18, జులై 2026, శనివారం

సమస్య - 5532

19-7-2026 (ఆదివారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“రూపము లేనట్టివాని రూపునుఁ గొలుతున్”

(లేదా...)

“రూపము లేనివాని శుభరూపమునే మది నిల్పి కొల్చెదన్”

12 కామెంట్‌లు:

  1. ఆ పరమాత్ముని గాంచగ
    రూపము మదిలో దలంచి లోహము తోడన్
    కోపుగ జేయించి సదా
    రూపము లేనట్టివాని రూపునుఁ గొలుతున్”

    రిప్లయితొలగించండి

  2. పాపుల దునుమాడ దలచి
    చేపయు కిటి కమఠము నర సింహము తానై
    యీ పుడమిని కాచిన యా
    రూపము లేనట్టివాని రూపునుఁ గొలుతున్.


    నాపయి జాలి చూపుమని నశ్వర మైన కళేబరమ్ము పై
    తీపిని వీడి వాసి ముగితిన్ క్షణియించుచు నీదు నామమే
    పాప హరమ్మటంచు విసువాసము తోడ నహర్నిశమ్ములున్
    రూపము లేనివాని శుభరూపమునే మది నిల్పి కొల్చెదన్.

    రిప్లయితొలగించండి
  3. ఆపువ్విల్తుని సోముడు
    కోపముతోఁ జూడ రూపు కోల్పడెననుచున్
    వాపోయిన రతి చాటెన్
    రూపము లేనట్టివాని రూపునుఁ గొలుతున్

    తాపసియైన భార్గవుడు తామసమే చెలరేగిచూడ నా
    చూపుకు భస్మమై మిగుల శోకము నాకు మిగిల్చె నయ్యయో
    రూపము గోలుపోయె నభిరూపుడు నాకిక మార్గమేదయా
    రూపము లేనివాని శుభరూపమునే మది నిల్పి కొల్చెదన్

    [ శివుడు మన్మథుని భస్మము చేసిన పిదప అతని భార్య రతి పలుకులు ]

    రిప్లయితొలగించండి
  4. ఉ॥ రూపమదేది యీశునకు రుద్రుఁడు విశ్వమునందు నిండఁగన్
    దాపముఁ దీర్చు వాని హృదిఁ దాల్చి స్తుతించఁగ ధ్యాసతో సదా
    తాపసు లెల్ల తెల్పినటు తన్మయ మొందుచు నూహదిద్దఁగన్
    రూపము లేని వాని శుభరూపము నే మది నిల్పి కొల్చెదన్

    (రూపము లేనివానికి ఒక శుభరూపము ఉహ దిద్దగా నేను మదిలో నిల్పి కొలిచెదను అని అండి)

    రిప్లయితొలగించండి
  5. ధూపము వేసి కోవెలను తోషముతో భజియింతు, పూర్వపున్
    పాపములన్ హరించి వెస బాసటనిమ్మని సంతతమ్ము నా
    లోపములన్నియున్ మడచి ప్రోచు మటంచు నిజమ్మునెంచగా
    రూపము లేనివాని శుభరూపమునే మది నిల్పి కొల్చెదన్

    రిప్లయితొలగించండి
  6. తాపముల నుండి నన్నిలఁ
    గాపాడఁగ సంతతమ్ము కరుణాకరు నా
    కాపఁగ నాపద లెల్ల వి
    రూపము లేనట్టి వాని రూపునుఁ గొలుతున్


    పాప వినాశ నార్థ మయి పంకజ గర్భుని దీనవత్సలున్
    స్థాపిత విశ్వ సంచయుని సన్నుతి సేయుచు భక్త లోక స
    ల్లాపుని లోక పాలకుని రమ్య సహస్ర సహస్ర రూపునిన్
    రూపము లేని వాని శుభ రూపమునే మది నిల్పి కొల్చెదన్

    రిప్లయితొలగించండి
  7. కందం
    పాపము వాపుచు భక్తుల
    కాపాడగ వచ్చుఁ గోరి గననగువాడై
    జేపడు! మరి యన్యంబగు
    రూపము లేనట్టివాని రూపునుఁ గొలుతున్

    ఉత్పలమాల
    పాపము వాపుచున్ మిగుల భక్తులు గొల్వ కృపాకరుండనన్
    గాపుగ నిత్యమున్ నిలిచి గైకొను పూజల నిర్గుణంబునన్
    జేపడు దివ్య రూపమున చింతనమట్లుగఁ, గాక యన్యమౌ
    రూపము లేనివాని శుభరూపమునే మది నిల్పి కొల్చెదన్!

    రిప్లయితొలగించండి
  8. రూపములు దాల్చి పెక్కు గ
    పాపము తొలగించు హరిని పరి పరి విధ మై
    యపు రూ పమ్ము గ వేడుచు
    రూపము లేనట్టి వాని రూపము గొలుతు న్

    రిప్లయితొలగించండి

  9. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    ఆపదలు సంభవించిన
    మా పాలిటి దైవమీవె మము కాపాడన్
    పాపులకు శిక్ష వేసెడు
    రూపము లేనట్టి వాని రూపునుఁ గొలుతున్.

    రిప్లయితొలగించండి