6, ఫిబ్రవరి 2026, శుక్రవారం

సమస్య - 5374

7-2-2026 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రావణుఁడు రామభక్తుఁడై ప్రణతులిడెను”
(లేదా...)
“రావణుఁ డేఁగుదెంచి రఘురామునకున్ బ్రణమిల్లె భక్తుఁడై”

14 కామెంట్‌లు:

  1. తేటగీతి
    సీతఁదెచ్చుట నిందించి, శ్రేయమొనర
    దాశరథి కొసంగుట మేటి ధర్మమనఁగ
    మూడి దుర్భాషలాడుచుఁ బొమ్మనంగ
    రావణుఁడు, రామభక్తుఁడై ప్రణతులిడెను

    ఉత్పలమాల
    కావరమెక్కువై మదిని కామము మీరగ నీచ భిక్షువై
    పావని జానకిన్ గొనియు బందిగ లంకకుఁ జేర్చుటన్నదే
    దీవరమన్ విభీషణుని దెప్పినయంతట కారుకూతలన్
    రావణుఁ ,డేఁగుదెంచి రఘురామునకున్ బ్రణమిల్లె భక్తుఁడై!

    (రావణుఁడు, + ఏగుదెంచి)

    రిప్లయితొలగించండి
  2. జ్యేష్ఠుడైనను రాముని యెదిరి నిలిచె
    రావణుఁడు ; రామభక్తుఁడై ప్రణతులిడెను
    పిన్న వాడయినట్టి విభీషణుండు,
    అన్న దమ్ముల మధ్యన అంతరమిది

    రిప్లయితొలగించండి

  3. సంలయనమున నావిభీషణుడు గాంచె
    స్వప్నమొక్కటి యందు వాస్తవ మెఱంగి
    దనుజ జాతిని రక్షింప దలచి నట్టి
    రావణుఁడు రామభక్తుఁడై ప్రణతులిడెను.


    ఆ వసతిన్ విభీషణుడు నంతిపురమ్ము శయించు వేళలో
    పావనభక్తుడై కనెను స్వప్నము నొక్కటి యందు రాఘవున్
    చేవనెఱంగి శీఘ్రమున సీతను రామున కప్పగించుచున్
    రావణుఁ డేఁగుదెంచి రఘురామునకున్ బ్రణమిల్లె భక్తుఁడై.

    రిప్లయితొలగించండి
  4. భావములోన నిల్పి గరు
    వంబున లావును గూర్చు వానిగన్
    జేవను గొంచు నమ్మి విభు
    సేవయె జీవన మార్గమంచు సం
    భావిత నిశ్చలాత్మ ధృతి
    బైకొని, మారుతి, భక్తి రక్తి మి
    త్రావణుఁ, డేఁగుదెంచి రఘు
    రామునకున్ బ్రణమిల్లె భక్తుఁడై!


    మిత్ర+అవణుడు=మైత్రితో యొప్పువాడు (అవణు+ఒప్పు)

    రిప్లయితొలగించండి
  5. దాశరథి కోరికపయి సీతనుకనుగొని
    వాయుజాతుడు శీఘ్రమె భటులను కడ
    తేర్చి లంకను గాల్చి నిట్టూర్చు చుండ
    రావణుఁడు, రామభక్తుఁడై ప్రణతులిడెను

    పావని లంకజేరుకొని పార్థివినేగని సంతసంబునన్
    భావిని భూషణమ్ముగొని పాపులపైబడి పోరి పిమ్మటన్
    రావణుఁ హెచ్చరించెనట లంకను భస్మమొనర్చి శత్రు వి
    ద్రావణుఁ డేఁగుదెంచి రఘురామునకున్ బ్రణమిల్లె భక్తుఁడై

    రిప్లయితొలగించండి
  6. భావనచేసి రాఘవుని పావన నామము మానసంబునన్
    దావరియై చెలంగియు నుదంచిత దేహబలంబు తోడనా
    రావణు లంకఁ గాల్చి హరి లంఘన జేసి పయోధి, వైరి వి
    ద్రావణుఁ డేఁగుదెంచి రఘురామునకున్ బ్రణమిల్లె భక్తుఁడై

    రిప్లయితొలగించండి
  7. తే. అవనిజ నపహరించిన యధముఁడెవఁడు
    అంజనీపుత్రు డెట్టుల నవనినలరె
    రామభద్రునకునయోధ్యయేమిజేసె
    రావణుఁడు రామభక్తుఁడై ప్రణతులిడెను

    రిప్లయితొలగించండి
  8. (చావుకు ముందు పూర్వ వృత్తాంతమంతా ఎరుకకు వచ్చి నమస్కరించాడని యండి, శరాఘాతం పిదపే నండి)

    తే॥ చావు సమయ మాసన్నమై చనఁగ నపుడు
    పూర్వ జన్మ చేతనఁ గని సర్వమెరుఁగ
    విష్ణువే రాముఁడను ధ్యాస విహిత మలర
    రావణుఁడు రామభక్తుఁడై ప్రణతులిడెను

    ఉ॥ చావుకు ముందు జ్ఞానమటు చక్కగఁ గాంచఁగ రామచంద్రుఁడే
    పావన మూర్తి విష్టువని పాపుచు శాపము తన్ను కావఁగా
    నీవిధి ధర్మరక్షకయి యెన్నిన రూపమటంచు నెక్కొనన్
    రావణుఁ డేఁగు దెంచి రఘురామునకున్ బ్రణమిల్లె భక్తుఁడై

    రిప్లయితొలగించండి
  9. తే.గీ:తమ్ము డై విభీషణుడు తా ధర్మ మెల్ల
    దెలుప నాతని నిందించె నలుక బూని
    రావణుఁడు, రామభక్తుఁడై ప్రణతులిడెను”
    తమ్ము డౌ విభీషణుడు బంధమ్ము వీడి

    రిప్లయితొలగించండి
  10. ఉ:"పావని యైన సీత యెడ పాపము నెంచకు" మంచు న్యాయమౌ
    త్రోవ విభీషణుండు నతి తో దెలుపన్ వెలివేయ గా తనన్
    రావణుఁ, డేఁగుదెంచి రఘురామునకున్ బ్రణమిల్లె భక్తుఁడై,
    సేవకుడై విభీషణుడు శ్రెష్ఠము ధర్మమె యంచు దల్చుచున్

    రిప్లయితొలగించండి
  11. దోఁచుకొనఁ ద్యాగరాజును వేచి చూచు
    చుండఁ గోదండ రాముఁడె యండ కాఁగఁ
    గాంచి భీతిల్లి వే విరమించి యొక్క
    శ్రావణుఁడు రామ భక్తుఁడై ప్రణతు లిడెను

    [శ్రావణుఁడు = మోసగాఁడు]


    కావఁగఁ జాలు సూర్య కుల కాంతుఁడు తప్పక యంచు నెంచి స
    ద్భావము నూని డెందమునఁ బాయక మంత్రులు రాఁగ నల్వురున్
    వే విడి స్వీయ లంకను విభీషణుఁ డార్తినిఁ, బొమ్మనంగ నా
    రావణుఁ, డేఁగుదెంచి రఘు రామునకుం బ్రణమిల్లె భక్తుఁడై

    రిప్లయితొలగించండి
  12. సీత నపహరించి యు లంక చెర పట్టె
    రావణుండు :: రామ భక్తుడై ప్రణ తు లిడెను
    భక్తి గ విభీష ణుడు తాను పావనo పు
    వర్త నంబు న వినయాన వరలె గాదె

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    సీతను వనము నందున చెఱను పెట్టి
    నీతి నియమము వీడెను నీచుడైన
    రావణుడు; రామ భక్తుడై ప్రణతులిడెను
    పవన సుతుడు సీతను గాంచి వనమునందు.

    రిప్లయితొలగించండి