21, జూన్ 2026, ఆదివారం

సమస్య - 5505

22-6-2026 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“నల్లులున్నట్టి మంచమే నయము సుమ్ము”

(లేదా...)

“మత్కుణపూర్ణతల్పమె సుమా సుఖనిద్ర నొసంగు నెప్పుడున్”

15 కామెంట్‌లు:


  1. పగలు శ్రమియించి యలసితి పడక జేరి
    నిదుర బోయెద మన్నను నీదు గోల
    యవశ మయ్యెను కాదుటే యంత కన్న
    నల్లులున్నట్టి మంచమే నయము సుమ్ము.


    చిత్కళ గొంతునీ విధిని చించుకు గేకలు వేయబోకు మా
    సత్కృప జూపి నీవికను శాంతి వహింపుమ, చెప్పె నెప్పుడో
    సత్కవి వాగు వారలట సన్నిధి నుండుట కంటె కాంచగా
    మత్కుణపూర్ణతల్పమె సుమా సుఖనిద్ర నొసంగు నెప్పుడున్

    రిప్లయితొలగించండి
  2. కవుల సభకు రేపటి ఉషఃకాలమునకె
    కవుల జాబితా నక్షర క్రమపు రీతి
    కూర్చుట కొరకై నిదుర రాకుండుటకయి
    నల్లులున్నట్టి మంచమే నయము సుమ్ము”

    రిప్లయితొలగించండి
  3. నల్ల వేల్పుకే తప్పదు నల్లిబాధ
    తల్ల డిల్లుట పరిపాటి దైవమయిన
    కల్ల లేర్చికూర్చిన కవి కల్పనయగు
    'నల్లులున్నట్టి మంచమే నయము సుమ్ము'

    ఉత్కలికాసమగ్రమగు యోచనలే కవికిన్ సమస్యలౌ
    మత్కుణపూర్ణతల్పమును మచ్చరికించని వారలుందురే
    సత్కవి సంప్రహాసమున సల్పిన కల్పన కాకపోవునే
    'మత్కుణపూర్ణతల్పమె సుమా సుఖనిద్ర నొసంగు నెప్పుడున్'

    రిప్లయితొలగించండి
  4. సత్కవి యైన నన్ను సతి చక్కగ జూచుచు నున్న నింటిలో
    నత్కుదు నొక్కమూలకును నవ్వక కారణ మెంచి చూడగన్
    మత్కుణ పూర్ణతల్పమె సుమా సుఖనిద్రనొసంగునెప్పుడున్
    ఉత్కటమైన భావనము లుప్పెన రీతిగ పొంగు చుండగన్

    రిప్లయితొలగించండి
  5. సత్కవి యైన నన్ను సతి చక్కగ జూచుచు నున్న నింటిలో
    నత్కుదు రాత్రు లందు విడనాడుదు శయ్యను హేతువెంచగన్
    మత్కుణ పూర్ణతల్పమె సుమా సుఖనిద్రనొసంగునెప్పుడున్
    ఉత్కటమైన భావనము లుప్పెన రీతిగ పొంగి పొర్లుచున్

    రిప్లయితొలగించండి
  6. ఉ॥ ఉత్కళ రాష్ట్రమందు జనులుత్సవ రీతినిఁ బేర్మి మీరఁగన్
    సత్కృతిఁ జేయగాను నను సాదర మొప్పఁగఁ బిల్వ నేఁగఁగన్
    మత్కుళముల్ కనన్ వసతి మాళిగ యందునఁ దెల్పఁ బల్కిరే
    మత్కుణ పూర్ణ తల్పమె సుమా సుఖ నిద్ర నొసంగు నెప్పుడున్


    సత్కృతి సత్కారము వసతి మాళిగ వసతి గృహము (మళిగె కన్నడ భాషలో అధికంగా వాడుతారండి)

    రిప్లయితొలగించండి
  7. తే.గీ:అత్తవారింటి కేగగా నతివినయము
    జూపి,వద్దన వినకుండ జూపినారు
    నల్లులున్నట్టి మంచమే ,నయము సుమ్ము
    నేల పై చాప పైననే నిదుర బోవ.

    రిప్లయితొలగించండి
  8. ఉ: మత్కృత సత్కవిత్వమును మన్నన జేయక, సంతతమ్ము నన్
    చీత్కరణమ్ము జేసి, నస చే నిదురింపగనీక, చేసినన్
    సత్కృతి నెంచ నట్టి పరుషస్వన యౌ సతి తో పరుండుటా?
    మత్కుణపూర్ణతల్పమె సుమా సుఖనిద్ర నొసంగు నెప్పుడున్”
    (సాదించే భార్య పక్కన పడుకోవటం కంటే నల్లుల మంచమే నయం.)

    రిప్లయితొలగించండి
  9. క్రొత్త మంచము కొని దెచ్చి కోర్కె మీర
    పవ్వ ళీ o చుచు దానిపై పలికె నిట్లు
    కిర్రు కి ర్రను శబ్ద ముల్ కెరలు చుండె
    నల్లు లున్నట్టి మంచమే నయము సుమ్మి

    రిప్లయితొలగించండి
  10. సత్కరణమ్ములన్ ధృతిని సల్పుచు క్షేత్రములందు నిత్యమున్
    సత్కవితల్ లిఖించుచును సమ్మతి తోడఁ బ్రశస్తి బొందుచున్
    సత్కృపఁ జూపుచున్ మెలగు స్వామిని కౌగిలిఁ జెల్గినన్, వినా
    మత్కుణ పూర్ణ తల్పమె సుమా సుఖ నిద్ర నొసంగు నెప్పుడున్

    రిప్లయితొలగించండి
  11. ఉల్లము లలర నిద్రిల నెల్లవారు
    చల్ల వలయు సుమమ్ములు సక్కఁగాను
    వెల్లి విరియ వాసన లట మల్లె లింక
    నల్లు లున్నట్టి మంచమే నయము సుమ్ము

    [ఇంకన్ + అల్లులు =ఇంక నల్లులు; అల్లి = అల్లి పువ్వు]


    సత్కృప నూని యెల్లరకు శయ్యలొసంగ నెడంద నెంచినన్
    మత్కృత మైన విన్నపము మన్నన సేయుమ భూత లాధినా
    థోత్కర మంతకున్ బుధవ రోత్తమ విన్మ సఖా సదా వినా
    మత్కుణ పూర్ణ తల్పమె సుమా సుఖ నిద్ర నొసంగు నెప్పుడున్

    రిప్లయితొలగించండి
  12. అత్తగారింట్ల పడకపై నయ్యొనాకు
    కంటికిన్నిద్ర కరువాయె కారణమ్ము
    నల్లులున్నట్టి మంచమే, నయము సుమ్మి
    నేలపైపడు కొనటయే నిమ్మలముగ.

    రిప్లయితొలగించండి
  13. తేటగీతి
    శయనమున్న వాహనమునన్ సాగ రాత్రి
    గుంతలమయమై రహదారి కుందఁజేయ
    దక్కదు కద చక్కని నిద్ర! దానికన్న
    నల్లులున్నట్టి మంచమే నయము సుమ్ము

    ఉత్పలమాల
    గత్కుల దారిలో న పడకల్ గల వాహనమందు రాత్రిలో
    యుత్కటమైన కుద్పులకు నోడ్చని మేనుకు నిద్రవచ్చునే?
    చిత్కి యజీర్తితో నలిగి చేరితి వైద్యుని! దానిమించుచున్
    మత్కుణపూర్ణతల్పమె సుమా సుఖనిద్ర నొసంగు నెప్పుడున్

    రిప్లయితొలగించండి
  14. పట్ట పగలె చుక్కలు జూపు భార్య కన్న
    మంచిమాటలు నాడులు మాటు నందు
    గోతులను త్రవ్వ నెంచెడుకూళుకన్న
    నల్లులున్నట్టి మంచమేనయముసుమ్ము

    మత్కృత పాపమెయ్యదియొ మానస మందు నెరుంగనైతిగా
    ఛీత్కరణమ్ము నెల్లపుడు చేయుచు వంకలు పెట్టుచున్ సదా
    హృత్కమలంబునొచ్చునటుహేళనచేసెడుభార్యకన్న నీ
    *“మత్కుణపూర్ణతల్పమె సుమా సుఖనిద్ర నొసంగు నెప్పుడున్”*

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    మేలుకొని యుంటి రాతిరి వీలుగాక
    కారణంబది తెలిసెను కడకు నదియె
    నల్లు లున్నట్టి మంచమే; నయము సుమ్ము
    నేల మీదనె శయనించి నిదుర పోవ.

    రిప్లయితొలగించండి