13, డిసెంబర్ 2025, శనివారం

సమస్య - 5329

14-12-2025 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వేణువా లేదు స్వరసుధల్ విందు సేసె”
(లేదా...)
“అగపడదొక్క వేణువు స్వరామృతపానముఁ జేసిరెల్లరున్”

13 కామెంట్‌లు:

  1. నేడు పండుగదినమని నిర్వహించు
    వాద్యకరుల పోటీయందు బాలుడొకడు
    వాయితోడుత నీలను ‌వదలినంత
    వేణువా లేదు స్వరసుధల్ విందు సేసె

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    హరి ప్రసాదు చౌరాసియా నరసి పొందె
    విశ్వనాథ వారలు సిరివెన్నెలకని
    వేణగానము, స్మ్యూలునన్ వింటి కనఁగ
    వేణువా లేదు స్వరసుధల్ విందు సేసె!

    చంపకమాల
    ప్రగతిని గాంచుమా గళము పంచగ వేడ్కగ మేటి గాయకుల్
    సగపడు వాద్యముల్ వలదు చక్కని వేదిక 'స్మ్యూలు' గూర్చెడున్
    దగ సిరివెన్నలందమరి తన్మయమొందగఁ జేయ పాటలం
    దగపడదొక్క వేణువు స్వరామృతపానముఁ జేసిరెల్లరున్


    రిప్లయితొలగించండి

  3. ధ్వన్యనుకరణ మందున వాసి గాను
    పేరు గాంచిన నొక కళా కారు డచట
    పలువిధ ధ్వనుల పలికించు పాళ మందు
    వేణువా లేదు స్వరసుధల్ విందు సేసె.


    నగధరుడేగుదెంచె యమునా తటిలో మురళిన్ వినంగనే
    మగువలు గొల్లభామలట మాధవు కోసము చేరనేమి యా
    పగతట మందు యాదవుని వారలు కాంచగ లేదు కాంచగా
    నగపడదొక్క వేణువు స్వరామృతపానముఁ జేసిరెల్లరున్.

    రిప్లయితొలగించండి
  4. రాణకెక్కినవగు సుస్వరాలతోడఁ
    బ్రాణపదముగా పాడిరి పాటలెన్నొ
    జాణ పలికించె రాగాలు వీణ మీటి
    వేణువా లేదు స్వరసుధల్ విందు సేసె

    అగణితమైన పోడిమిని హ్లాదము గూర్చెను వాద్య బృందమే
    గగనము చేరురీతి పటు గానము చేసిరి గాయనీమణుల్
    సొగసుగ చిందులేసిరట శ్రోతలు సైతము మంత్రముగ్ధులై
    అగపడదొక్క వేణువు స్వరామృతపానముఁ జేసిరెల్లరున్

    రిప్లయితొలగించండి
  5. అలరె నీ వని రాగాల నలమి, చూడ
    వేణువా లేదు! స్వరసుధల్ విందు జేసె!
    లేతగాలుల తాకిడి చేత కదలు
    తరుల పత్రాలతో ఝరీధ్వాన మేమొ!

    రిప్లయితొలగించండి
  6. సాధనమ్మది 'కీబోర్డు' సాధ్యపరచు
    నన్ని వాద్యవిశేషముల్ పన్నుగాను
    వేణుగానము వినిపించె వింత యౌర!
    వేణువా లేదు స్వరసుధల్ విందు సేసె

    రిప్లయితొలగించండి
  7. తే.గీ:వీణ లే దట, వాయొలిన్ వేడ్క లేదు,
    తత్త్వ గీతమ్ములకును నిత్యత్వ మిచ్చు
    మోహన స్వర నిథి బాల మురళి యుండ
    వేణువా? లేదు స్వరసుధల్ విందు సేసె
    (అక్కద వీణ,వాయొలిన్ లేవు.ఆయనే మురళి కాబట్టి ఇంకో వేణువు అవసరం లేదు.ఏమి సేతురా లింగా మొదలైన పాటలని తత్త్వాలు అంటారు.ఆ మహానుభావుదు తత్త్వాలకి నిత్యత్వం ఇచ్చాడు. )

    రిప్లయితొలగించండి
  8. తే॥బుధుఁడు ధ్వన్యాను కరణల మురళి నాద
    సంభ్రమము నిలిపి చనఁగ స్వర మధురిమ
    గాన కౌశల ధృతి యటు గరిమఁ బడయ
    వేణువాలేదు స్వరసుధల్ విందు సేసె

    చం॥ నిగమ విశారదుండు శ్రుతి నేమపు విజ్ఞుఁడు గాన లోలుఁడై
    సుగమ రసాఝరీ ధృతిని శుద్ధ సముచ్చయ భాస మానమై
    న గరిమఁ గాంచి మాధవుని నామ సహస్రము నాలపించఁగా
    నగపడ దొక్క వేణువు స్వరామృతపానముఁ జేసి రెల్లరున్

    సముచ్చయ శబ్దసంయోగము

    రిప్లయితొలగించండి
  9. చం;యుగమది మార శాస్త్రపు ప్రయోగము లెన్నియొ వచ్చె కంటికే
    యగుపడ కుండ గాయకుడు హాయి నొసంగును టేప్ రికార్డు లో
    నగుపడ దొక్క వీణయు, మృదంగము, తాళము గూడ,కంటికే
    యగుపడదొక్క వేణువు స్వరామృతపానముఁ జేసిరెల్లరున్”
    (టెక్నాలజీ అభివృద్ధి చెంది టేప్ రికార్డర్ వంటివి వచ్చాక కంటికి గాయకుదు,వాద్యాలు ఏవీ కనిపించకున్నా గానం ఆస్వాదించ వచ్చు. )

    రిప్లయితొలగించండి
  10. కడప యాకాశవాణిలో కమ్మనైన
    వాద్య సంగీతమును విని పరవ శించి
    చూడ లేదయ్యె నచ్చట చోద్య ముగను
    వేణు వా లేదు స్వర సుధల్ విందు సేసె

    రిప్లయితొలగించండి
  11. నగధరుఁడైన మాధవుని నాదవినోదముఁ గోరి గోపికల్
    నగువుచు వేచియుండ యమునానది యొడ్డున కానుపించకన్
    గగనఁపు మేనిఛాయగల కన్నయ చాటున వేణువూదగా
    నగపడదొక్క వేణువు స్వరామృతపానముఁ జేసిరెల్లరున్

    రిప్లయితొలగించండి
  12. ప్రియుని పైనఁ దలంపులు వృద్ధి సెందఁ
    దన్ను గొనిపోవ నంత వింత జగములకు
    నూహలు మదిలోఁ జెలరేఁగ నుల్ల మలర
    వేణువా లేదు స్వరసుధల్ విందు సేసె


    వగచుచు నంత గోపికలు పద్మ దళాక్షులు మిక్కుటమ్ముగన్
    నగధరు పూర్వ చేష్టల మనమ్ముల నెంచుచు నిశ్వసించుచున్
    మగువలు కృష్ణునిన్ వెదక మార శరానల తప్త చిత్తలై
    యగపడ దొక్క వేణువు స్వరామృత పానముఁ జేసి రెల్లరున్

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    ఒకరు మురళిని వాయించ నొకరు తబల,
    నొకరు వయొలిను వాయించ నొకరు వీణ
    పరికరములు లేవెవ్వరి వద్ద కూడ
    ధ్వన్యనుకరణలో వారు వాసి గాంచి
    వేణువా లేదు స్వరసుధల్ విందు సేసె.

    రిప్లయితొలగించండి