2, నవంబర్ 2025, ఆదివారం

సమస్య - 5293

3-11-2025 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“విరసమె పద్యమున నొలుక వేడుకఁ గూర్చెన్”
(లేదా...)
“విరసమె పద్యమం దొలుక విజ్ఞుల కొప్పెను ప్రీతిపాత్రమై”
(వద్దిపర్తి పద్మాకర్ గారి శతావధానంలో ఆచార్య ఫణీంద్ర గారి సమస్య)

8 కామెంట్‌లు:

  1. కందం
    సురమౌని కలహచింతను
    మురహరి పై సత్య యలిగి పోరుకు దిగెడున్
    వరుసను తిమ్మన కృతియౌ
    విరసమె పద్యమున నొలుక వేడుకఁ గూర్చెన్


    చంపకమాల
    మురహరి రుక్మిణీ సతికి పువ్వునొసంగె నటన్న వార్తతో
    సురముని సత్యకున్ హరికి చోద్యము గొల్పెడు కయ్యమెంచెడున్
    వరుసన తిమ్మనార్యులొక భావన కావ్యము గూర్చినంతటన్
    విరసమె పద్యమం దొలుక విజ్ఞుల కొప్పెను ప్రీతిపాత్రమై

    రిప్లయితొలగించండి
  2. చ.
    పరమ కవిత్వ సిద్ధికర భాసిత శుక్ల శుభాంచితాగ్ర కుం
    దరదన నా పయోజభవు దార్కొను భామ మదిం దలంప శ్రీ
    వరమయి కావ్య లక్షణము వాలయి పారెను గూర్చె బుద్ధి ద్ర
    వ్వి రసమె, పద్యమం దొలుక విజ్ఞుల కొప్పెను ప్రీతిపాత్రమై !

    రిప్లయితొలగించండి
  3. కరకుగ పలికితి వీరీతి
    విరసమె పద్యమున నొలుక వేడుకఁ గూర్చెన్” ?
    అరయక పలుకకు , నిజముగ
    సరసమె పద్యములకొసగు సౌరభమెపుడున్

    రిప్లయితొలగించండి

  4. విరి రుక్మిణి కొసగె ననుచు
    పరిచారిక తెల్ప సత్య భామయె కినుకన్
    మురహరి పై తా జూపిన
    విరసమె పద్యమున నొలుక వేడుకఁ గూర్చెన్.


    మురహరి పారిజాతమును పూషణి రుక్మిణి కిచ్చె నంచు నా
    వరవట జేరిచెప్పగనె భామయె కోపము వ్రేటు వడ్డ దీ
    ర్ఘరసన మట్లు రేగుతరి కన్నులు నిప్పులు రాల్చు నత్తరిన్
    విరసమె పద్యమం దొలుక విజ్ఞుల కొప్పెను ప్రీతిపాత్రమై.

    రిప్లయితొలగించండి
  5. పరవశమిడు కావ్యములో
    నిరసించెనుగద వరూధినిని బ్రవరుండే
    మరియా మనుచరితంబున
    విరసమె పద్యమున నొలుక వేడుకఁ గూర్చెన్

    పరవశమొప్పగా గెలుచు పాఠకు లెల్లరి మానసంబులన్
    సరసముగా వరూధినియె సంగముఁ గోరుచు తాను బల్కినన్
    నిరసన చూపినాడకట! నిశ్చలుడై ప్రవరుండు భామపై
    విరసమె పద్యమం దొలుక విజ్ఞుల కొప్పెను ప్రీతిపాత్రమై

    రిప్లయితొలగించండి
  6. స్థిరమగు కొల్వు చిక్కినను చెంతన భార్యయు లేక నొక్కడున్
    మరిమరి బాధనొందుచును మన్మథ వేదన నాపలేక తా
    విరహపు కైతలల్లి కడు వేదన తోడుత పాడుచుండ *తా
    వి *రసమె పద్యమందొలుక విజ్ఞుల కొప్పెను ప్రీతి పాత్రమై

    రిప్లయితొలగించండి
  7. సరస కవిత్వ పాండితికి చందనమద్దిన రీతి తేనలూ
    రి రసన పైన వాలు క్రియ రేగిన కోర్కెలె కావ్య రాజమై
    సురుచిర పుష్ప బాణమగు సుందరి వర్ణనఁ జేయ నింతి మో
    వి రసమె పద్యమం దొలుక విజ్ఞుల కొప్పెను ప్రీతిపాత్రమై!!

    రిప్లయితొలగించండి
  8. పరిపూర్ణమౌను కైతలు
    కరుణాది నవరసములను కలబోయంగన్
    మరికొండొకచో పరిమిత
    విరసమె పద్యమున నొలుక వేడుకఁ గూర్చెన్

    రిప్లయితొలగించండి