26, మే 2026, మంగళవారం

సమస్య - 5479

27-5-2026 (బుధవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“చరణమ్ములు దెగిన లేమ చక్కఁగ నాడెన్”

(లేదా...)

“చరణమ్ముల్ దెగినట్టి లేమ సలిపెన్ సర్వుల్ గనన్ నాట్యమున్”

23 కామెంట్‌లు:

  1. నిరుడు చికిత్సా లయమున
    చరణమ్ములు దెగిన లేమ , చక్కఁగ నాడెన్
    నరుదగు నిపుణత జూపుచు
    పురిని జరగిన చదరంగ పోటీ లందున్

    రిప్లయితొలగించండి
  2. -

    వరమై కృత్రిమ పదముల
    మరగ మయూరమ్ము వలె నమస్సుల తోడై
    కరముల్ జోడిచి సభలో
    చరణమ్ములు దెగిన లేమ చక్కఁగ నాడెన్

    https://youtube.com/shorts/WjpQ4NVyw2Y?si=QxX18b4IgJT9NRxr


    రిప్లయితొలగించండి


  3. *(సుధా చంద్రన్ జీవిత గాథ)*

    నిరసింప విజ్జులు పడతి
    చరణమ్మును, విడువని సాధన తోడన్
    బరిణిష్ఠను జూపించుచు
    చరణమ్ములు దెగిన లేమ చక్కఁగ నాడెన్.


    *(నాటి షోలే యను సినిమాలోని దృశ్యము)*

    కరుణా హీనుడు దుష్ట నాయకుని దుష్కార్యమ్ము లన్ నిల్పగా
    పురమున్ జేరిన వారిలో నొకని నా మూర్ఖుండు బంధించు చున్
    చొరవన్ జూపుచు నాడమంచు నట గాజుల్ జల్లనా ధూర్తుడే
    చరణమ్ముల్ దెగినట్టి లేమ సలిపెన్ సర్వుల్ గనన్ నాట్యమున్.

    రిప్లయితొలగించండి
  4. దొరఁకొనె కృతకాంగమ్ములు
    పరమేశుడు కరుణతోడఁ బడతిని జూడన్
    వరమే నాకివి యనుచున్
    జరణమ్ములు దెగిన లేమ చక్కఁగ నాడెన్

    దురదృష్టంబున గోలుపోయె పదముల్ దుర్జాతమే పైకొనన్
    బరమేశా యని వేడుకొన్న పిదపన్ భస్మాంగుడే ప్రీతితో
    వరమిచ్చెన్ గృతకాంగముల్ దొరఁకొనన్ బద్మాక్షి నర్తించెలే
    చరణమ్ముల్ దెగినట్టి లేమ సలిపెన్ సర్వుల్ గనన్ నాట్యమున్

    రిప్లయితొలగించండి
  5. జరిగిన ప్రమాద మందున
    చరణమ్ములు పోయె గాని సంకల్ప ము తో
    మరలా తా పుంజు కొనగ
    చరణమ్ములు తెగిన లేమ చక్కగ నాడెన్

    రిప్లయితొలగించండి
  6. సమస్య:
    "చరణమ్ములుతెగిన లేమ చక్కగ నాడెన్"

    కం॥
    గరిమల నాట్య ప్రదర్శన
    సురసమ్ముగసాగుచుండ, సుహితాంకమునన్
    విరసమ్మొప్పుచు పాటన్
    చరణమ్ములుతెగిన; లేమ చక్కగనాడెన్

    రిప్లయితొలగించండి
  7. మ॥ ధరలో నాపద యట్లు పాదముల విధ్వంసంబు కావించఁగన్
    వరమౌ శస్త్ర చికిత్స శాస్త్రవిధి సద్భాగ్యంపు బ్రహ్మాస్త్రమై
    వరలన్ గూర్చుచుఁ గృత్రిమావయములన్ బ్రావీణ్య మేపారఁగన్
    జరణమ్ముల్ దెగినట్టి లేమ సలిపెన్ సర్వుల్ గనన్ నాట్యమున్

    రిప్లయితొలగించండి
  8. కం:సరిగా పాడని గాయకు
    డర కొర తప్పులను బాడ, నాతని యా తొం
    దర లో పాటల గొన్నిట
    చరణమ్ములు దెగిన, లేమ చక్కఁగ నాడెన్”
    (గాయకుడు పాటలో కొన్ని చరణాలు తెగ గొట్టాడు కానీ ఆమె నృత్యం బాగా సాగింది. )

    రిప్లయితొలగించండి
  9. మ:దురదృష్టమ్మున బాదముల్ దెగిన నా దుఃఖమ్ము రానీక సుం
    దరమౌ నాగిని వోలె, కేశవుడు మత్స్యంబట్లు రూపమ్ము నం
    దు రసస్ఫోరక పాత్రలన్ గొనుచు వైదుష్యమ్ము పొంగార నా
    చరణమ్ముల్ దెగినట్టి లేమ సలిపెన్ సర్వుల్ గనన్ నాట్యమున్”
    (కాళ్లు తెగిన నర్తకి నాగకన్యగాను, విష్ణువు యొక్క మత్స్యావతారాన్ని అభినయించింది.ఆ పాత్రలకి నడక ఉండదు.పాకటమే ఉంటుంది. )

    రిప్లయితొలగించండి
  10. కం: గురుడా! చదరంగమ్మున
    సరి యగు మెద డున్న జాలు, చతురత యున్నన్
    చరణములు లేక యే మగు?
    చరణమ్ములు దెగిన లేమ చక్కఁగ నాడెన్
    (ఆడెన్ అంటే నాట్యమే కానక్కర లేదు. ఆ కుంటి అమ్మాయి చదరంగం బాగా ఆడింది. )

    రిప్లయితొలగించండి
  11. కందం:
    సురదన నాట్యమయూరము
    చరణమ్ములు గోల్పడె విధి సలిపిన యాటన్
    వరమై కృతకాంగమ్ములు
    చరణమ్ములు దెగిన లేమ చక్కఁగ నాడెన్

    మత్తేభము:
    సరవిన్ నాట్యకళా విశారదగ ప్రాశస్త్యమ్ము గొన్నట్టి యా
    యరవిందాక్షిని కాటువేసె విధి తానయ్యెన్కటా! కుంటిగా
    వరమై ధారణ చేయగా కృతకమౌ పాదమ్ము తానంతటన్
    చరణమ్ముల్ దెగినట్టి లేమ సలిపెన్ సర్వుల్ గనన్ నాట్యమున్

    రిప్లయితొలగించండి
  12. కరుణా రస ముప్పొంగఁగ
    సరోజ దళ సన్నిభాక్షి సంతోషమునన్
    నరకల్పిత పాదద్వయి
    చరణమ్ములు దెగిన లేమ చక్కఁగ నాడెన్


    పరచింతా రత మానినీ మణికి సంప్రాప్తించునే భంగముల్
    తరుణీ రత్నము నాట్య మధ్యమున సద్యః ప్రాప్త తాదాత్మ్య కాఁ
    బరమాత్మార్థపుఁ ద్యాగరాజ కృత విశ్వఖ్యాత గానమ్మునం
    జరణమ్ముల్ దెగినట్టి లేమ సలిపెన్ సర్వుల్ గనన్ నాట్యమున్

    రిప్లయితొలగించండి
  13. పరుష బదములు బలికినటి
    పర మప్రథముడునినని సభన వగలాడీ
    అరచిజరచిన సుయోధన
    చరణమ్ములు దెగిన, లేమ చక్కఁగ నాడెన్

    ఇది నా మొదటి ప్రయత్నం, తప్పులుంటే క్షమించగలరు

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    చరణముల తొలగజేయ, న
    మరించ కృత్రిమపు కాళ్లు మరి శిక్షణతో
    మురిపించుచు ప్రేక్షకులను
    చరణమ్ములు తెగిన లేమ చక్కగ నాడెన్.

    రిప్లయితొలగించండి