30, ఏప్రిల్ 2024, మంగళవారం

సమస్య - 4751

1-5-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“స్త్రీ మీసలు పెద్దవయ్యెఁ జేకుఱు వన్నెల్”
(లేదా...)
“స్త్రీ మీసంబులు పెద్దవయ్యె నిఁకపై సిద్ధించు సన్మానముల్”
(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

16 కామెంట్‌లు:

  1. మీమాభేదములేకను
    ధీమాతోడనుసుదతిసుధీతయుకాగా
    నీమాలెందుకుమనకని
    స్త్రీమీసలుపెద్దవయ్యెచేకురువన్నెల్

    రిప్లయితొలగించండి
  2. విద్యార్థి తండ్రితో గురువర్యులు:

    కందం
    నీమంబుల్ విడి చదువం
    దేమాత్రము శ్రద్ధఁజూపడేమది సుతుడున్?
    సామాన్యులె మిత్రులు? శా
    స్త్రీ! మీసలు పెద్దవయ్యెఁ జేకుఱు వన్నెల్!

    శార్దూలవిక్రీడితము
    నీమంబుల్ విడి మీ సుతుండు మిగులన్ నిర్లజ్జఁ జూపించి తా
    నేమాత్రంబును స్పర్దఁజూపడయయో! యెట్లబ్బు సద్విద్యలున్
    సామాన్యుండనలేనువానిఁగన నేస్తాలెల్ల ధూర్తాళి, శా
    స్త్రీ! మీసంబులు పెద్దవయ్యె నిఁకపై సిద్ధించు సన్మానముల్!

    రిప్లయితొలగించండి
  3. ఆ మహిత పండితాత్ముని
    భూమీశుడు మెచ్చుకొనియు పూజలు సేసెన్
    ఆ మాన్యతచే కవి శా
    స్త్రీ, మీసలుపెద్దవయ్యె చేకురు వన్నెల్

    రిప్లయితొలగించండి

  4. మోముకు మీసమె యందము
    రా మొగుడా యనుచును గృహ లక్ష్మియె పలుకన్
    నే మారితి గనుమో శా
    స్త్రీ , మీసలు పెద్దవయ్యెఁ జేకుఱు వన్నెల్.



    సామాన్యుండ్రకు శ్మశ్రువుల్ పొసగు శాస్త్రాధ్యాయమున్ జేసెడిన్
    ధీమంతుండ్రకవేల యంచనుచు నే తీయించితిన్ గాని నే
    భామల్ మెచ్చరు పేడిమూతిననుచున్ భావింప లేకుంటి, శా
    స్త్రీ ! మీసంబులు పెద్దవయ్యె నిఁకపై సిద్ధించు సన్మానముల్.

    రిప్లయితొలగించండి
  5. కం॥ భామా కలాప నాటక
    మే మగువలు వేయనెంచి యిచ్ఛగఁ జనఁగా
    నేమందు పురుష వేషపు
    స్త్రీ మీసలు పెద్దవయ్యెఁ జేకూరు వన్నెల్

    శా॥ ప్రేమాదుల్ గన మిన్న యౌచు భవిలో శ్రేయంబుతో నొప్పఁగన్
    స్త్రీ, మీసంబులు పెద్దవయ్యె నిఁకపై సిద్ధించు సన్మానముల్
    భామా యంచును బల్క బీరములు సంప్రాప్తించునా పూరుషా
    ప్రేమన్ స్త్రీ వలెఁ జూపి పిల్లల నిలన్ బెంచంగ ధన్యుండవే

    రిప్లయితొలగించండి
  6. కోమలి నాటక మందున
    ధీమా గా పురు షు డ య్యె తేకువ తోడ న్
    భీముని వేషమ్ము న నా
    స్త్రీ మీసలు పెద్ద వ య్యె జేకురు వన్నె ల్

    రిప్లయితొలగించండి
  7. ధీమంతుల్ శ్లాఘించిరి
    నీమార్గ కవిత్వరీతి నీ సత్కృతులన్
    బ్రామాణికంబనుచు శా
    స్త్రీ! మీసలు పెద్దవయ్యెఁ జేకుఱు వన్నెల్

    ధీమంతుండని నిన్ను మెచ్చిరిగదా దివ్యాంశ సంభూతులే
    ప్రామాణ్యంబని చెప్పియుంటిరి కదా బాలుండవై వ్రాసినన్
    సామాన్యుల్ ప్రణుతించుచుండ యశమే స్వాధీనమౌ నీకు శా
    స్త్రీ! మీసంబులు పెద్దవయ్యె నిఁకపై సిద్ధించు సన్మానముల్

    రిప్లయితొలగించండి
  8. కం:కామిని కూలీ యిట్లనె"
    నీ మీదనె నా మనస్సు నిలచె ,సొగసరీ!
    నీ మగసిరి జూపుచు మే
    స్త్రీ !మీసలు పెద్దవయ్యెఁ జేకుఱు వన్నెల్
    (ఒక ఆడ కూలీ మేస్త్రీ ని ఇలా బుట్టలో వేసుకుంటోంది. )

    రిప్లయితొలగించండి
  9. శా:నీ మీదన్ బడి యేడ్చు సంఘము పయిన్ నీ ప్రశ్నలన్ దెల్పుచున్,
    నీ మాటల్ పలు ముల్కులై చెలగగా, నీ కీర్తి నే పెంచె "స్త్రీ"
    యేమాత్రమ్మును లొంగ వద్దు చలమా!యీ శక్తి నీ కిచ్చె నీ
    స్త్రీ, మీసంబులు పెద్దవయ్యె నిఁకపై సిద్ధించు సన్మానముల్
    (చలం గారు "స్త్రీ " అనే పేరుతో ఒక వ్యాససంపుటి వ్రాశారు. దానిలో ఆయన అభిప్రాయాలు సూటిగా ,పదునుగా చెప్పారు.అది నీకు శక్తి నచ్చింది. నీ మీసాలు పెరిగాయి. ఇక సన్మానాలు కూడా జరుగుతాయని ఒక విమర్శకు డన్నట్టు.)

    రిప్లయితొలగించండి
  10. ఆమని ఋతువే సుఖమని
    మామ పుడమిపూజ జేసి మాళిగ కట్టన్
    నామంత్రించిన యా మే
    స్త్రీ మీసలు పెద్దవయ్యెఁ జేకురు వన్నెల్

    రిప్లయితొలగించండి
  11. సామీరి కీచకాధము
    నేమారిచి చంపబూని యెవ్విధినైనన్
    భామగ జీరను గట్టెను
    స్త్రీ మీసలు పెద్దవయ్యెఁ జేకుఱు వన్నెల్

    రిప్లయితొలగించండి
  12. సామీరిన్దన మానరక్షణకునై సైరంధ్రి వేడన్ వెసన్
    యేమార్చైనను కీచకాధముని మాయింపంగ భామాకృతిన్
    ధీమంతంబుగఁ జీర కట్టుమనుచున్ ధీశాలి భీముండనెన్
    స్త్రీ మీసంబులు పెద్దవయ్యె నిఁకపై సిద్ధించు సన్మానముల్

    రిప్లయితొలగించండి
  13. శ్యామంబులై కరం బభి
    రామంబులునై భృశం బలంకారములై
    వేమఱు వొగడఁగ స్వీయ
    స్త్రీ మీసలు పెద్ద వయ్యెఁ జేకుఱు వన్నెల్


    నే మున్నెన్నఁగ బాలుఁడం గనుమ నే నిక్కంబుగాఁ బెర్గితిన్
    యీ మర్త్యావలి లోన నుత్తముడ శంకింపంగ నీ కేల నో
    భామా రత్నమ! నా ముఖమ్ము గను మిబ్భంగిన్ మనోబ్జస్థిత
    స్త్రీ! మీసంబులు పెద్ద వయ్యె నిఁకపై సిద్ధించు సన్మానముల్

    రిప్లయితొలగించండి
  14. శా:"ఏమీ!మీసలు పెంచినా రిటుల స్వామీ విప్రు లై యుండియున్?"
    "మేమే భాషల రెండిటన్ ఘనుల మౌ, మీ కున్న సందేహముల్
    మీ మీ శేముషి జూప రాదె!అటు పై మీసల్ వడిన్ బోవు" శా
    స్త్రీ మీసమ్ములు పెద్ద వయ్యె నికపై సిద్ధించు సన్మానముల్
    (తిరుపతి వెంకట కవులని ఒక అవధానం లో ప్రాశ్నికుడు "మీరు బ్రాహ్మణులు కదా!మీసాలు పెంచారే?"అనటం రెండు భాషల లో మేమే కవుల మని చెప్పడానికి పెంచాము ,మీరు మమ్మల్ని ఓడిస్తే మీసాలు తీస్తా మనటం అందరికీ తెలిసినదే.ఆ సమాధానం విన్న ప్రాశ్నికుడు సరదాగా "మీ మీసాలు పెద్ద వయ్యాయిలెండి!అని ఇక సన్మానం జరుగుతుంది లెండి అన్నట్టు. )

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    రాముకు వివాహ సమయమె
    యేమాయెను పెండ్లిమాట యెత్తుట లేదే?
    మామా!శివశంకర శా
    స్త్రీ! మీసలు పెద్దవయ్యెఁ జేకుఱు వన్నెల్.

    రిప్లయితొలగించండి