7, అక్టోబర్ 2026, బుధవారం

సమస్య - 5613

8-10-2026 (గురువారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“ఆముదాల మురళి యల్పుఁ డంద్రు”

(లేదా...)

“అవధానంబున నాముదాల మురళీ యల్పుండ వీ వంద్రు పో”

(న.చ. సాహిత్ శతావధానంలో అన్నమరాజు ప్రభాకర రావు గారి సమస్య)

10 కామెంట్‌లు:

  1. కల్లరి యిడినట్టి కైపదమును విని
    పూరణ సలుపుటకు పూనిక గొని
    చక్క జేయలేక సతమతమగుచుండ
    ఆముదాల మురళి యల్పుఁ డంద్రు

    రిప్లయితొలగించండి
  2. ఆటవెలది
    సత్కవిత్వశోభ సామర్థ్యమునవెల్గ
    శ్రీనివాసుకరుణ సిరులు గురియై
    సదవధాన గరిమ సాధింప, నెవ్వరు
    "నాముదాల మురళి యల్పుఁ డంద్రు?"

    మత్తేభవిక్రీడితము
    స్తవనీయంపు కవిత్వ పాటవముతో ధారాళమౌ పద్యముల్
    భువిలో మించగ లేని ధారణలతో ముద్దారగన్ బల్కి, వై
    భవనీయున్ దిరువేంకటేశ్వరునికిన్ వ్యాఖ్యాతలౌ మిమ్ము నే
    యవధానంబున నాముదాల మురళీ! యల్పుండ వీ వంద్రు పో?

    రిప్లయితొలగించండి
  3. అవధి లేని రీతి యవధానములు సల్పి
    భువిని పేరు గొన్న కవి యతండు
    గిట్టనట్టి యొకఁడు గేలిచేసె నిటుల
    "ఆముదాల మురళి యల్పుఁ డంద్రు"

    అవధానమ్ము లనేకముల్ సలిపె తానత్యంత హృద్యమ్ముగా
    భువిలో గొప్ప వధానియన్న ఘనతన్ బొందెన్ ప్రభూతమ్ముగా
    అవధానాగ్రణియైన సత్కవిని మీరట్లందురా యోర్వమిన్
    అవధానంబున నాముదాల మురళీ యల్పుండ వీ వంద్రు పో

    రిప్లయితొలగించండి
  4. అందమైన రీతి నవధాన విఖ్యాతి
    కొల్లగొట్టి నాడు కోవిదుండు
    కవివరుండు గాదె! కైపదమ్ములలోన
    నాముదాల మురళి యల్పుఁ డంద్రు

    అవధానాభ్రము నందు కౌముది గదా హర్షింపగా వీక్షకుల్
    జవనాశ్వంబన నొప్పు తీరున వడిన్ సాధించినన్ జిక్కులన్
    గవులే కూర్చిన కైపదమ్ములనహో కన్పించు నీ పల్కులే
    'అవధానంబున నాముదాల మురళీ యల్పుండ వీ వంద్రు పో'

    రిప్లయితొలగించండి
  5. ఆ॥ వినయముఁ గని పరఁగు వివరించు నడిగిన
    విషయమెల్ల మిగుల వివరముగను
    వరకవీశుఁ డతఁడు పలుకఁ దప్పగు నిట్లు
    నాముదాల మురళి యల్పుఁ డంద్రు

    మ॥ అవధానంబుకు నొజ్జయై కరపు సౌహార్దమ్ము నేపారఁగన్
    జవితో నేర్పును పద్య నిర్మితిని సంస్కారమ్ముతో సర్వదా
    ప్రవరుండాతఁడు సత్కవీశుఁడును దర్పంబేది యేరీతిగా
    నవధానంబున నాముదాల మురళీ యల్పుండ వీవంద్రు, పో

    వర శ్రేష్ఠ ప్రవరుడు శ్రేష్ఠుడు

    రిప్లయితొలగించండి
  6. ప్రాజ్ఞు లర్హు లయ్య ప్రజ్ఞను గుర్తింప
    సరస మెఱుఁగు నెట్లు షండుఁ డవని
    నల్పు లందు రిట్టు లజ్ఞాన మడరంగ
    నాముదాల మురళి యల్పుఁ డంద్రు


    అవమానమ్ములు వ్యక్తి నామముల నయ్యా రాజకీయమ్ము లం
    దవలోకమ్ములు నాఁ దలంచితి నసత్యం బయ్యె నీ రీతినే
    యవధానమ్ములఁ గూడ వచ్చినవి యే మందుం బరంధాముఁడా
    యవధానంబున నాముదాల మురళీ యల్పుండ వీ వంద్రు పో

    రిప్లయితొలగించండి
  7. అవధానమ్ముల పేరుగాంచి బడిలో నధ్యాపకుండై, సదా
    స్తవనీయంబగు ప్రజ్ఞతో కవులకున్ సంగాతి, సంచాల క
    త్వ విధిన్ ఖ్యాతిని బొందె దేశమున, చిత్తమ్మందు ద్వేషించువా
    రవధానంబున నాముదాల మురళీ యల్పుండ వీ వంద్రు పో

    రిప్లయితొలగించండి

    రిప్లయితొలగించండి

  8. కల్ల లాడు నట్టి ఖలుని జూపించుచు
    నతని గూర్చి తెలుపు మనుచు నడుగ
    గరికి పాటి వారు గరిమెళ్ల వారును
    నాముదాల మురళి, యల్పుఁ డంద్రు.


    భువిలో మేటి వధాని వంచు బుధులామోదింపగా గాంచుచున్
    స్తవనీయం బగు పాటవమ్ముగని యీర్ష్యాసూయలన్ జెందు వా
    రవనిన్ హెచ్చుగ నుందు రోయి కనగా నాశాత్రువుల్ పల్కిరే
    అవధానంబున నాముదాల మురళీ యల్పుండ వీ వంద్రు పో.

    రిప్లయితొలగించండి

  9. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    ఆరితేరి మురళి యవధాన విద్యలో
    నెన్నొ చేసినాడు మిన్నగాను
    నింత గొప్ప వాని నీర్ష్య నసూయతో
    ఆముదాల మురళి యల్పుడంద్రు.

    రిప్లయితొలగించండి