24, జనవరి 2026, శనివారం

సమస్య - 5361

25-1-2026 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వరమున రాక్షసుఁడు పుట్టెఁ బాలింప భువిన్”
(లేదా...)
“వరమునఁ బుట్టె రాక్షసుఁడు వైభవమొప్ప జగంబు నేలఁగన్”
(భరతశర్మ గారి శతావధానంలో గౌరీభట్ల రఘురామ శర్మ గారి సమస్య)

11 కామెంట్‌లు:

  1. కందం
    సరసకుఁ జేరెడు సమయమ
    సురసంధ్యన్ దగదనఁ బతి. ,చోద్యమనంగన్
    దరుణి దితియె పొరలిన కా
    వరమున రాక్షసుఁడు పుట్టెఁ బాలింప భువిన్

    చంపకమాల
    సరసకుఁ జేరగానసురసంధ్యను కశ్యపు డొప్పకుండినన్
    మరిమరి కౌతుకమ్మున సమాగము దప్పదటన్నరీతిగన్
    వరుసను మార్చకే దితియె వాంఛలు దీరఁగ పొర్లినట్టి కా
    వరమునఁ బుట్టె రాక్షసుఁడు వైభవమొప్ప జగంబు నేలఁగన్

    రిప్లయితొలగించండి

  2. సరికాదు సురత మిదియె య
    సురసంధ్య యని పతి దితికి సూచించిన నే
    మి రమణి కోరెనుగద కా
    వరమున, రాక్షసుఁడు పుట్టెఁ బాలింప భువిన్.


    సరి యిది కాదు కాదసుర సంధ్యను సంగమమ్మటంచున్
    పురుషుడు చెప్పనేమీ సతి మూర్ఖత వీడక సంప్ర యోగమున్
    విరహము తాళలేననుచు వేడగ నాదితి యున్నతిల్లు కా
    వరమునఁ, బుట్టె రాక్షసుఁడు వైభవమొప్ప జగంబు నేలఁగన్.

    రిప్లయితొలగించండి
  3. తరతరముల జనహితముగ
    పరిపాలనమును సలిపిన వంశమె గాదా !
    అరుదగు విధముగ నిపుడు ప్ర
    వరమున రాక్షసుఁడు పుట్టెఁ బాలింప భువిన్

    రిప్లయితొలగించండి
  4. -

    జయవిజయులు,/ ఆదాము ఈవులు
    ద్వంద్వ ప్రకృతి/ ద్వైతము ....


    హరిని గొలిచె పణిహారిగ
    గరువము తలకెక్కగా నకరిణికి గురియై
    యిరమనెడీ మోక్షపు స్థా
    వరమున రాక్షసుఁడు పుట్టెఁ బాలింప భువిన్


    శుభోదయము
    జిలేబి





    రిప్లయితొలగించండి
  5. నిరతము నీరజోదరుని నిండు మనంబున నిల్పి గొల్చుచున్
    పరమ పవిత్రులైన హరి భక్తుల సంగతమందు నార్తితో
    హరిని భజించుటన్నఁగడు హర్షముఁజూపెడు బాలకుండుగా
    వరమునఁ బుట్టె రాక్షసుఁడు వైభవమొప్ప జగంబు నేలఁగన్

    రిప్లయితొలగించండి
  6. (ప్రహ్లాదుని జననమండి హరి వరమున పుట్టినవాడే కదా)

    కం॥ ధరఁ గశ్యపాత్మజుఁ డటుల
    వరలఁగ దురిత గుణములను బంకజనాభున్
    వరదుని వేడఁగ నాతని
    వరమున రాక్షసుఁడు పుట్టెఁ బాలింప భువిన్

    చం॥ ధరణిని కశ్యపాత్మజుఁడు తల్లడపెట్టఁగ సజ్జనాళినిన్
    సరగున దేవతాళి చని చక్రిని వేడఁగ నూరడించుచున్
    హరి కరుణామయుండు దరహాస వికాశముతో నొసంగె నా
    వరమునఁ బుట్టె రాక్షసుఁడు వైభవ మొప్ప జగంబు నేలఁగన్

    కశ్వపాత్మజుడు హిరణ్యకశిపుడు
    (ప్రహ్లాదుడు చాలా సంవత్సరాలు పరిపాలిస్తాడు కదండి)

    రిప్లయితొలగించండి
  7. సమస్య:
    “వరమునఁ బుట్టె రాక్షసుఁడు వైభవమొప్ప జగంబు నేలఁగన్”

    చం.మా :

    పరసతి బట్ట శాపమును, పాపపు భీతియు లేక సీతనే !
    గరువము తోడ దెచ్చెనుగ, గారవమంచు నశోకవాటికన్
    కరమును బట్టలేక మరి కాంతను వేడెను గూడ, కండ, కా
    “వరమునఁ బుట్టె రాక్షసుఁడు, వైభవమొప్ప, జగంబు నేలఁగన్”

    రిప్లయితొలగించండి
  8. నిరతము హరినామమ్మును
    స్మరియించుచు నార్తితోడ మదిలో నెపుడున్
    హరినిఁ గొలుచు భక్తునిగా
    వరమున రాక్షసుఁడు పుట్టెఁ బాలింప భువిన్

    రిప్లయితొలగించండి
  9. గురు తప మొనరింప నరే
    తరుల వలనఁ జావు లేమి ధాత యొసంగెన్
    నిరతమ్మును జెలరేఁగుచు
    వరమున రాక్షసుఁడు పుట్టెఁ బాలింప భువిన్


    వర మిడ పద్మనాభుఁడు సుపర్వుల కింపుగ లోకరక్షకై
    పురుష వరుండు రాఘవుఁడు వుట్టె వధింపఁగ రావణాసురున్
    సురముని దత్త శాపమునఁ జోద్యము వైశ్రవణుండు కండ కా
    వరమునఁ బుట్టె రాక్షసుఁడు వైభవ మొప్ప జగంబు నేలఁగన్

    రిప్లయితొలగించండి
  10. మురియగ నసుర గణంబులు
    నిరుపమ విక్రముo డ గాగ నిగనిగ లాడేతరుణమున లంకా స్థా
    వరమున రాక్షసుడు పు ట్టె పాలింప భువిన్

    రిప్లయితొలగించండి