18, ఆగస్టు 2025, సోమవారం

సమస్య - 5217

19-8-2025 (మంగళవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“దండముఁ గని శాత్రవుండు దండము వెట్టెన్”

(లేదా...)

“దండముఁ గాంచి శాత్రవుఁడు దండము వెట్టుచు వెన్నుఁ జూపెరా”

28 కామెంట్‌లు:

  1. ఉ.
    చండ పయోనిధి ప్రభవ సంభ్రమదోర్మి విధాన కోపియై
    కండల పెంపుచే మురిసి కచ్చలు తీర్చుకొనంగ వేగమై
    పండిన పండ్ల తోటకును వచ్చి పదంబిడ నాదమేయ వే
    దండము గాంచి శాత్రవుడు దండము వెట్టుచు వెన్ను జూపెరా !

    రిప్లయితొలగించండి
  2. భండన వేళ బెగడువడి
    దండింపగ తరలివచ్చి దశరథసుతుడే
    చెండుననుచు రాముని కో
    దండముఁ గని శాత్రవుండు దండము వెట్టెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తండిరి పంపఁ యజ్ఞమును ధ్వంసమొనర్చెడు రాక్షసాళినే
      చెండగ వచ్చెదాశరధి చెంతను లక్ష్మణుడుండ తోడుగా
      హుండుడు బింకమున్ విడిచి హోమగుహేరుడు రాముడెత్తు కో
      దండముఁ గాంచి శాత్రవుఁడు దండము వెట్టుచు వెన్నుఁ జూపెరా

      తొలగించండి
    2. మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  3. కందం
    చెండెడు వారిగ రాముని
    నిండుగ మారీచుఁడెంచి నిల్చుచు మృగమై
    కొండలఁ బడి రాముని కో
    దండముఁ గని శాత్రవుండు దండము వెట్టెన్!


    ఉత్పలమాల
    చెండును రావణాసురుఁడు చెప్పిన కార్యము చేయకున్నచో!
    గండము తప్పదే తనకు కార్యము నెంచిన రాము చేతిలో!
    రెండవదెంచి రాక్షసుడు లేడిగ మారుచు రాము చేత కో
    దండముఁ గాంచి శాత్రవుఁడు దండము వెట్టుచు వెన్నుఁ జూపెరా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సవరింపబడిన కందం:

      కందం
      చెండెడు వానిగ రాముని
      నిండుగ మారీచుఁడెంచి నిల్చుచు మృగమై
      కొండలఁ బడి రాముని కో
      దండముఁ గని శాత్రవుండు దండము వెట్టెన్!

      తొలగించండి
  4. పండుకొనెనని తలంచుచు
    భండారము దొంగిలించ వచ్చిన వాడై
    అండన నుంచుకొనిన యా
    దండముఁ గని శాత్రవుండు దండము వెట్టెన్

    రిప్లయితొలగించండి
  5. భండన భీముడార్తజన పాలిటి
    రాముని కోసలేశునిన్
    మెండుగ రాజ్యపాలనము మేదిని
    మెచ్చగ జేసినట్టి యు
    ద్ధండుని దుష్ట రాక్షసుల దర్ప
    మడంచిన రామమూర్తి కో
    దండము జూసి శత్రువుడు దండము
    వెట్టియు వెన్ను జూపెరా.

    రిప్లయితొలగించండి
  6. భండన భీముఁడై చెలఁగి వైరిగణమ్ములు భీతినొంద ను
    ద్దండ బలప్రతాప సముదంచిత తేజముతో రణమ్మునన్,
    బెండువడంగ ప్రద్విషుల బింకము, పార్థుని కోల్మసంగు కో
    దండముఁ గాంచి శాత్రవుఁడు దండము వెట్టుచు వెన్నుఁ జూపెరా

    రిప్లయితొలగించండి

  7. *(రావణునితో మారీచుని మాటలుగ)*

    భండన భీముడు రాముడు
    దండిమగండతడు గాదె తాటకి కిట పు
    త్రుండ, వచింతు నతని కో
    దండముఁ గని శాత్రవుండు దండము వెట్టెన్.



    *(హనుమంతుడు రావణునితో రాముని గొప్పతనముగురించి తెలుపుట)*

    దండిమగండు వాడు కడు ధైర్యము గల్గినవాడు గాంచగన్
    భండన భీముడై మునుల భద్రత గూర్చిన వాడు రామభ
    ద్రుండు నిజమ్ము నీవికను తోయలి జానకి వీడు వాని కో
    దండముఁ గాంచి శాత్రవుఁడు దండము వెట్టుచు వెన్నుఁ జూపెరా.

    రిప్లయితొలగించండి
  8. దండకవన మునిజనమున
    కండగ శ్రీరామచంద్రు డసురాధములన్
    ఖండించగ నెత్తిన కో
    దండముఁ గని శాత్రవుండు దండము వెట్టెన్

    రిప్లయితొలగించండి
  9. చెండగ రణమున దూకియు
    మెండుగ శరములను వాడి మించిన కూడా
    దండుగ యని తలచి యు కో
    దండము గని శాత్రవుండు దండము వె ట్టె న్

    రిప్లయితొలగించండి
  10. దండముఁ గొని వాయుసుతుఁడు
    బెండువడఁగ వైరివరుల బింకంబనిలో
    భండనమున నెక్కఁగ వే
    దండముఁ గని శాత్రవుండు దండము వెట్టెన్

    రిప్లయితొలగించండి
  11. కం:గండర గండడు రాణా
    కండగ మత్తేభ ముఖపు టశ్వము నిల్వన్
    నిండగు నా కృత్రిమ వే
    దండముఁ గని శాత్రవుండు దండము వెట్టెన్”
    (రాణా ప్రతాప్ సింగ్ కి చేతక్ అనే గుర్రం ఉండేది.రాణా దానికి తోలు తో ఏనుగు తుండాన్ని పెట్టి అది గుర్రమో,ఏనుగో తెలియకుండా భ్రమ కల్గించే వాడు.దాని ఠీవి,శౌర్యం చూసి అక్బర్ దణ్నం పెట్టాడు.ఈ కథ ఒకటి ప్రచారం లో ఉంది.)

    రిప్లయితొలగించండి
  12. (సాధ్యమైనంత వరకు నేటి స్థితిగతులకన్వయించి వ్రాయాలని నాప్రయత్నమండి)

    కం॥ మెండుగ నుగ్రత్వ మొదవి
    పండిన దుష్టుల రిపులను బరిమార్చుటకై
    నిండగు వ్యూహముఁ గైకొన
    దండముఁ గని శాత్రవుండు దండము వెట్టెన్

    ఉ॥ అండగ న్యాయవాదులటు లాసర నీయఁగ రెచ్చిపోవుచున్
    మెండుగ నుగ్రవాదమును మిక్కిలి క్రూరతఁ జూపు వానికిన్
    గుండెలు న్యాయ సంహితపు గూఢతఁ దెల్పఁగ జారిపోవఁగన్
    దండముఁ గాంచి శాత్రవుఁడు దండము వెట్టుచు వెన్నుఁ జూపెరా

    దండము శిక్ష
    IPC ని మార్చి భారతీయ న్యాయసంహితము చేసారు

    రిప్లయితొలగించండి
  13. ఉ:దండి మగండు భీముని గదాహతి యెట్టిదొ నేర నట్లు మూ
    ర్ఖుండగు నొక్క కౌరవుడు రోషము తో నెదిరించ జూడ నా
    చండుడు భీముడొక్క కరి జంపెను,చచ్చిన యట్టి మత్తవే
    దండముఁ గాంచి శాత్రవుఁడు దండము వెట్టుచు వెన్నుఁ జూపెరా!
    (భీముని బలం ఏమిటో తెలియని వాడి లాగా ఒక కౌరవుడు ఎదిరించటానికి వచ్చాడు.ఆ సమయానికే భీముడు ఒక ఏనుగుని చంపాడు.అది చూడగానే ఆ కౌరవుడు పారి పోయాడు. ఆ కౌరవుడు ఎవరు? అంటే భీముడి చేతిలో చచ్చిన నూరుగురిలో ఎవడో ఒక కౌరవుడు.అనామకుడు.)

    రిప్లయితొలగించండి
  14. పాండుర దేహార్తుండై
    ఖండిత నిజ సర్వ సైన్య కౌశికుఁ డనిలో
    భాండోద్భవు బ్రహ్మాభిద
    దండముఁ గని శాత్రవుండు దండము వెట్టెన్


    దండ ధరాభ విక్రముని దండిత వైరి సమూహు ప్రజ్వల
    ద్భండన భీము పౌర జన బాంధవు దార్ఢ్య త రాయ సాభ దో
    ర్దండ విరాజమాను నుత ధర్మ చరిత్రుని రాఘవేంద్రు కో
    దండముఁ గాంచి శాత్రవుఁడు దండము వెట్టుచు వెన్నుఁ జూపెరా

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    పాండవ మధ్యముడు నరుడు
    చెండుచు శత్రువులనెల్ల చేయుచు రణమున్
    గుండెలు చీల్చు నతని కో
    దండముఁ గని శాత్రవుండు దండము వెట్టెన్.

    రిప్లయితొలగించండి