9, అక్టోబర్ 2025, గురువారం

సమస్య - 5269

10-10-2025 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కవులకు దిక్కగు సుమా శకారుం డెపుడున్”
(లేదా...)
“కవులకు మాటిమాటికి శకారుఁడె దిక్కగుచుండు పూజ్యుఁడై”

18 కామెంట్‌లు:

  1. కవితన యతి ప్రాసల విడి
    నవీన విధమనుసరించి నడిపించుటలో
    చవి జూప నేర్పరులయిన
    కవులకు దిక్కగు సుమా శకారుం డెపుడున్

    రిప్లయితొలగించండి
  2. చ.
    నవరస సంభృతాఖ్య రచనా విలసద్ఘన కీర్తి బొంద పూ
    ని విధి మదిన్ మదించుచు వినిశ్చల శక్తిని నమ్మి కూర్చెనో
    నవగుణ కావ్యముం, గథను నచ్చెడు రీతిని మల్పు ద్రిప్ప స
    త్కవులకు మాటిమాటికి శకారుడె దిక్కగుచుండు పూజ్యుడై !

    రిప్లయితొలగించండి
  3. కందం
    వివరింప వీలు పడదనె
    డవగుణమొలకఁగ సమస్య యనువుగ లేకే
    వ్యవధిఁ గొనక పూరణకై
    కవులకు దిక్కగు సుమా శకారుం డెపుడున్!

    చంపకమాల
    అవగుణ పూర్ణుఁడై పలుకునందున నన్వయమొప్పనట్లుగన్
    జవమున మాటలాడుచు నసాధ్యుని పోకడ రాణకెక్కఁగన్
    వ్యవధికి లొంగి పూరణకు పాటిగ లేని సమస్యలందునన్
    కవులకు మాటిమాటికి శకారుఁడె దిక్కగుచుండు పూజ్యుఁడై!

    రిప్లయితొలగించండి

  4. అవగుణుడగు దనుజుని మా
    ధవుడంతము చేయ నెంచి స్తంభమున మనో
    జవుతలగాచు నృసింహుడె
    కవులకు దిక్కగు సుమా, శకారుం డెపుడున్.


    కవనము చెప్పగా వలయు కాపురుషుండొకడీ మహిన్ మనో
    జవునిని పేర్మి వీడి యగచాట్లను పెట్టిన వానిగూల్చ మా
    ధవుడు నృసింహుడైన చరితమ్మును తెల్పగ బూను వేళలో
    కవులకు మాటిమాటికి శకారుఁడె దిక్కగుచుండు పూజ్యుఁడై.

    రిప్లయితొలగించండి
  5. కవయితకు కోశకారుడు
    జవసత్వము లొసగు ననిన సముచితమనరే
    కవివర! 'కో' పూర్వకమై
    కవులకు దిక్కగు సుమా 'శకారుం' డెపుడున్

    కవులకు శబ్దముల్ మొదలు గాగల విచ్చును శబ్దకోశమే
    కవులకు మాటిమాటికిని కష్టము మాపుచు కోశకారుడే
    కవనము నందు సాయమనఁ గాదన జాలరు, తెల్పుమెవ్విధిన్
    గవులకు మాటిమాటికి శకారుఁడె దిక్కగుచుండు పూజ్యుఁడై?

    రిప్లయితొలగించండి
  6. అవనిని కుకవులు నిరతము
    కవనములో దోషములను గణియింపక స
    త్కవులము మేమందురు, దు
    ష్కవులకు దిక్కగు సుమా శకారుం డెపుడున్

    రిప్లయితొలగించండి
  7. కం:అవధానమున నిషిద్ధము
    నెవరికి నైన నిడగన్ స్ఫురించగ శ్రీ యే
    అవధాని శ్రీ నె కోరును
    కవులకు దిక్కగు సుమా శకారుం డెపుడున్
    (అవధానాల లో ఆద్యక్షర నిషేధం లేకుంటే అవధానికి శ్రీ తేలిక.నిషిద్ధం
    చేసే పృచ్ఛకుడికి నిషేధం చెయ్య దలిస్తే శకారం నిషేధిస్తాడు.కాబట్టి ఇద్దరికీ శకారుడు మిత్రుడే.)

    రిప్లయితొలగించండి
  8. కవులు రచించు సత్కృతుల గానఁగజాలరు కావ్య మాధురుల్
    కవనమునందు వ్యాకృతికి కాలముచెల్లిన లెక్కసేయకన్
    కవులకుదామె దిక్కనుచు గాటముగా దలపోయునట్టి దు
    ష్కవులకు మాటిమాటికి శకారుఁడె దిక్కగుచుండు పూజ్యుఁడై

    రిప్లయితొలగించండి
  9. (2)చం:ఎవ రవధానమున్ జరుప నీ శివ వర్ణన తో నిషిద్ధమే
    చవుకగ దల్చి యిచ్చెదరు శంభుడనంగను ,శంకరుం డనన్,
    శివుడన గా నిషిద్ధమును జేసెద రింక శకార మూని యీ
    కవులకు మాటిమాటికి శకారుఁడె దిక్కగుచుండు పూజ్యుఁడై

    (ఈ అవధాని ఎక్కడ అవధానం చేసినా శివవర్ణన తో నిషిద్ధాక్షరి ఇవ్వటం,శివనామాలు చెప్పకుండా శకారాన్ని తేలికగా నిషేధిస్తున్నారుట.ఈ కవులకి ఇంకో అంశం దొరకదేమో అని అవధాని గారి వేళాకోళం.)

    రిప్లయితొలగించండి
  10. నవరసభావముల్ చిలుకు నవ్య సుగంధము లొల్కు యోగ్యమౌ
    కవితల నల్లకుండినను కమ్మగ గానము చేయకుండినన్
    కవికుల మందు శ్రేష్ఠులము కాళికి దాసుల మంచు మాటికిన్
    వివిధ వితర్దులందునను వెర్రిగ వాగెడు జ్ఞానహీనులౌ
    కవులకు మాటిమాటికి శకారుడె దిక్కగుచుండు పూజ్యుడై

    రిప్లయితొలగించండి
  11. కం॥ అవనిని విద్యలు నేర్చుచు
    వివిధ కవిత్వ పగిదులను వెలసిన ఘనుఁడై
    భువి దుర్గుణములఁ దెలుపఁగఁ
    గవులకు దిక్కగు సుమా శకారుం డెపుడున్

    చం॥ అవనిని విద్య నేర్చి కని యాదర మొందెడు పాండితీ ప్రభల్
    వివిధ కవిత్వ పద్ధతుల విచ్చిన పాటవమెంతఁ జూపినన్
    నవకము నొప్ప దుష్టతను నల్వురు మెచ్చెడు రీతిఁ దెల్పఁగన్
    గవులకు మాటిమాటికి శకారుఁడె దిక్కగు చుండు పూజ్యుఁడౌ

    రిప్లయితొలగించండి
  12. వివరించు చు పలు విధముల
    భవ బంధంబు ల మనుజుల పరి వర్త న ముల్
    స వివరము గా దె లుపు ట కు
    కవుల కు దిక్కగు సుమా శ కారు o డె పుడు న్

    రిప్లయితొలగించండి
  13. వివరింప శక్య మగునే
    యవివేకుల బాధ లెల్ల నవనీ తల మం
    దవిరళ పర పరిచర్యా
    కవులకు దిక్కగుఁ జుమా శకారుం డెపుడున్

    [పరిచర్యా కవులు = దాస్య శృంఖలములు గలవారు; శక + అరుఁడు = శకారుఁడు, శక మను నల్పజాతికి శత్రువు, అగ్రకులుఁడు]


    నృవరు లిడన్ సమస్యలను నేరక వైనము పూరణమ్ములం
    జెవులకు నింపొసంగు గతిఁ జెప్పఁ గవిత్వము రాక యున్నచోఁ
    దివిరిన నెంత యే పగిది దిక్కెద నెద్దియుఁ దోఁపకున్నచోఁ
    గవులకు మాటిమాటికి శకారుఁడె దిక్కగుచుండుఁ బూజ్యుఁడై

    [వైనము = ఉపాయము]

    రిప్లయితొలగించండి
  14. కవనమునెంచ, నందు పస కన్పడ దించుకయైన పూరణన్
    జవమున పూరణల్ సలుప జాలరు మంచి సమస్య లిచ్చినన్
    వివరముగా తలంచరు ప్రవృత్తిని, తోచినచెత్త వ్రాయు దు
    ష్కవులకు మాటిమాటికి శకారుఁడె దిక్కగుచుండు పూజ్యుఁడై!

    రిప్లయితొలగించండి
  15. సమస్య: కవులకు మాటిమాటికి శకారుఁడె దిక్కగుచుండు పూజ్యుఁడై

    పూరణ : కవి మనసే ఒక శకారుడిలా మూర్ఖమైన, అర్ధము లేని విషయాలను పోగేస్తూ వుంటుంది. కానీ చివరికి ఆ మానస శకారుడి పల్కులే కావ్యము లాగ మారతాయి. కవికి శకారుడి లాంటి ఆ మనసే దిక్కు.

    చంపకమాల.
    వివరములేని ఊహలు కవీంద్రుని మానసమందు కూడగన్
    చెవులను తాకుచుండ మదిజెప్పెడి అర్ధములేని వ్యర్ధముల్
    కవనము గావె మానస శకారుడి పల్కులె చోద్యమే ఇదిన్
    కవులకు మాటిమాటికి శకారుఁడె దిక్కగుచుండు పూజ్యుఁడై !

    రిప్లయితొలగించండి