10, అక్టోబర్ 2024, గురువారం

సమస్య - 4908

11-10-2024 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“జమునఁ గ్రిందఁ గనుము చల్లఁదనము”

(లేదా...)

“జమునకుఁ గ్రిందిభాగమునఁ జల్లఁదనంబఁట చూచితే కవీ”

(ఆశావాది ప్రకాశరావు గారు పూరించిన సమస్య)

18 కామెంట్‌లు:

  1. యుద్ధభూమిలో యోధులందరి మరణము తరువాత రారాజు అంతరంగము:

    ఆటవెలది
    "రణమునందు జయము రారాజ మనదని
    ద్రోణభీష్ములుండ తూగినావె
    యోటమి భయమనెడు నుడుకు తగ్గగ సరో
    జమునఁ గ్రిందఁ గనుము చల్లఁదనము!"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వేసవి లో అవధానమైన పిదప అవధానితో నిర్వాహకులు:

      చంపకమాల
      "తమరికి మేటి గెల్పు నవధానమునందున కోవిదుల్ గనన్
      ప్రముఖుల మెప్పులన్ గొనిన రంజిల ఘర్మజలమ్ము వేసవిన్
      శ్రమపడఁ జేసెనే వసతి శాలకుఁ బ్రక్కన మున్కలన్! సరో
      జమునకుఁ గ్రిందిభాగమునఁ జల్లఁదనంబఁట చూచితే కవీ!"

      తొలగించండి
  2. వేడిగాలులవియవీచెనుగ్రీష్మము
    గొంతునెండిపోయెకోరెనీరు
    చెమటఁజిందె ముఖముసేదనుఁదీరభూ
    జమునఁగ్రిందఁగనుముచల్లదనము

    రిప్లయితొలగించండి
  3. కమలెనుతెల్లతామరలు కాయగనెండయుగ్రీష్మమందునన్
    సుమమునుబోలుసుందరియుచూడగకందెనుసూర్యుధాటికిన్
    అమరనిశాంతినెమ్మదినిహాయనివేడగదేవుడిచ్చుభూ
    జమునకుక్రిందిభాగమునఁజల్లదనంబటజూచిరేకవీ

    రిప్లయితొలగించండి

  4. నీట పుట్టినట్టి నీరేరుహమ్మది
    వెప్పు చిహ్నమైన విడిని నదియె
    చీకిలించనేమి చేతితో తాక, కం
    జమునఁ గ్రిందఁ గనుము చల్లఁదనము.


    అమృతము నందు బుట్టనది యంబురుహమ్మది కాంచినంత ర
    క్తిమమున నివ్వటిల్లునది తీక్ష్ణత గల్గిన దానివోలెనే
    భ్రమకలిగించు చుండెనది వాస్తవ మీయ్యది గాంచమంటి, కం
    జమునకుఁ గ్రిందిభాగమునఁ జల్లఁదనంబఁట చూచితే కవీ.

    రిప్లయితొలగించండి
  5. ఆ॥ పగలు కష్టపడుచుఁ బనులఁ జేసి యలసి
    పోగ విసిగి పోయి ప్రొద్దుగూకఁ
    దోషముఁ బడయఁగను దోటలో వృక్షరా
    జమునఁ గ్రిందఁ గనుము చల్లఁదనము

    చం॥ విమలమునొంద మానసము పేరిమి మీరఁగ శక్తివంతుఁడై
    సమముగ కార్యభారమును శ్రద్ధను బొందుచుఁ జక్కఁబెట్టఁగన్
    సమయము సంధ్యనందుకొనఁ జక్కని యూరటఁ బొంద వృక్షరా
    జమునకుఁ గ్రిందిభాగమునఁ జల్లదనంబఁట చూచితే కవీ

    రిప్లయితొలగించండి
  6. బలి శిరము నణచిన వామను పద సరో
    జమునఁ గ్రిందఁ గనుము చల్లఁదనము !
    పుణ్యగతుల నొంది మోక్షమొందె నతడు ,
    దేవుని పదస్పర్శ తీరు యదియె

    రిప్లయితొలగించండి
  7. విమలతటాకముల్, నడుమ విచ్చిన తామరసమ్ములున్ మనో
    జ్ఞములగు పూవనంబులును చల్లగ వీచెడి పిల్లవాయువుల్
    ప్రమదముగూర్చు నీవనము పక్షుల నిస్వనముల్ వినంగ భూ
    జమునకుఁ గ్రింది భాగమునఁజల్లదనంబట చూచితే కవీ

    రిప్లయితొలగించండి
  8. కలువ పూవు రాత్రిఁ గళకళ లాడగా
    పగటి పూట మెఱయు పంకరుహము
    ఎండలోన వాడకుండు పుష్పము వారి
    జమునఁ గ్రిందఁ గనుము చల్లఁదనము

    సమయము కీలకమ్ముగద చక్కగ పూవులు తేజరిల్లగా
    కమలము శోభిలున్ గద ప్రకాశముతో రవి మింటనుండగా
    కమలక నున్న తామరను గాంచిన నబ్బుర మొప్పినన్ బయో
    జమునకుఁ గ్రిందిభాగమునఁ జల్లఁదనంబఁట చూచితే కవీ

    రిప్లయితొలగించండి
  9. వేడి గాలి తగిలి వేసారి పోవగా
    నొ క్క చోట నున్న చక్క నైన
    మఱ్ఱి చెట్టు గాంచి సర్రు న వెడలి భూ
    జమున గ్రింద గనుము చల్ల దనము

    రిప్లయితొలగించండి
  10. విమల మహోగ్ర తాప ఘన వీర్య మయూఖ సమూహ వాయువుల్
    సుమసమ దేహులన్ మిగుల స్రుక్కగ జేయును గ్రీష్మ వేళలన్!
    హిమమును గూర్చు వృక్షములు హెచ్చిన నాశ్రయమిచ్చి కాచు! క్ష్మా
    జమునకుఁ గ్రిందిభాగమునఁ జల్లఁదనంబఁట చూచితే కవీ!!

    రిప్లయితొలగించండి
  11. కమలధరునియొక్క కరములు తాకఁగ
    కమలదళములొందె కలవరమ్ము
    విమలజలములందు విరిసి మెరయు సరో
    జమునఁ గ్రిందఁ గనుము చల్లఁదనము

    రిప్లయితొలగించండి
  12. పైనఁ గాంచినఁ గనఁబడుఁ బరిమల యుత
    మైన చక్కఁ దనము హ్లాద మొసఁగఁ
    గర కమలము లంటి కమనీయముగ నీర
    జమునఁ గ్రిందఁ గనుము చల్లఁదనము


    సముచిత రీతి శోధనము సల్పిన బాహ్యము నంతరమ్ము లం
    దు మనుజు లుంద్రు నిక్కముగఁ దోఁచుచు రెండు విభిన్న భంగులం
    గుమతులు గాంచు వాని దగు కోప పరీవృత ఘోర తీక్ష్ణ నై
    జమునకుఁ గ్రింది భాగమునఁ జల్లఁదనం బఁట చూచితే కవీ

    రిప్లయితొలగించండి
  13. ఆ.వె:వద్దటంచు జెప్ప వదలక పై భాగ
    మందు జేర్చినావు హడల జేయు
    వేడి కలుగు చుండె విడెదమీ పై యిల్లు
    జమున!క్రింద గనుము చల్లఁదనము”

    రిప్లయితొలగించండి
  14. చం:"అమరగ బీరు గ్రీష్మమున నందును చల్లదన"మ్మటంచు ,"గీ
    తములను వ్రాయు టెట్టు లది త్రావక?" యందువు కాని కూలి సం
    ఘము గనుమయ్య చల్లనగు కల్లును దించిరి, తాళవృక్షరా
    జమునకుఁ గ్రిందిభాగమునఁ జల్లఁదనంబఁట చూచితే కవీ!”

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    ఎండలోన కష్టమెంతయో చేయగ
    తనువు కోరు చల్లదనము సుంత
    దూరమనక చెంత తోటలో వృక్షరా
    జమునఁ గ్రింద గనుము చల్లదనము.

    రిప్లయితొలగించండి
  16. వేసవిసమయమున విపిణికేగి మరలి
    వచ్చు వేళ లందు బాట చివర
    నిరుగడలనునొప్పు నిమ్ముగా నున్నభూ
    జమున గ్రింద గనుము చల్లదనము

    రిప్లయితొలగించండి