22, ఆగస్టు 2024, గురువారం

సమస్య - 4860

23-8-2024 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“దుష్టసాంగత్యమే ఘనదోషహరము”

(లేదా...)

“దుష్టుని స్నేహమే జనుల దోషములం దొలగింప జేసెడిన్”

(బులుసు అపర్ణ గారి శ్రీశైలం ద్విశతావధానంలో సింహాద్రి వాణి గారి సమస్య)

13 కామెంట్‌లు:

  1. శ్రీకృష్ణ పరమాత్మ కుంతీ నందనుడు కర్ణునితో....

    తేటగీతి
    కుంతి కనగ నిన్ పాండవుల్ గూడమనిరి
    రాజ్యమమరును! ద్రౌపదీ రమణి దక్కు!
    రాజరాజు యధర్మ వర్తనుఁడు, వీడ
    దుష్టసాంగత్యమే, ఘనదోషహరము

    ఉత్పలమాల
    శిష్టులఁ గాచు ధర్మమది శీఘ్రమె కూడుము పాండవేయులన్
    ద్రష్టగ మౌని మంత్రమిడఁ దల్లిగ కన్నది నిన్ను కర్ణ! ని
    న్నిష్టము తోడ కృష్ణ కొను! నేలికవౌదువు! వీడ నొప్పగన్
    దుష్టుని స్నేహమే జనుల దోషములం దొలగింప జేసెడిన్!

    రిప్లయితొలగించండి
  2. ఇష్టమైన మిత్రులనుచు నింపుగాను
    మంచిచెడ్డలమంచుచు సంచరించి
    ఖలుడ వవబోకు నీవు వదలిన చాలు
    దుష్టసాంగత్యమే, ఘనదోషహరము.


    కష్టము లెన్ని కూడిన నకాయుడు ప్రోచుచు మేలుగూర్చు నం
    చిష్టము తోడునన్ గోలువ నేమిర పోకిరి వాడెయైన యా
    భ్రష్టుడు చెంతజేరి నిను పాపిగ మార్చగలండు వీడినన్
    దుష్టుని స్నేహమే, జనుల దోషములం దొలగింప జేసెడిన్.

    రిప్లయితొలగించండి
  3. స్పష్టము మానవాళియును సజ్జన
    స్నేహమె చేయుటొప్పుగా
    కష్టములోన మున్గుదురు కాపురు
    షాత్ముల దాపుజేరినన్
    నష్టము దొల్గిపోవు తగు న్యాయము
    దక్కు నిజంబుగా వినా
    దుష్టని స్నేహమే జనుల దోషములం
    దొలగింప జేసెడిన్.

    రిప్లయితొలగించండి
  4. ఊరి జనులముందవమాన మమొంద జేయు
    దుష్టసాంగత్యమే ; ఘనదోషహరము
    శిష్టులను కూడి పనులను జేయునపుడు
    గుణము నెరిగియె చెలిమిని గూర్చనొప్పు

    రిప్లయితొలగించండి
  5. తే॥ దుష్టుని సఖునిగఁ బడయ దుష్టులకును
    శిష్టులకును వ్యత్యాసము స్పష్టముగను
    దెలియఁ గలుగ మనఁగ వీలు తెలివిఁ గనుచు
    దుష్ట సాంగత్యమే ఘన దోషహరము

    ఉ॥ దుష్టునిఁ జేరి వాఁడు కను దుష్టత మోసము లన్ని చూచుచున్
    కష్టముఁ దప్పు రీతులను గట్టుకుఁ జేరెడి జ్ఞానసంపదల్
    శిష్టుని వోలె నేర్చుచును శ్రేయము నొందెడి దారిఁ గాంచినన్
    దుష్టుని స్నేహమే జనుల దోషములం దొలగింపఁ జేసెడిన్

    (దుష్టని సాంగత్యములో వాడు చేసే మోసమలను చూసి వాటినుండి ఎలా తప్పకోవాలో తెలుసుకొన గలిగితే మంచిదని అండి)

    రిప్లయితొలగించండి
  6. శిష్టు డనగ నొప్పు ధ్వజుడు శ్రేష్టుడు దొర
    శిష్ట సాంగత్య మేగూర్చు శ్రేయమిలను
    దుష్ట సఖ్యతే హేతువు దోషములకు
    దుష్ట సాంగత్య మేఘన దోషహరము?

    శిష్టుడనంగ సజ్జనుడు శ్రేష్టుడు ధృష్టువు మేలు బంతిలే
    శిష్టుల స్నేహమే జనుల శ్రేయము గూర్చును యెంచి చూడగా
    కష్టములేసదా కలుగు కాపురుషుల్ హితులైన వారికిన్
    దుష్టుని స్నేహ మేజనుల దోషములం దొలగింప జేసెడిన్ ?

    రిప్లయితొలగించండి
  7. మంచి వారల స్నేహాన మాన్యు లగుచు
    చెడ్డ వారల మైత్రితో చెడుదు రనుచు
    ప లుకు పెద్దల వచనం బు భావ్య మెటుల
    దుష్ట సాంగత్య మే ఘన దోష హరము?

    రిప్లయితొలగించండి
  8. దుష్ట బుద్ధుల నుంచుమ దూర మందు
    శిష్ట జనులను నిల్పుమ స్నేహ మందుఁ
    గష్ట మైనను ధరలోనఁ గాంచ విగత
    దుష్ట సాంగత్యమే ఘన దోష హరము


    స్పష్టమె యెల్లవారలకుఁ జక్కగఁ బృథ్విని దానకర్మ ప
    ర్వేష్టుని స్వీయ దుష్కర సమీప్శిత సత్కృత నిత్య కర్మ జా
    లేష్టుని బాంధ వేష్టుని యనీర్ష్య మనస్కు సతం బమేయపుం
    దుష్టుని స్నేహమే జనుల దోషములం దొలఁగింపఁ జేసెడిన్

    [అమేయపు + తుష్టుని= అమేయపుం దుష్టుని]

    రిప్లయితొలగించండి
  9. తే.గీ:కృష్ణు డిట్లనె "యో కర్ణ!కృపను వినుము
    ధర్మపరుడైన నిన్నుంచె దప్పు దారి
    దుష్టసాంగత్యమే, ఘనదోషహరము
    పాండవుల మైత్రి యిక నైన బాగు పడుము"

    రిప్లయితొలగించండి
  10. ఉ:దుష్టుని దుష్టు డంచు గడు దూరము నందున నుంచ ధర్మమా?
    దుష్టత పైన ద్వేషమును,దుష్టుని యందున ప్రేమ యుంచి యా
    భ్రష్టుని మార్చ నెంచి తన వైరము వీడుచు మంచి నేర్ప నా
    దుష్టుని స్నేహమే జనుల దోషములం దొలగింప జేసెడిన్
    (గాంధీ గారి సూక్తి:- దుష్టత్వాన్ని ద్వేషించు కానీ దుష్టుణ్ని ద్వేషించకు అని.వాణ్ని మార్చటం కోసం స్నేహం చేస్తే అది గొప్ప సంస్కరణే.)

    రిప్లయితొలగించండి

  11. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    చెనటులను గూడి స్నేహమ్ము చేయుచుండి
    నీతి నియమము వీడి దుర్నీతి నడచి
    వెంబరగ మారబోకుము,వీడిన సరి
    దుష్ట సాంగత్యమే, ఘన దోష హరము.
    (వెంబర= దుష్టుడు)

    రిప్లయితొలగించండి
  12. మాయమాటలకు భ్రమసి మంచిని విడి
    చేసితివరాచకమ్ములు జీవితమున
    బుద్ధి నేమార్చుచునునీకు ముప్పు తెచ్చు
    దుష్ట సాంగత్యమే ఘన దోషహరము



    ఇష్టముతోడనొద్ధికగనిమ్ముగ మాటలనాడు చున్సదా
    కష్టము కల్గచేయునదిఖచ్చితమంచునువీడుమింకనా
    *“దుష్టుని స్నేహమే, జనుల దోషములం దొలగింప జేసెడిన్”*
    శిష్టలతో డ స్నేహమును చేసిన మేలును చేయునెప్పుడున్

    రిప్లయితొలగించండి
  13. శిష్టజనాళితో చెలిమి సేయుటయొప్పు విపత్తులందునం
    దిష్టముబూని మేలొనరనెంతయు పాటుబడన్ శ్రమించు నిర్
    దిష్టముగా ప్రణాళికను దీటుగ వర్తిలజేసి వీడినన్
    దుష్టుని స్నేహమే జనుల దోషములం దొలగింప జేసెడిన్

    రిప్లయితొలగించండి