14, అక్టోబర్ 2024, సోమవారం

సమస్య - 4912

15-10-2024 (మంగళవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“బరువని వల్వలను విడుచు భామకు స్తవముల్”

(లేదా...)

“బరువని వల్వలన్ విడుచు భామినిఁ గాంచి ప్రశంసలిచ్చిరే”

20 కామెంట్‌లు:

  1. కందం
    భరతావని ప్రాశస్త్యము
    మెరిపించును కట్టుబొట్టు మిన్నగననుచున్
    బరదేశి చీరఁ దాల్చినఁ
    బరువని వల్వలను విడుచు భామకు స్తవముల్

    (దాల్చినన్+పరువు+అని)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంపకమాల
      మరిమరి చూడనొప్పెడును మాన్యత గల్గిన కట్టుబొట్టులన్
      తిరమగు కీర్తితో భరతదేశము భాసిల విశ్వమంతటన్
      మురిసి విదేశియైన మది ముచ్చట దీరఁగ చీరఁదాల్చుటన్
      బరువని వల్వలన్ విడుచు భామినిఁ గాంచి ప్రశంసలిచ్చిరే

      తొలగించండి
  2. పెరిగిననాగరికంబున
    సరిగంచులచీరయంత చాలగమరుగై
    పరుగునువెట్టగవీలుగ
    బరువనివల్వలనువిడచు భామకుస్తవముల్

    రిప్లయితొలగించండి
  3. కరుణామయి కాంచెనచట
    దురదృష్టుల మేనిపైని దువ్వలువలనే
    చిరుగుల వలనన్ బోవున్
    బరువని వల్వలను విడుచు భామకు స్తవముల్

    [విడుచు = దానమిచ్చు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కరుణకు మారుపేఱగుచు కష్టములన్ దొలగించు పూనికన్
      నిరతము బీదవారలకు నెమ్మదిఁ దోడ్పడు మెచ్చులాడిరో!
      చిరిగిన వస్త్రముల్ తొడుగ స్త్రీలకు శీఘ్రమె పోవునిచ్చటన్
      బరువని వల్వలన్ విడుచు భామినిఁ గాంచి ప్రశంసలిచ్చిరే!

      [ఇచ్చటన్+పరువు+అని; విడుచు = దానమిచ్చు]
      చిరిగిన వస్త్రములు కట్టిన స్త్రీలకు పరువు పోతుందని వలువలు దానము చేసిన భామిని ప్రశంసలు పొందినదని భావము.

      తొలగించండి

  4. పిరిమిని బంధువు దళసరి
    యరచట్టను జన్మదినమటంచును తేగా
    ధరియించి పిల్ల డేడ్వగ
    బరువని వల్వలను విడుచు భామకు స్తవముల్.


    అరుణుడు తా ప్రచండుడయి యత్యధికొష్ణము రాల్చు కాలమున్
    బిరిమిని తెచ్చె బంధువొక పేరిణి జన్మదినమ్మటంచు, నం
    గరకను వేసినంత నపగండడు తాళగ లేక నేడ్వగా
    బరువని వల్వలన్ విడుచు భామినిఁ గాంచి ప్రశంసలిచ్చిరే.

    రిప్లయితొలగించండి
  5. అరుదగు శీతల ముండగ
    బిరుసగు బట్టలు ముసుగుగ వేసుకొనంగన్
    చిరు సమయమందె వాటిని
    బరువని వల్వలను విడుచు భామకు స్తవముల్

    రిప్లయితొలగించండి
  6. పెరిగిననాగరీకమున భేదములెంచని సభ్యసంస్కృతిన్
    మెఱపునుతీగలాయనగ మెప్పునుబొందగ ప్రాకు లాడుచున్నారు
    వెరపునులేనివేషములపెంచిరినవ్యతయంచుమూర్ఖులై
    బరువనివల్వలన్విడచుభామినిగాంచిప్రశంసలిచ్చిరే

    రిప్లయితొలగించండి
  7. కం॥ విరిసిన నవ నాగరికము
    మెరయఁగ చిత్రములు నేఁడు మేటిగఁ గనఁగన్
    ధరణిని మారెను పద్ధతి
    బరువని వల్వలను విడుచు భామకు స్తవముల్

    చం॥ అరయఁగ నేఁడు నాగరికమంచును విచ్చిన నూత్న రీతులన్
    వరమగుఁ జిత్ర రాజములఁ బాటలు నాట్యము మెప్పునొందఁగా
    నరకొర దుస్తులే మెరియు నంచుఁదలంచి ధరించి సాగగన్
    బరువని వల్వలన్ విడుచు భామినిఁ గాంచి ప్రశంసలిచ్చిరే!

    రిప్లయితొలగించండి
  8. ధర సరసంబు పండుగకు దాల్చగ చీరలు తీసుకొందుమం
    చు రమణి గీత కోరెననసూయను! వద్దని పల్కినంత, తా
    నరువుగనివ్వజూపనరువక్కర లేదని, వద్దు వద్దు డా
    బరువని వల్వలన్ విడుచు భామినిఁ గాంచి ప్రశంసలిచ్చిరే!!


    తాన్ + అరువుగను + ఇవ్వ + చూపన్ + అరువు + అక్కర లేదని = తానరువుగనివ్వజూపనరువక్కర లేదని
    డాబు + అరువు + అని = డాబరువని

    రిప్లయితొలగించండి
  9. అరుదుగ లభియించె ననుచు
    మురిపించె డి వస్త్ర ములను మోహము తోడ న్
    ధరి యింప నెంచి రి గదా
    బరువని వల్వ లను విడుచు భామకు స్తవ ముల్

    రిప్లయితొలగించండి
  10. అరుణుని కిరణముల భువిని
    తరిగొని యూష్మమ్ము దిశల తలిరుకొనఁగ నా
    తెరవున తన సుతునకవియె
    బరువని వల్వలను విడుచు భామకు స్తవముల్

    రిప్లయితొలగించండి
  11. అరకొర దుస్తులందు దమ‌యంగములెల్ల బహిర్గతంబవన్
    పరువొకొ? యంచు పండితుడు భాషణమందున నుగ్గడించగా
    సరియగు మార్గమెంచుకొని చక్కని చీరను గట్ట స్త్రీలకుం
    బరువని వల్వలన్ విడుచు భామినిఁ గాంచి ప్రశంసలిచ్చిరే

    రిప్లయితొలగించండి
  12. కం:బరువగు బట్టల మూటల
    చెరువుకు మోసెడు కులమను చెర విడి పదవుల్
    ధరియించ, చదువు పొందగ
    బరువని వల్వలను విడుచు భామకు స్తవముల్”
    (చాకలి కులం లో జన్మించింది కానీ పదవులు,చదువు కోరుకొని బట్టల బరువుని వదిలించుకొన్నది.)

    రిప్లయితొలగించండి
  13. చం:పరువుగనే పతివ్రతల పాత్రల దాల్చు నటీమణుల్ కదా
    స్థిరమగు కీర్తి నొంది ప్రజ చేత, నవార్డులు పొంది రెన్నియో
    పరువును వీడి నృత్యముల,పాటల సత్వర కీర్తి బొందగా
    బరువని వల్వలన్ విడుచు భామినిఁ గాంచి ప్రశంసలిచ్చిరే?
    (అర్థనగ్ననృత్యాలు చేసే నటీమణులకి అంతగా ఆవార్డులు రాక తాత్కాలిక మైన చప్పట్లే దక్కి ,పరువు గా నటించిన హీరోయిన్లకే మెప్పులు,ఆవార్డులు దక్కుతుంటాయి.)

    రిప్లయితొలగించండి
  14. ఉరమందు నొక్క పుట్టము
    తరుణీ మణి కటినొకండు తనరుచు నుండం
    బురి పుట్టంబన్యమ్ముల
    బరు వని వల్వలను విడుచు భామకు స్తవముల్


    కరములఁ గంకణమ్ములును గాళుల గజ్జెలు మ్రోగుచుండఁగా
    నురమునఁ బైడి హారము సముజ్జ్వల కాంతుల నీనుచుండఁగా
    మురిపము లొల్కు చిన్ని నగు మోమున నాడెడు చంటిపాపకున్
    బరు వని వల్వలన్ విడుచు భామినిఁ గాంచి ప్రశంస లిచ్చిరే

    రిప్లయితొలగించండి
  15. కం:పరు లిచ్చు పలుచ చీరల
    మురిపెము గా దొంగిలించు మోయుట సులువై,
    హరియింపక నావి "ముతక,
    బరు"వని వల్వలను విడుచు భామకు స్తవముల్”
    (ఆ చాకలి పలచగా ఉన్న చీరలని కాజేస్తుంది కానీ నా చీరలు ముతకగా ఉంటాయని దొంగిలించదు కనుక మెచ్చుకుంటాను.)

    రిప్లయితొలగించండి

  16. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    భరతావనిలో చీరలు
    కరములతో నేసినవియె కావలెననుచున్
    పరదేశానివి కట్టిన
    బరువని వల్వలను విడుచు భామకు
    స్తవముల్.

    రిప్లయితొలగించండి
  17. కరములతో కుట్టితినని
    తరుణీమణితా ముదమున తనయకు వేయన్
    త్వరగా నడచిన పడునని
    బరువని వల్వలను విడుచు భామకు స్తవముల్

    రిప్లయితొలగించండి