28, జులై 2026, మంగళవారం

సమస్య - 5542

29-7-2026 (బుధవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“దేవుఁడు లేఁడని పలికి మదిం బూజింతున్”

(లేదా...)

“దేవుఁడు లేఁడు లేఁడని మదిం గడు నమ్ముచుఁ గొల్తు భక్తితో”

(న.చ. సాహిత్ అర్ధశతావధానంలో వెల్దండ సత్యనారాయణ గారి సమస్య)

38 కామెంట్‌లు:

  1. శ్రీవనితామనోహరుఁడు, శిష్టజనావనతత్పరుండు, నా
    నావిధపాపభంజనుఁడు, నారదసన్నుతుఁ డచ్యుతుండు, స
    ద్భావనతోడ గొల్చిన శుభంబిడి ప్రోచు మురారి కంటె యే
    దేవుఁడు లేఁడు లేఁడని మదిం గడు నమ్ముచుఁ గొల్తు భక్తితో.

    పావనకాశికాపురినివాసుఁడు, బాలశశాంకమౌళి, గౌ
    రీవనితామనోహరుఁడు, ప్రీతిని గంగనుఁ దాల్చువాఁడు, దీ
    నావనుఁడున్, ద్రినేత్రుఁ డురగాభరణుండగు శూలి కంటె నే
    దేవుఁడు లేఁడు లేఁడని మదిం గడు నమ్ముచుఁ గొల్తు భక్తితో.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురు పూర్ణిమ సందర్భంగా
      శ్రీ కందిశంకరయ్య గారికి
      సంగీతము చేసిన పూరణ లింకు :)

      https://youtu.be/r-n1YU0NP5o?is=Ih40LlPPx6bxCasX


      తొలగించండి
  2. కందం
    పావన నాముడు దీన జ
    నావలి నభయాన బ్రోచి యార్తినిఁ దీర్చన్
    బ్రోవన్ రాముని మించిన
    దేవుఁడు లేఁడని పలికి మదిం బూజింతున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      రావణు పాలి మృత్యువయి రామను బ్రోచిన వీరుడై భువిన్
      దీవనలిచ్చుచున్ మిగుల దీనజనావళి గాచు వాడు సం
      జీవుని మానసాన సుధఁ జిల్కెడు నాముడు రాము మించెడున్
      దేవుఁడు లేఁడు లేఁడని మదిం గడు నమ్ముచుఁ గొల్తు భక్తితో

      తొలగించండి
  3. ఆ వసతి చేరువు నకొక
    శ్రావణుడరుదెంచి జనుల సముఖము నందున్
    దైవమును జూపెదననగ ,
    దేవుఁడు లేఁడని పలికి మదిం బూజింతున్

    రిప్లయితొలగించండి
  4. పావను డై వేడు కొనగ
    దీవన లాసగియు శివుండు ది క్కై నిలుచున్
    కావగ నతనిని మించిన
    దేవుడు లేడని పలికి మ ది o బూ జింతు న్

    రిప్లయితొలగించండి

  5. పావన చరితుండాతడు
    రావణ సంహారి ధర్మ రక్షకుడతడే
    గోవున రాముని మించిన
    దేవుఁడు లేఁడని పలికి మదిం బూజింతున్.


    కోవెల లోన నిల్చెనని కోరు వరమ్ముల నిచ్చు వాడె యా
    దైవమటంచు చెప్పెడి బుధానుల మాటలు విశ్వ సింపకన్
    భావన లోనె యుండు భగ వంతుడటంచు కనంగ నెక్కడో
    దేవుఁడు లేఁడు లేఁడని మదిం గడు నమ్ముచుఁ గొల్తు భక్తితో.

    రిప్లయితొలగించండి
  6. దైవశ్రేష్టుండుఁ సకల
    జీవులఁ రక్షించువాడు శ్రీవల్లభుడే
    పావనుని కన్న ఘనుడౌ
    దేవుఁడు లేఁడని పలికి మదిం బూజింతున్

    కేవలమీ జగత్తునకు కేంద్రకమై వెలుగొందు దైవమై
    జీవుల సూక్ష్మమై సకల జీవులనెన్నడుఁ బ్రోచువాడు రా
    జీవదళేక్షణుండయిన శ్రీహరి యాతని కన్న మిన్నయౌ
    దేవుఁడు లేఁడు లేఁడని మదిం గడు నమ్ముచుఁ గొల్తు భక్తితో

    రిప్లయితొలగించండి
  7. పూవిలుతుండు మన్మథుని బుగ్గియొనర్చిన వాడు కాళికా
    దేవికి భర్తయై సగము దేహమొసంగిన వాడు భూషగన్
    శీవము వాసుకిన్ నిలుపు క్ష్వేళగళుండుని కన్న మిన్నయౌ
    దేవుడు లేడు లేడని మదింగడు నమ్ముచు గొల్తు భక్తితో

    రిప్లయితొలగించండి
  8. దేవుళ్లెల్లరొకరని న
    మోవాకమిడదగు కాని మోకరిలి ప్రభుం
    డా వేంకటేశుని వినా
    దేవుడు లేడని పలికి మదిన్ పూజింతున్

    రిప్లయితొలగించండి
  9. భావన చేయుచు భక్తిగ
    రావణ సంహర్తయైన రాముని కంటెన్
    బ్రోవఁగ భువిలో వేరొక
    దేవుఁడు లేఁడని పలికి మదిం బూజింతున్

    రిప్లయితొలగించండి
  10. భావన జేసి దీనజన బాంధవునిన్ సుగుణాభిరామునిన్
    దేవగణార్చితున్ సమరధీరుని రాముని నెమ్మనమ్మునన్
    బ్రోవుమటంచు పంక్తిరథు బుత్రునికన్నను మిన్నయైన నే
    దేవుఁడు లేఁడు లేఁడని మదిం గడు నమ్ముచుఁ గొల్తు భక్తితో

    రిప్లయితొలగించండి
  11. ఉ:జీవతతిన్ సహస్రకర చేతన నిద్దుర నుండి లేపియున్,
    లేవగనే కనంబడుచు,లెక్కకు మించిన కర్మ లందు దా
    నే వెలొగొందు సాక్షి యయి యీ రవి, యీతని మించి దగ్గరౌ
    దేవుఁడు లేఁడు లేఁడని మదిం గడు నమ్ముచుఁ గొల్తు భక్తితో”

    రిప్లయితొలగించండి
  12. కం:నా విధి సంధ్యావందన
    మీ విధినే మరువ విప్రు నే? జ్ఞానార్తిన్
    గావింతు, రవిని మించిన
    దేవుఁడు లేఁడని పలికి మదిం బూజింతున్”

    రిప్లయితొలగించండి
  13. కం॥ భావించి తల్లిదండ్రుల
    సేవనము ప్రియముగ చనఁగ శ్రేయముఁ గూర్చున్
    గావున వారల మించెడు
    దేవుఁడు లేఁడని పలికి మదిం బూజింతున్

    పూజించు సేవించు భావములో నండి. వారు పరమపదించిన తరువాత లేచిన వెంటనే వారికి నమస్కరించుట మంచిది అని రెండవ భావమండి.

    ఉ॥ భావన మీరు తత్పరత భవ్య ముదావహమున్ నివాసమై
    తావుల నీనఁ జిత్తమునఁ దాల్మినిఁ నేమము నిష్ఠలొప్పఁగన్
    దీవెనలంది జీవితము దీపిలఁ గేశవు మించు చుండు నే
    దేవుఁడు లేఁడు లేఁడని మదిం గడు నమ్ముచుఁ గొల్తు భక్కితో

    రిప్లయితొలగించండి
  14. భావమునందు భాగ్యమున
    భాసిలు దివ్య మహాస్వరూపమై
    జీవమునందునిల్చి హృది
    చేతననిచ్చు నికామ తేజ వి
    భ్రాజితమూర్తియై యలరు
    పావన వేంకటనాధుబోలు నే
    దేవుఁడు లేఁడు లేఁడని మ
    దిం గడు నమ్ముచుఁ గొల్తు భక్తితో!

    రిప్లయితొలగించండి
  15. రే వగలు కాచు చుండును
    సేవ లొసంగు నిరతమ్ము క్షేమం బరయుం
    గావునఁ దల్లికి మించిన
    దేవుఁడు లేఁడని పలికి మదిం బూజింతున్


    తావు నొసంగఁ డెన్నఁడును ద్రాతయె తా నని నేర నేరికిన్
    దైవమ మాన వాకృతినిఁ దప్పక కాచును భక్త కోటినిం
    గావు మటంచు వేఁడ నర కాయము భక్తిని రాని యట్టి యే
    దేవుఁడు లేఁడు లేఁడని మదిం గడు నమ్ముచుఁ గొల్తు భక్తితో

    రిప్లయితొలగించండి
  16. భావన జేయ భక్తిమయి, బాధలు బాపును నెమ్మితోడుతన్
    కావగ వచ్చు కోరుకొన, క్రన్నన భక్తుల నాదరింపగా
    నీవసుధా స్థలిన్ గనగ నీశుని మించి జనాళిఁ గాంచు నే
    దేవుఁడు లేఁడు లేఁడని మదిం గడు నమ్ముచుఁ గొల్తు భక్తితో

    రిప్లయితొలగించండి
  17. కావగ రావా సామీ!
    నీవేనాప్రాణమంచు నిరతముఁదలతున్
    బ్రోవగ శంభుని మించిన
    దేవుఁడు లేఁడని పలికి మదిం బూజింతున్”

    రిప్లయితొలగించండి
  18. కావగ రావ రామ!,మము కారణ జన్ముడ! నీవ కాక యే
    దేవుఁడు లేఁడు లేఁడని మదిం గడు నమ్ముచుఁ గొల్తు భక్తితో”
    రావణ సంహరా! వరద! రమ్యకులోధ్భవ!లక్ష్శణాగ్రజా!
    సేవను జేయగాబలము శీఘ్రమ యీయుము నాకునెప్పుడున్

    రిప్లయితొలగించండి

  19. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    దైవము కేశవుడే యని
    పావన మూర్తిని గొలుచుచు ప్రతిదినమందున్
    బ్రోవగ నాతని మించిన
    దేవుడు లేడని పలికి మదిం బూజింతున్.

    రిప్లయితొలగించండి