6, అక్టోబర్ 2013, ఆదివారం

ఆశీర్నవరత్నములు


శ్రీ గన్నవరపు వరాహ నరసింహ మూర్తి, నాగమణి దంపతుల జ్యేష్ఠ కుమారుఁడు
చి|| భార్గవ నారాయణ మూర్తి
శ్రీ పరిగె వెంకట లక్ష్మీనరసింహ సుధాకర్, సుందరి లక్ష్మి దంపతుల కుమార్తె
చి||||సౌ|| హారిక
శుభ వివాహ మహోత్సవము
ది. ౧౨-౧౦-౨౦౧౩ (శనివారం) నాడు జరుగుచున్న సందర్భమున సమర్పించిన
ఆశీర్నవరత్నములు

శ్రీసుదతీలలామ నెదఁ జేర్చి జనావళిఁ గాచు శౌరి; గౌ
రీ సతికిన్ సగంబుగ శరీరము నిచ్చిన శంభుఁడున్; మనో
ల్లాసముగాఁ జతుర్ముఖములన్ శుభవాణినిఁ దాల్చు ధాత మీ
కీ సమయంబునన్ శుభము లెన్నియొ కూర్తు రొసంగి దీవెనల్.

గన్నవరపువంశాబ్ధి రాకావిధుఁడు
రాహ నరసింహ మూర్తిసార సుగుణఖని
యతని సతి నాగమణిసాధ్వి హిత గుణాఢ్య
యలరి రాదర్శదంపతులై నిరతము.

వారల తనయుఁడు భార్గవ
నారాయణ మూర్తిసద్గుణవ్రాత శుభా
కారుండై మోదం బే
పారఁగ కళ్యాణకళల వరుఁడై నెగడెన్.

పరిగెసదన్వయ ముఖ్యుఁడు
పెరిమ గలిగి కీర్తిఁగన్న వెంకట లక్ష్మీ
నరసింహ సుధాకర్, సుం
దరి లక్ష్మీదంపతుల తనయ హారికయే.

కవి పండిత జన సందో
హ వరాశీస్సుల మహిమను హారికతో భా
ర్గవ నారాయణ మూర్తి శు
భ వివాహపు వేడ్క కనుల పండుగ జేయున్.

కంటి కింపగు కళ్యాణ మంటపమున
హితులు బంధువుల్ మంగళాక్షతలఁ జల్లి
శుభ సుఖంబుల జీవన శోభ నంద
దీవెనల నీయ మీ జంట దీప్తినందు.

కలకాలము మీ రిద్దరు
కలసి మెలసి జీవితమును గడుపుచు పతి ప
త్నులు మిత్రులుగా కష్టం
బుల సుఖములఁ దోడయి శుభముల నందవలెన్.

ఎల్లప్పుడు మీ జంటకు
నెల్లలు లేనట్టి సుఖ సహిత విభవంబుల్
కొల్లలుగ నందవలెనని
యుల్లంబునఁ గోరుకొందు నొప్పుగ నెపుడున్.

సరిలేని శుభ సుఖంబుల
సిరు లన్యోన్యతను పొంది చిరకాలము సు
స్థిర దాంపత్యముతో మీ
రిరువురు సత్కీర్తి నంది హిత మందవలెన్.

సమర్పణ
శంకరాభరణం
కంది శంకరయ్య

6 కామెంట్‌లు:

  1. కనువిందు చేయు కవకున్
    మనమలరగ చేయు పద్య మణి హారంబున్
    బొనరించి యిచ్చె దీవెన
    లను మన శ్రీ శంకరయ్య ప్రమదం బెసగన్

    రిప్లయితొలగించండి
  2. శ్రీగురుభ్యోనమ:

    నవదంపతులే మ్రొక్కగ
    కవిపండిత పూజితుండు కంది గురుండున్
    నవరత్నంబులనొసగిరి
    శివపార్వతి రూపుడైన శ్రేష్టుండతడే

    రిప్లయితొలగించండి
  3. నవరస భరిత మైన నవరత్న ములతో ఆశీర్వ దించిన గురువులకు ప్రణామములు

    రిప్లయితొలగించండి
  4. శ్రీ గురుభ్యో నమః ! మాపై యెంతో కృపతో మా , చి.ల.సౌ. హారికమ్మను, చి. భార్గవ నారాయణ మూర్తిని కమనీయమైన పద్యాలతో ఆశీర్వదించిన, గురువరేణ్యులు శ్రీ కంది శంకరయ్య గారికి , అన్నయ్య గారు శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారికి,అక్కయ్య గారికి, మాన్యశ్రీ కవివరేణ్యులకు, మిత్ర బృందమునకు , మా దంపతుల కృతజ్ఞతా పూర్వకాభివందనములు. చి. భార్గవ, చి. సౌ. హారిక , శ్రీ పరిగె సుధాకర్ గారు, శ్రీమతి పరిగె సుందరి లక్ష్మి గారు కూడా తమ తమ ధన్యవాదములను తెలుపమని చెప్పారు. అందరికీ మరో పర్యాయము కృతజ్ఞతలు !

    రిప్లయితొలగించండి
  5. పండిత నేమాని వారూ,
    శ్రీపతి శాస్త్రి గారూ,
    రాజేశ్వరి అక్కయ్యా,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి