29, నవంబర్ 2025, శనివారం

సమస్య - 5319

30-11-2025 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కలువకంటికిఁ గాటుక గరళమయ్యె”
(లేదా...)
“కాటుక చూడఁగాఁ గలువకంటికిఁ దీవ్రవిషంబె యౌనుగా”
(ఆకాశవాణి సమస్య)

16 కామెంట్‌లు:

  1. తేటగీతి
    భర్త యభిమన్యుఁడు ననికి పయనమౌచు
    నాలి గర్భిని యుత్తర యాలకించ
    తెలుప రాన్, బొట్టు పెట్టియు దిద్ద బోవఁ
    గలువకంటికిఁ గాటుక గరళమయ్యె!

    ఉత్పలమాల
    దాటిగ తమ్మిమొగ్గరము దాటెడు సాహసమెంచు శూరుడై
    సూటిగ నిండు చూలి సతిఁ జూచుచుఁ జెప్పగ భీతిచెందుచున్
    దీటుగ వీర తిల్కమును దిద్దియు, నుత్తర తీర్చఁ బోవుచున్
    గాటుక చూడఁగాఁ గలువ కంటికిఁ దీవ్రవిషంబె యౌనుగా!

    రిప్లయితొలగించండి

  2. కోరె ప్రియురాలటంచును కూర్మి తోడ
    పట్టణము నుండి తెచ్చెనా ప్రాణ సఖుడు
    కలికి కొరకంచు, నదిగాంచ గడువు దాటి
    కలువకంటికిఁ గాటుక గరళమయ్యె.


    సాటియె లేనియందమని చక్కని చుక్కయటంచు మోదమున్
    బోటికి యభ్రపుష్పమున ముద్దుగ స్నానము బోసి తల్లియె
    కాటుక దిద్దబోయె నది కాంచగ కాలము తీరె నిప్పుడా
    కాటుక చూడఁగాఁ గలువ కంటికిఁ దీవ్రవిషంబె యౌనుగా.

    రిప్లయితొలగించండి
  3. పతి గతించఁగ దురమున పడతి నుదుట
    బొట్టు చెరిగెను బ్రతుకేమొ బిట్టువడెను
    తాళి బరువయి తన నెగతాళి జేసె
    కలువకంటికిఁ గాటుక గరళమయ్యె

    రిప్లయితొలగించండి
  4. శంకరాభరణం

    సమస్య 30/11/2025

    “కాటుక చూడఁగాఁ గలువకంటికిఁ దీవ్రవిషంబె యౌనుగా”

    ఉత్పలము

    కూటికి కోటి విద్యలని కోమలి వేయుచు నాటకమ్మునే

    మేటిగఁ బట్టు వస్త్రములు,మిన్నగు భూషణముల్ ధరించుచున్

    ఘాటు రసాయనమ్ము గల కజ్జలమున్ గను దిద్దఁ నత్తఱిన్

    జేటుఁ గలంగఁ జేసె నది చీకటి క్రమ్మెను జీవితంబునన్

    గాటుక చూడఁగాఁ గలువకంటికిఁ దీవ్రవిషంబె యౌనుగా


    ఆకుల శాంతి భూషణ్
    వనపర్తి

    రిప్లయితొలగించండి
  5. అగ్గువయని దెచ్చె సుదతి యంజనమును
    ముదము నొందుచు గనులకు పూసుకొనగ
    గలువకంటికిఁ గాటుక గరళమయ్యె ,
    మోయ లేని రీతిగ మంట పుట్టుచుండె

    రిప్లయితొలగించండి
  6. కాటుక పొసగకుండును కలికికెపుడు
    పెండ్లికూతురు హవణిక పెంచగోరి
    ముద్దు లొలుకగ కాటుక దిద్దినారు
    కలువ కంటికిఁ గాటుక గరళ మయ్యె

    కాటుక వైపరీత్యమని కప్పురగంధి ధరింప దెన్నడున్
    మేటిగ తీర్చిదిద్దినను మిన్నగు రీతిని మిత్ర బృందమే
    బోటినలంకరింప తలపోయుచు దిద్దిరి కన్నులందునన్
    గాటుక చూడఁగాఁ గలువకంటికిఁ దీవ్రవిషంబె యౌనుగా

    రిప్లయితొలగించండి
  7. బోటికి భర్త నైధనము బొట్టును మాయముఁజేసె నక్కటా
    చేటుగ తాళిబొట్టు మన చేడియ గాత్రము వీడిపోయె నా
    పాటలగంధి చేలములు వన్నెను గోల్పడి వెల్లనాయెనే
    కాటుక చూడఁగాఁ గలువకంటికిఁ దీవ్రవిషంబె యౌనుగా

    రిప్లయితొలగించండి
  8. నెగడు దీపపు మసిలోన నెయ్యిగలిపి
    చేయి కజ్జలము కనుల హాయి గొలుపు
    బహుళ జాతీయ సంస్థల పన్నుగడన
    కలువకంటికిఁ గాటుక గరళమయ్యె

    రిప్లయితొలగించండి
  9. తే.గీ:కజ్జలము వెట్ట గా నల్ల కలువ లంచు
    కనుల సౌందర్యమున్ మెచ్చు కవివరుండు
    భర్త దివి కేగగా నామె భవ్యమైన
    కలువకంటికిఁ గాటుక గరళమయ్యె”

    రిప్లయితొలగించండి
  10. తే॥ ఘాటగు రసాయనములటు కలుపుచుండ
    లాభములఁ గనఁ గాటుక కలుషితమగు
    హానిఁ జేయద వాడఁగ నతివ కదియె
    కలువ కంటికిఁ గాటుక గరళమయ్యె

    ఉ॥ ఘాటు రసాయనమ్ములవి కాంచఁగ మిక్కిలి హానిఁ జేయవా!
    నీటగు లాభముల్ గనఁగ నీతినిఁ బాయుచు క్షేమమెంచకన్
    గాటుకఁ దీర్చ నట్లు కడు కష్టము వాడినఁ దెచ్చిపెట్టునే
    కాటుక చూడగాఁ గలువ కంటికిఁ దీవ్రవిషంబె యౌనుగా

    రిప్లయితొలగించండి
  11. ఉ;కాటుక వెట్టగా కలువ కన్నుల బిడ్డకు తల్లి చూడ నా
    కాటుక జూడగా భయము క్రమమును బిడ్డకు, నామె తోడ పో
    రాటమె కాగ తల్లి సమరమ్మున నిట్లను నీకు దిద్ద నీ
    కాటుక ,చూడఁగాఁ గలువకంటికిఁ, దీవ్రవిషంబె యౌనుగా”
    (కాటుక పెట్ట బోతే చిన్న పిల్లలు భయపడి దాన్ని విషం లాగా చూస్తారు.)

    రిప్లయితొలగించండి
  12. ఉ;కాటుక కంటి నీరు చనుకట్టు పయిన్ బడ నేడ్చు శారదన్
    కూటికి నమ్మ లేని కవి గుండెకు దోచెడు నిట్లు "జారు నీ
    కాటుక చూడఁగాఁ గలువకంటికిఁ, దీవ్రవిషంబె యౌనుగా
    మాటను వీడి రాజు లిడు మాన్యపు పంటలు మెక్క గోరినన్"
    (పోతన గారి పద్యాన్ని స్ఫురింప జేసే ప్రయత్నం." నీ కళ్ల నుంచి జారి పోతున్న ఆ కాటుకను చూస్తూ నా మాటని వీడి నిన్ను రాజుల కిచ్చి వాళ్లిచ్చే మాన్యాలలో పంటను తింటే అది విషమై పోదా? అన్నట్లు.)

    రిప్లయితొలగించండి
  13. మెత్తని పఱుపు ఱాయియై మేనుఁ గలఁచెఁ
    గంటికిఁ గునుకు దూరమై కలఁత నొసఁగె
    దారుణమ్ముగ విరహాగ్ని తప్త యైన
    కలువకంటికిఁ గాటుక గరళమయ్యె


    పోటులు మాటిమాటికిని మూరుచు వచ్చుచు నుండఁ దోర మ
    ప్పాటలగంధికిం గనులఁ బాఱుచు నుండ జలమ్ము ధారయై
    పాటిలఁ గంటికిం గలఁక వారని బాధ నొసంగ నిత్యముం
    గాటుక చూడఁగాఁ గలువ కంటికిఁ దీవ్ర విషంబె యౌనుగా

    రిప్లయితొలగించండి
  14. ముద్దు లొ లి కెడు మోముకు ముచ్చట య్యె
    కలువ కంటికి కాటుక :: గరళ మ య్యె
    మనసు దుష్టని కనగా నె మలిన మయ్యె
    ననుచు పలికె ను లోకాన మనుజు డొకడు

    రిప్లయితొలగించండి
  15. తే॥గీ
    బియ్యమందు కల్తి తినెడి పిండి కల్తి
    క్షీరమందు కల్తి తుదకు నీరు కల్తి
    పణము కొరకు జేయు చెనటి పనులవలన
    కలువకంటికి గాటుక గరళమయ్యె

    రిప్లయితొలగించండి

  16. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    ఆధునిక స్త్రీకి గాజులే యధిక బరువు
    బొట్టు కుంకుమ తోడను పెట్టుకొనదు
    చీర ధరియించ మన్నచో ఛీత్కరించు
    కలువ కంటికి కాటుక గరళమయ్యె.

    రిప్లయితొలగించండి