20, నవంబర్ 2025, గురువారం

సమస్య - 5310

21-11-2025 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఇంతలు గనులున్ననుఁ దెరువే కననైతిన్”
(లేదా...)
“ఇంతలు గన్నులుండఁ దెరువే కననైతి నిదేమి చోద్యమో”

21 కామెంట్‌లు:

  1. ఉ.
    కాంతలు హేల నాటలను కమ్మని పల్కులు బల్కి నాకు బె
    న్గంతలు గట్టి వీడిరి ప్రకామ మనోజ్ఞ వనాంతరంబునన్
    గొంతిల రాలు గేకలను గొబ్బున బెట్టితి జెంత జేరలే
    దింతలు కన్నులుండ దెరువే కననైతి నిదేమి చోద్యమో !

    రిప్లయితొలగించండి
  2. చెంతనగల హితుని గలసి
    మంతనము సలుప వెడలగ మార్గమునందున్
    నంతయు జీకటి కవియగ ,
    నింతలు గనులున్ననుఁ దెరువే కననైతిన్

    రిప్లయితొలగించండి

  3. చెంతను కనిపించిన దొక
    కాంతయె యందమున మేనక నుబోలిన యా
    యింతిని విడిచి చనుటకిక
    నింతలు గనులున్ననుఁ దెరువే కననైతిన్.


    ఇంతియె కానవచ్చెనట యేమని చెప్పెద నందమున్ గళా
    వంతుని కన్న మిన్నయను భావన కల్గిన దయ్యె నత్తరిన్
    గాంతను దాటి నాదయిన గ్రామము జేరు పథమ్ము గాంచగా
    యింతలు గన్నులుండఁ దెరువే కననైతి నిదేమి చోద్యమో.


    చెంతన యున్నమూర్ఖులగు స్నేహితు లెల్లరు పోరు పెట్టగా
    పంతము వీడి యాసవము బానము సేయగ నెంచి యేగితిన్
    ముంతెడు కల్లు గ్రోలగనె ముంచుకు వచ్చిన మత్తు తో కదా
    యింతలు గన్నులుండ దెరువే కననైతి నిదేమి చోద్యమో.

    రిప్లయితొలగించండి
  4. ఎంతటి దెప్పరమ్ముగన నీవనమందున నీనిశీధిలో
    వింతగ నొక్కమారు వినువీధిని మేఘములావరించగా
    గంతలు కట్టినట్లు కనుగానని రీతిని వాన తుట్రిల
    న్నింతలు గన్నులుండఁ దెరువే కననైతి నిదేమి చోద్యమో

    రిప్లయితొలగించండి
  5. తనను వీడిన లక్ష్మికై వెదుకుతూ రమాకాంతుడు:


    కందం
    చింతయె క్రోధమ్మై న
    న్నింతగ వక్షమున దన్న నీసున భృగువే
    కాంతయె వీడెను! పొందఁగ
    నింతలు గనులున్ననుఁ దెరువే కననైతిన్!

    ఉత్పలమాల
    చింతయె క్రోధమై భృగువు శీఘ్రమె రొమ్మున దన్నినంతటన్
    గాంతకు స్థానమౌ కతన కందియు వీడె వికుంఠమామెయే
    చెంతనె లేక పోషణము సృష్టికి నెట్లొకొ! లక్ష్మినొందగా
    నింతలు గన్నులుండఁ దెరువే కననైతి నిదేమి చోద్యమో!

    రిప్లయితొలగించండి
  6. [హిమాద్రికేగి సంతసించిన పిదప ప్రవరుని యంతరంగము]

    వింతగ లేపనము కరిగె
    నింతలు గనులున్ననుఁ దెరువే కననైతిన్
    సంతసమే మటుమాయము
    చింతలు విడివడి గృహమును సేరుట యెటులో

    ఇంతలు గన్నులుండఁ దెరువే కననైతి నిదేమి చోద్యమో
    వింతలు చూడగోరి పరివేష్టన సల్పితినేమి కర్మమో
    చింతిల పాదలేపనము చిత్రముగా కనరానిదయ్యెనే
    సంతసమే సమాప్తమయె సద్మము నెవ్విధిఁ సేరుకొందునో

    రిప్లయితొలగించండి


  7. శంకరాభరణం సమస్య

    ఇంతలు గన్నులుండఁ దెరువే కననైతి నిదేమి చోద్యమో!

    ( మయసభలో ప్రవేశించిన దుర్యోధనుడు ఇలా తలంచుచున్నాడు )

    ఉత్పలమాల

    ఎంతయొ యద్భుతమ్మనగ నేగితి గాని కనంగ వింతలే !

    కొంతయుఁ గాంచలేదు గద కుడ్య కవాట జలంబు లెక్కడో!

    ఇంతటి రాజరాజుఁ గని హేళనజేసి హసించెఁ గాంతయే!

    భ్రాంతియె కల్గినే మయసభన్ బరికించుచు నుండఁ నయ్యొ!యిం

    తింతలు గన్నులుండఁ దెరువే కననైతి నిదేమి చోద్యమో

    ఆకుల శాంతి భూషణ్
    వనపర్తి

    రిప్లయితొలగించండి
  8. కాంతనుతిట్టివచ్చితిని గమ్యము లేకయె సాగుచుంటిగా
    చెంతనునేను లేననుచు చింతను చేయచునుండునేమొ తా
    నింతకు దారి తప్పితినె నయిల్లును చేరుట నెట్టులో గదా
    *“ఇంతలు గన్నులుండఁ దెరువే కననైతి నిదేమి చోద్యమో”*



    పంతముబూని యిలువిడితి
    నెంతకుదారికనరాదునింటికినేగన్
    సుంతయుతోచుటలేదే
    *"ఇంతలు గనులున్ననుఁ దెరువే కననైతిన్

    రిప్లయితొలగించండి
  9. కం॥ వింతగు పలుకులివె కదా!
    యింతలు గనులున్ననుఁ దెరువే కననైతిన్
    సుంతయు విజ్ఞతఁ బడయుమ
    యెంతయొ మేలుఁ గలుగుఁ దెరవెపుడు నగుపడున్

    ఉ॥ ఇంతలు గన్నులుండఁ దెరవే కననైతి నిదేమి చోద్యమో
    వింతగఁ బల్క నేలనొకొ విజ్ఞత ముఖ్యము కాద కాంచఁగన్
    సుంతయు బుద్ధి యుండనటు స్ఫూర్తిని విజ్ఞతఁ బొందనెంచుమా
    యెంతయొ మేలు కల్గుఁ దెరవెప్పుడు నీకగుపించు స్పష్టమై!

    తెరవు అంటే దారి కాక విధము అండి బ్రదుకు తెరవు (విధము) discerning power.

    రిప్లయితొలగించండి
  10. కం: వింతగ నార్థిక మాంద్యము
    గొంతు నులుము చుండె బ్యాంకు కూడ నొసగ ద
    ప్పింతయు గ్రానైట్ గనులకు,
    నింతలు గనులున్ననుఁ దెరువే కననైతిన్”
    (ఒకప్పుడు ఆర్థికమంద్యం వచ్చి గ్రానైట్ వ్యాపారం దెబ్బ తిన్నది. పెద్ద పెద్ద గ్రానైట్ గనులు ఉన్న వాళ్లు వ్యాపారం నడవక,బ్యాంకులు కూడా అప్పు లివ్వటానికి భయ పడుతుంటే బాధ పడ్డారు.)

    రిప్లయితొలగించండి
  11. ఉ:"కాంతుడె యంధు డయ్యె" నని కండ్లకు గంతలు కట్టుకొంటి, నా
    వంతయు బుద్ధి లేని సుతు లందరు బాండవు లందు,గృష్ణు పై
    పంతము బూన నాశమగు , వారల జూచుచు మంచి జెప్ప నా
    కింతలు గన్నులుండఁ దెరువే కననైతి నిదేమి చోద్యమో!

    (భర్తకి కళ్లు లేవు కదా! అని నేను కూదా గంతలు కట్టుకున్నాను. నా బిద్దలు పాండవులతో,కృష్ణుని తో పంతాలకు పోతే నాశనమే అవుతుంది.వాళ్లని కళ్లారా చూస్తూ మంచి చెప్ప లేక పోతున్నాను అని గాంధారి ఆవేదన .కళ్లకి గంత లున్నా మాట్లాడ వచ్చు కానీ బిడ్డలని చూస్తూ మాట్లాడితే తృప్తి. )

    రిప్లయితొలగించండి
  12. ఉ. ఎంతటి విద్య నేర్చినను ఈషణమీసులనేమరిల్లుచున్
    చింతలఁ లొగ్గడిల్లుచును చిందిలిమందిలి నొందనేల క
    న్గంతలు గట్టినట్టు నిహకామ్యములేల పరమ్ము గోరకన్
    ఇంతలు గన్నులుండఁ దెరువే కననైతి నిదేమి చోద్యమో

    రిప్లయితొలగించండి
  13. సమస్య:
    ఇంతలు గన్నులుండఁ దెరువే కననైతి నిదేమి చోద్యమో !

    ఉత్పలమాల:

    సుంతయుఁజింత గల్గె, మనసొప్పదు వీడగ పుట్టినింటినే
    యెంతయు నచ్చ జెప్పితిని, యేలను తండ్రికి జాలి గల్గదో !
    చింతయు మీరె, బేసిగను చేరిక మార్గము గాన రాదొకో
    ఇంతలు గన్నులుండఁ దెరువే కననైతి నిదేమి చోద్యమో !

    రిప్లయితొలగించండి
  14. కంతు నిజాస్త్రఘాతమున కాంతల కౌగిళులందు జిక్కి నా
    చింతనమంతరించగ నచేతనునైతిని తామసంబునం
    దింతుల వింత సోయగము లెంతటి గంతలు సంతరించె నా
    ,కింతలు గన్నులుండఁ దెరువే కననైతి నిదేమి చోద్యమో

    రిప్లయితొలగించండి
  15. పంతము నూని ధనమ్ము న
    నంతము నొడ్డి వికటింప నక్కట స్వీయ
    స్వాంతము జూదం బాడితి
    నింతలు గను లున్ననుఁ దెరువే కన నైతిన్


    కంతుని బారిఁ బడ్డ నరకాంతుల చిత్తము లార్తి నందవే
    యింతినిఁ జెంతఁ గన్న మది నెంతయొ రక్తి జనింప వింత నే
    సుంతయుఁ దాళకుంటి వెస సొంతము సేసికొనంగ నక్కటా
    యింతలు గన్ను లుండఁ దెరువే కన నైతి నిదేమి చోద్యమో

    రిప్లయితొలగించండి
  16. కం॥
    ఇంతటి ఘోరపు పాలన
    నింతయు న్యాయమ్ములేని నేతల కిడితిన్
    వింతగ మరియొక పట్టము
    నింతలు గనులున్ననుఁ దెరువే కననైతిన్”

    రిప్లయితొలగించండి
  17. సుంతయు భీతిని వీడియు
    చెంత న గల కాన కేగి చేరి న పుడు నే
    నెంత యు వెదికిన న య్యె డ
    నింతయు కనులు న్న దెరు వే కన నైతిన్

    రిప్లయితొలగించండి
  18. సమస్య:
    ఇంతలు గన్నులుండఁ దెరువే కననైతి నిదేమి చోద్యమో !

    ఉత్పలమాల:

    1 పంతము దీర సంధియని పధ్ధతి పంపిరి నందనందనున్
    మంతన జేసి శ్రీహరిని మాయము జేయగ త్రాటి బంధమున్
    వింతగ జూపెవారికిని విశ్వపు రూపము కోటి వెల్గులన్
    ఇంతలు గన్నులుండఁ దెరువే కననైతి నిదేమి చోద్యమో !
    చింతిలు పుట్టునంథునకు చిత్రము నిచ్చెను నేత్ర వీక్షణన్

    2 ఇంతిని జూడ మోహమది యిమ్మహి గెల్వగలేని యందమే
    కాంతను నేను గోరుటయు కానిపనాయెగ నేడు కీచకా !
    వింతగఁదోచె మా మదిని వీడను నేనిక యామె నీడనై
    ఇంతలు గన్నులుండఁ దెరువే కననైతి నిదేమి చోద్యమో !

    3 వింతగ దోచె భూసురుని వేషము యక్షుల గాన జాలనే
    ఇంతటి సుందరుండు దన యీప్సిత మెన్నక గీము దారినే
    సుంతయు దెల్ప వేడుటయు సుందరు గూడగ నిచ్ఛ హెచ్చెనే
    ఇంతలు గన్నులుండఁ దెరువే కననైతి నిదేమి చోద్యమో !
    (వరూధిని మనోగతం....)

    రిప్లయితొలగించండి

  19. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    అంతయు తిరుగుచు నగరము
    వింతలఁ జూచుచును తిరిగి వెళ్లెడు దారిన్
    సుంతయు తెలియగ లేదే
    యింతలు గనులున్ననుఁ దెరువే కననైతిన్.

    రిప్లయితొలగించండి