31, డిసెంబర్ 2025, బుధవారం

సమస్య - 5337

1-1-2026 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కాలసర్పముం గబళించెఁ గప్ప యొకటి”
(లేదా...)
“కనుఁగొని కాలసర్పమును గప్ప వెసం గబళించె నాఁకటన్”
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి దుబాయి శతావధాన సమస్య)

14 కామెంట్‌లు:

  1. చ.
    పనిగొని ప్రొద్దు రేయులను బాయక కార్యములందు మున్గి నే
    కనులను మూసి నిద్దుఱకు కౌగిలి నిచ్చితి నప్డు స్వప్నమం
    దున వనమందు చిత్రముగ దూరి నికుంజములందు పోకడం
    గనుగొని కాలసర్పమును గప్ప వెసం గబళించె నాకటన్ !

    రిప్లయితొలగించండి

  2. కని శిఖండిని భీష్మడు కదన మందు
    నస్త్రములను వీడుచు చేరె నంపశయ్య
    ననుచు చెప్పి నంత నొకడు ననియె నిట్లు
    కాలసర్పముం గబళించెఁ గప్ప యొకటి.


    ఘనుడుగు క్రీడి మారుగ శిఖండిని గాంచి ధనుస్సు వీడుచున్
    జినుడట యంపశయ్య పయి చేరెనటంచును తెల్పినంతనే
    యనుచరు డొక్కడిట్టులనె యచ్చరు వొందుచు, నెంత చిత్రమో
    కనుఁగొని కాలసర్పమును గప్ప వెసం గబళించె నాఁకటన్.

    రిప్లయితొలగించండి
  3. తే. జీర్ణ దేవాలయమ్మున జీవనమును
    హరుని చెంతన గడిపెను హరియొకండు
    శర్వసామీప్యపుణ్యమున్ జననమరణ
    కాలసర్పముం గబళించెఁ గప్ప యొకటి

    హరి : కప్ప

    రిప్లయితొలగించండి
  4. బొమ్మల కొలువు పెట్టిరి బుడతలచట
    ద్విజములనచట వ్రేలాడ దీసినంత
    దారము తెగి సర్పము రాలె దాటరి పయి
    కాలసర్పముం గబళించెఁ గప్ప యొకటి

    రిప్లయితొలగించండి
  5. కాల హరణము నొనరింప వీలుపడక
    దూర దర్శని యెదుటను జేరికంటి
    దివ్య మైన హాస్యభరిత దృశ్యమొకటి
    కాల సర్పముం గబళించెఁ గప్ప యొకటి

    కనబడు వ్యంగ చిత్రములు కన్నుల ముందర నంచు మార్చు చుం
    డ నమితమైన మార్గములు టక్కున గాంచితి నేను దూరద
    ర్శనమున మంచి హాస్యకర సత్యవిదూర విచిత్ర దృశ్యమున్
    గనుఁగొని కాలసర్పమును గప్ప వెసం గబళించె నాఁకటన్

    రిప్లయితొలగించండి
  6. తే.గీ:నోటి ముందుకు వచ్చిన కీటకమును
    తనకు మృతుయువై కబళింప దనను బట్టి
    బాధ వెట్టగ భరియించి వ్యథను వెట్టు
    కాలసర్పమున్ , గబళించెఁ గప్ప యొకటి
    (ఆ కప్ప పాము నోట్లోనే ఉంది.ఒక ప్రక్క ఆ పామును భరిస్తూ నీతి ముందుకు వచ్చిన కీటకాన్ని మింగింది.మనిషి ఆశ విషయం లో తాత్త్వికులు చెప్పే ఉదాహరణ ఇది.)

    రిప్లయితొలగించండి
  7. చం:తన తనువెల్ల చిక్కియును దారుణ సర్పపు నోట, జేర వ
    చ్చిన యొక కీటకమ్ము నతి శీఘ్రమె కాలుని రూప మట్టులన్
    గనుఁగొని కాలసర్పమును, గప్ప వెసం గబళించె నాఁకటన్
    దన కిక దక్క దెద్దియును దానిని వీడిన నంచు వింతగన్.
    (భావం పై పద్యం లోనిదే.)

    రిప్లయితొలగించండి
  8. ఈశ్వ రానుగ్రహమ్మున హీన విక్ర
    ముండు సెలరేఁగి యొకనాఁడు పాండు సుతుల
    సమర వీరుల వారించె సైంధవుండు
    కాల సర్పముం గబళించెఁ గప్ప యొకటి


    విను తెరు వందు నేగుచును వేగము మీఱ బలాఢ్యుఁ డొక్కెడన్
    మును గజ కచ్ఛపమ్ములను మూరి భుజించిన వాఁడు చక్కఁగా
    ఘనుఁ డగు పక్షి రాడ్వరుఁడు కశ్యప సూనుఁడు రేఁగి రెంటినిం
    గనుఁగొని కాల సర్పమును గప్ప వెసం గబళించె నాఁకటన్

    రిప్లయితొలగించండి
  9. కాల మనియె డు సర్పమ్ము గాంచి నంత
    గతము ముంగిస లాదూ కి కప్ప యగుచు
    కాల సర్ప ము o మ్రింగెను కప్ప వోలె
    యనుచు పరిహాస ముగ బల్కె నతడు గాదె

    రిప్లయితొలగించండి
  10. తే॥ బాలలటు మోద మొందఁగ బహు విచిత్ర
    రీతిఁ గ్రొత్తదనము నింపి నీతి కధలఁ
    దెలుపు గర్వభంగము నందు మలచి రిటులఁ
    గాల సర్పముం గబళించెఁ గప్ప యొకటి

    చం॥ పనిగొని నీతి సూక్తులను బాలలు మెచ్చెడి రీతిఁ దెల్పఁగన్
    మనసిడి తాల్చి నవ్యతను మన్నన సేయదురంచు నెంచుచున్
    ఘనముగ గర్వభంగమటు కాంచఁగఁ దీసిరి త్రుక్కుఁ జూపఁగన్
    గనుఁగొని కాలసర్పమును గప్ప వెసం గబళించె నాఁకటన్

    త్రుక్కు గర్వము
    (పిల్లల కార్టూన్ చిత్రాలలో నీతి బోధ ఇలాగే ఉంటుందండి)

    రిప్లయితొలగించండి
  11. తేటగీతి
    కాళియుఁడెగసి మడుగున గరళమద్ద
    చిన్ని కృష్ణయ్య పడగలన్ జేరి త్రొక్కె
    కర్కశమ్ముగ మార్చగన్ 'గర్వమ'దియె
    కాలసర్పముం, 'గబళించెఁ గప్ప యొకటి!'

    చంపకమాల
    అనుదినముద్ధతిన్ మడుగునందున కాళియుఁడద్ద క్ష్వేళమున్
    వినతిని జేయ గోకులము పీఁచమడంచెను చిన్నికృష్ణుడే!
    తననెదురించ లేరనెడు తత్వము మీరఁగ 'గర్వమొం' దగన్,
    కనుఁగొని కాలసర్పమును, 'గప్ప వెసం గబళించె' నాఁకటన్

    రిప్లయితొలగించండి

  12. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    కోట్లు లంచాల రూపాన కూడబెట్టి
    పొలములున్ ఫ్లాట్లు,స్వర్ణమున్ స్థలములగొన
    పట్టుకొంటిరి యవినీతి వారు తుదకు
    కాలసర్పముం గబళించెఁ గప్ప యొకటి.

    రిప్లయితొలగించండి
  13. తేటగీతి:
    పాడు వెసనములకు ప్రజ బానిసలయి
    బ్రతుకు నర్ధాంతరమ్ముగా కుతిలపెట్టు
    తీరు నీరీతి మలచెను దేవటుండు
    కాలసర్పముం గబళించెఁ గప్ప యొకటి
    (దేవటుడు=శిల్పి)

    చంపకమాల:
    తనియక నెంతమాత్రము నితాంత ప్రశాంత వనాంతమందునన్
    పనిగొని కుడ్యచిత్రముల ప్రాగహరమ్ముగ జేయు చిత్రకా
    రుని మదినుండి పుట్టెనొక లోకఁపు పోకడ చిత్ర మిట్టులన్
    కనుఁగొని కాలసర్పమును గప్ప వెసం గబళించె నాఁకటన్

    రిప్లయితొలగించండి
  14. పద్య సంఖ్య :-- 2212. 1--1--2026.
    పిన్నక నాగేశ్వరరావు. స.క.స.1043.
    హైదరాబాద్.
    శంకరాభరణం వారు ఇచ్చిన సమస్య :--
    కాలసర్పముం గబళించెఁ గప్ప యొకటి.
    పూరణము :-- తేటగీతి.
    కోట్లు లంచాల రూపాన కూడబెట్టి
    పొలములున్ ఫ్లాట్లు,స్వర్ణమున్ స్థలములగొన
    పట్టుకొంటిరి యవినీతి వారు తుదకు
    కాలసర్పముం గబళించెఁ గప్ప యొకటి.
    **************************************

    రిప్లయితొలగించండి