24, జూన్ 2026, బుధవారం

సమస్య - 5508

25-6-2026 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భాస్కరుం డస్తమించెను పగటిపూట”
(లేదా...)
“భాస్కరుఁ డేలకో పగలె పశ్చిమ దిక్కున నస్తమించెరా”

11 కామెంట్‌లు:

  1. అంబరమున నల్లని మేఘ మడ్డుపడగ
    భాస్కరుం డస్తమించెను పగటిపూట ;
    మబ్బు తొలగిన వెంబడి మరల తోచె
    నాకసమునందు సూర్యోదయమయినటుల

    రిప్లయితొలగించండి
  2. గగనమున కారు మబ్బులు క్రమ్ము కొనగ
    మబ్బు చాటున రవి యుండ మహికి తోచె
    భాస్కరు o డ స్త మించెను పగటి పూట
    యనుచు లోకులు తలచి రి యబ్బు రముగ

    రిప్లయితొలగించండి
  3. తేటగీతి
    ప్రక్కదారి హిందూమతమొక్కనాడు
    నంధకారమునొందఁగ నంబరమణి
    గ వెలిగి, నడుమ శంకరులవని వీడె
    భాస్కరుం డస్తమించెను పగటిపూట!

    ఉత్పలమాల
    తస్కరులైన మ్లేచ్చులను దాళక దేశమునుండి పంప తే
    జస్కరునట్లుగన్ భగతు సాగెను విప్లవబాట త్రొక్కి, శ్రే
    యస్కరమొందకే నడుమ నందుచు వారికి వీడె ప్రాణముల్
    భాస్కరుఁ డేలకో పగలె పశ్చిమ దిక్కున నస్తమించెరా!

    రిప్లయితొలగించండి

  4. అతనికిచ్ఛామరణ మనెడద్భుత మగు
    వరము కల్గిన నేమిరా ఫల్గుణునకు
    తన రహస్యము తెలిపి శాంతనవుడనెడి
    భాస్కరుం డస్తమించెను పగటిపూట.


    మస్కరి యిచ్చు స్వచ్ఛమగు మాలతి బోలిన స్వేచ్ఛ కోసమై
    భాస్కరుడై పరాయి పరి పాలన నంతము జేయ గోరినన్
    తస్కరు లే వధింపగను దావరి మన్నెపు వీరుడైన యా
    భాస్కరుఁ డేలకో పగలె పశ్చిమ దిక్కున నస్తమించెరా.

    రిప్లయితొలగించండి
  5. సమస్య : "భాస్కరుం డస్తమించెను పగటిపూట"

    తెల్లవారి గుండియలెల్ల ఝల్లుమనగ
    ఎదురునిల్చి కైదువునకు బెదురుగొనక
    ఒరిగె మన్యపుసింగమల్లూరి యకట
    భాస్కరుం డస్తమించెను పగటిపూట

    రిప్లయితొలగించండి
  6. అష్ట దిగ్గజాలను జూచె నాదరమున
    సతతము కవి పండితులను సత్కరించె
    నిభములేని శ్రీకృష్ణరాణృపుడు కీర్తి
    భాస్కరుం డస్తమించెను పగటిపూట

    చోస్కముపైఁ జరించెనట చోద్యముగా నిలిచెంగదా మనో
    తస్కరుడై నృపాధిపుడు ధన్యత నొందినవాడు ధీరచే
    తస్కుడు కృష్ణరాయలు సదా కవి పండిత మిత్రుడా యశో
    భాస్కరుఁ డేలకో పగలె పశ్చిమ దిక్కున నస్తమించెరా

    [ చోస్కము = మంచిగుఱ్ఱము; ధీర చేతస్కుడు = స్థిర చిత్తుడు ]

    రిప్లయితొలగించండి
  7. ఉ॥ భాస్కరుఁ డేలొకో పగలె పశ్చిమ దిక్కున నస్తమించెరా
    తస్కర వైపరీత్యముల ధాత్రియు మండెను దుష్టులిట్లు నో
    జస్కరమొంద సజ్జనుల సంగతిఁ దెల్పఁగ హీనమయ్యె శ్రే
    యస్కర మేదొకో ప్రళయ మాహవనమ్మగు నంచుఁ దోఁచెనే!

    (మరి ప్రళయ కాలములోనే కదండి ఇన్ని వైపరీత్యాలు)

    రిప్లయితొలగించండి
  8. భాస్కర తేజమాతనిది పంచకమందున విక్రమించి తే
    జస్కరుడై యరాతులను శౌర్యముతో నెదిరించి నిల్వగా
    తస్కరులట్లు దుండగులు దాడియొనర్చిరి దొంగచాటుగా
    భాస్కరుఁ డేలకో పగలె పశ్చిమ దిక్కున నస్తమించెరా

    రిప్లయితొలగించండి
  9. మండు వేసవి మధ్యాహ్నమందు నాడు
    కారుమబ్బులు క్రమ్మిన కారణమున
    పగలు రేయిగ గన్పట్టె వసుధయందు
    భాస్కరుం డస్తమించెను పగటిపూట

    రిప్లయితొలగించండి
  10. శత్రు సైన్యముఁ దున్మాడి చిత్రముగను
    బరు లనేకులై యెదిరింపఁ బాడి తప్పి
    యాజి నభిమన్యుఁ డత్యుగ్ర తేజ మందు
    భాస్కరుం డస్తమించెను బగటిపూట


    మస్కర చౌర్య మగ్నులకుమౌఢ్యము మూరఁగ నొక్క నాఁడు శ్రే
    యస్కర మైన మైత్రి చెడి యక్కట తూర్పున రేఁగ ద్వేషముల్
    తస్కరు లైన యిర్వురకు దైవము సన్నిధి సాక్షి గాఁగ నా
    భాస్కరుఁ డేలకో పగలె పశ్చిమ దిక్కున నస్తమించెరా

    [పగలె = కక్షలె]

    రిప్లయితొలగించండి

  11. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    వర్ష కాలాన నొక రోజు పట్టపగలు
    కారు మేఘాలు గగనాన క్రమ్ముకొనగ
    క్రమ్మి చీకట్లు భువినంత కప్పివేయ
    నిటుల వాతావరణముఁ వర్ణించె కవులు
    భాస్కరుం డస్తమించెను పగటి పూట.

    రిప్లయితొలగించండి