14, జనవరి 2026, బుధవారం

సమస్య - 5351

15-1-2026 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మృణ్మయపాత్ర వెల హెచ్చు హేమముకంటెన్”
(లేదా...)
“మృణ్మయపాత్రకుండు వెల మిక్కిలి స్వర్ణఘటంబు చౌకయౌ”
(భరతశర్మ గారి శతావధానంలో నేనిచ్చిన సమస్య)

8 కామెంట్‌లు:

  1. కందం
    షణ్మత విరోధమది యీ
    షణ్మాత్రము లేదనంగ శంకరుల మదిన్
    జిన్మయుఁడుఁ దాల్చెననఁగన్
    మృణ్మయపాత్ర వెల హెచ్చు హేమముకంటెన్

    ఉత్పలమాల
    షణ్మత భేదముల్ గనని శంకరు దృష్టిని దైవమొక్కటే
    మృణ్మయపాత్ర దేహమని మీరక యెప్పుడు భక్తిగల్గుచో
    చిన్మయు ధ్యానమే సతము జీవుని దేవునిఁ జేర్చు, నప్పుడే
    మృణ్మయపాత్రకుండు వెల మిక్కిలి! స్వర్ణఘటంబు చౌకయౌ! !

    రిప్లయితొలగించండి

  2. మృణ్మయ పాత్రను తెమ్మని
    షణ్ముఖి యేకోరినంత జామి యయిన యా
    షణ్ముఖు డిట్లు వచించెను
    మృణ్మయపాత్ర వెల హెచ్చు హేమముకంటెన్.


    మృణ్మయ పాత్ర తెమ్మిటకు మిక్కిలి శ్రేష్ఠమటంచు కోర నా
    షణ్ముఖి బద్ధకస్థుడయి సంతకు నేగగ లేనటంచు నా
    షణ్ముఖు డిట్లుచెప్పెను పసారము నందు గనంగ నక్కరో
    మృణ్మయపాత్రకుండు వెల మిక్కిలి స్వర్ణఘటంబు చౌకయౌ.

    రిప్లయితొలగించండి
  3. షణ్ముఖుని దండ్రి వడ నీ
    షణ్మాత్రముయిన భరించ సాధ్యముగాకన్
    ఉన్మ త్తమున కొ నదలచ
    మృణ్మయపాత్ర వెల హెచ్చు హేమముకంటెన్”

    రిప్లయితొలగించండి
  4. షణ్ముఖ రూపముఁ గలదది
    మృణ్మయ పాత్ర తిలకింప మిక్కిలి సొబగే
    షణ్ముఖి వచించె నిట్టుల
    మృణ్మయపాత్ర వెల హెచ్చు హేమముకంటెన్

    షణ్ముఖ రూపుకల్గినది చక్కని సుందర మైన వస్తువా
    మృణ్మయపాత్ర చూచుటకు మిక్కిలి మక్కువ రేఁచుచుండగా
    షణ్ముఖ నామధేయుడనె సంబరమొప్పగ దానిఁ జూపుచున్
    మృణ్మయపాత్రకుండు వెల మిక్కిలి స్వర్ణఘటంబు చౌకయౌ

    రిప్లయితొలగించండి
  5. సమస్య : మృణ్మయపాత్ర వెల హెచ్చు హేమముకంటెన్

    కం. చిన్మయరూపము నెఱుగక
    తన్మయులగు జనులు భ్రమసి తనువుల మెరుగున్
    ఉన్మాదము గాదే యిది
    మృణ్మయపాత్ర వెల హెచ్చు హేమముకంటెన్

    భావం:
    జ్ఞాన స్వరూపమైన పరమాత్మ (ఆత్మ) గురించి తెలుసుకోలేక, ప్రజలు కేవలం బయటికి కనిపించే ఈ శరీరం యొక్క అందాన్ని చూసి మోసపోతున్నారు. నశించిపోయే ఈ శరీరాన్ని చూసి మురిసిపోవడం పిచ్చితనం (అజ్ఞానం) కదా. వీరి ప్రవర్తన ఎలా ఉందంటే, బంగారం కంటే మట్టి పాత్ర ఎంతో ఎక్కువ విలువైనదని అనుకోవడం లాంటిది.

    రిప్లయితొలగించండి
  6. ఉ॥ మృణ్మయమే సుమా తెలుప మేదిని లోపల లభ్యమైనచో
    మృణ్మయమేను కాంచనము మృత్తిక యక్కర యున్న కుండయే
    మృణ్మరు వంటి వారపుడు మేలనిఁ గోరరె యట్టి వేళలో
    మృణ్మయ పాత్రకుండు వెల మిక్కిలి స్వర్ణఘటంబు చౌకయౌ

    మృణ్మయము made of earth మృణ్మరు రాయి మృత్తిక మన్ను

    (శ్రాద్ధ కర్మలు ఇలాంటి వాటికి మట్టి కుండే కావాలి. అలాంటి సమయంలో తప్పనపుడు మట్టికుండకే విలువ అని అండి. భూమిలో దొరికేవన్నీ భూమితో కూడకున్నవే కదండి మృణ్మయము)

    రిప్లయితొలగించండి
  7. మృణ్మ య బుర్రను గల్గిన
    షణ్ము ఖు డ తి శయముగ ననె సహ వా సుల తో
    న ణ్మా త్రము బెదరక యే
    " మృణ్మ య పాత్ర వెల హె చ్చు హేమము కంటె న్

    రిప్లయితొలగించండి
  8. రుణ్మనమున నడుగ నభ
    స్త్విణ్మణి సాక్షిగ వచింపు వేల్పుల మిన్నా
    షణ్ముఖ యే లోకమ్మున
    మృణ్మయ పాత్ర వెల హెచ్చు హేమము కంటెన్


    రాణ్మణు లుండ దేశమునఁ బ్రాకృత మానవుఁ డొంద నేర్చునే
    త్విణ్మయ భర్మ భూషలను దిట్టతనమ్మున భారతమ్మునన్
    షణ్ముఖ ధాత్రి నట్టి దివసమ్మునఁ దప్పక, యే దినమ్మునన్
    మృణ్మయ పాత్ర కుండు వెల మిక్కిలి, స్వర్ణ ఘటంబు చౌకయౌ

    రిప్లయితొలగించండి