21, సెప్టెంబర్ 2026, సోమవారం

సమస్య - 5597

22-9-2026 (మంగళవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“వధువు లేకుండఁ గట్టెను వరుఁడు దాళి”

(లేదా...)

“మానిని లేకయే వరుఁడు మంగళసూత్రముఁ గట్టెఁ బెండ్లిలో”

(ఐతగోని వెంకటేశ్వర్లు గారి శతావధానంలో సంగనభట్ల నర్సయ్య గారి సమస్య)

11 కామెంట్‌లు:

  1. తేటగీతి
    కానలకు నంపి రాముడు జానకి నట
    జన్నమొనరించు దీక్షకై స్వర్ణసీత
    మూర్తి ప్రక్కన కూర్చుండి మును, సజీవ
    వధువు లేకుండఁ గట్టెను వరుఁడు దాళి!

    ఉత్పలమాల
    కానలకంపి జూనకిని కాదన లేకయె రామచంద్రుఁడున్ ధీనిధి యశ్వమేధమును దీక్షఁగ జేయగ నగ్ని సాక్షిగా
    జానకి స్వర్ణమూర్తినిటఁ జక్కఁగ బెట్టి, సజీవ కాంతులన్
    మానిని లేకయే వరుఁడు మంగళసూత్రముఁ గట్టెఁ బెండ్లిలో!

    రిప్లయితొలగించండి

  2. పెండ్లి యని రమ్మనుచు తాను పిలువ నేమి
    పరుల దేశాన యున్నట్టి బంధు వామె
    వచ్చుట కుదరదను వార్త పంప నట్టి
    వధువు లేకుండఁ గట్టెను వరుఁడు దాళి.
    *(వధువు =స్త్రీ, ఆడది)*


    సూనను వానికిచ్చుట ప్రసూతికి నచ్చక నాగడించగా
    నా ననబోడి చెయి విడ నంచు దలంచిన వాడటన్ సదా
    దానుని మందిరమ్ము జని తక్షణమే మనువాడె తల్లి యా
    మానిని లేకయే వరుఁడు మంగళసూత్రముఁ గట్టెఁ బెండ్లిలో

    రిప్లయితొలగించండి
  3. తనను కోరివచ్చెను శుభదంతి యనుచు
    మోసగాడొక డమితమౌ మోజుతో ర
    హస్యరీతినిన్, దను బెండ్లి యాడినట్టి
    వధువు లేకుండఁ, గట్టెను వరుఁడు దాళి

    [పెండ్లైన వాడు రహస్యముగా తన భార్య
    లేకుండా మరో మగువకు తాళి కట్టాడు]

    మానస మందులేనిదగు మానిని నెట్టుల స్వీకరించులే
    దాను వరించినట్టిదగు దానినిఁ దప్పక పెండ్లియాడగా
    మేనరికంబు వద్దనుచు మిత్ర సమూహము నందు నన్యమౌ
    మానిని లేకయే వరుఁడు మంగళసూత్రముఁ గట్టెఁ బెండ్లిలో

    రిప్లయితొలగించండి
  4. దార గ్రహణము నందున తనకెదురుగ
    వధువు లేకుండఁ ; గట్టెను వరుఁడు దాళి
    ప్రక్కనగల వాలుగకంటి వయిపు వంగి .
    పెండ్లి యటుల ముగియ నామె పెండ్ల మయ్యె

    రిప్లయితొలగించండి
  5. -

    హమ్మయ్య! చాన్నాళ్ల
    తరువాయి గిట్టించినాము జిలేబీయము

    దీనపు "కోవిడా"కొనిన దిక్కులుగానని కాలమప్పుడా
    మానిని లేకయే వరుఁడు మంగళసూత్రముఁ గట్టెఁ బెండ్లిలో
    తానను కొన్న మూర్తమున తన్వికి "జూమను" యాపు లోన క
    ల్యాణపు రీతులన్ గని భళారె యటంచును మెచ్చ బంధుగుల్


    రిప్లయితొలగించండి
  6. తే.గీ:తోటి పెండ్లి కూతుకు జ్వర మౌట బెండ్లి
    మధ్య వైద్యశాలకును బంపంగ ముదము
    లేకయును చేయునది యేమి లేక తోటి
    వధువు లేకుండఁ గట్టెను వరుఁడు దాళి
    (తోటి వధువు= తోడు పెండ్లి కూతురు. పెండ్లి మధ్య లో తోడు పెండ్లి కూతురు వైద్యశాలకు వెళ్లి నప్పుడు వరుడు తాళి కట్టాడు. )



    రిప్లయితొలగించండి
  7. కానమె వింతలెన్నొ కలికాలమునందున నీ జగంబునన్
    వానలు మెండుగా గురిసి వాగులువంకలు పొంగిపొర్ల ల
    గ్నానికి పెండ్లిమంటపము నందున విజ్ఞులు దెల్ప కత్తికిన్
    మానిని లేకయే వరుఁడు మంగళసూత్రముఁ గట్టెఁ బెండ్లిలో

    రిప్లయితొలగించండి
  8. కానుము సాధు ప్రయోగము కాకపోతే అదేభావము ఈవిధంగా మార్చినానండి

    ఉ॥ మానవ సంప్రదాయములు మక్కువఁ గూర్చును వింత రీతులన్
    గోనల వాసముండు నొక కోయల పద్ధతులన్ గ్రహించఁగన్
    గానకు నేఁగ శోధనకుఁ గాంచితి నచ్చటి తంతు బొమ్మకున్
    మానిని లేకయే వరుఁడు మంగళ సూత్రముఁ గట్టెఁ బెండ్లిలో

    (ఒక Social Science Research student పరిశోధనలో కనిపించినట్లుగా)

    రిప్లయితొలగించండి
  9. ఉ: మానిని వృత్త మందు నభిమానము నాకు,లిఖింతు బెండ్లికిన్
    మానిని నొక్కటైన, నభిమానము తో కవి నంచు బిల్వ నే
    మానితి బెండ్లి కేగ గృహ మంత్రివరేణ్యుల యింట, నిన్న నా
    మానిని లేకయే వరుఁడు మంగళసూత్రముఁ గట్టెఁ బెండ్లిలో”
    (ఈ కవిని గృహమంత్రి గారు అనగా హోం మినిస్టర్ గారు పెండ్లికి పిలిచారు. ఈయన రాసే మానినీ వృత్తం లేకుండా పెళ్లి కొడుకు తల్లి కట్టాడు. అది ఈయన అసంతృప్తి. )

    రిప్లయితొలగించండి
  10. చాలు చాలింకఁ జెప్పకు చాలు చాలు
    మబ్బు లేకుండఁ జనుదెంచె నబ్బ వాన
    తల్లి లేకుండ నీ చిట్టి తల్లి వుట్టె
    వధువు లేకుండఁ గట్టెను వరుఁడు దాళి


    మానుమ యింక నీ గిరలు మానవు నీ సఖు లెంత సెప్పినన్
    మానుగ నీదు పంతమును మానవుఁ డెచ్చట నెప్పు డెవ్వఁడో
    మానవుఁ డైననుం గలఁడ మా కిఁకఁ జెప్పుమ మానవోత్తమా
    మానిని లేక యే వరుఁడు మంగళసూత్రముఁ గట్టెఁ బెండ్లిలో

    రిప్లయితొలగించండి

  11. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    గర్భిణి యని చూడక కనికరము లేక
    పంపె రాముడు సీతను వనములకును
    జన్నమాచరించ దలచి స్వర్ణ సీత
    ప్రతిమ నొక్కటి చేయించి వడిగ తాను
    వధువు లేకుండఁ గట్టెను వరుడుఁ దాళి.

    రిప్లయితొలగించండి