27, మార్చి 2026, శుక్రవారం

సమస్య - 5421

28-3-2026 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వ్రాసిన సత్కవిత శృంగభంగమ్మె యగున్”
(లేదా...)
“వ్రాసెద సత్కవిత్వమను వానికిఁ దప్పదు శృంగభంగమే”

16 కామెంట్‌లు:

  1. కందం
    దాసుడె గతమున నేతకు
    మోసము లన్నింటి నెఱుఁగు ముఖ్యుడనంగన్
    గాసిలి సకలము దెలుపుచు
    వ్రాసిన సత్కవిత శృంగభంగమ్మె యగున్

    ఉత్పలమాల
    దాసునిగా చరించి మును దాడులఁ జేసియు నేతకోసమై
    మోసము లెన్నియో సలిపి భూరిగ సంపద గూడఁ బెట్టియున్
    గాసిలి మీదటన్ దుదకు కల్మషమెల్ల జగంబెఱుంగగన్
    వ్రాసెద సత్కవిత్వమను వానికిఁ దప్పదు శృంగభంగమే!

    రిప్లయితొలగించండి
  2. ఆసక్తి జుపి పగతుని
    మీసముపై మచ్చిక గొని మేలగు రీతిన్
    వాసి బడయు విధముగనే
    వ్రాసిన సత్కవిత శృంగభంగమ్మె యగున్

    రిప్లయితొలగించండి

  3. కాసుల నాశించుచు పీ
    నాసి ప్రభువు జేరి మిగుల నైపుణ్యముతో
    వాసుర లో పేద కవియె
    వ్రాసిన సత్కవిత శృంగభంగమ్మె యగున్.


    వ్రాసిరి పూర్వ మందె కవి వర్యులు రమ్యత గన్న కావ్యముల్
    వాసుర మందు గాంచ నవి ప్రాకట మై వెలుగొందు చుండగా
    వాసి నుతించు రీతిగను వాటిని మించు విధమ్ము నన్ భువిన్
    వ్రాసెద సత్కవిత్వమను వానికిఁ దప్పదు శృంగభంగమే.

    రిప్లయితొలగించండి
  4. మోసపు నేత వడిన్ గా
    జేసిన సొత్తు వివరములు చెప్పదలచినన్
    జేసిన యత్నంబు వృథా
    వ్రాసిన సత్కవిత శృంగభంగమ్మె యగున్

    మోసము సల్పగా పొగరు బోతుకు పెత్తనమే లభింప కా
    జేసిన సొత్తుపై కవిత చెప్పి విమర్శకు పూనుకొన్నచో
    దూసెద కత్తులంచు మరి దుష్టునిపై గుఱివెట్టి పొల్పునన్
    వ్రాసెద సత్కవిత్వమను వానికిఁ దప్పదు శృంగభంగమే

    రిప్లయితొలగించండి
  5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  6. పాసిక రవముల మెచ్చుచు
    కీసర లంఘనమె నచ్చు కలుషిత సభలన్
    శ్రీసుమ గంధము గొనరు
    వ్రాసిన సత్కవిత శృంగభంగమ్మె యగున్!

    రిప్లయితొలగించండి
  7. కం:నీ సరస కవిత జూపగ
    నాస పడుచు తడవు జేయ కవధానివరా!
    గోస బడి మనము నందున
    వ్రాసిన సత్కవిత శృంగభంగమ్మె యగున్
    (అవధానం లో ఆశువు చెప్పేటప్పుడు చాలా సరస మైనది చెప్పాలని మనస్సులో రాసుకుంటూ కూర్చో కూడదు. అక్కడ సరసత కంటే వేగం ముఖ్యం. )

    రిప్లయితొలగించండి
  8. వాసము నందునే సతము బంధుర తోడుత కుల్కుచున్ సదా
    సీసల కొద్ది త్రాగి సుర చిందులు వేయుచు ధర్మ భాగినిన్
    గాసిల బెట్టు నీచుని జగంబున ప్రస్తుతి జేయ వానిపై
    వ్రాసెద సత్కవిత్వమను వానికి దప్పదు శృంగభంగమే

    రిప్లయితొలగించండి
  9. ఉ॥ రోసిరి ప్రాత పద్ధతుల లోపము నెక్కడ యున్నదో కదా!
    వాసిగ చింకి బట్టలను భవ్యమటంచు ధరించి మెచ్చిరే!
    దాసులమంచు స్థాయికుడు దైవ సమానుఁడనంగ నొప్పిరే
    వ్రాసెద సత్కవిత్వమను వానికిఁ దప్పదు శృంగ భంగమే!

    స్థాయికుడు అధికారి (చింకి బట్టలు పైమోజు. పైఅధికారికిని దైవము రీతిగ కొల్చేవారికే వెసులుబాటు. అలాంటి చోట సత్కవిత్వమునకు విలువ ఉండదని)

    రిప్లయితొలగించండి
  10. చూసిన వన్నియు మనసున
    వాసిగ నిలిపియు కవితగ ప్రభావించ o గా
    భాసము నొందాక నట్టివి
    వ్రాసిన సత్కవిత శృంగ భంగ మ్మె యగున్

    రిప్లయితొలగించండి
  11. భాసురముగ ఘోరాటవిఁ
    బూసిన పూవుల విధమ్ము పూర్ణము విద్యా
    భ్యాసము లేని జగమ్మున
    వ్రాసిన సత్కవిత శృంగ భంగమ్మె యగున్


    కాసులు పెక్కు లున్న వని గర్వము నూని వచింప నొప్పునే
    బాస నెఱింగి క్షుణ్ణముగఁ బల్కిన దోస మొకింత యుండునే
    వాసికి నెక్క లోకమునఁ బాండితి లేక సభాంతరమ్మునన్
    వ్రాసెద సత్కవిత్వ మను వానికిఁ దప్పదు శృంగ భంగమే

    రిప్లయితొలగించండి
  12. వాసిగ వెలయును కావ్యము
    వ్రాసిన పదగుంఫనముల ప్రన్నదనముతో
    దోసఁపు వ్యాకరణమ్మున
    వ్రాసిన సత్కవిత శృంగభంగమ్మె యగున్

    దోసములేమి లేక పరితోషముఁ గూర్చెడు రీతి కావ్యమున్
    వ్రాసిన సత్కవీశ్వరుఁడు భాసిలు కావ్యము శ్లాఘనీయమౌ
    కాసులు కూడగట్టుటయె కర్జముగా నుపఘాతమౌ విధిన్
    వ్రాసెద సత్కవిత్వమను వానికిఁ దప్పదు శృంగభంగమే

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    మోసము జేయుచు మరొకరు
    వ్రాసిన కవిత తనదనుచు వాసికి నెక్కన్
    మోసము బయటపడగ కవి
    వ్రాసిన సత్కవిత శృంగభంగమ్మె యగున్.

    రిప్లయితొలగించండి
  14. కాసులనొసగుచు పరులిల
    వ్రాసినరచనలనుతమదుపాటవమనుచున్
    కోసిన కోతల నవ్విధి
    *"వ్రాసిన సత్కవిత శృంగభంగమ్మె యగున్”*


    ప్రాసలు వాడకుండ యతులన్ తగుచోటుల కూర్చకుండగన్
    నాసిరకమ్ముగా తనకు నచ్చిన యట్టుల వ్రాయుచెప్పుడున్
    దోసములెంచిచూపినను త్రోయుచు నావల బుద్ధిహీనుడై
    వ్రాసెద సత్కవిత్వమను వానికి దప్పదు శృంగభంగమే

    రిప్లయితొలగించండి
  15. వాసిగ పూర్వకావ్యముల ప్రాకటమౌ గతి నేర్చి యిచ్చతో
    బాసకు వన్నె తెచ్చుచు నవారితమైన మనీష తోడుతన్
    దోసపు వృత్తితో మెలగు ధూర్తపు నేతల మెచ్చకున్నచో
    వ్రాసెద సత్కవిత్వమను వానికి దప్పదు శృంగభంగమే

    రిప్లయితొలగించండి