9, జులై 2026, గురువారం

సమస్య - 5523

10-7-2026 (శుక్రవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భార్యలకు భయపడవలె భర్తలెల్ల”
(లేదా...)
“భార్యలు గొట్టఁగావలెను భర్తలు నిచ్చలు నేడ్వఁగాఁ దగున్”

16 కామెంట్‌లు:

  1. తేటగీతి
    సంబరమున' జంబలకిడిపంబ' యనెడి
    చిత్రమొకటి తీయంగ విచిత్రరీతి
    దర్శకుండు నిర్దేశింప తప్పకుండ
    భార్యలకు భయపడవలె భర్తలెల్ల


    ఉత్పలమాల
    భార్యలు బాధలున్ బడఁగ భర్తల తీర్చెడు గాథలెన్నొ! యాం
    తర్యము మార్చి నూత్నముగ దర్శకుఁడొక్కడు తీయు చిత్రమై
    చర్యల తో వినోదమును సర్వులు మెచ్చగ తీర్చ ఘట్టముల్
    భార్యలు గొట్టఁగావలెను! భర్తలు నిచ్చలు నేడ్వఁగాఁ దగున్!

    రిప్లయితొలగించండి
  2. వలపుతో రుచి కారణమగు వంట జేయు
    కార్యమున మీదుమిక్కిలి గడుసరులగు
    మగువలకు నుతినిడకున్న మానెదరని
    భార్యలకు భయపడవలె భర్తలెల్ల

    రిప్లయితొలగించండి

  3. సద్గుణమ్ముల గల్గిన సాధ్వి మణులు
    ధారలుగ కలిగిన నేమి పూరుషుండ్రు
    వక్ర మార్గన చరియించు వారె యైన
    భార్యలకు భయపడవలె భర్తలెల్ల.


    భార్యలు చేతకత్తెలను భావన తోడ చరించువారలౌ
    క్రౌర్యమనస్కులైన వలకారులు, దిచ్చు, సురాసు లైనచో
    ధైర్యము తోడవారినిక దారిని పెట్టగ తప్ప కున్నచో
    భార్యలు గొట్టఁగావలెను, భర్తలు నిచ్చలు నేడ్వఁగాఁ దగున్.

    రిప్లయితొలగించండి
  4. ధైర్యము తెగువ గలిగిన దారలిపుడు
    క్రౌర్యమతిశయించు విధము కడలుకొనగ
    భార్యలొనరించు కృత్యాలు పరిగణింప
    భార్యలకు భయపడవలె భర్తలెల్ల

    మౌర్యుల కాలమందుగల మానవి నిర్మిత రాజ్యమందునన్
    శౌర్యపరాక్రమంబులుఁ బ్రశస్తత గల్గిన రాణి రాకతో
    పర్యవసానమైనవని ప్రాజ్ఞుడొకండనెఁ గట్టుబాట్లుగా
    భార్యలు గొట్టఁగావలెను భర్తలు నిచ్చలు నేడ్వఁగాఁ దగున్

    రిప్లయితొలగించండి
  5. క్రౌర్యమనస్కులౌచు నిల కాంతులు కొందరు కళ్ళు కానకన్
    భార్యల నెల్ల వేళలను బాధలు మిక్కిలి పెట్టు చుంద్రుగా
    దుర్యశమెంతొ జాదుకొని దుష్టపు చేష్టలు సేయు భర్తలన్
    భార్యలు గొట్టగావలెను భర్తలు నిచ్చలు నేడ్వగా దగున్

    రిప్లయితొలగించండి
  6. మంచి వర్తన గల్గిన మానవుండు
    సంఘ హితమును గోరెడు సౌమ్యుడ గుచు
    చేయ రానట్టి పనులను జేయు నపుడు
    భార్య లకు భయ పడ వలె భర్త లెల్ల

    రిప్లయితొలగించండి
  7. ఇంటి యిల్లాలి నొంటిగా నింటవిడచి
    పరసతుల పొందు కోసమై పరుగులిడెడు
    భర్తలకు జేయ భార్యలు బడితె పూజ
    భార్యలకు భయపడవలె భర్తలెల్ల

    రిప్లయితొలగించండి
  8. క్రౌర్యమనస్కులై సతము గానక నెమ్మి దయావిహీనులై
    భార్యల హింస బెట్టుచును వారక వేశ్యల గీములందు దు
    శ్చర్యల పాలుపంచుకొను చండుల దౌష్ట్యమునాప నిర్దయన్
    భార్యలు గొట్టఁగావలెను భర్తలు నిచ్చలు నేడ్వఁగాఁ దగున్

    రిప్లయితొలగించండి
  9. తే.గీ:స్వంత తలిదండ్రులకు నైన సాయ మిడగ
    భార్యలకు భయపడవలె భర్త, లెల్ల
    జీతమును దెచ్చి భార్యల చేతి కిడిన
    తెలుసుకొనుమురా మగ వాడ! కలియుగ మిది.
    (భర్తలు తమ సంపాదనని, లెక్కలు మొత్తం భార్య చేతి లో ఉంచటం చాలా తప్పు.అది చేస్తే మగవాడికీ ఆర్థికస్వాతంత్ర్యం లేనట్టే.)

    రిప్లయితొలగించండి
  10. తే॥ కలిని ముదితలు ధైర్యముఁ గాంచి యొప్పి
    పతులకును దూగు రీతినిఁ బనులఁ జేయు
    కతన దుర్బలులై చని నతుకు చుండ
    భార్యలకు భయపడవలె భర్తలెల్ల

    ఉ॥ ధైర్యముఁ గాంచిరే కలిని దైన్యము వీడుచు లక్ష్యసాధనన్
    శౌర్యముఁ జూపుచున్ సతులు చచ్చుగ గేస్తులు నుండ మూర్ఖులై
    స్థైర్యము నొప్పు రీతిఁ గని దండన సేయరె దిద్ద నెంచుచున్
    భార్యలు గొట్టఁగా వలెను భర్తలు నిచ్చలు నేడ్వఁగాఁ దగున్

    నతుకు అణగు

    రిప్లయితొలగించండి
  11. ఉ:భార్యలు మీకు స్వాస్థ్య మిడు పథ్యము జెప్పగ వీడి వారి పై
    శౌర్యము జూపి దుర్వ్యసనసర్వము బూనగ,వృద్ధు లయ్యు నే
    కార్యము జేయ లేని యెడ, కష్టము లొందగ నీదు సేవ లో
    భార్యలు గొట్టఁగావలెను భర్తలు నిచ్చలు నేడ్వఁగాఁ దగున్”

    (భార్యలు మీ ఆరోగ్యం కోరి మంచి చెపితే వినక దుర్వ్యసనాల వల్ల మంచాన పడితే మీకు సేవ చెయ్య లేని విసుగుతో భార్యలు కొట్టినా తిట్టినా భరించక తప్పదు. )

    రిప్లయితొలగించండి
  12. ప్రేమ నొలికించి లాలింపఁ బ్రీతి తోడ
    భర్తలకు భయపడ వలె భార్య లెల్ల
    నిత్య మనురాగమును జూపు నెలఁత లైన
    భార్యలకు భయపడ వలె భర్త లెల్ల


    ఆర్య విసర్జనీయములె యా ద్వివిధమ్ములు సంతతమ్ము నౌ
    దార్య మొకింత లేని యెడ దంపతు లిర్వురు నేడ్వఁగా వలెన్
    భార్యల కేడ్వఁగాఁ దగును భర్తలు నిచ్చలుఁ గొట్టఁగా వలెన్
    భార్యలు గొట్టఁగా వలెను భర్తలు నిచ్చలు నేడ్వఁగాఁ దగున్

    రిప్లయితొలగించండి
  13. 🥁 శంకరాభరణం🥁
    ***************** 🌷సమస్య 🌷 10/07/2026 🌷
    ***********************

    భార్యలు గొట్టఁగావలెను భర్తలు నిచ్చలు నేడ్వఁగాఁ దగున్”

    నా పూరణ : ఉ. మా.
    ****************
    (..నేడు భార్యలు పరాయి పురుషుల మోజులో పడి కట్టుకున్న వానినే కడతేరుస్తున్న సంఘటనల ఆధారంగా...)


    కార్యములన్ గనంగ పరకాంతుల గూడి నిగూఢ రీతి నౌ

    దార్య మొకింత లేక మెడ దాళిని గట్టిన బ్రాణనాథునిన్

    క్రౌర్యపు బుద్ధి మీఱగను గాటికి బంపుచు నుండ్రి నీచపున్

    భార్యలు.., గొట్టఁగావలెను భర్తలు నిచ్చలు.., నేడ్వఁగాఁ దగున్


    🌿 ఆకుల శాంతి భూషణ్ ✍️
    వనపర్తి

    రిప్లయితొలగించండి
  14. కార్యము మాని చౌర్యమును కాసుల
    కోసము సేయు ధూర్తులన్
    ధుర్యుల రోజు త్రాగి యతి దుర్జన
    స్నేహము జేయుచున్ సదా
    క్రౌర్యముతోడ నిర్దయను గాదిలి
    గొట్టెడు మూఢ వ్యక్తులన్
    భార్యలు గొట్టగా వలయు భర్తలు
    నిచ్చెలు నేడ్వగా వలెన్"

    రిప్లయితొలగించండి
  15. సమస్య : "భార్యలు గొట్టఁగావలెను భర్తలు నిచ్చలు నేడ్వఁగాఁ దగున్"

    ఉ. స్థైర్యమనస్కులై నిలచి దారుణవారుణిపాత్ర నేలకున్
    *భార్యలు గొట్టఁగావలెను, భర్తలు నిచ్చలు నేడ్వఁగాఁ దగున్!*
    క్రౌర్యవిమాలమున్బతులు కక్కసపెట్టఁగ మద్యలోలురై
    దుర్యశమౌనె యింతులిల దూష్యులకించుక బుద్ధిఁజెప్పినన్.

    రిప్లయితొలగించండి

  16. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    మద్యమున్ ద్రాగి ప్రతిరోజు మల్లె పూలు
    తెచ్చి భార్యకిచ్చుచు కప్పి పుచ్చగ నల
    వాటు, తెలిసి తెలియనట్లు సూటిపోటి
    మాటలను గాయమున్ జేయు, మగని
    మనసు,
    భార్యలకు భయపడవలె భర్తలెల్ల.

    రిప్లయితొలగించండి