25, జూన్ 2026, గురువారం

సమస్య - 5509

26-6-2026 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రావణు దల లక్ష్మణుండు రణమునఁ దునిమెన్”
(లేదా...)
“రావణు మస్తకంబును దురంబున లక్ష్మణుఁ డుత్తరించెరా” 

7 కామెంట్‌లు:

  1. కందం
    కావలసిన పాదమ్మిది
    ' రావణి తల లక్ష్మణుండు రణమునఁ దునిమెన్'
    కావించితిట్లు శిష్యా!
    "రావణు దల లక్ష్మణుండు రణమునఁ దునిమెన్"

    ఉత్పలమాల
    చేవను గల్గి యుద్ధమున జిక్కిన వెంటనె, శాపపీడితున్
    రావణి మస్తకంబును దురంబున లక్ష్మణుఁ డుత్తరించెరా!
    సేవనమేమిచేసితివొ శిష్య! కరంబన దొర్లె తప్పిటుల్
    “రావణు మస్తకంబును దురంబున లక్ష్మణుఁ డుత్తరించెరా! ”

    రిప్లయితొలగించండి

  2. ఆవహ మున సౌమిత్రియె
    రావణి గడతేర్చె నంచు ప్రాజ్ఞుడు చెప్పన్
    భావిని లిఖించె నిట్టుల
    రావణు దల లక్ష్మణుండు రణమునఁ దునిమెన్.


    కోవెల లోన నర్చకుడు కోమలి కోరగ చెప్పె లక్ష్మణుం
    డావహమందు రావణిని యంతమొనర్చెనటంచు, నైన నా
    భావిని వ్రాసె నిట్టులుపపాతమునన్ దన పొత్తమం దునన్
    రావణు మస్తకంబును దురంబున లక్ష్మణుఁ డుత్తరించెరా.

    *(రావణి=ఇంద్రజిత్తు)*

    రిప్లయితొలగించండి
  3. రావణు జంపినదెవరని
    ఆ వడుగని దరికి బిలచి యడిగిన తోడన్
    ఏ వెరపు లేక నుడివెను
    "రావణు దల లక్ష్మణుండు రణమునఁ దునిమెన్

    రిప్లయితొలగించండి
  4. రావణ తనూభవుండగు
    రావణి సురపతినిగెలిచి రాణించె గదా
    తా వధియింతునని జగ
    ద్రావణు దల లక్ష్మణుండు రణమునఁ దునిమెన్

    రావణ నందయంతుడగు రాక్షస వీరుడు మేఘనాధుడే
    తా విభుధేంద్రునిన్ గెలువ దక్కెను సంశ్రవమింద్రజిత్తుగా
    రావణపుత్రు డింద్రజిని రాక్షస మాయలమారినిన్ జగ
    ద్రావణు మస్తకంబును దురంబున లక్ష్మణుఁ డుత్తరించెరా

    [ జగద్రావణుడు = లోకాన్ని వణికించువాడు ]

    రిప్లయితొలగించండి
  5. ఉ॥ భావన మీర రామ కథ భవ్యతఁ దెల్ప విదేశమందునన్
    ఠీవిగ విన్న వారలటు టిప్పణి పూర్తిగ మర్చి పోయినన్
    ధీవరులౌచుఁ బల్కిరిటు తీరుగ ధైర్యముఁ గాంచి యుద్ధతిన్
    రావణు మస్తకంబును దురంబున లక్ష్మణుఁ డుత్తరించెరా!

    మరొక పూరణ
    (రాత్రి నాకు గుర్తు రాలేదండి నాగచంద్రుడు 11వ శతాబ్దం కన్నడ జైనకవి. ఆయన వ్రాసిన పంప రామాయణముగా ప్రసిద్ధి గాంచిన కావ్యంలో రావణుని లక్ష్మణుడు చంపుతాడు. నాగచంద్ర కు అభినవ పంప అని బిరుదు ఉన్నందున పంప రామాయణం గా వినుతికెక్కింది. పంప కన్నడ ఆదికవి 10వ శతాబ్దం)

    ఉ॥ భావము మార్చి యెంతగనొ వ్రాసెను జైనమతంపు స్ఫూర్తితో
    భావనఁ జేసి యూహలకుఁ బ్రాభవ మొప్పఁగ రూపు దిద్దుచున్
    జేవగ నాగచంద్రుఁడిటు చెప్పుచు రాముని గాథ వింతగా
    రావణు మస్తకంబును దురంబున లక్ష్మణుఁ డుత్తరించెరా

    రిప్లయితొలగించండి
  6. రావణు దల దీ సి రెవరు?
    కావలె సరియగు జవాబు గడగడ జెపు మా
    లేవక నిట్టుల జెప్పెను
    " రావణు దల లక్ష్మణుండు రణమున దునిమెన్ "

    రిప్లయితొలగించండి