15, జనవరి 2026, గురువారం

సమస్య - 5352

16-1-2026 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తిక్కనను వరించితీవు తిక్కలపోరీ”
(లేదా...)
“తిక్కననున్ వరించెఁ గద తిక్కలపోరి యిదేమి లొల్లియో”
(భరతశర్మ గారి శతావధానంలో ధనికొండ రవిప్రసాద్ గారి సమస్య)

15 కామెంట్‌లు:

  1. చక్కని కవిగ పొగడెదరు
    తిక్కనను ; వరించితీవు తిక్కలపోరీ
    యక్కరకు రాని మూర్ఖుని ,
    యిక్కటులుండును విడువక నెల్లయదనలన్

    రిప్లయితొలగించండి

  2. పెక్కురు భయపడి చత్తురు
    తిక్కల వాడనుచు వాని తిట్లకు భువిలో
    మక్కువ యంటివి యతడన
    తిక్కనను వరించితీవు తిక్కలపోరీ.


    *(రుక్మిణి కృష్ణుని వెంటవెడలిన పిమ్మట రుక్మి అంతరంగము )*

    మొక్కలు రైన బాలకులె పొందులటంచు త్రియామ వేళలో
    యిక్కలు జొచ్చి వెన్న హరియించిన చోరుడు వాడు కాంచగా
    యక్కలు స్నానమాడు తరి యంబరముల్ గిలు బాడి నట్టి యా
    తిక్కననున్ వరించెఁ గద తిక్కలపోరి యిదేమి లొల్లియో.

    *(తిక్కల వాడు తిక్కన)*

    రిప్లయితొలగించండి
  3. దిక్కులు చూచి ననుంగని
    మక్కువతో పలికినావు మానినినీవే
    మిక్కుట మైనది పో నీ
    తిక్క! నను వరించితీవు తిక్కలపోరీ

    మిక్కుటమైన సోయగము మెచ్చిన పోడిమి యున్న కన్నెరో
    దిక్కులు చూచినన్నుగని దిగ్గున నాకిక వెల్లడించెరో
    చక్కని రూపమున్నను ప్రశాంతత లేనిది పెచ్చరిల్లగా
    తిక్క! ననున్ వరించెఁ గద తిక్కలపోరి యిదేమి లొల్లియో!

    రిప్లయితొలగించండి
  4. సమస్య : తిక్కనను వరించితీవు తిక్కలపోరీ

    కం. ఇక్కట శ్మశానమమ్మ యు
    ళక్కట వెలిబూది పరిమళములట మెడలో
    బొక్కల హారమట సతీ!
    తిక్కనను వరించితీవు తిక్కలపోరీ

    ఇక్క = నివాసము, ఇల్లు
    అమ్మ ఉళక్కి అట = తల్లే లేదట, అజన్ముడు

    భావం :
    ఇందులో రెండు భావాలు ఒదిగించే ప్రయత్నం చేశాను. మొదటిది పార్వతితో అంటున్న "నిందా స్తుతి". రెండవది దక్షుడు సతీ దేవితో అంటున్న గర్వంతో కూడిన మాటలు.

    A) నిందాస్తుతి:

    ఓ సతీ! పార్వతీ దేవీ!, నీవు వరించిన ఆ శివుని రూపం ఎంత విచిత్రమైనదో చూడు!

    ఆయన ఉండే ఇల్లేమో శ్మశానం. (ప్రపంచం అంతా లయమయ్యాక మిగిలేది ఆయనొక్కడే అని అంతరార్థం).
    ఆయనకు తల్లి లేదట (అమ్మ ఉళక్కి). ఆయన ఎవరికో పుట్టినవాడు కాదు, అజన్ముడు. ఒంటికి పూసుకున్న పరిమళ ద్రవ్యాలేమో తెల్లని బూడిద (విభూతి).అది వైరాగ్యానికి గుర్తు. మెడలో ధరించినవేమో ఎముకల మాల.

    ఇంతటి విలక్షణమైన, లోక విరుద్ధమైన పనులే చేసే ఆ "తిక్కన"ను (పిచ్చివాడిగా కనిపించే శివుడిని) పెళ్లాడావు. నిజంగా నువ్వు కూడా పెద్ద "తిక్కలదానివే!" (అంటే లోకాతీతమైన ఆయన తత్వాన్ని అర్థం చేసుకున్నదానివి అని అర్థం).

    B) దక్షుడి మాటల్లో నిందార్థంలో.

    ఓ సతీ! వివేకం లేకుండా ప్రవర్తిస్తున్నావు. నీ భర్తను చూడు. గౌరవప్రదమైన ఇల్లు లేదు, నివసించేది పీనుగులు కాల్చే శ్మశానం. ఆయన తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియదు. సుగంధ ద్రవ్యాలకు బదులు ఒళ్లంతా చితి భస్మం పూసుకుంటాడు. బంగారు హారాలకు బదులు మెడలో ఎముకల దండలు వేసుకుంటాడు. ఇంతటి పిచ్చివాడిని మొండిగా పెళ్లాడావు. నువ్వు కూడా పెద్ద తిక్కలదానివే!

    రిప్లయితొలగించండి
  5. తిక్కన నామంబతడిది
    తిక్కగొనును వాని పనుల తీరునుఁ గనినన్
    పెక్కురు విబుధులఁ గాదని
    తిక్కనను వరించితీవు తిక్కలపోరీ!

    తిక్కన నామమాతడికి తీరుగ సార్థకమయ్యె నెట్లనన్
    పెక్కురు పోవుమార్గమును వీడిజనున్ పెడదారి వెంబడిన్
    చిక్కులఁగోరి తెచ్చుకొను చేసెడి కృత్యములందు నట్టియా
    తిక్కననున్ వరించెఁ గద తిక్కలపోరి యిదేమి లొల్లియో

    రిప్లయితొలగించండి
  6. కం:చక్కని వాడను కానే!
    అక్కరమే రాని వాడ, నది యెరిగియు నే
    లెక్కల జూచితి? విదియే
    తిక్క? నను వరించితీవు తిక్కలపోరీ
    (అందం ,చదువు లేని నన్ను ప్రేమించటం నీ తిక్క అని నిరహంకారం గా అన్నాడు ఒకడు.)

    రిప్లయితొలగించండి
  7. (1)ఉ; చక్కదనమ్ము లేదు, సరసమ్మగు మాటల తీరు లేదు, కై
    పెక్కుడు నంగసౌష్ఠవము లింతయు లే ,వొక విద్య లేదు, తా
    నెక్కువ యంద గత్తెనని యెంచుచు నుండును దీని కేదియో
    తిక్క, ననున్ వరించె గద తిక్కల పోరి యిదేమి లొల్లియో!

    రిప్లయితొలగించండి
  8. (3)ఉ:చక్కని కాపురమ్ము గల చానమ్మ దెంతటి ద్రోహబుద్ధియో!
    మక్కువ లేదు భర్త యన,మారణ కాండను వీడి రాగ మా
    తిక్కన నెట్లు యుద్ధమున దింపె? నిదెక్కడి రాజభక్తి? మా
    తిక్కననున్ వరించెఁ గద తిక్కలపోరి! యిదేమి లొల్లియో!
    (ఇక్కడ తిక్కన అంటే కవి తిక్కన కాదు.ఖడ్గ తిక్కన.తిక్కన యుద్ధం నుంచి పారిపొయి వస్తే అతణ్ని అవమానించి యుద్ధానికి పంపి అతని వీరమరణానికి భార్య చానమ్మ కారణ మైంది.ఆమెను కొందరు ఆక్షెపించినట్లు. )

    రిప్లయితొలగించండి
  9. కం॥ మక్కువ మీరఁగఁ బెంచఁగ
    నక్కున నిడి గర్వ మొదవి యమితముగ నటుల్
    మిక్కిలి పిచ్చిఁ గని యహో
    తిక్క, నను వరించితీవు తిక్కల పోరీ

    ఉ॥ మక్కువ మీర పెంచఁగను మన్ననఁ జేయుచు ముద్దుముద్దుగా
    నక్కునఁ జేర్చి గర్వమటు లబ్బగఁ గన్యకు విద్య నేర్వకన్
    మిక్కిలి పిచ్చి చేష్టలను మిన్నగఁ గాంచి చరించుచుండె నా
    తిక్క, ననున్ వరించెఁ గద తిక్కల పోరి యిదేమి లొల్లియో

    రిప్లయితొలగించండి
  10. అక్కజముగ నెదలోఁ గవి
    తిక్కనయే యంచుఁ దలఁచితివ వనజాక్షీ
    యక్కట వెస ఖడ్గపు టా
    తిక్కనను వరించి తీవు తిక్కల పోరీ


    ఒక్కరి కున్నఁ దిక్క కనుచుందుము పోరు నిరంతరమ్మునుం
    దిక్క సెలంగ నిద్దఱికి దిట్టగ జంట చరించు నొక్కటై
    తిక్క గలట్టి యన్న యగుఁ దిక్కన తిక్కకుఁ దిక్క యొప్పనం
    దిక్కననున్ వరించెఁ గద తిక్కల పోరి యిదేమి లొల్లియో

    రిప్లయితొలగించండి
  11. చక్కని కవియని యందురు
    తిక్కనను :: వరించి తీవు తిక్కల పోరీ
    ముక్కిడి వానిని మూర్ఖుని
    మక్కువ తో కోరినావు మనువాడు ట కై

    రిప్లయితొలగించండి
  12. ప్రవరాఖ్యుఁడు వరూధిని తో....

    కందం
    చిక్కితి హిమగిరులందున
    దక్కిన పసరు కరుగునను ధ్యాస మఱువ, నే
    నొక్కింత సత్యమెఱుఁగని
    తిక్క! నను వరించితీవు తిక్కలపోరీ!


    ఉత్పలమాల
    ఎక్కడివాడనో హిమగిరీంద్రము సూచెడు యావ సిద్ధుడున్
    మక్కువనీయ లేపనము మర్మమెఱుంగక దాల్చివచ్చియున్
    జిక్కితి పూతయే కరుగ! చేడియ నొక్కతె గల్గు నేనిటన్
    దిక్క! ననున్ వరించెఁ గద తిక్కలపోరి యిదేమి లొల్లియో!

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    నిక్కమిది యో సరస్వతి!
    తిక్కనను వరించితీవు; తిక్కల పోరీ!
    చక్కని వానిని కాదని
    పెక్కు నవగుణముల వాని పెండ్లాడితివే?

    రిప్లయితొలగించండి
  14. మిక్కిలి త్రాగుతాను మరి మేనును

    మర్చి చరించుతాను నే

    నక్కడ నిక్కడన్ దిరుగు చన్యుల

    మోసమొనర్చుతాను నే

    నిక్కము కార్యమేదియునునేర్పున

    జేయని నన్ను దానిదౌ

    తిక్క , ననున్ వరించె గద తిక్కల పోరి

    యిదమి లొల్లియో?

    రిప్లయితొలగించండి