4, జులై 2024, గురువారం

సమస్య - 4811

5-7-2024 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“బకజపము లొనర్చి ముక్తిఁ బడఁయఁగ వచ్చున్”

(లేదా...)

“బకజప మాచరించుటయె ప్రాప్తమొనర్చును మోక్షమిద్ధరన్”

(కోటబొమ్మాళి శతావధాన సమస్య)

37 కామెంట్‌లు:

  1. కందం
    అకటా! గరళము గొనుమని
    ప్రకటింపగ సతియె మేలు ప్రజలకటంచున్
    సుకరముగఁ గ్రోలె ననఁ ద్ర్యం
    బకజపము లొనర్చి ముక్తిఁ బడఁయఁగ వచ్చున్!


    చంపకమాల
    సకల సురాసురుల్ సుధను సాగరమందున బొంద ద్రచ్చగన్
    వికలమునందగన్ జగము వెల్వడ క్ష్వేళము గౌరి యొప్పఁగన్
    సుకరమునన్ సదాశివుడె జుర్రెను లోకము లెల్లఁ గావఁ ద్ర్యం
    బకజప మాచరించుటయె ప్రాప్తమొనర్చును మోక్షమిద్ధరన్!

    రిప్లయితొలగించండి
  2. సకలముకాలమెంచుననిశాంతివహించుచుకన్నుమూయుచున్
    వికలముగానిమానసమువెంపరలాడకవిజ్ఞుడౌచునున్
    నకనకలాడుచున్జగతినాదనుభావనసేయకేమదిన్
    బకజపమాచరించుటయెప్రాప్తమొనర్చునుమోక్షమిద్ధరన్

    రిప్లయితొలగించండి
  3. సకలము సర్వేశ్వరుఁడే
    వికలమొనర్చఁగనఘముల వేదనలనుతా
    నొకడే దిక్కగును త్రియం
    బకజపము లొనర్చి ముక్తిఁ బడఁయఁగ వచ్చున్

    రిప్లయితొలగించండి
  4. సుకములజంపగవచ్చును
    బకజపమొనరించి, ముక్తిబడయగవచ్చున్
    సకలముదైవాధీనము
    నికరముకాదనుతలపుననేరుపుతోడన్

    రిప్లయితొలగించండి
  5. నికరమునందు జనులతో
    తకరారు సలుపగ పెద్ద తగవున చిక్కన్
    చకితుడగుచు నేత యెదుట
    బకజపము లొనర్చి ముక్తిఁ బడఁయఁగ వచ్చున్

    రిప్లయితొలగించండి
  6. సకలము వీడియు నిత్య
    మ్మకలంకుని దేవ దేవు నారాదిస్తున్
    సుకరమ్ము గా జనము త్ర్యం
    బక జపము లొనర్చి ముక్తిఁ బడఁయఁగ వచ్చున్

    రిప్లయితొలగించండి
  7. సకలము దేవదేవుఁడగు శర్వుడు భక్త జనాళి రక్ష, తా
    వికలమొనర్చు పాపముల వేదన దీర్చును వేఁడినంతనే
    సుకరము భక్తవర్యులకు సోమునిఁ గొల్చిన నార్తి దీరు ద్ర్యం
    బకజప మాచరించుటయె ప్రాప్తమొనర్చును మోక్షమిద్ధరన్

    రిప్లయితొలగించండి
  8. కం॥ వికలముఁ గాని మదినిలిపి
    సకలము నీవని తలచుచు సద్భక్తిఁ గనన్
    బ్రకటితమగుఁ గాని యెటుల
    బకజపము లొనర్చి ముక్తిఁ బడయఁగ వచ్చున్

    చం॥ వికలముఁ గాని మానసముఁ బ్రీతియు నమ్మిక భక్తి తోడుగా
    సకలము నీవటంచు భువి సజ్జనుఁడై పచరించఁ దక్కుఁ గా
    ని కపటమాశ్రయించి చన నిత్యము ప్రాప్త మొసంగునే యెటుల్
    బకజప మాచరించుటయె ప్రాప్తమొనర్చును మోక్షమిద్ధరన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీ కంది శంకరయ్య గారు తిద్దిన పిదప చం॥ 2వపాదము పచరించ పిదప అనవసరంగా ఉంచిన అరసున్న తొలిగించానండి

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  9. సకలము నెరిగిన వారలు
    అకలంకమనస్కులగుచుననవరతంబున్
    సుకరంబగువిధమున త్ర్యం
    *“బకజపము లొనర్చి ముక్తిఁ బడఁయఁగ వచ్చున్”*

    సకలురడెందెమందుగనశాశ్వత స్థానమునందినట్టి త్ర్యం
    *“బకజప మాచరించుటయె ప్రాప్తమొనర్చును మోక్షమిద్ధరన్”*
    నికపసలేనిపూజలవియేలవిచారమెనర్చుచున్సదా
    వికలతనొందకుండగనువేడుకతోడనుకొల్వుమీశునిన్

    రిప్లయితొలగించండి

  10. సుకములవి శాశ్వతములే?
    యకములకవి మూలమనుచు నందురు కదరా!
    యికనైనను తప్పక త్ర్యం
    బక జపము లొనర్చి ముక్తిఁ బడఁయఁగ వచ్చున్.


    సకల గుణాభిరాముడగు సంతుకు నాయువు తీరుచుండగా
    వికలిత మైన చిత్తమున వేదన తోడ మృకండు డిట్లనెన్
    త్రికరణ శుద్ధిగా నిపుడు రేదొర భూషణు డైన యట్టి త్ర్యం
    బక జప మాచరించుటయె ప్రాప్తమొనర్చును మోక్షమిద్ధరన్.

    రిప్లయితొలగించండి
  11. సుకరము జీవన మెప్పుడు
    సకల భవిష్యములమరును సద్భక్తులకే
    వికసిత హృదయముతో త్ర్యం
    బకజపము లొనర్చి ముక్తిఁ బడఁయఁగ వచ్చున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుకరము గాదెజీవనము చూపగఁ లక్ష్యము భక్తిమార్గమే
      సకలము ప్రాప్తమౌను సుఖసౌఖ్యములందును సర్వవేళలన్
      ముకుళిత హస్తులై జనులు ముక్తిని కోరుచు భక్తితోడ త్ర్యం
      బకజప మాచరించుటయె ప్రాప్తమొనర్చును మోక్షమిద్ధరన్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  12. వికసిత చిత్తము గల్గియు
    సకలా ర్థ పు సాక్షి యైన సర్వే శ్వ రు న
    య్య క లంకుని మది లో త్ర్య o
    బక జపము లొనర్చి ముక్తి బడయగ వచ్చు న్

    రిప్లయితొలగించండి
  13. ప్రకటిత భక్తిం ద్రిపురాం
    తకార్పితస్వీయ బుద్ధి తనరగ సతమున్
    వికల మనమ్మున ఫాలాం
    బక జపము లొనర్చి ముక్తిఁ బడఁయఁగ వచ్చున్


    సుకరము లౌను గార్యములు చొప్పడు నెల్ల లసన్మనో రథ
    ప్రకరము లంచితమ్ముగను ఫాలత లాక్షునిఁ గొల్వ భక్తినిన్
    సకల నరోత్కరమ్మునకు సన్నుత ధర్మము చిత్త శుద్ధిఁ ద్ర్యం
    బక జప మాచరించుటయె ప్రాప్త మొనర్చును మోక్ష మిద్ధరన్

    రిప్లయితొలగించండి
  14. కం:ఒక పరి చెర లో బడినా,
    విక నాపుము పోరు బాట,
    యేదో ఆధ్యా
    త్మికత నటించుచు బుద్ధిగ
    బకజపము లొనర్చి ముక్తిఁ బడఁయఁగ వచ్చున్”
    (జైల్ లో పడ్డావు కదా!ఇంకా పోరాటాలు దేనికి?కాస్త ఆధ్యాత్మికత చూపి ఏదో కొంగ జపం చేస్తే మంచితనం మీద జైల్ నుంచి ముక్తి దొరక వచ్చు.)

    రిప్లయితొలగించండి
  15. చం:సకలవిధాల వైద్యములు సాగుచు నున్నవి,తృప్తి జెంది నీ
    విక పరమాత్ము దల్చుకొనవే! త్యజియించు భయమ్ములన్,గణిం
    పకు మిక దేహబాధలను, భక్తి వహించుచు శ్రద్ధతో త్రయం
    బకజప మాచరించుటయె ప్రాప్తమొనర్చును మోక్షమిద్ధరన్”
    (త్రయంబక మంత్రం అనే ఒక మంత్రం ఉంది.అది మోక్షసాధన మంత్రం.ఆరోగ్యానికి కూడా దాన్ని పఠిస్తారు.)

    రిప్లయితొలగించండి
  16. సకలము నీవే యంచును
    నకలంకపు మనము తోడ ననవరతంబున్
    ముకుళిత వదనమున ద్ర్యం
    బకజపము లొనర్చి ముక్తిఁ బడఁయఁగ వచ్చున్

    రిప్లయితొలగించండి
  17. ముకుళిత భావముంగలిగి మోదమునొందుచునెల్లవేళలన్
    వికలపు చింత లేకమదిభీకర మౌశపధంబుఁజేసియే
    సకలముఁదానెయంచునిక సార్ర్థతకల్గిన మోము తోడఁద్ర్యం
    బకజప మాచరించుటయె ప్రాప్తమొనర్చును మోక్షమిద్ధరన్

    రిప్లయితొలగించండి
  18. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    సకలము నశ్వరమె యనుచు
    వికలము చెందిన మనసున వేదనతోడన్
    త్రికరణ శుద్ధిగను త్రియం
    బక జపము లొనర్చి ముక్తిఁ బడయగవచ్చున్.

    రిప్లయితొలగించండి