25, నవంబర్ 2025, మంగళవారం

సమస్య - 5315

26-11-2025 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శ్రావ్యగళస్వనమునన్ ఖరమె మేటి గదా”
(లేదా...)
“శ్రావ్యగళస్వనమ్మున ఖరమ్మున కెయ్యది సాటి వచ్చురా”

17 కామెంట్‌లు:

  1. ఉ.
    దివ్యము కాని, వీనులకు తీపులు పంపెడు రీతి కాని, స
    త్కావ్యము కాని, ముద్దుచిలుకల్ తగ పల్కెడు పల్కు కాని, సం
    భావ్యము కాని, హ్లాదముల పండగ జేయని రోతయైన య
    శ్రావ్యగళస్వనమ్మున ఖరమ్మున కెయ్యది సాటి వచ్చురా ?

    రిప్లయితొలగించండి
  2. అవ్యాజపు పల్కులనుట
    నే వ్యాపకములుగ నెంచి యెసకమునాడే
    ఈ వ్యతిరేకపు క్రీడను
    శ్రావ్యగళస్వనమునన్ ఖరమె మేటి గదా

    రిప్లయితొలగించండి
  3. తాళి కట్టు శుభవేళ అను పాట చివరలో గాడిద గొంతు ననుకరింపగ బాలుగారు అదియే మేటి కదా! అను భావముతో....

    కందం
    నవ్యత కోరఁగ శ్రోతలు
    సవ్యముగ స్వరానుకరణ సలిపెడు పాటన్
    భవ్యమొలుక 'బాలు' తుదిని
    శ్రావ్యగళస్వనమునన్ ఖరమె మేటి గదా!


    దివ్య గళంబునన్ జెలఁగి తీర్చిన పాటను బాలుగారలున్
    నవ్యముగా స్వరానుకరణంబును సల్పుచు నాలపించగన్
    భవ్యమనంగ సాగుచు రవమ్ములతో మురి పించఁగన్ తుదిన్
    శ్రావ్యగళస్వనమ్మున ఖరమ్మున కెయ్యది సాటి వచ్చురా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుదేవా! 'తాళికట్టు శుభవేళ' పాట అని పొరపాటున వ్రాశాను. 'కట్టుథలు చెప్పి నేను కవ్విస్తే'' అను పాటగా గమనించ మనవి.

      తొలగించండి
  4. భవ్యమెటులుండునో మరి
    సవ్యముగా లేదనునది జనులకు దెలుపన్
    అవ్యయముగ కూత నిడెడు
    శ్రావ్యగళస్వనమునన్ ఖరమె మేటి గదా

    రిప్లయితొలగించండి
  5. దివ్యము దాని రూపు వినుతింపఁగ చాలవు వేయి వక్త్రముల్
    నవ్యత గానవచ్చు వదనమ్మున చొక్కటముం గనుంగొనన్
    భవ్యము జీవనమ్ము పలు బట్టలు మూపునఁ దాల్చి మోయు సు
    శ్రావ్యగళస్వనమ్మున ఖరమ్మున కెయ్యది సాటి వచ్చురా

    రిప్లయితొలగించండి

  6. భవ్య వసంతములో యళి
    యవ్యయ గానము గనంగ నద్భుత మదియే
    శ్రావ్యమ్మన్న భువిని య
    శ్రావ్యగళస్వనమునన్ ఖరమె మేటి గదా.


    నవ్య వసంత కాలమున నల్దిశ లందు మనోహరమ్ముగా
    నవ్యయ మైన గానమగు శ్యామపు గాత్రమె లోకమందునన్
    శ్రావ్యమనంగనొప్పదె హిరణ్యద మందున గాంచి నంత య
    శ్రావ్యగళస్వనమ్మున ఖరమ్మున కెయ్యది సాటి వచ్చురా.

    రిప్లయితొలగించండి
  7. శంకరాభరణం సమస్య
    ••••• •••• •••• •••• •••• •••• ••••

    సమస్య - 25 / 11 / 2025
    **** **** **** **** **** **** ****

    శ్రావ్యగళస్వనమ్మున ఖరమ్మున కెయ్యది సాటి వచ్చురా”


    ఉత్పలము

    నవ్య కచేరులన్ గనగ నాణ్య తొకింతయు లేదు.స్పష్టతల్,

    శ్రావ్యత లేని రాగములు. శబ్దము కర్ణ కఠోరమైననున్

    సవ్యమటంచుఁ బల్కెదరు ఛాందస వాదులు. వారి దృష్టిలో

    శ్రావ్యగళస్వనమ్మున ఖరమ్మున కెయ్యది సాటి వచ్చురా


    ఆకుల శాంతి భూషణ్
    వనపర్తి

    రిప్లయితొలగించండి
  8. శ్రావ్యత పరిగణనముకై
    శ్రావ్యగళరవమనఁ గోకిలయె మేటి గదా
    శ్రావ్యత లోపంబన న
    శ్రావ్యగళస్వనమునన్ ఖరమె మేటి గదా

    శ్రావ్యగళస్వనమ్మున పసందుగ పాడగ సాటి లేనిదౌ
    దివ్య మనోజ్ఞ చేతనము తేకువ తోడ చెలంగు కోకిలే
    సవ్యము కాని సంగతము శ్రావ్యత యించుక లేనిదైన న
    శ్రావ్యగళస్వనమ్మున ఖరమ్మున కెయ్యది సాటి వచ్చురా

    రిప్లయితొలగించండి
  9. దివ్యము దాని స్వరూపము
    భవ్యము జీవనము, మోయు బట్టల నెపుఁడున్
    సవ్యముగా నోండ్రించఁగ
    శ్రావ్యగళస్వనమునన్ ఖరమె మేటి గదా

    రిప్లయితొలగించండి
  10. ఈమధ్య కొన్ని విధముల సంగీతము శబ్దకాలుష్యము కలుగ జేస్తూ తలపోటు తెప్పిస్తాయండి దానికంటే గార్దభ స్వరం నయమనిపిస్తుంది.

    కం॥ నవ్య సుసంగీత ఝరిని
    దివ్యమనఁ జెవులు వడఁకఁగఁ దెలివి సడలఁగన్
    భవ్యము పోల్చనని పలికె
    ”శ్రావ్యగళస్వనమునన్ ఖరమె మేటి గదా”

    ఉ॥ నవ్య సువాద్య గోష్ఠులను నాదము చీల్చఁగఁ గర్ణభేరినే
    దివ్యమటంచు సన్నుతుల దీటుగఁ బొందఁగఁ గంపితుండునై
    భవ్యమటంచు పోల్చి యిటు పల్కఁగఁ దప్పగునే తలంపఁగన్
    ”శ్రావ్యగళస్వనమ్మన ఖరమ్మున కెయ్యది సాటి వచ్చురా”

    రిప్లయితొలగించండి
  11. కం॥
    సవ్యము గానిదె నవ్యత,
    నవ్యతకైపరితపించు నవతరమునకున్!
    దివ్యంబుగవారందురు-
    "శ్రావ్యగళస్వనమునన్ ఖరమె మేటి గదా!!"

    రిప్లయితొలగించండి
  12. దివ్యముగా పాడేదనని
    నవ్యపు రాగాల తోడ నైజము జెడ గా
    సవ్యము గాదని పలికిరి
    శ్రావ్య గళ స్వన ము నన్ ఖర మె మేటి గదా!!?

    రిప్లయితొలగించండి
  13. వే వ్యయ మొనర్ప వినికిడి
    నవ్య గతిన్ దద్దఱిల్ల నరులకుఁ జెవులే
    సవ్యాపసవ్యము లహో
    శ్రావ్య! గళస్వనమునన్ ఖరమె మేటి గదా


    దివ్యముగాఁ దలంచి వసుదేవుఁడు గాడిద కప్డు మ్రొక్కి తా
    భవ్య తరమ్ముగాఁ బొగడె వారక యేఁగుచుఁ గార్య సిద్ధికై
    కావ్య చయాది పాఠములఁ గాంతుము వర్ణన లిట్టి భంగినిన్
    శ్రావ్యగళస్వనమ్మున ఖరమ్మున కెయ్యది సాటి వచ్చురా

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    దివ్యము సుశీల గానము
    శ్రావ్యగళస్వనమునన్; ఖరమె మేటి గదా
    సవ్యముగా మోసి బరువు
    ద్రవ్యముఁ గూర్చు యజమాని బ్రతుకుట
    కొఱకై.

    రిప్లయితొలగించండి
  15. కం: కావ్య రచన నే ఘనుడవు,
    కావ్యమ్మును పాడ కీవు, గాత్రము లో నే
    సవ్యత లేదే! పోల్చగ
    శ్రావ్యగళస్వనమునన్ ఖరమె మేటి గదా!

    రిప్లయితొలగించండి
  16. ఉ:దివ్యము గా సభన్ నడుప తీరుగ నొంటెలు ,గార్ధభమ్ములున్
    భవ్యము లౌ ప్రశంస లిడు భాషణ లందు ఖరమ్ము లన్నియున్
    "దివ్యము మీ స్వరూప" మని తీరుగ మెచ్చగ,నొంటె లిట్లనెన్
    "శ్రావ్యగళస్వనమ్మున ఖరమ్మున కెయ్యది సాటి వచ్చురా”
    (ఒంటెలు, గాడిదలు సమావేశమై పరస్పరం మెచ్చుకొన్నాయి. ఒంటెల అందాన్ని గాడిదలు మెచ్చుకొన్నాయి. గాడిదల గాత్రాన్ని ఒంటెలు మెచ్చుకొన్నాయి.ఇది ప్రాచీనకాలం లోనే ఉన్న ఒక హాస్యపు నానుడి.)

    రిప్లయితొలగించండి