20, జనవరి 2026, మంగళవారం

సమస్య - 5357

21-1-2026 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వ్రాయకుమయ వ్రాయకిట్టి వ్రాతల నింకన్”
(లేదా...)
“వ్రాయకు వ్రాయఁబోకుమయ వ్రాయకు వ్రాయకు మిట్టి వ్రాతలన్”
(భరతశర్మ గారి శతావధానంలో వేదాల గాయత్రి గారి సమస్య)

14 కామెంట్‌లు:

  1. -
    శ్రేయస్కరమ్ము కాదిది
    వ్రాయకుమయ వ్రాయకిట్టి వ్రాతల నింకన్
    గాయంబొనర్చు కటువగు
    ప్రేయము కాని పలుకుల కవీశ వినదగున్



    హమ్మయ్య
    మొట్టమొదటి పూరణ :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. నాయన జెప్పినది వినుము
    వాయినదుపు జేయుమనిరి వాత్సల్యమునన్
    ఆయన పయి నీ రీతిగ
    వ్రాయకుమయ , వ్రాయకిట్టి వ్రాతల నింకన్”

    రిప్లయితొలగించండి

  3. ప్రేయాంసుడు కనుచుండగ
    తోయలి కొక ప్రేమలేఖ దుడుకుతనముతో
    జాయకు వ్రాసితివట కద
    వ్రాయకుమయ వ్రాయకిట్టి వ్రాతల నింకన్.


    తోయలు లెల్ల ధారుణిని దుర్మతు లంచులిఖించి నీవు నీ
    హేయపు బుద్ధి చూపితివి హీనగుణాత్ముడ నాల కించుమా
    న్యాయము కాదు కాదనుచు నాగ్రహ మందున చెప్ప బూనితిన్
    వ్రాయకు వ్రాయఁబోకుమయ వ్రాయకు వ్రాయకు మిట్టి వ్రాతలన్.

    రిప్లయితొలగించండి
  4. మాయలమారివి గదరా
    వాయపు రజ్జులు కపటపు వార్తల నికపై
    వ్రాయకు నీ పత్రికలో
    వ్రాయకుమయ వ్రాయకిట్టి వ్రాతల నింకన్

    మాయలమారివై తసుకు మాటలుపల్కుచు గెల్చు నేతవై
    హాయిగ దోచినావు దరహాసము చేయుచు దుష్టబుద్ధితోఁ
    బాయక నెల్లవేళలను వాయపు రజ్జులు తప్పు వార్తలన్
    వ్రాయకు వ్రాయబోకుమయ వ్రాయకు వ్రాయకుమిట్టి వ్రాతలున్

    రిప్లయితొలగించండి
  5. సమస్య : "వ్రాయకుమయ వ్రాయకిట్టి వ్రాతల నింకన్"

    కం. వ్రాయగ లేరని యొత్తులు
    న్యాయమె యక్కరములఁ దెగ నరకగ నకటా
    తీయని భాషను చెండగ
    వ్రాయకుమయ వ్రాయకిట్టి వ్రాతల నింకన్

    భావం : అక్షరాలకు ఒత్తులు వ్రాయడం కష్టమని వాటిని ఇష్టానుసారంగా కత్తిరించి/మార్చి వ్రాయడం న్యాయమేనా? అయ్యో! తీయని తెలుగు భాషను ముక్కలు చేసే ఇలాంటి రాతలను ఇకనైనా వ్రాయకండి.

    "వత్తులు లేకుండా తెలుగు" అను ఈ క్రింది వార్తకు స్పందనగా.

    https://www.facebook.com/share/p/1AUDpgTnB7/

    రిప్లయితొలగించండి
  6. కం॥ నేయఁగ వ్యాకరణ మొదవి
    పాయక ఛందము మనమిడి పద్యము ముదమే!
    న్యాయమ రచించ ననృతము
    వ్రాయకుమయ వ్రాయకిట్టి వ్రాతల నింకన్

    ఉ॥ నేయఁగఁ బద్య మాలికల నేర్పుగ వ్యాకరణమ్ము ఛందమున్
    బాయక మాధురీ సిరుల భావ సుసంపద భవ్యమై చనన్
    న్యాయమె యాలిఖించఁగఁ బ్రహారముఁ జేయుచు నన్ని సూత్రముల్
    వ్రాయకు వ్రాయఁ బోకుమయ వ్రాయకు వ్రాయకు మిట్టి వ్రాతలన్

    రిప్లయితొలగించండి
  7. (1)కం:ఆ యొక సమస్య బట్టుక
    వ్రాయగ కందమ్ము చాలు , వ్రాయగ వృత్త
    మ్మే యవసరమే? చాలును
    వ్రాయకుమయ వ్రాయకిట్టి వ్రాతల నింకన్”
    (సమస్య ఒకటే కదా! కందము చాలదా.మళ్లీ వృత్తం కూదా ఎందుకు? గురువు గారు మన్నించాలి. )

    (2)ఉ: ఈయకు మీయబోకు మిక నీయకు మిట్టి సమస్య లెప్పుడున్
    చేయకు చేయబోకు మయ చేయకు చేయకు మెట్టి పూరణన్
    చేయుట కీ వధాని కడు చింతన జేసియు జేయ లేఖకా
    వ్రాయకు వ్రాయఁబోకుమయ వ్రాయకు వ్రాయకు మిట్టి వ్రాతలన్.
    (సరదా పూరణ.ఇలాంటి సమస్య ఇవ్వ వద్దని ఇచ్చిన వారికి సలహా.ఇస్తే ఇచ్చారు.దీనికి పూరణ చెయ్య వద్దని అవధానికి సలహా.ఆయన కష్టపడి పూరణ చేస్తే చెయ్య వచ్చు కానీ దాన్ని వ్రాయ వద్దని లేఖకుడికి సలహా.)

    రిప్లయితొలగించండి
  8. ఉ:"వ్రాయగ నాదె యిష్టమని బ్రహ్మను నే" నని వ్రాసినావు గా
    "వ్రాయుము రా కవిత్వ" మని ఫాలము నందున పిచ్చి వ్రాత నే
    వ్రాయగ పాఠకుం డెవడు? పత్రిక యేదియు నచ్చు వేయదే
    వ్రాయకు వ్రాయఁబోకుమయ వ్రాయకు వ్రాయకు మిట్టి వ్రాతలన్”

    రిప్లయితొలగించండి
  9. గాయము జేయుచు మనసుకు
    పాయని బాధలను గూర్చు పదముల తోడన్
    సాయ మొ న ర్చ ని విధముగ
    వ్రాయ కు మ య వ్రాయ కి ట్టి వ్రాతల నింకన్

    రిప్లయితొలగించండి
  10. నీ యడుగులకు మడువులన్
    వేయ వలెన లేక యున్న విద్వేషమునం
    దీయఁ దలంతువె మానము
    వ్రాయకు మయ వ్రాయ కిట్టి వ్రాతల నింకన్


    కాయకు కాయఁ బోకు మయ కాయకు కాయకు పందె మెన్నఁడుం
    దీయకు తీయఁ బోకు మయ తీయకు తీయకు తిట్ల పొత్తమున్
    రోయకు రోయఁ బోకు మయ రోయకు రోయకు మాత్మ బంధులం
    గూయకు కూయఁ బోకు మయ కూయకు కూయకు మిట్టి కూఁతలన్
    వ్రాయకు వ్రాయఁ బోకు మయ వ్రాయకు వ్రాయకు మిట్టి వ్రాఁతలన్

    రిప్లయితొలగించండి
  11. కందం
    మాయలు సేయవు మతములు
    సాయము జేయునవి ముక్తి సముపార్జింపన్
    గాయపడ నన్య మతములు
    వ్రాయకుమయ వ్రాయకిట్టి వ్రాతలనింకన్

    రిప్లయితొలగించండి

  12. ఉత్పలమాల
    మాయలు సేయదే మతము మానవుడొందగ ముక్తి, మార్గమున్
    సాయమనంగఁ జూపునది సద్గుణశీలము పెంపుఁజేయుచున్
    గాయపడంగ నన్యమత కర్మలనెప్పుడు తప్పు పట్టుచున్
    వ్రాయకు వ్రాయఁబోకుమయ వ్రాయకు వ్రాయకు మిట్టి వ్రాతలన్

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    మాయలు మంత్రమ్ములనుచు
    శ్రేయము గూర్చని రచనలు చేయవు మేలున్
    ధ్యేయంబేమియు లేకను
    వ్రాయకుమయ వ్రాయకిట్టి వ్రాతలనింకన్.

    రిప్లయితొలగించండి