30, జూన్ 2026, మంగళవారం

సమస్య - 5514

1-7-2026 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మాతనుఁ బెండ్లాడుటకుఁ గుమారుఁడు వచ్చెన్”
(లేదా...)
“మాతనుఁ బెండ్లియాడఁగఁ గుమారుఁడు వచ్చె నలంకృతాంగుఁడై”

7 కామెంట్‌లు:

  1. ఆ తారకుని వధించగ
    జాతము నొందె నలనాడు చండుని శిశువై
    పీతాంబరు సుత వల్లీ
    మాతనుఁ బెండ్లాడుటకుఁ గుమారుఁడు వచ్చెన్”

    రిప్లయితొలగించండి
  2. కందం
    ప్రీతిగ నటించి కోడలుఁ
    జేత ధనము బట్ట తీయ చిత్రములెన్నో
    మ్రోతగ, నత్త పిలువ ని
    ర్మాతనుఁ బెండ్లాడుటకుఁ గుమారుఁడు వచ్చెన్

    ఉత్పలమాల
    ప్రీతి వినోదమున్ నటిగ ప్రేక్షకులెల్లరు మెచ్చ పంచుచున్
    జేతను బట్టి విత్తమును జెల్లగఁ దీసెను మేటి చిత్రముల్
    మ్రోతలు మ్రోగగన్ సుతుని ముందుకు రమ్మని యత్త పిల్వ ని
    ర్మాతనుఁ బెండ్లియాడఁగఁ గుమారుఁడు వచ్చె నలంకృతాంగుఁడై!

    రిప్లయితొలగించండి

  3. స్థాతవ్యమేల మన సుతు
    డేతుల నచ్చెనని చెప్పి యిట కేతెంచెన్
    నాతీ తెమ్మిట కిక నా
    మాతనుఁ , బెండ్లాడుటకుఁ గుమారుఁడు వచ్చెన్.


    ఏతుల నచ్చలేదనుచు నెందరినో వలదన్న పుత్రుడే
    యీ తరుణిన్ వివాహమున కిష్టపడెన్ గద యాలకించుమో
    నాతి విలంబమేల జవనమ్మున తెమ్మిటు వృద్ధురాలు నా
    మాతనుఁ , బెండ్లియాడఁగఁ గుమారుఁడు వచ్చె నలంకృతాంగుఁడై.

    రిప్లయితొలగించండి
  4. కం:ఆ తల్లి సుతుని కొరకై
    జీతము, నందము గలిగిన శ్రీమతి దేగా
    నే తృప్తిన్ మెచ్చుచు దన
    మాతనుఁ,బెండ్లాడుటకుఁ గుమారుఁడు వచ్చెన్”

    రిప్లయితొలగించండి
  5. ఉ:చేతుల చీర నుంచి, యిరు చేతులకున్ దగు గాజు లిచ్చి యున్
    బ్రీతిని గూర్చి, యక్షతలు వేయగ గోరుచు, నామె పాదముల్
    చేతుల దాకి మ్రొక్కి ,స్తుతి జేయుచు నెంతయు గౌరవించి యా
    మాతనుఁ, బెండ్లియాడఁగఁ గుమారుఁడు వచ్చె నలంకృతాంగుఁడై”
    (పెండ్లికి ముందు పెద్దలకు బట్టలు పెట్టి నమస్కరించటం మన ఆచారం.)

    రిప్లయితొలగించండి
  6. ఉ॥ జాతక చక్రముల్ పొసఁగఁ జక్కగ నొప్పుచు రెండు వర్గముల్
    చేతనులై వివాహమును శీఘ్రము చేయఁగ నిర్ధరించఁగన్
    భ్రాతినిఁ గాంచి తండిరినిఁ బద్ధతి మీరక సంప్రదించుచున్
    మాతనుఁ, బెండ్లియాడఁగఁ గుమారుఁడు వచ్చె నలంకృతాంగుఁడై

    (పెండ్లి పీటలపైకి వచ్చేకి ముందుగా పద్ధతి ప్రకారము తల్లిదండ్రులను సంప్రదించి వచ్చాడు అని అండి)

    రిప్లయితొలగించండి
  7. కూతురు ప్రేమించినదని
    జాతకములు కలవవనుచు సందియమా! జా
    మాత కడుయోగ్యుడట మా
    మా!తనుఁ బెండ్లాడుటకుఁ గుమారుఁడు వచ్చెన్

    కూతురు కోరినట్లుగనె కోవెలలో మనువాడనిమ్ము జా
    మాతగ వచ్చుచుండెనసమానుడు సంశయమేల వారికా
    రీతిఁ వివాహమే శుభము లేమను సిద్ధము సేయుమయ్య మా
    మా! తనుఁ బెండ్లియాడఁగఁ గుమారుఁడు వచ్చె నలంకృతాంగుఁడై

    రిప్లయితొలగించండి