30, జూన్ 2014, సోమవారం

సమస్యా పూరణం - 1459 (తల్లికి జనించువాఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
తల్లికి జనించువాఁడు సోదరుఁడు కాదు.
ఈ సమస్యను పంపిన కె. వినోద్ గారికి ధన్యవాదలు.

పద్యరచన - 606

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

నిర్వచన భారత గర్భ రామాయణము - 15

రామాయణము-
సీ.      అభివృద్ధి నొందెఁ జేయఁగ దైత్యులు (కడుగ
ను నసూయ దుర్యోధనుఁడునుఁ బాండు)
యశుఁడగు రాముండు; కుశికతనూజుండు
పగను మారీచసుబాహుముఖ్య
ఘననిజయజ్ఞవిఘ్నకరదితి(సుతుల
పైఁ గని యేగి, భూపతిని, వారి)
గూల్ప రాఘవుఁ (బంపఁ గోరెఁ బవిత్రంబు
వారణావ)ళి సింహవర్గ మాడు
ఆ.      కొను స్వసవత(తతలమునకు, వీఁగియునుఁ దు
దఁ ననుపంగ) నీయకొనె నితం డ
తులితుఁ డుక్కుతునుక నిలువు నీరగు టేల
యనుపు మని వశిష్ఠుఁడు నుడువంగ. (౩౦)

భారతము-
తే.      కడుగను నసూయ దుర్యోధనుఁడునుఁ బాండు
సుతులపైఁ గని యేగి, భూపతిని వారిఁ
బంపఁ గోరెఁ బవిత్రంబు వారణావ
తతలమునకు, వీఁగియును దుద ననుపంగ. (౩౦)

టీక- (రా) దుర్యోధనుఁడు = యోధులకు భేదింపరానివాఁడు; పాండుయశుఁడు = తెల్లని కీర్తి గలవాఁడు; వారణావళి...తతలమునకు = జాతివైషమ్యములను గూడ మఱచి, విశ్వామిత్రుని ప్రభావముచేత నతని యాశ్రమమందు నేనుఁగులు సింహము లాడుకొనిచున్న వనుట; స్వసవతత తలము = తన యజ్ఞముచేయు విశాలమగు చోటు.
(భా) పాండుసుతులపైన్ = పాండవులపై; వారణావతతలమునకు = వారణావతమను స్థలమునకు; ఉక్కుతునుక = పరాక్రమము గలిగినవాఁ డనుట.

రావిపాటి లక్ష్మీనారాయణ

29, జూన్ 2014, ఆదివారం

సమస్యా పూరణం - 1458 (సతతము బాధించునట్టి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
సతతము బాధించునట్టి స్వామికి జేజే.

పద్యరచన - 605

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

నిర్వచన భారత గర్భ రామాయణము - 14

రామాయణము-
చ.      అతులితవీరులై (పెరిగి రా ప్రభుపుత్రులు వీఁకగూడ;) బ
ర్వతధృతిఁ దండ్రి తా (నధికవైరిచమూదధిహారికుంభ)జుం
డతిధృతిఁ జూడ, రా(జదయనందును నేర్చిరి క్షాత్రవిద్య)లం
దతమగు నేర్పుతో; (నవనిఁ దామతతంపర లైరి చాల)గన్. (౨౯)

భారతము-
తే.      పెరిగి రాప్రభుపుత్రులు వీఁక గూడ,
నధికవైరిచమూదధిహారి కుంభ
జ దయ నందుచు నేర్చిరి క్షాత్రవిద్య;
నవనిఁ దామరతంపరలైరి చాల. (౨౯)

టీక- (రా) అధికవైరిచమూదధిహారికుంభజుండు = గొప్ప శత్రుసేనాసముద్రమునకు మనోజ్ఞుఁ డగు నగస్త్యుని బోలువాఁడు. (భా) అధికవైరిచమూదధిహారి = గొప్ప శత్రుసేనాసముద్రమును వారించువాఁడగు, కుంభజదయ = ద్రోణుని దయ; వీఁక = పరాక్రమము; తతము = విరివియైన; తామరతంపర లగుట = వృద్ధిజెందుట.

రావిపాటి లక్ష్మీనారాయణ

28, జూన్ 2014, శనివారం

సమస్యా పూరణం - 1457 (కైక పతిన్ రఘూత్తముని)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
కైక పతిన్ రఘూత్తమునిఁ గానల కంపకు మంచు వేడెఁగా.
(ఒకానొక అవధానంలో గరికిపాటి వారు పూరించిన సమస్య)
ఈ సమస్యను పంపిన అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు.

పద్యరచన - 604

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

నిర్వచన భారత గర్భ రామాయణము - 13

రామాయణము-
చతుర్విధకందము
నీతిగ దివిజవితానము
భాతిన్, ఘనకేసరిశిశువర్గం బనఁగా,
భూతకరుణాత్ము లనియెడి
ఖ్యాతిన్, జననాథసుతనికాయము దనరెన్. (౨౮)

భారతము-
చతుర్విధకందము-
ఘనకేసరిశిశువర్గం
బనఁగా భూతకరుణాత్ము లనియెడు ఖ్యాతిన్,
జననాథసుతనికాయము
దనరెన్ నీతిగ దివిజవితానము భాతిన్. (౨౮)

(భూతకరుణాత్ము లనియెడు నుండియు, ‘జననాథసుతనికాయము నుండియుఁ జదివినను కందపద్యములు వచ్చును.)

టీక- వితానము, వర్గము, నికాయము = గుంపు.

రావిపాటి లక్ష్మీనారాయణ

27, జూన్ 2014, శుక్రవారం

సమస్యా పూరణం - 1456 (మూగవాఁడు పాడె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
మూగవాఁడు పాడె మోహనముగ.

పద్యరచన - 603 (కప్పల పెండ్లి)

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

నిర్వచన భారత గర్భ రామాయణము - 12

రామాయణము-
చ.      జగతివిభుండు సద్(హసనసంయుతుఁడై ధృతి నంత మాద్రి)నె
ప్డు గనఁగ లేదనెన్; (మమతఁ బొందె, మహీసురు మాట నాఱె) నా
వగ యనె భూపుఁడున్ (ధవుఁడు బాండుసమాఖ్యుఁడు; తత్సుకీర్తి)తో
నగరియు వెల్గె, రే(యతివ నాధుని రాజును హాళిఁ గూడె)నాన్. (౨౭)

భారతము-
తే.      హననసంయుతుఁడై ధృతి నంత మాద్రి
మమతఁ బొందె, మహీసురు మాట నాఱె
ధవుఁడు బాండుసమాఖ్యుఁడు; తత్సుకీర్తి
యతివ నాథుని రాజును హాళిఁ గూడె. (౨౭)


టీక- ధృతినంతమాద్రి = (రా) అంతకు సామ్యమగు సంతసమును; ఆఱె = చనిపోయెను; పాండుసమాఖ్యుఁడు = (రా) తెల్లని కీర్తి గలవాఁడు; రాజును = (రా) చంద్రుని, (భా) పాండురాజును; మాట = (రా) దీవన, (భా) శాపము; హసన = నవ్వు (సంతోషము చేత).

రావిపాటి లక్ష్మీనారాయణ

26, జూన్ 2014, గురువారం

సమస్యా పూరణం - 1456 (విస్కీ త్రాగి యవధాని)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
విస్కీ త్రాగి యవధాని వెస సభ కేఁగెన్.
ఈ సమస్యను సూచించిన అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు.

పద్యరచన - 602

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

నిర్వచన భారత గర్భ రామాయణము - 11

రామాయణము-
సీ.      రాజీవపత్రనేత్ర సుమిత్రయును (బాఢ
భవ్యతఁ గాంచెఁ బ్రభాయుతుని న)
తవిరోధి(కులుని నుతదివిజు ముదితకు
వలయు సహ)స్రాంశుభాసమాను
లక్ష్మణు, శత్రుఘ్ను, లాలితభూ(దేవు,
దివ్యరుచికలితు, ధృతిని నెన్ని)
కకు నెక్కు మోహనాకారులునౌ (స్వర్గ
వైద్యుల మాద్రి సుపర్వవినుత)
ఆ.వె.   లలితరూపులయిన లక్ష్మణ శత్రుఘ్ను
లుద్భవంబు నొంది రుర్విఁ బగలు;
వరుసఁ జక్రశేషపాంచజన్యములె త
గ భరతుఁడు సుమిత్ర కందులయ్యె. (౨౬)

భారతము-
తే. బాఢభవ్యతఁ గాంచెఁ బ్రభాయుతుని న
కులుని, నుతదివిజు ముదితకువలయు, సహ
దేవు, దివ్యరుచికలితు ధృతిని నెన్ని
స్వర్గవైద్యుల, మాద్రి సుపర్వవినుత. (౨౬)

టీక- (రా) నతవిరోధికులుని = వంగిన శత్రుసమూహము గలవానిని; సహస్రాంశు భాసమాను = సూర్యతేజస్సు గలవానిని; పాంచజన్యము = విష్ణుని శంఖము; స్వర్గవైద్యుల మాద్రి = అశ్వినులవలె. కందులు = కుమారులు.

(భా) మాద్రి = మాద్రీదేవి; స్వర్గవైద్యుల = అశ్వినులను; ఎన్ని = ప్రార్థించి.

25, జూన్ 2014, బుధవారం

సమస్యా పూరణం - 1455 (రవిక విప్పి డాసె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
రవిక విప్పి డాసె రమణి యతిని.
ఈ సమస్యను సూచించిన అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు.

పద్యరచన - 601

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

నిర్వచన భారత గర్భ రామాయణము - 10

రామాయణము-
చం.    అతిముదితాత్మయై (మురియు చర్మిలిచే మినుముట్టి యాని)శన్
హితమతి కైకయున్ (శితశరేక్షణ గాంచెను జిష్ణుసత్క)ళా
యుతుఁడగువాని, దా(రుణరిపుజ్జ్వలభంజనరూక్షతేజుఁ) బ్ర
స్తుతు భరతున్, మహా(విజయు శోభితలక్షణు వేల్పు లెన్నఁ)గన్. (౨౫)

భారతము-
తే.      మురియు చర్మిలిచే మినుముట్టి యా ని
శితశరేక్షణ గాంచెను జిష్ణుసత్క
రుణరిపుజ్జ్వలభంజనరూక్షతేజుఁ
విజయు శోభితలక్షణు వేల్పు లెన్న. (౨౫)

టీక- (రా) జిష్ణుసత్కళాయుతుఁడగువాని = జయశీలుని తేజము గలవాని, మహావిజయు శోభితలక్షణు = గొప్పగెలుపుకాని యొక్క ప్రకాశమానమగు స్వభావము గలవానిని.

(భా) ఆ నిశితశరేక్షణ = కుంతి; జిష్ణుసత్కరుణ = దేవేంద్రుని దయవలన; విజయు = అర్జునుని.

24, జూన్ 2014, మంగళవారం

సమస్యా పూరణం - 1454 (రామ యనిన నోరు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
రామ యనిన నోరు ఱాతిరోలు.
ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

పద్యరచన - 600

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

భారత గర్భ రామాయణము - 9

రామాయణము-
చం.    వరసుతజన్మమున్ (రమనుఁ బ్రౌఢుఁడునౌ ధృతరాష్ట్రుఁ డంత) జా
ల రమణతో వినెం, (బలువ లక్షణముల్ గలవారి నూఱు) నా
యురువిమలాత్ముఁడున్ (గురుసుయోధనముఖ్యులఁ గూర్మితోడఁ) గ
ల్గు రసికుఁ డర్మిలిం (గనెను, గోర్కుల బీదలఁ గాంక్షఁ దన్పెఁ)దాన్. (౨౪)

భారతము-
తే.      రమనుఁ బ్రౌఢుఁడునౌ ధృతరాష్ట్రుఁ డంత
బలువ లక్షణముల్ గలవారి నూఱు
గురు సుయోధనముఖ్యులఁ గూర్మితోడఁ
గనెను, గోర్కుల బీదలఁ గాంక్షఁ దన్పె. (౨౪)


టీక- ధృతరాష్ట్రుఁడు = (రా) రాష్ట్రమును ధరించినవాఁడు- దశరథుఁడు; పలువ లక్షణముల్... విమలాత్ముఁడు = (రా) దుస్స్వభావులనుఁ జంపు శుద్ధుఁడు; గురుసుయోధనముఖుల = గొప్ప వీరశ్రేష్ఠుల; అర్మిలిం గనెను = (రా) సంతస మందెను.

23, జూన్ 2014, సోమవారం

సమస్యా పూరణం - 1453 (గురువును దిట్టి కొట్టుఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
గురువును దిట్టి కొట్టుఁడు నిగూఢరహస్యము వెల్లడింపఁగన్.
ఈ సమస్యను సూచించిన అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు.

పద్యరచన - 599

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

నిర్వచన భారత గర్భ రామాయణము - 8

రామాయణము-
చం.    రణమున జంపు నీ(పరమరాజితుఁడౌ కృతి బంటు భీము) రా
వణు నని పొంగుచుం (బ్రథితభవ్యతఁ గూడి ప్రభన్ మరుత్తు)లున్
ప్రణుతసుశీలురుం (దలఁచి రమ్యసుఖంబు ముదంబునొంది) మేల్
గణుతినిఁ జేయఁగా, (ధృతిని గాంచెను దత్సతి తీవబోఁడి)యున్. (౨౩)

భారతము-
తే.      రమరాజితుఁడౌ కృతి బంటు భీము
బ్రథితభవ్యతఁ గూడి ప్రభన్ మరుత్తు
దలఁచి రమ్యసుఖంబు ముదంబునొంది
ధృతిని గాంచెను దత్సతి తీవబోఁడి. (౨౩)


టీకా- కృతి = (రా) నేర్పరి, (భా) నేర్పరిని; భీము = (రా) భయంకరుని, (భా) భీముని; ప్రథిత = ప్రఖ్యాతినొందిన; మరుత్తులు = (రా) సురలు, మరుత్తు = (భా) వాయుదేవుని; తత్సతి = (రా) కౌసల్య, (భా) కుంతి; ధృతిని = సంతోషముతో; కాంచెను = ప్రసవించెను.

22, జూన్ 2014, ఆదివారం

సమస్యా పూరణం - 1452 (మారణహోమమ్ము కూర్చు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
మారణహోమమ్ము కూర్చు మహిలో శాంతిన్.
ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

పద్యరచన - 598

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

నిర్వచన భారత గర్భ రామాయణము - 7

రామాయణము-
సీ.      వి(బుధసందోహము వేడ్క జెందెను, గనెన్
మోదంబు గోబృందమున్) నయముగ
వ(సుధ నాశించెడువారు సంతసమునన్
శోభిల్లుచుండంగ, శో)కరహిత
శు(భధరాచక్రము చొక్క, మెల్లన జగ
త్ప్రాణుండునున్ వీచెఁ దా) ఖలచయ
ము (నధమశ్రేణియుఁ బొందు చుమ్మలికమున్
ఖ్యాతిన్ విడెం బెల్లుగన్) సుపర్వ
తే. దుందుభులు మ్రోసె దశదిశ లొందె దెలివి,
నలరులజడి గురిసె, నాడి రప్సరసలు,
పాడె గంధర్వతతి, కూర్మితోడ మింట
గరుడపన్నగకిన్నరుల్ గంతు లిడిరి. (౨౨)

భారతము-
మ.     బుధసందోహము వేడ్క జెందెను, గనె న్మోదంబు గోబృందమున్
సుధ నాశించెడువారు సంతసమునన్ శోభిల్లుచుండంగ, శో
భధరాచక్రము చొక్క, మెల్లన జగత్ప్రాణుండునున్ వీచెఁ దా
నధమశ్రేణియుఁ బొందు చుమ్మలికమున్ ఖ్యాతిన్ విడెం బెల్లుగన్. (౨౨)


టీక- సుధనాశించెడువారు = దేవతలు; జగత్ప్రాణుండు = వాయుదేవుఁడు; ఉమ్మలికము = దుఃఖము; సుపర్వ = దేవతలు.

21, జూన్ 2014, శనివారం

సమస్యా పూరణం - 1451 (పాలు త్యజించి నీరమును)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
పాలు త్యజించి నీరమును పానమొనర్చును హంసలెప్పుడున్.
(ఒకానొక అవధానంలో గరికిపాటి వారు పూరించిన సమస్య)
ఈ సమస్యను పంపిన అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు.

పద్యరచన - 597

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

నిర్వచన భారత గర్భ రామాయణము - 6

రామాయణము-
సీ.      అట్లు సుతేష్టిఁ జే(య మునికరుణచేఁ బ
రముని యుధిష్ఠిరు) రమ్యతేజు
నారాయణునిఁ బద్మనయను ఘనశ్యాము
(సత్సుధర్మగుణము శాంతరసము)
నొప్పు కనికరంబు (నుట్టిపడు మహాత్ము
నురు శుభాకారుఁ గుం)భరిపు ధైర్య
లక్షణు, రాము, సల్లలితుఁ గౌసల్య ధృ
(తిఁ గనె ముదము నంద జగము లన్ని)
ఆ.      పవలు చైత్రశుద్ధనవమిఁ గర్కటలగ్న
మునను భానువారమునఁ బునర్వ
సునను గగనమధ్యమునను సూర్యుం డుండ
నుద్భవించె రాముఁ డుర్విమీద. (౨౧)

భారతము-
ఆ.      యముని కరుణచేఁ బరముని యుధిష్ఠిరు
సత్సుధర్మగుణము శాంతరసము
నుట్టిపడు మహాత్ము నురుశుభాకారుఁ గుం
తి గనె ముదము నంద జగములన్ని. (౨౧)


టీక- యుధిష్ఠిరు = (రా) యుద్ధమునందు స్థిరమగువానిని, (భా) ధర్మరాజును; కుంభిరిపు = సింహముయొక్క.

20, జూన్ 2014, శుక్రవారం

సమస్యా పూరణం - 1450 (కాకి కాకి కాక)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
కాకి కాకి కాక కేకి యగునె?

పద్యరచన - 596

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

నిర్వచన భారత గర్భ రామాయణము - 5

రామాయణము-
సీ.      ప్రతిభ వెల్గె [ఘనుఁడు పాండుసమాఖ్యుఁ; డా
జనవరాను]గ్రహమున కనేక
నృపులు వేచెదరు; తద్దినసామ్యతే[జుండు
నెప్పు డన్ననుడుల చొప్పు విడఁడు;]
రమ [కోరి దిగ్విజయముఁ జేసెఁ గుంతిమ
ద్ర] క్షోణివిభుముఖ్యరాజతతుల
మించి, కౌసల్య సుమిత్ర గేకయ [ధాత్రి
ధవతనయనుఁ గొనె దయితలుగను]
తే.      సంతులేక విచారించె స్వాంత మందు,
శ్రీవిచారించె గురువు వశిష్ఠుతోడ
ఋశ్యశృంగుఁ దెచ్చె నిజపురికి బురజను
లెలమి మిన్నందఁ బుత్రకామేష్టి సలిపె. (౨౦)

భారతము-
తే.      ఘనుఁడు పాండుసమాఖ్యుఁ; డా జనవరాను
జుండు నెప్పు డన్ననుడుల చొప్పు విడఁడు;
కోరి దిగ్విజయముఁ జేసెఁ గుంతి, మద్ర
ధాత్రి ధవతనయనుఁ గొనె దయితలుగను. (౨౦)


టీక- పాండుసమాఖ్యుఁడు = (రా) తెల్లని కీర్తి గలవాఁడు, (భా) పాండురాజు; అన్ననుడులచొప్పు = (రా) పలికిన మాటలదారి, (భా) అగ్రజుని మాటలదారి; ఇనసామ్యతేజుండు = సూర్యునికి సమమగు తేజము కలవాఁడు.

19, జూన్ 2014, గురువారం

సమస్యా పూరణం - 1449 (చేతకానివాఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
చేతకానివాఁడు శ్రీహరి యట. 
ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

పద్యరచన - 595

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

నిర్వచన భారత గర్భ రామాయణము - 4

రామాయణము-
చం.    ముదమున నేలు నా [నగరి భూపతి చీకుజనాలకాఁపు] హె
చ్చు; దశరథుండనన్ [వెలయుచున్ ధృతరాష్ట్రుఁడు బిట్టు భీష్మ]మౌ
కదనమునందు సచ్[శరనికాయసహాయతఁ జక్కడంచె]ను
గ్రదనుజకోటులన్ [రిపుల రాజకులేంద్రు లరే యనంగ]నున్. (౧౯)

భారతము-
తే.      నగరి భూపతి చీకుజనాలకాఁపు
వెలయుచున్ ధృతరాష్ట్రుఁడు బిట్టు భీష్మ
శరనికాయసహాయతఁ జక్కడంచె
రిపుల రాజకులేంద్రు లరే యనంగ. (౧౯)


టీక- చీకుజనాలకాఁపు = (రా) గ్రుడ్డిజనుల రక్షించువాఁడు, (భా) గ్రుడ్డివాఁడు, జనుల రక్షించువాఁడు; భీష్మ = (రా) భయంకరమైన, (భా) భీష్మునియొక్క; ధృతరాష్ట్రుఁడు = (రా) రాష్ట్రమును ధరించినవాఁడు; రాజకుల = (రా) రాజుల సమూహములో, (భా) చంద్రవంశములో; నికాయము = గుంపు.

18, జూన్ 2014, బుధవారం

సమస్యా పూరణం - 1448 (విప్రులఁ బూజించిన)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
విప్రులఁ బూజించిన నపవిత్రులు గారే.

పద్యరచన - 594

కవిమిత్రులారా,
మాస్కోలో హిందూ దేవాలయము
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

నిర్వచన భారత గర్భ రామాయణము - 3

సీ.      మారణమన్నట్టి మాటయే లేదన్నఁ
బొలబోన మనుమాటఁ దెలుపనేల
మత్తువస్తువులన్న మాటయే లేదన్నఁ
గలుషచిత్తులమాటఁ దెలుపనేల
చాటుమాటు తెఱంగు మాటయే లేదన్నఁ
దులువజారులమాటఁ దెలుపనేల
మేటిస్వార్థంబన్న మాటయే లేదన్నఁ
గులమతేర్ష్యలమాటఁ దెలుపనేల
తే. [పలుపలుకు లేల యచటి జను లనయము స్వ
ధర్మపథమునున్ వదలక తా]ల్మిని నయ
[మలరు గని యుందురు; పురము లలిఁ గళగళ
లాడుఁ దోటలన్ సరసులతో]డ మివుల. (౧౮)

భారతము-
కం.    పలుపలుకు లేల యచటి జ
ను లనయము స్వధర్మపథమునున్  వదలక తా
మలరు గని యుందురు; పురము
లలిఁ గళకళలాడుఁ దోటలన్ సరసులతో. (౧౮)


టీక- పొలబోనము = మాంసాహారము; అనయము = ఎల్లప్పుడు; నయము = నీతి; అలరు = సంతోషము.

17, జూన్ 2014, మంగళవారం

సమస్యా పూరణం - 1447 (రాముఁడు రావణుని మెచ్చి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
రాముఁడు రావణుని మెచ్చి రాజ్య మ్మొసఁగెన్.
ఈ సమస్యను సూచించిన అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు.

పద్యరచన - 593

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

నిర్వచన భారత గర్భ రామాయణము - 2

కథాప్రారంభము

రామాయణము-
ఉ.      శ్రీరమణీయమై [సిరులఁ జెంది వెలుంగును, జిష్ణువీటి]నిన్
మీఱి, యయోధ్యనా [గరిమ మించుచు బృథ్వి; నఖండహస్తి]ర
క్షోరిగృహంబె యా[పురియు నచ్చటి మేడలు వ్యోమ మంటు] మేల్
తోరఁపు ఖ్యాతితో [నగరి దూగుఁదులన్ హరినట్టుతోడ] దాన్.

భారతము-
తే.గీ.   సిరులఁ జెంది వెలుంగును, జిష్ణువీటి 
గరిమ మించుచు బృథ్వి; నఖండహస్తి
పురియు నచ్చటి మేడలు వ్యోమ మంటు
నగరి దూగుఁదులన్ హరినట్టుతోడ. (౧౭)


టీక- జిష్ణువీటిన్ = అమరావతిని; హరినట్టు = వైకుంఠము; హస్తిరక్షోరిగృహంబె = గజాసురుని విరోధియగు శివునిల్లు (కైలాసము); గరిమ = గొప్పదనము; వ్యోమము = ఆకాశము.

16, జూన్ 2014, సోమవారం

సమస్యా పూరణం - 1446 (కర్ణుఁ డెద్దు నెక్కి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
కర్ణుఁ డెద్దు నెక్కి కంసుఁ జంపె.

పద్యరచన - 592

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

నిర్వచన భారత గర్భ రామాయణము - 1

నిర్వచన భారత గర్భ రామాయణము
రావిపాటి లక్ష్మీనారాయణ

శా.     శ్రీనాళీకభవాండ మాకృతి, ధరిత్రీపాళి పాదంబు, మి
న్నే నాభిస్థలి, స్వర్గమే శిరము, చిచ్చే యాననాబ్జంబు, భ
వ్యేనేందు ల్గను, లాశలే చెవులు, గాడ్పే ప్రాణమౌ వేల్పు నే
కోనారాయణ యంచు ముక్తికొఱకై కోర్కిన్ ధృతిం గొల్చెదన్. (౧)

చ.      పలుకులబోటిఁ బొంది భువిపౌజు సృజించెడి బ్రహ్మ దానయై
కలుములచెల్వతోడుత జగమ్ములఁ బెంచెడి శౌరి దానయై
చలిమలకూఁతునుం గలిసి సర్వము ద్రుంచెడు శూలి దానయై
చెలువుగ దక్కు వేల్పులయి చెన్నగు నా యఖిలేశుఁ గొల్చెదన్. (౨)
టీక- పౌజు = గుంపు, మల = కొండ, శూలి = శివుఁడు.

సీ.      ఎవ్వానియాజ్ఞ మొయిళ్లు చిల్లులు పడ్డ
కరణినిఁ దృటి వాన గురియుచుండు,
నెవ్వానియాజ్ఞచే నెక్కక మిట్టలఁ
బల్లంబు జలమెప్డు పాఱుచుండు,
నెవ్వానియాజ్ఞచే నినశశితారక
లెప్పుడు తమచొప్పుఁ దప్పకుండు,
నెవ్వానియాజ్ఞచే నీ భూతవిసరంబు
పుట్టుచుఁ బెరుగుచు గిట్టుచుండు,
తే.      నెవఁడు నవ్వించు మఱలను నేడిపించు
నెవఁడు మట్టిలో సదయత నెఱ్ఱ మనుచు
నెవఁడు మొగ్గలకును రంగు లిడుచునుండు
నా మహామహు నఖిలేశు నాత్మ నెంతు. (౩)
టీక- విసరంబు = గుంపు, ఎఱ్ఱ = వానపాము.

కం.    విఘ్నేశ్వరుఁడయి దుష్టకృ
తఘ్నస్వార్థకపటకలితప్రబలోద్యో      
గఘ్నుఁడయి సుకార్యములకు
విఘ్నములనుఁ బాఱద్రోలు విభునిఁ దలఁచెదన్. (౪)

ఉ.      ఉల్లమునందు భక్తిని ఘనోరగగేహజు, వ్యాసు, దండి, ధీ
వల్లభుఁ గాళిదాసకవి, బాణుఁ గవిత్రయ భాస్కరేంద్రులం
బెల్లగు సోముఁ, బోతనను, బెద్దన, సూరన, మూర్తిఁ దిమ్మనన్,
మొల్లను, వేంకమాంబ మఱి పూర్వుల నిప్పటివారి నెంచెదన్. (౫)
టీక- ఉరగగేహజుఁడు = వాల్మీకి.

కం.    అనుమానానేకము దీ
ర్చిన మహితుఁడు దుగ్గరాజు సీతారామ
య్యనుఁ గొలుతు వెండి నిండుమ
తిని వేంకటపార్థసారథి కవులఁ దలఁతున్. (౬)

కం.    తెలియని శబ్దార్థము పె
ద్దల నడిగి గ్రహింపఁబోక తప్పని ధృతితోఁ
బలుకుచు నితరుల భావం
బులను హరించెడు కుకవులమూఁకఁ దెగడుదున్. (౭)

తే.      రామకథ నిర్వచనముగ వ్రాయుదుఁ, బ్రతి
పద్యమందున వేఱొక్క పద్యముండు,
నట్టి గర్భితములగు పద్యముల నెల్ల
వరుసతోడుతఁ జదువఁగా భారత మగు. (౮)

కం.    కలియుగ మఱవదివేల క
వల ముప్పది పయిని రెండవది, క్రీస్తుశకం
బొలయగఁ బదితొమ్మిది వం
దల ముప్పదియొకటిలో నొనరిచితిఁ దీనిన్. (౯)

తే.      శ్రీనగమున కీశాన్యంబు, కృష్ణకు శమ
నదిశ, గుంటూరుజిల్లాను నరసరావు
పేట తాలుకలోపల వెలయు రావి
పాఁడు స్వగ్రామమై నాకు వఱలుచుండు. (౧౦)

సీ.      భారతీయుండ, బాపండ నాపస్తంభ
సూత్రుండఁ గౌండిన్యగోత్రజుండ,
బండితాగ్రేసరమండలమునకు న
త్యధికవిధేయుండ, నాఱువేల
వాఁడను, ముత్తాత వఱలును జలమల
రాజనం, గొండలరాజు తాత,
కొండలరాజునకుం జలమయ్య య
ప్పయ్య నాఁ గలిగి రం దగ్రజుండు
తే.      చలమయకు సతి పిచ్చమ్మ వలనను జని
యించితిమి వేంకటప్పయ్య యేనును గురు
నాథ మనఁగ సుబ్బారా వనంగ నం ద
రయ ద్వితీయుండ లక్ష్మినారాయణుండ. (౧౧)

ఆ.వె.   విమలకథలని, నవవిధమని, బుద్బుద
యశమునకు పిరంగినైనఁ దలనుఁ
దూర్చు వీరువయసుతోనుంట, నీ కష్ట
సాధ్యకృతికి సాహసము సలిపితి. (౧౨)
టీక- బుద్బుదయశమునకు... వీరువయసు- షేక్సుఫియర్ (Shakesphere) యొక్క As you like it నాటకములోని మానవుని సప్తవయస్సుల (Seven ages of Man)లో సూచింపబడిన నాలవవయ్యస్సు “A soldier seeking the bubble reputation in cannon’s mouth”

తే.      ధరణిలోఁ “బ్రమాదో ధీమతామపి” యన
నల్పుఁడనుఁ జడమతిని నే ననఁగ నెంత
జలముల విడి పాలఁ గొను హంసలవిధమున
దప్పుల వదలి యొప్పులఁ దలఁప రయ్య. (౧౩)

*షష్ఠ్యంతములు*

కం.    ధీరునకున్ విదళితసం
సారునకు సమస్తవేదసారున కధికో
దారునకును విమలశుభా
కారున కుపమానరహితగంభీరునకున్. (౧౪)

కం.    ఘోరునకును నాగమసం
చారున కఘదూరునకును సచ్చిద్గుణవి
స్తారునకును సకలకలుష
హారికి నినశశిముఖాఖిలాధారునకున్. (౧౫)

కం.    ఆ యఖిలాధీశ్వరునకు
నా యమరేశునకు భక్తి నంకితమును నేఁ
జేయుదు; గర్భకవిత రా
మాయణభారతకథాక్రమం బెట్టిదనన్. (౧౬)

15, జూన్ 2014, ఆదివారం

చమత్కార పద్యాలు - 208 (భారత గర్భ రామాయణము)

నిర్వచన భారత గర్భ రామాయణము
రావిపాటి లక్ష్మీనారాయణ
మనకు పింగళి సూరన రచించిన రాఘవపాండవీయము, రామరాజభూషణుని  హరిశ్చంద్రనలోపాఖ్యానము, పిండిప్రోలు లక్ష్మణకవి రావణదమ్మీయము మొదలైన ద్వ్యర్థికావ్యాలు, అయ్యగారి వీరభద్రకవి రాఘవపాండవయాదవీయము, భట్టర బాలసరస్వతి రచించిన  రాఘవయాదవపాండవీయము మొదలైన త్ర్యర్థికావ్యాలు ఉన్నాయి.
నిర్వచనకావ్యాలు తిక్కననాటినుండి లెక్కకు మించి ఉన్నాయి.
చతుర్విధకవిత్వంలో గర్భకవిత్వం ఒకటి. ఒక పద్యంలో పెక్కుపద్యాలను ఇముడ్చడం గర్భకవిత్వం. ఇటువంటి గర్భకవిత్వం పూర్వకవుల కావ్యాలలో అక్కడక్కడ కనిపిస్తున్నది. గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వరవిలాసంలో కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. ఆధునికులలో చింతా రామకృష్ణారావు గారు గర్భకవిత్వంలో నిష్ణాతులు.
భారతగర్భరామాయణములో ఆద్యంతం గర్భకవిత్వమే. అందులోనూ ద్వ్యర్థి. పైగా నిర్వచనకావ్యం. గ్రంథంలో ప్రతిపద్యంలోను మరొక పద్యం గర్భస్థమై ఉంటుంది. మూలపద్యం రామాయణార్థం, గర్భస్థపద్యం భారతార్థం. ఇటువంటి కావ్యాలలో ఇదే మొదటిది, ఇప్పటివరకు ఇదే చివరిది.
దీనిని రచించిన కవి రావిపాటి లక్ష్మీనారాయణ. ఇతని స్వస్థలం గుంటూరు జిల్లా నరసరావుపేట తాలూకా రావిపాడు గ్రామం. గురిజాల డిస్ట్రిక్ట్ మున్సిఫ్ కోర్టులో గుమాస్తాగా ఉద్యోగం చేసేవాడు. తన ఇరవైమూడవ ఏట గ్రంథాన్ని రచించాడు. కావ్యం 1931లో రచింపబడింది.
మొత్తం 126 పద్యాలలో 16 పద్యాలు ఇష్టదేవతాప్రార్థన, సుకవిస్తుతి, కుకవినిరసన, కవిపరిచయము, కావ్యప్రసక్తి, షష్ఠ్యంతాలు పోను మిగిలిన 110 పద్యాలు నిర్వచన భారతగర్భరామాయణం.

రేపు పీఠిక. ఎల్లుండినుండి రోజుకొక పద్యం చొప్పున పరిచయం చేసుకుందాం. పద్యం చివర కవి ఇచ్చిన లఘు టీకా కూడా ఉంటుంది.