25, అక్టోబర్ 2021, సోమవారం

సమస్య - 3882

26-10-2021 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పరహితమ్ము సేయువాఁడు ఖలుఁడు”
(లేదా...)
“పరహిత కార్యముల్ సలుపువానిని దుష్టుఁడుఁ గ్రూరుఁడందురే”

31 కామెంట్‌లు:

  1. ఆటవెలది
    సాద యౌచు నకుల సహదేవులకు మామ
    యంగ రాజు మదినిఁ గ్రుంగ జేసి
    పాండుసుతులు గెలువ పన్నాగమును బన్ని
    పరహితమ్ము సేయువాఁడు ఖలుఁడు!

    చంపకమాల
    దొరవలె వచ్చి శల్యుఁడట ధూర్తపు బుద్ధిని కర్ణ సాదిగన్
    వెఱపును గూర్చు భాషణల వేదనముంచుచు గ్రుంగ దీయుచున్
    వరలుచు పాండవుల్ గెలువ నమ్మక ద్రోహము సేయఁ బూనుచున్
    బరహిత కార్యముల్ సలుపువానిని దుష్టుఁడుఁ గ్రూరుఁడందురే!

    రిప్లయితొలగించండి
  2. వరమున బుట్టి నాడు పరి వారము మెచ్చగ సంతసమ్ముగా
    విరివిగ దానధర్మముల వేడుక జేసిరి తల్లి తండ్రులున్
    పెరిగిన ప్రేమలంబడసి పెద్దయి విద్యల నేర్చియుండినన్
    పరహిత కార్యముల్ సలుపువానిని దుష్టుఁడుఁ గ్రూరుఁడందురే!!

    ***మంచి కార్యముల జేసిననూ అర్థం చేసుకోలేని వారిపై ఆవేదనతో....

    రిప్లయితొలగించండి
  3. రిప్లయిలు
    1. అహరహమ్ము సల్పు బహువిధ జనసేవ
      పరహితమ్ము సేయువాఁడు; ఖలుఁడు
      బలము జూపి జనుల పొలము, ధనము దోచు
      నావు పులిని బోల్చ నమరు నిట్లు.

      తొలగించండి
  4. స్వార్ధము విడనాడి సజ్జనుండె ప్పుడు
    పరహితమ్ము సేయువాడు : ఖలుడు
    దోచు గొనగ జూచు దురితుడై మనుచుండి
    కీడు సలుపు చుండు వాడు గాదె !

    రిప్లయితొలగించండి
  5. మేలుఁబోందగోరిమేలైనకార్యంబు
    చేయుచుండువాడెచెప్పఘనుఁడు
    మారుపలుకకుండుమర్యాదరాముండు
    పరహితమ్ముసేయువాఁడుఖలుఁడు

    రిప్లయితొలగించండి
  6. సురమునిశ్రేష్టులెవ్వరునుఁజూడనిదేవుఁడుస్రుష్టియందునన్
    తఱిగనిసామ్యభావమునతాల్మినిదాల్చుచుజీవుగావగా
    నసురులనాదరింపగనునాపరమున్గనిఁజంపఁజూతురే
    పరహితకార్యముల్సలుపువానినిదుష్టుఁడుక్రూరుడందురే

    రిప్లయితొలగించండి
  7. రాజకీయమదిరి రంజిల యవినీతి
    ఎవరి మేలు గోర రెవరిదైన
    కల్మషమ్ము లేక ఘనముగా పనిజేసి
    పరహితమ్ము సేయువాఁడు ఖలుఁడు!

    రిప్లయితొలగించండి
  8. పరమ దయాళువాతడభివంద్యుడటంచు నుతింతురెల్లరున్
    పరహిత కార్యముల్ సలుపువానిని; దుష్టుఁడుఁ గ్రూరుఁడందురే
    పరమ కిరాతకుండగుచు ప్రాణము మానము దోచు హీనునా
    పరమదురాత్ముడా ఖలుడవశ్యము మ్రగ్గును పాపకూపమున్

    రిప్లయితొలగించండి
  9. తప్పుపనులు జేయు తనయుడనెఱగియు
    తనను మార్చ దలచు తండ్రి జేయు
    హెచ్చరికలలోననెంతమాత్రమ్ము క్షే
    ప రహితమ్ము సేయువాడు ఖలుడు.

    రిప్లయితొలగించండి
  10. నీచమైనపనులు నీచునకు సుఖము
    పాపపుణ్యమెంచు పథము వీడి
    మానవాళినెల్ల మట్టుపెట్టు పని లో
    ప రహితమ్ము సేయువాఁడు ఖలుఁడు

    రిప్లయితొలగించండి

  11. దురితపు కార్యకారులగు దుష్టులు మెత్తురకార్య శీలురన్
    ధరణీని వాస్తవమ్మిదియె ధర్మము న్యాయమెఱుంగనట్టి యా
    నరకుడొకండు చెప్పెనట నాకుని తోడ వివేక శూన్యుడై
    పరహిత కార్యముల్ సలుపు వానిని దుష్టుడుఁ గ్రూరుఁడందురే.

    రిప్లయితొలగించండి
  12. తరగని ప్రేమభావమున దైవసమంబుగ జూతురార్తులే
    పరహిత కార్యముల్ సలుపువారిని; దుష్టులు క్రూరులందురే
    దురితమనెంచకే పరుల దోచెడువారిని, ధర్మదూరులై
    కరుకగు మానసంబునను గావరమున్న సురత్వభావమున్

    అరుదగు స్వర్ణలంకకును హానినిజేయగ ద్రోహచింతనన్
    వరముల బొందినట్టి నను పాపివటంచును తూలనాడుచున్
    నరుడగు రామచంద్రునికి నాతిని సీతను నప్పగించగా
    మరిమరి చెప్పుచున్ దనదు మాటల చేతల హింసబెట్టగా
    పరహిత కార్యముల్ సలుపువారిని దుష్టులు క్రూరులందురే

    రిప్లయితొలగించండి
  13. నిరతము వక్ర మార్గమున నిర్ద
    యుడై కడతేర్చి ప్రాణులన్
    గరముగ బెంచి సంపదను గష్టము
    బొందుచు నున్నవారికి
    న్నరయగ పంచి పెట్టు జనునైన
    సహించరు, మోసగించుచున్
    పరహిత కార్యముల్ సలుపు వానిని
    దుష్టుడు గ్రూరుడందురే

    రిప్లయితొలగించండి
  14. చంపకమాల:
    అరకొర జీతబత్తెముల నార్ధిక పుష్టి సమంగలేని తాన్
    దొరనను డాంబికంబున సుతుల్ పరివారము నీసడించుచున్
    నిరతము మోసగించు కడు నీచుల నమ్మి పరాన్నభుక్కులౌ
    “పరహిత కార్యముల్ సలుపువానిని దుష్టుఁడుఁ గ్రూరుఁడందురే”
    ---కటకం వేంకటరామ శర్మ.

    రిప్లయితొలగించండి
  15. సురగురు డైన నేమి మరి సూర్యుడు జంద్రుడు శుక్రుడైన,తాన్
    పరహిత కార్యముల్ సలుపువానిని దుష్టుఁడుఁ గ్రూరుఁడందురే
    పరిజనముల్, సదా తమకు బాసటయై చరియించు వాడు గా
    పరివలె నుండగోరెదరు, బాపురె లోకుల కివ్వ నోర్తురా?

    రిప్లయితొలగించండి
  16. సమస్య :

    పరహితకార్యముల్ సలుపు
    వానిని దుష్టుడు గ్రూరుడందురే

    ( అంతవరకు తనతో నుండి ఆపై రాముని వద్దకు చేరిన విభీషణుని గురించి మంత్రులకు చెప్పి
    బాధపడుతున్న రావణాసురుడు )

    చంపకమాల
    ..................

    అరుదగు ప్రేమ జూపితిని
    అందరిలోన గనిష్టు డంచు ; నే
    నరగొర లేక పెంచితిని ;
    నందపు భామను బెండ్లిచేసితిన్ ;
    మరచి విభీషణుం డిపుడు
    మమ్ముల వీడుచు రాము జేరెగా !
    పరహితకార్యముల్ సలుపు
    వానిని దుష్టుడు గ్రూరుడందురే .

    రిప్లయితొలగించండి
  17. కల్లఁగాదు నిజము నెల్లలఁగాపాడఁ
    బరులఁదరుము వారు బలిమిగాగ
    దొడ్డిదారిజేఱిదోచగవచ్చిన
    పరహితమ్ము సేయువాఁడు ఖలుఁడు”

    కొరుప్రోలు రాధాకృష్ణరావు

    రిప్లయితొలగించండి
  18. రామ చరితయందు రావణుని విడిచి
    బెట్టినట్టి యా విభీషణుండు
    వైరి రాఘవునికి వైనమిడ నెటుల
    పరహితమ్ము సేయువాఁడు ఖలుఁడు ?

    రిప్లయితొలగించండి
  19. (సుగ్రీవుడు పరహితుడైనను ఖలుడుగాడు)

    ఆటవెలది.

    అన్న జాడ దెలిపె నడుచగ ననుజుఁడు
    రామ మైత్రి గోరి! రాణువ నిడె
    మొనము గెలిచి భవ్య మొనరగ! ఏలనౌ
    పరహితమ్ము సేయువాఁడు ఖలుఁడు

    రిప్లయితొలగించండి
  20. నిరతము స్వార్థ చింతనము నిల్చి మనమ్మున సంఘమందునన్
    దురితపు కర్మలన్ సతము తోషము నొందుచు, దొంగిలించుచున్
    పరుల ధనమ్ము పృథ్విపయి పాపుల తోడుత మైత్రితో పర
    స్పర హిత కార్యముల్ సలుపువానిని దుష్టుఁడుఁ గ్రూరుఁడందురే

    రిప్లయితొలగించండి
  21. ఇహపరములనొందునెన్నఁడుసుఖమును
    పరహితమ్ము సేయువాఁడు, ఖలుఁడు
    నిరతము నరకంబు నిక్కముగవడయున్
    బ్రతికియుండగానె పతనమొందు

    రిప్లయితొలగించండి
  22. పరమ దయాళువై జనుల బాధలు దీర్చెడి జాతి రత్నమై
    పరిపరి రీతులన్ వెదకి పైకమునప్పుగ దెచ్చి యందులో
    పరిజనులందరున్ దినగ పంచుచు దక్కిన భాగమందునన్
    పరహిత కార్యముల్ సలుపువానిని దుష్టుఁడుఁ గ్రూరుఁడందురే

    రిప్లయితొలగించండి

  23. శరణము గోరి వచ్చినను శత్రువు నైన సమాదరించుచున్
    భరణము నీయగా వలయు పాపము కాదది ధర్మమయ్యదే
    స్థిరతరు సేవకన్న ధర దీనుల సేవయె మిన్నగాదుటే
    పరహిత కార్యముల్ సలుపు వానిని దుష్టుఁడుఁ గ్రూరుఁడందురే?

    రిప్లయితొలగించండి
  24. పరమపవిత్రుడీ భువిని పాపపుకృత్యము లుజ్జగించి తా
    నిరతము సాధుపుంగవుల నిర్మల చిత్తముతోడ గొల్చుచున్
    పరమునుబొందునీప్సితుఁడు భవ్యమనస్కుఁడు నెల్లవేళలన్
    పరహిత కార్యముల్ సలుపువానిని దుష్టుఁడుఁ గ్రూరుఁడందురే?

    రిప్లయితొలగించండి
  25. సంతతమ్ము దాను బంత మూని చెలఁగి
    వీఁక సందియమ్ము లేక తనదు
    నీతి లేమిఁ జూపు హేతువు నెల్ల రూ
    ప రహితమ్ము సేయు వాఁడు ఖలుఁడు


    పర ధన ధాన్య సంపదల పైన మనమ్ము కడింది యుంచి స
    త్వరము గ్రహింప వంచనను వానిని యత్న మొనర్చుచున్ నిరం
    తర నిజ లాభ కార్య రతిఁ దాలిచి డెందము నందు సజ్జ నా
    పర హిత కార్యముల్ సలుపువానిని దుష్టుఁడుఁ గ్రూరుఁ డందురే

    [సజ్జన+అపర హితము = సజ్జ నాపర హితము]

    రిప్లయితొలగించండి
  26. లోకపూజ్యుడగును లోకేశు సాక్షిగ
    పరహితమ్ము సేయువాడు,ఖలుడు
    కీడుజేయుచుండు వీడువాడుననక
    నెల్లవారలకును నీసుమతిని

    రిప్లయితొలగించండి
  27. నిరతము గౌరవింతురిల నేతలు పఃడితులెల్ల వారలున్
    పరహితకార్యముల్ సలుపువానిని,దుష్టుడు క్రూరుడఃదురే
    పరులకు హింసజేయుచును బండుగవోలెను సంబరంబుగా
    బరగెడువానినిన్ బ్రజలు పచ్చిగ దిట్టుదు రాగ్రహంబుతో

    రిప్లయితొలగించండి