11, డిసెంబర్ 2011, ఆదివారం

పద్యప్రాశస్త్యము

                             పద్యప్రాశస్త్యము



 సీ.
పద్యమ్ము పద్మసంభవ భామినీ విలా
          సాద్భుత రచనా మహత్త్వ ఫలము
పద్యమ్ము కవిరాజ వాక్సుధా వాహినీ
          వీచీ విలోల కవిత్వ మయము
పద్యమ్ము సముచిత పద గుంఫనోపేత
          రస విశేష పటుత్వ రాజితమ్ము
పద్యమ్ము శబ్దార్థ వైచిత్ర్య విన్యాస
          బాహుళ్య రుచిర సంపల్లలితము
తే.గీ.
సాహితీ నందనోద్యాన జనిత పారి
జాత సుమధుర సౌరభ సార కలిత
పద్యము మనోహరాకార వైభవమ్ము
భవ్య సౌవర్ణ భావ సౌభాగ్యవతికి 


మిత్రులారా!
           బమ్మెర పోతన గారు మహత్త్వ, కవిత్వ, పటుత్వ, సంపదల్ కోరేరు "అమ్మల గన్న యమ్మ" అనే తన ప్రార్థనలో. ఇవి క్రమముగా ఓం, ఐం, హ్రీం, శ్రీం అనే బీజాక్షరాలకి సంబంధించినవి. ఈ నాలుగు భావములను (మహత్త్వ, కవిత్వ, పటుత్వ, సంపదల్) పైన నేను చెప్పిన పద్యములో చేర్చేను. గమనించండి. అంటే మన కవిత్వము ఎంతో పవిత్రముగా ఉండాలని నా భావన. స్వస్తి.    
                  పండిత నేమాని రామజోగి సన్యాసి రావు
కవిమిత్రులారా,
          నేమాని వారి ‘పద్యప్రాశస్త్యము’ చదివారు కదా! పద్యం చచ్చిపోయిందన్న అపప్రథను తొలగించడానికి మనవంతు ప్రయత్నం మనం చేద్దాం. తెలుగు భాషాసాహిత్యాల గురించి కాని, పద్యకవితాసౌందర్యాన్ని గురించి కాని మీరూ పద్యాలు వ్రాసి పంపండి. ఆంధ్రపద్యకవిత్వం వర్ధిల్లాలి!

9 కామెంట్‌లు:

  1. పద్యములు వ్రాయ గలిగిన
    గద్యంబులు వ్రాయు టెంతొ కష్టము కాదూ
    హృద్యముగ వ్రాయు కొరకును
    నాద్యంతము దగు, మెలుకువ లవసర మగునున్

    రిప్లయితొలగించండి
  2. శ్రీ నేమాని వారూ ! మహత్వమైన, పటుత్వమైన పద్య కవిత్వ సంపద గురించి గొప్ప పద్యము చెప్పారు.

    రిప్లయితొలగించండి
  3. అయ్యా! పద్య ప్రాశస్త్యము శీర్షిక ప్రక్కన ఉన్న ఫోటో ఎవరిదో వ్రాయండి. నా ఫోటో నా రామాయణము పుస్తకము వెనుక అట్టపై ఉన్నది.

    రిప్లయితొలగించండి
  4. వెంకట రాజారావు . లక్కాకులఆదివారం, డిసెంబర్ 11, 2011 9:42:00 AM

    పండితుల వారు సార మతులు .వారి పద్యం పారిజాత సుమధుర సౌరభ సార సంకలితమే . సందేహం లేదు . అయినా ,

    మచ్చు కొక్క తెలుగు మాటైన గన రాదు
    తెలుగు పద్య మిచటి తీరు జూడ
    అరయ బోతరాజు 'అమ్మల గన్నమ్మ'
    తెలుగు పద్య మందు తెలుగు జూడు!

    రిప్లయితొలగించండి
  5. పలుకగ వచ్చు గాక బహు భంగుల నా కవితా విధానమున్
    తెలియని వారు హేళనగ, దేనికి నేనియు నొచ్చుకోను, నే
    తెలుగుననేని జెప్పుదును తేటపదంబులతోడ తీయగా
    సలలిత శబ్ద భావమయ సంస్కృత రీతులనేని సత్కృతుల్

    రిప్లయితొలగించండి
  6. తెనుగు భాష మధుర మైనదే.వ్యావహారిక భాషలో కావలసినంత సాహిత్యము లభ్య మవుతున్న యీ తరుణములో, సంస్కృతము పైన గ్రాంధిక భాష పైన సమరము అనవసరము. కావలసి నంత పదజాల మున్నప్పుడు అమ్మ,నాన్నలు మమ్మీ డాడీ లవుతున్నప్పుడు ఆంగ్లము లేక పోతే బ్రతుక లేమనే భావన ప్రబల మవుతున్నప్పుడు యీ తగవు అనవసరమే ! అచ్చ తెనుగు పై మక్కువ ఉన్న నేస్తులు తెనుగు పదముల నిక్కడ వెలుగు లోనికి తెస్తే మేము కూడా నేర్చు కొంటాము. తెనుగు చెప్పినా,సంస్కృతము చెప్పినా నాకిష్టమే !

    తెనుఁగు బాస యొడమిఁ దెలిపిరి తీయగా
    కడగి యడువ మాట నుడియు గాక
    తల్లి సంస్కృతంబె తగవేల పలుకగా
    చిడుగు గాదు నుడువ చెలువు మీఱ !

    ఒడమి = సంపద ; అడువ = పురాతనము,ప్రాత ; ఉడి = వ్యర్ధము
    చిడుగు = తక్కువ ; చెలువు = అందము

    రిప్లయితొలగించండి
  7. శంకరార్యా ! చక్కని పద్యం ! ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  8. ఆ ఫోటో కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారిది.

    రిప్లయితొలగించండి