2, ఆగస్టు 2026, ఆదివారం

సమస్య - 5547

3-8-2026 (సోమవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“అన్యాయమె జయమునందు నవనీస్థలిపై”

(లేదా...)

“అన్యాయంబె జయించుచుండు భువిలో హత్యావిధుల్ ధర్మమౌ”

(ఉప్పలధడియం భరతశర్మ శతావధానంలో కాకరపర్తి దుర్గాప్రసాద్ గారి సమస్య)

15 కామెంట్‌లు:

  1. భీష్మద్రోణుల వీర మరణం తరువాత సుయోధనుని మానసం:

    కందం
    మాన్యుండౌ హరి పూన్చగ
    విన్యాసంబుల దునిమిరె భీష్మున్ ద్రోణున్
    శూన్యాచారుల విజ్ఞత
    నన్యాయమె జయమునందు నవనీస్థలిపై!


    శార్దూలవిక్రీడితము
    మాన్యుండౌ హరి పూన్చఁగన్ జెలఁగి దుర్మార్గాన భీష్మున్, గురున్
    విన్యాసంబుల పాండునందనులు దుర్భేద్యాదులన్ ద్రుంచిరే
    శూన్యాచారుల ధర్మమూర్తులనుచున్ స్తోత్రంబులింకేలనో?
    యన్యాయంబె జయించుచుండు భువిలో హత్యావిధుల్ ధర్మమౌ!

    రిప్లయితొలగించండి
  2. మాన్యుల నవమానించెడి
    అన్యాయమె జయమునందు నవనీస్థలిపై
    సన్యాస మొందినప్పుడె
    ధన్యడనెద రెవరినైన ధారణి యందున్

    రిప్లయితొలగించండి
  3. ధన్యంబౌ జీవిత మని
    సన్యాసము స్వీకరించి సాగింత్రు విధుల్
    విన్యాసములన్ జూడగ
    నన్యాయమె జయమునందు నవనీస్థలిపై

    సన్యాసాశ్రమమే విశేష మనరే సంక్లిష్టమౌ ముక్తికై
    సన్యాసమ్మును స్వీకరించి ఘనులై సాగింతురే కృత్యముల్
    విన్యాసమ్ములఁ గాంచినంత విధిగా విస్పష్టమీ సత్యమే
    అన్యాయంబె జయించుచుండు భువిలో హత్యావిధుల్ ధర్మమౌ

    రిప్లయితొలగించండి

  4. *(సుర గణము విష్ణు మూర్తి తో మొరపెట్టు కొనుట)*

    దైన్యంబున చేరితి మిట
    మాన్యా భువినవతరించి మాకింకను నీ
    వే న్యాయము చేయని చో
    యన్యాయమె జయమునందు నవనీస్థలిపై.


    దైన్యంబయ్యెను మాదు జీవన మటన్ దాక్షిణ్యమున్ వీడి మా
    కన్యాయంబును గూర్చు చుండె నిజమా కల్మాషుడే గాంచ నీ
    వే న్యాయమ్మును జేయకున్ననిక నా హీనాత్మకున్ జేతిలో
    నన్యాయంబె జయించుచుండు భువిలో హత్యావిధుల్ ధర్మమౌ.

    రిప్లయితొలగించండి
  5. కన్యాత్వంబును పాడుజేయు నొకడున్ కామంధ కారాన సౌ
    జన్యంబింతయు లేక దుశ్చరితుడై సంస్కార హీనుండునై
    వన్యప్రాణుల పట్టి పేరడచి తా భావించు నీరీతిగా
    నన్యాయంబె జయించు చుండు భువిలో హత్యావిధుల్ ధర్మమౌ

    రిప్లయితొలగించండి

  6. అన్యాయపు జనులకు సరి
    యన్యాయమె జయమునందు నవనీస్థలిపై


    రిప్లయితొలగించండి
  7. -
    పుణ్యాత్ములకేది యెలమి
    వన్యమృగమరయు నగరపు ప్రఖరపు జిత్తుల్?
    అన్యాయపు జనులకు సరి
    యన్యాయమె జయమునందు నవనీస్థలిపై



    రిప్లయితొలగించండి
  8. అన్యుల తప్పుడు సాక్ష్య ము
    మాన్యము గా జే కొనుచును మహిసంభవమై
    జన్య ము గా దీ ర్పు జరుగ
    న న్యా య మె జయము నందు నవ నీ స్థలి పై

    రిప్లయితొలగించండి
  9. ధన్యుఁడు ధర్మాచరణము
    మాన్యతతో సలుపునట్టి మనుజుడు భువిలో
    నన్యాయకారి తలఁపున
    నన్యాయమె జయమునందు నవనీస్థలిపై

    రిప్లయితొలగించండి
  10. ధన్యాత్ముండు జగమ్మునందు గడు శ్రద్ధాసక్తులన్ ధర్మమున్
    మాన్యుండై యొనరించుచుండు నిరతం బాతండె ధర్మాత్ముడౌ
    విన్యాసంబుగ పాపముల్ సలిపి భావించున్ దురాత్ముండు నే
    డన్యాయంబె జయించుచుండు భువిలో హత్యావిధుల్ ధర్మమౌ

    రిప్లయితొలగించండి
  11. కం:అన్యాయద్యూతమ్మున
    వన్యుల జేసితివి కౌరవపతీ! మము సా
    మాన్యులనకు, ప్రథమమునం
    దన్యాయమె జయమునందు నవనీస్థలిపై”
    (అని భీముడు అన్నట్లు.)

    రిప్లయితొలగించండి
  12. శా: ధన్యమ్మౌ భరతావనిన్ గలిని జింతన్ జేసి బ్రహ్మర్షులౌ
    మాన్యుల్ జెప్పిరి భావి నిట్లు "నశియింపన్ వర్ణధర్మమ్ములే,
    సన్యాస మ్మొక వేషమౌచు, ద్విజులున్ శాస్త్రమ్ములన్ వీడగా
    నన్యాయంబె జయించుచుండు భువిలో హత్యావిధుల్ ధర్మమౌ”
    (పురాణాలలో ఋషులు కలికాలం ఇలా ఉంటుం దని చెప్పారు. )

    రిప్లయితొలగించండి
  13. అన్యమ్మును జింతింపకు
    విన్యస్తం బగు జయమ్ము పిదపం దథ్యం
    బా న్యాయమునకు ముందుగ
    నన్యాయమె జయము నందు నవనీస్థలిపై


    కన్యా భోగము లందు మగ్నుఁ డగు లంకా నాథుఁ డెల్లప్పుడున్
    మాన్యామాన్య వివేక శూన్యులకు ధర్మం బన్న దెందుండు రా
    జన్యాశేష పరాజయార్థ మయి రక్షః పాలు రాజ్యమ్ములో
    నన్యాయంబె జయించుచుండు భువిలో హత్యా విధుల్ ధర్మమౌ

    రిప్లయితొలగించండి
  14. పుణ్యాత్ముల్ వ్యథ రాజకీయముల సంపూర్ణమ్ముగా వీడగా
    దైన్యమ్మొందె విలాతి పాలనవడిన్ దౌర్బాగ్యులే పొంది తా
    మన్యమ్మైన విధమ్ములన్ బ్రజల భాగ్యమ్ముల్ గొనన్ వారిదౌ
    అన్యాయంబె జయించుచుండు భువిలో హత్యావిధుల్ ధర్మమౌ

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    కన్యల హత్యాచార
    మ్మన్యాయమె;జయమునందు నవనీ స్థలిపై
    మాన్యులు ధర్మమెఱుంగుచు
    దైన్యుల కాపాడుచుండ దక్షత తోడన్.

    రిప్లయితొలగించండి