15, మే 2026, శుక్రవారం

సమస్య - 5468

16-5-2026 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“దోమ మ్రింగె నొక్క సామజమును”

(లేదా...)

“మ్రింగెను దోమ యేనుఁగును మిక్కిలి యాఁకలిఁ గొన్నదై వడిన్”

24 కామెంట్‌లు:

  1. ఆటవెలది
    ఇచ్చిపుచ్చుకొనఁగ నెంచఁగఁ జరవాణి
    మోసకారులతని ధ్యాసమార్చి
    దూరి కోట్లధనము దోచినారను రీతి
    దోమ మ్రింగె నొక్క సామజమును!

    ఉత్పలమాల
    రంగమునందునన్ దిగిరి రాక్షసులెందరొ కళ్లుఁగప్పుచున్
    దొంగిల కోట్ల విత్తమును దూరుచు నా చరవాణి క్రీడలం
    దంగిట నున్న నేమరిచి యబ్బురమొందగ దోచురీతిగన్
    మ్రింగెను దోమ యేనుఁగును మిక్కిలి యాఁకలిఁ గొన్నదై వడిన్

    రిప్లయితొలగించండి
  2. పార్టి పెట్టి విజయ పంచ వర్షములు
    మంత్రి పదవి చేయు మహిత నేత
    నోడ జేసె నౌర యోహో!యనగనవ్య
    దోమ మ్రింగె నొక్క సామజమును!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాగుంది.
      "పంచవర్షమ్ములు" అనండి. లేకుంటే గణభంగం. 'నవ్యదోమ' వైరి సమాసం.

      తొలగించండి
    2. పార్టి పెట్టి విజయ పంచ వర్షమ్ములు
      మంత్రి పదవి చేయు మహిత నేత
      నోడ జేసె నౌర యోహో!యనగ చిన్న
      దోమ మ్రింగె నొక్క సామజమును!

      తొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  4. కంటివి గద యిటుల కలలయం దున నేడు
    " దోమ మ్రింగె నొక్క సామజమును "
    జేయలేని దైన జేయుచునుండుట
    జరుగబోవు ననుచు సైగ యిదియ

    రిప్లయితొలగించండి
  5. పేరు మోసి నట్టి పెద్ద నేత కెదురు
    పోటి చేసి గెలువ మేటి యనుచు
    జన త పొగడి వాని సంతస మున పల్కె
    దోమ మ్రింగె నొక్క సామ జమును

    రిప్లయితొలగించండి
  6. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి.
      'భారికి'?
      "జింకకును.." అనండి. 'పేరు + ఏనుగే' అన్నపుడు యడాగమం రాదు. "పేరె యేనుగౌ" అనండి.

      తొలగించండి
    2. సామజమను పేరు చక్కని జింకది
      భారి కొసగి నట్టి పేరు దోమ
      చిన్న పిల్ల వాడు సెప్పెనీ విధముగా
      దోమ మ్రింగె నొక్క సామజమును

      [ భారి = సింహము ]

      బంగరు వన్నె జింకకును బాలకు డిచ్చిన పేరె యేనుగౌ
      చెంగట నున్న కేసరికి శీఘ్రమె దోమ యటంచుఁ బేరిడెన్
      సింగము చంపె జింక నని చెప్పగ నెంచి వచించె నిట్టులన్
      మ్రింగెను దోమ యేనుఁగును మిక్కిలి యాఁకలిఁ గొన్నదై వడిన్

      ధన్యవాదాలు గురూజీ 🙏

      తొలగించండి

  7. సామగర్భు డతడె సర్వోప గతుడంచు
    పలుకు సుతుడె తనకు ప్లవుడటంచు
    జంప బోయి తాను చచ్చుట గాంచగా
    దోమ మ్రింగె నొక్క సామజమును.


    సంగుడె యాది దైవమని సత్య మతండని పల్కు పుత్రుడే
    గొంగ యటంచు నెంచి ప్రతికూలుని చంపగ బూన నేమిరా
    భంగ పడెన్ గదా యట ప్రవాహికుడే పరలోక మేగుటే
    మ్రింగెను దోమ యేనుఁగును మిక్కిలి యాఁకలిఁ గొన్నదై వడిన్.

    రిప్లయితొలగించండి
  8. ఆ॥వె
    జనుల కొక్కమారు జళుకునింపుసరళి
    దోమస్వరమునందుదొరలుబాణి!
    అడపదడప మదిని యనిపించునక్కటా
    దోమ మ్రింగెనొక్క సామజమును!!

    (సామజము: సామవేదము నుండి సంగీతము పుట్టినది అనికదా ప్రతీతి)

    రిప్లయితొలగించండి
  9. తే.గీ:అలతి యయ్యు తానె యతిభయంకర మైన
    దోమ మ్రింగె నొక్క సామజమును
    గుట్టి రక్త మింత, గుట్టుటయే కాక
    గ్రిముల వదలి జబ్బు రేపి పోయె

    రిప్లయితొలగించండి
  10. ఉ:చెంగట నున్న జంతువుల జీదర వెట్టుచు రోగరాశి తో
    గ్రుంగగ జేయు జీవి యయి కొంచెపు దేహము గల్గియున్ కటా
    మ్రింగెను దోమ యేనుఁగును మిక్కిలి యాఁకలిఁ గొన్నదై వడిన్
    భంగము జేసి నిద్ర తన ప్రజ్ఞను జూపుచు రక్తలేశమున్.

    రిప్లయితొలగించండి
  11. ఉ॥ సంగతిఁ దెల్పఁగన్ విజయ సారథియై విజయుండు నత్తఱిన్
    గ్రుంగఁగఁ జేయ నెన్నికలఁ గుంజర సామ్యపు యోధులెల్లరన్
    జెంగున నోటమిన్ గనఁగఁ జేయుచు నెల్లరుఁ బల్కిరీవిధిన్
    మ్రింగెను దోమ యేనుఁగును మిక్కిలి యాఁకలిఁ గొన్నదై వడిన్

    రిప్లయితొలగించండి
  12. దైవ లీల లద్భుతమ్ము లగు నిలిచి
    సవ్యసాచికి సరసన శిఖండి
    తాతఁ గూల్చె నాజి దర్శనము నొసంగి
    దోమ మ్రింగె నొక్క సామజమును


    పొంగఁగ రాదు ప్రాణులకు భూరి బలమ్ము సెలంగ నెన్నఁడుం
    బ్రాంగణ మందు నుండఁగను బల్లిదు నక్కట దోమ కుట్టఁగా
    భంగము కాఁగ దేహమున స్వాస్థ్యము కూలెను వింత వ్యాధితో
    మ్రింగెను దోమ యేనుఁగును మిక్కిలి యాఁకలిఁ గొన్నదై వడిన్

    రిప్లయితొలగించండి
  13. భంగము చేసి నాయకుని స్వార్థపరుల్ గొన పెత్తనమ్ము మం
    త్రాంగము చేసి దోచుకొని దాచుకొనన్ మనుజాళి భూతి, నా
    భంగి నెరింగి యోట్లుకొన బల్లిదు డోడగ, పల్కి రెల్లరున్
    ‘మ్రింగెను దోమ యేనుఁగును మిక్కిలి యాఁకలిఁ గొన్నదై వడిన్’

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    రాత్రిపూట నరుని రక్తమున్ పీల్చుచు
    దోమ మ్రింగె; నొక్క సామజమును
    పట్టుకొని మకరము బాధపెట్టుచు నుండ
    మురహరుండు చంపె మొసలి నపుడు.

    రిప్లయితొలగించండి