28, సెప్టెంబర్ 2026, సోమవారం

సమస్య - 5604

29-9-2026 (మంగళవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“భవుఁడు రచించెను రఘుకులమాన్యుని చరితన్”

(లేదా...)

“భవుఁడు రచించె రామకథ మానవకోటికి మేలు సేయఁగన్”

(నారాయణం బాలసుబ్రహ్మణం గారి నిన్నటి అష్టావధానం సమస్య)

11 కామెంట్‌లు:

  1. కందం
    రవళించెను శ్లోకమ్మది
    వివశత విడి పక్షిజంట వేదన పడ, బో
    య వగచ‍! కిరాత కుల సం
    భవుఁడు రచించెను రఘుకులమాన్యుని చరితన్

    రిప్లయితొలగించండి
  2. చంపకమాల
    రవళిగ శ్లోకమే పొరలె రమ్యపు పక్షుల జంట రాగపున్
    వివశతఁ బాయుచున్ దనువు వీడగ శోకము రేపినంత బో
    య వగచ! నారదాఖ్యు విని యద్భుత రీతి కిరాతవంశ సం
    భవుఁడు రచించె రామకథ మానవకోటికి మేలు సేయఁగన్

    రిప్లయితొలగించండి
  3. కవనము పుట్టెనెవ్వని సుగాత్రమునన్ ప్రధమమ్ముగా భువిన్
    కవన వనాంతరమ్మున మృగాధిపమంచు కవుల్ ను తింపగా
    సవన సమాన దీక్ష గొన సాగఁబ్రచేతస మౌని వంశ సం
    భవుఁడు రచించె రామకథ మానవకోటికి మేలు సేయఁగన్

    రిప్లయితొలగించండి

  4. కవనంబెఱుగని యొక్క మృ
    గవధాజీవుడు వాడు కంజుని దయతో
    నవ దూత యగుచు కృమి స
    మ్భవుఁడు రచించెను రఘుకులమాన్యుని చరితన్.


    కవనము వ్రాయ జాలని మృగావుడు కొమ్మన యున్న జంట పా
    రువముల గాంచి కొట్టుతరి రోదన చెందుచు విల్లు వీడి సా
    ధువుగను మారి బ్రహ్మ దయతోడ కిరాతుడు శక్రమూర్ధ స
    మ్భవుఁడు రచించె రామకథ మానవకోటికి మేలు సేయఁగన్.

    రిప్లయితొలగించండి
  5. కవికాడు , పుట్ట తెగ సం
    భవుఁడు రచించెను రఘుకులమాన్యుని చరితన్
    ద్రువుపయి పక్షి మృతినిగని
    నవత బడయ శ్లోకమొకటి నడచుట చేతన్

    రిప్లయితొలగించండి
  6. నవరస భరితపు కథనే
    సవివరముగఁ దెలుపనెంచి చక్కని రీతిన్
    గవనముగా ఖోలక సం
    భవుఁడు రచించెను రఘుకులమాన్యుని చరితన్

    సవివరమైన కావ్యమిది చక్కని పాటవమొప్పురీతినిన్
    గవనము కూర్చినట్టి కవి జ్ఞానవిలోచను డగ్నిశర్మ సం
    భవుఁడు విలక్షణుండు నగు మౌని తపోనిధి శక్రమూర్ధ సం
    భవుఁడు రచించె రామకథ మానవకోటికి మేలు సేయఁగన్

    [ఖోలకము = పుట్ట; శక్రమూర్ధము = పుట్ట]

    రిప్లయితొలగించండి
  7. భవహరమైన దాశరథి భవ్యచరిత్రము కావ్యరూపమై
    శివమును గూర్చి తేకువను జీవులకేర్పడ జేయు నిచ్ఛతో
    కవనము వ్రాయ బూనుకొని కమ్రముగానిల శక్రమూర్ధసం
    భవుఁడు రచించె రామకథ మానవకోటికి మేలు సేయఁగన్

    రిప్లయితొలగించండి
  8. భవహరము శుభకరము కే
    శవు చరితము శ్రీకరమ్ము సకల జనులకున్
    కవిగా భువి వల్మికసం
    భవుఁడు రచించెను రఘుకులమాన్యుని చరితన్

    రిప్లయితొలగించండి
  9. చం:"అవి యివి వ్రాయ నేల? గవి వైన లిఖింపుము రామగాథ" యన్
    చవి గల తండ్రి బోధ విని శాస్త్ర విదుండగు విశ్వనాథ, త
    త్త్వవిదుడు, కావ్యశిల్పి, ఋషిధర్మ విదుండును, విప్రవంశసం
    భవుఁడు రచించె రామకథ మానవకోటికి మేలు సేయఁగన్



    రిప్లయితొలగించండి
  10. చం॥ కవియ కిరాతుఁడాతఁడటు కావ్యముఁ గూర్చుట నేర్చి యుండెనా?
    భవితను దెల్ప శక్యమొకొ బ్రహ్మకుఁ గాని యతండు మారుచున్
    జవిఁగొని తప్పుఁ దెల్సికొను సంఘటనమ్మున నౌచు జ్ఞాన సం
    భవుఁడు రచించె రామకథ మానవకోటికి మేలు సేయఁగన్

    (బ్రహ్మ కూడ వ్రాసి తప్పకోవలసినదే కదండి. గుర్తుండే అవకాశము లేదను భావముతో)

    రిప్లయితొలగించండి