24, ఆగస్టు 2025, ఆదివారం

సమస్య - 5223

25-8-2025 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“పయ్యెదన్ లాగు ధూర్తుని భామ మెచ్చె”

(లేదా...)

“పయ్యెద లాగు ధూర్తుని సెబాసని మెచ్చెను సాధ్వి నవ్వుచున్”

14 కామెంట్‌లు:

  1. ఉ.
    తియ్యగ నోటికింపయిన తీపి తినంగ సమీపమందు వా
    రొయ్యన వాహమున్ విడువ నుద్గత రౌద్ర సముద్భువ ప్రభల్
    కయ్యము కూర్ప వే మగడు కందని శక్తిని చూపి కొట్టెడిన్
    పయ్యెద లాగు ధూర్తుని, సెబాసని మెచ్చెను సాధ్వి నవ్వుచున్ !

    రిప్లయితొలగించండి
  2. ప్రాంతపు చిఱుతలింటికి వచ్చిరనుచు 
    ముదిత వండునపుడు నిప్పు ముట్టుకొనగ
    చీర కొంగున మంటలు చెలయు చుండె
    పయ్యెదన్ లాగు ధూర్తుని భామ మెచ్చె

    రిప్లయితొలగించండి
  3. నాటక వేదికపై...

    తేటగీతి
    అకట! ద్రౌపదీ వస్త్రాపహరణమనెడు
    ఘట్టమున దుస్ససేనుడు గలికిఁ జేరి
    కేలు సాచెడు వేళను దేలు ప్రాక
    బయ్యెదన్, లాగు ధూర్తుని భామ మెచ్చె!

    ఉత్పలమాల
    అయ్యెదె ద్రౌపదిన్ నిలిపి యందరిముందర వల్వలూడ్చగన్
    గుయ్యను ఘట్టమున్ సభను గూర్చెడు వేళను దుస్ససేనుడున్
    రయ్యున గాంచి తేలొకటి ప్రాకుచు నుండగఁ జీరకొంగునన్
    బయ్యెద లాగు ధూర్తుని సెబాసని మెచ్చెను సాధ్వి నవ్వుచున్!

    రిప్లయితొలగించండి

  4. ముద్దు మురిపాల సుతుడని ముద్దుసేసి
    పాన్పు బవళింప జేసెడి పాళమందు
    కొంటె తనమున చిన్నారి కొమరుడపుడు
    పయ్యెదన్ లాగు, ధూర్తుని భామ మెచ్చె.


    నెయ్యపు రాలు వచ్చె తన నెత్తురు గందును వెంటతెచ్చె, నా
    తొయ్యలి తోడముచ్చటలతో సమయమ్మది మీర పాపడే
    శయ్యను వీడి ప్రాకుతు ప్రసత్వరి జేరుచు పాలకోసమై
    పయ్యెద లాగు ధూర్తుని సెబాసని మెచ్చెను సాధ్వి నవ్వుచున్.

    రిప్లయితొలగించండి
  5. తియ్యని తలపులందునఁ దేల్చినావు
    తొయ్యలి నినుగన మనసు తొందరించె
    శయ్యకు తరలి రమ్మని సఖిని వేడి
    పయ్యెదన్ లాగు ధూర్తుని భామ మెచ్చె

    తొయ్యలి నీదు సోయగము తొందర చేసెను నిన్ను జేరగా
    కయ్యపు మాటలేల సఖి కౌగిటఁ జేరి సుఖించు వేళలో
    శయ్యకు చేరుకొమ్మనుచు చక్కని తియ్యని భాషణంబుతో
    పయ్యెద లాగు ధూర్తుని సెబాసని మెచ్చెను సాధ్వి నవ్వుచున్

    ధూర్తుడు = శఠుఁడు [శృంగార నాయకులలో ఒకఁడు]

    రిప్లయితొలగించండి
  6. ఈస డించిరి సభ యందు నెల్ల వారు
    పయ్యె దన్ లాగు ధూ ర్టుని :: భామ మెచ్చె
    వస్త్ర మొసగియు రక్షించు వాసు దేవు
    కేలు మో డ్చి యు మ్రొ క్కు చు కీర్తి సేసె

    రిప్లయితొలగించండి
  7. తొయ్యలి నొంటిగా గవిసి ధూర్తుడొకండు వికారచేష్టలన్
    శయ్యకు రమ్మురమ్మనుచు చయ్యన లాగఁగ నామె పయ్యెదన్
    సయ్యన నేగుదెంచియొక సద్గుణశీలుడు మార్కొనంగనా
    పయ్యెద లాగు ధూర్తుని, సెబాసని మెచ్చెను సాధ్వి నవ్వుచున్

    రిప్లయితొలగించండి
  8. ధూర్తుడొంటిగ జనుచున్న తొయ్యలిఁ గని
    పయ్యదను లాగి వెకిలిగా పలుకరించ
    యోధుడొక్కఁడు మార్కొని యుక్కడంచె
    పయ్యెదన్ లాగు ధూర్తుని, భామ మెచ్చె

    రిప్లయితొలగించండి
  9. తే॥ “పయ్యెదన్ లాగు ధూర్తుని భామ మెచ్చె”
    నేఁటి చిత్ర రాజములటు మేటి యనుచుఁ
    జూచి నీతినిఁ బాసిన చేష్టలొదవి
    మూర్ఖుఁడొకఁడు పల్కెనొ యట్లు బుద్ధిఁ గనక

    ఉ॥ “పయ్యెద లాగు ధూర్తుని సెబాసని మెచ్చెను సాధ్వి నవ్వుచున్”
    దయ్యము పట్టి మూర్ఖుఁడిటు తప్పుగఁ బల్కెనొ నేఁటి చిత్రముల్
    నెయ్యము మీరఁ జూచుచును నేమము మర్చెనొ సాధ్వి యొప్పునే
    అయ్యయొ పైట లాగుటయు నంగన మెచ్చుట శోకహేతువౌ

    చిత్రములు సినిమాలు

    రిప్లయితొలగించండి
  10. తే.గీ: "కొంటె వాడే నటుడు, వాని కొంటె తనము
    కృష్ణవేషమునకు సరియే" యటంచు
    సత్యభామగ నటియింప సరసత దన
    పయ్యెదన్ లాగు ధూర్తుని భామ మెచ్చె”
    (ఆమె వేసింది సత్యభామ వేషం కనుక సినిమా లో కృష్ణుని కొంటె తనాన్ని ఆమె మెచ్చింది.సినిమా హీరోయిన్లు హీరోలని మెచ్చే టప్పుడు సిగ్గు పడరు.)

    రిప్లయితొలగించండి
  11. ఉ:కయ్యము తోడ భాగవత గాధల నెన్నెడు వాడనెన్"భళా!
    యియ్యమ నేటి ప్రేమ లవి యెల్లను కామము లంచు బల్కె గా
    తియ్యని భాషణన్! మరల దేనికి కృష్ణుని, భామ గన్ పడన్
    పయ్యెద లాగు ధూర్తుని సెబాసని మెచ్చెను సాధ్వి నవ్వుచున్”
    (భాగవతము చెప్పే ఒక సన్యాసినిని భాగవతము నచ్చని వాడు ఇలా ఆక్షేపించాడు- ఈ సాధ్వి నేటి ప్రేమ లన్నిటినీ కామం అని ఆక్షేపించింది.కానీ భామలందరినీ పైటలు లాగిన కృష్ణుడి సరసాలని ఎలా నవ్వుతూ మెచ్చుకున్నది?)

    రిప్లయితొలగించండి
  12. ఆమె పరికింప నిత్యమ్ము నాటకత్తె
    వాఁడు పరికింప నిత్యమ్ము వంచకుండు
    దాను వేసిన వల లోనఁ దగిలె నంచుఁ
    బయ్యెదన్ లాగు ధూర్తుని భామ మెచ్చె


    కయ్యము నొక్కెడం బ్రమద కారణ మౌను దలంప వింతగాఁ
    గుయ్యిడి యంతటం బ్రణయ కోపముతోఁ బరమేశ్వరుండు నీ
    వియ్యెడ నేను గెల్చు తఱి నెక్కడి కేగెదు నా వచింప నా
    పయ్యెద లాగు ధూర్తుఁ గడు బాగని మెచ్చెను సాధ్వి నవ్వుచున్

    [ధూర్తుఁడు = శివుఁడు; సెబాసు – అన్య భాషా శబ్ద మౌట వర్జితము]

    రిప్లయితొలగించండి
  13. నాల్గు రోడ్ల కూడలిలోన నలుగు రచట
    గాంచు చుండ ఫెళ్శన గొట్టె కాంతయోర్తు
    *“పయ్యెదన్ లాగు ధూర్తుని, భామ మెచ్చె”*
    పక్కనే నిలిచి గనుచు ప్రస్తుతించె


    రయ్యిన వచ్చి చెంతకును రాగము తోడను చూచుచున్ వడిన్
    నయ్యమనాకిశోరుడటనాశగలాగుచు చీరకొంగునే
    చేయ్యక సవ్వడిన్ నిలిచి చేతిని చాచుచు వెన్కచేరుచున్
    బయ్యదలాగు ధూర్తుని సెభాసని మెచ్చెను సాధ్వి నవ్వుచున్

    రిప్లయితొలగించండి
  14. కయ్యము లాడెనెంచి లయకారిగ నిత్యము యమ్మతంబి మా
    మయ్యను బాల్యమందునను, మాన్య వరుండని నచ్చచెప్పగా
    నయ్య, వరించె యౌవనము నందున మామను, శోభనమ్ములో
    బయ్యదలాగు ధూర్తుని సెభాసని మెచ్చెను సాధ్వి నవ్వుచున్

    రిప్లయితొలగించండి