1, అక్టోబర్ 2026, గురువారం

సమస్య - 5607

2-10-2026 (శుక్రవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కలుషితచిత్తులె కదా జగద్గురు లెల్లన్”

(లేదా...)

“కలుషితచిత్తులే కద జగద్గురువుల్ పరికించి చూచినన్”

(న.చ. సాహిత్ శతావధానంలో నేనిచ్చిన సమస్య)

12 కామెంట్‌లు:

  1. కందం
    వెలయఁగ సర్వులకు శుభముఁ
    బలికె జగద్గురుడు దివ్య భగవద్గీతన్
    దలఁప గురుపరంపరను న
    కలుషితచిత్తులె కదా జగద్గురు లెల్లన్

    చంపకమాల
    తెలియని మూఢులన్ దెలివి తేటల దారికి తెచ్చి, వారిలోఁ
    గలిగిన పాపవాసనల కల్మషమున్ దమయందు దాల్చుచున్,
    జెలువగు జ్ఞానదీపమును జేపడఁ జేసెడు నట్టివారలై
    కలుషితచిత్తులే కద జగద్గురువుల్ పరికించి చూచినన్!

    రిప్లయితొలగించండి
  2. అలవాటయినటుల దనకు
    తెలిసిన దంతయు నిజమను దీరుగ దానిన్
    పలువురి కెటులైన తెలుప
    కలుషితచిత్తులె కదా జగద్గురు లెల్లన్

    రిప్లయితొలగించండి
  3. (1)తలతురు గొప్పవారమని ధర్మ విదూరులు కర్మ భ్రష్టులై;
    విలువలు లేనివాడొకడు వెర్రిగవాగుచు రెచ్చిపోగ నో
    ఖలుడికవాణ్ణిజేరి కలికాల ప్రభావముగూడ నిట్లనెన్..
    కలుషిత చిత్తులే కద జగద్గురువుల్,
    పరికించి చూచినన్!

    (2)
    తలచుట సాధ్యమాయతుల ధర్మము, జ్ఞానము,స్వాత్మనిష్ఠలన్
    కలియుగ మందుభక్తులనుగావగదండముచేతబూని భూ
    జనులనునుద్ధరించుటకు సర్వము త్యాగముజేయునట్టి ని
    ష్కలుషిత చిత్తులే కద జగద్గురువుల్,
    పరికించి చూచినన్!

    రిప్లయితొలగించండి
  4. తలపులు మంగళకరమై
    కలనము పలువురి జనులకు కాపాడుటకై
    విలువలనడరించెడి ని
    ష్కలుషితచిత్తులె కదా జగద్గురు లెల్లన్

    పలువురు గావవత్తురిట వంచకులై గురువేషధారులై
    తలపులు దారితప్పి పెడదారిని బట్టిన పెద్దవారలా
    కలుషితచిత్తులే కద; జగద్గురువుల్ పరికించి చూచినన్
    విలువలు పెంపొనర్చుటకు విజ్ఞత చూపిన వారలందురే

    రిప్లయితొలగించండి
  5. -
    హమ్మయ్య !

    విలువలను మరచిన జనులు
    కలుషితచిత్తులె కదా; జగద్గురు లెల్లన్
    పులుకడిగినట్టి ముత్య
    మ్ములు తెలుసుకొనవె జిలేబి మూఢత వలదే



    రిప్లయితొలగించండి
  6. కం:ఫలముల తమ కాశించక
    యిలకున్ దత్త్వమ్ము దెలుపుటే లక్ష్యమ్మై
    పలు రచనల్ గావించు న
    కలుషితచిత్తులె కదా జగద్గురు లెల్లన్!


    రిప్లయితొలగించండి
  7. చం॥ ఇలననుభూతి యేర్పరచు నెంచఁగ భావన లంతియే కదా!
    విలసిత వేషధారణము విచ్చిన మోసము లెన్నొ కాంచుచున్
    మెలఁపును బొంద పల్కరొకొ మిక్కిలి జ్ఞానుల వోలె “నిక్కమే
    కలుషిత చిత్తులే కద జగద్గురువుల్ పరికించి చూచినన్”

    (ఎవరి అనుభవం వారిది కదండి. సద్గురులెందరో కపటులు లోకమందు రెట్టింపు. అలా మోసపోయిన వారి ఉవాచ)

    రిప్లయితొలగించండి
  8. పలుకులు పేయూషమ్ములు
    పలువురి హితమభిలషించు పావనమూర్తుల్
    కలియుగమున వెలసిన ని
    ష్కలుషితచిత్తులె కదా జగద్గురు లెల్లన్

    రిప్లయితొలగించండి
  9. చం: పలువిధతర్కముల్ సలుపు వాడొక డిట్లనె "శంకరుండు బౌ
    ద్ధుల నశియింప జేయ గడు ధూర్తకుతర్కము జేసె, కాచ వి
    ప్రుల నలు పీఠముల్ నిలిపె బో! కుల తత్త్వము నిల్ప గోరు నా
    కలుషితచిత్తులే కద జగద్గురువుల్ పరికించి చూచినన్”

    (ఈనాటి కొందరు హేతువాదులకు,నాస్తికులకు బుద్ధుని పై అభిమానము, శంకరుల పై ద్వేషము ఉన్నాయి. శంకరుడు బ్రాహ్మణవర్గాన్ని కాపాడటానికి, బౌద్ధాన్ని నాశనం చెయ్యటానికి మాత్రమే ప్రయత్నించా డనేది వారి విమర్శ.)


    రిప్లయితొలగించండి
  10. పలుకులయందు నిర్జరము పావన జీవనశైలి, నిచ్చలున్
    నలుగురి మేలు కోరుకొను నైజము, సత్పథగాములై భువిన్
    కలియుగమందు నివ్వటిలు కారణజన్ములుగా చరించు ని
    ష్కలుషితచిత్తులే కద జగద్గురువుల్ పరికించి చూచినన్

    రిప్లయితొలగించండి
  11. ఇలపయి శాంతి నెక్కొలుప నెంచుచు, చేయుచు నుంద్రు యత్నముల్
    పలుకుచు సత్యభాషనలఁ బ్రార్థనఁ జేయుచు నాదిశక్తిఁ గో
    వెలలను యజ్ఞయాగముల వేవురు భక్తులు కొల్వఁ జేయు ని
    ష్కలుషిత చిత్తులే కద జగద్గురువుల్ పరికించి చూచినన్

    రిప్లయితొలగించండి
  12. అల కాంచి యొక్క రిద్దఱి
    నలువు రటులె యుందు రని మనములఁ దలఁచుచుం
    బలుకఁగ రా దిబ్భంగినిఁ
    గలుషిత చిత్తులె కదా జగద్గురు లెల్లన్


    కల రిలఁ గొంద ఱెల్లెడలఁ గైతవ సంయము లర్థకాముకుల్
    ఫలముల యాశఁ జూపి జన వర్గము నక్కట మోసపుచ్చఁగా
    సలలిత మొప్పు నిట్లనిన శంకరుఁ డాదిగ నొజ్జ లెల్ల ని
    ష్కలుషిత చిత్తులే కద జగద్గురువుల్ పరికించి చూచినన్

    రిప్లయితొలగించండి