19, జనవరి 2026, సోమవారం

సమస్య - 5356

20-1-2026 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఆయనకు నేవురైరి రామాయణమున”
(లేదా...)
“రంగా యాయన కేవురైరి గదరా రామాయణం బందునన్”
(భరతశర్మ గారి శతావధానంలో జంధ్యాల సుబ్బలక్ష్మి గారి సమస్య)

12 కామెంట్‌లు:

  1. దశరథునికి మూవురు కళత్రములు కలుగ‌ ,
    చక్కటి ప్రతిపాలనమును సలుపుటకయి
    పుత్రులు నలుగురును దన పుడమి కూడి
    “యాయనకు నేవురైరి రామాయణమున

    రిప్లయితొలగించండి
  2. తల్లి తొలిగురువు, గురువు దశరథుండు,
    మునివశిష్టుడు, గాధిజముని గురువులు
    కూడగా నగస్త్యుం డెంచ గురుపథమున
    నాయనకు నేవురైరి రామాయణమున

    రిప్లయితొలగించండి
  3. సీత సతిగను లక్ష్మణోపేతమగుచు
    భరత శత్రుఘ్నలన్ గూడి పరగుచుండి
    యాంజనేయుని బంటుగా నలరుకతన
    నాయనకు నేవురైరి రామాయణమున!

    రిప్లయితొలగించండి

  4. తనయులు నలువురును గల దశరథునకు
    పిరిమి తోడ పెంచుకొనిన బిడ్డ యొకతి
    శాంతను గలిపి గణియింప సవము లుగను
    నాయనకు నేవురైరి రామాయణమున.


    కంగారేల వినంగ పంక్తిరథు సత్గాథన్ సుతుల్ నల్వురా
    సింగారమ్మది హెచ్చుగా గలుగు నా జిన్నారులే యుండగా
    సంగంబందున పుత్రికై నిలుచునా శాంతమ్మ లెక్కింపగా
    రంగా యాయన కేవురైరి గదరా రామాయణం బందునన్.

    రిప్లయితొలగించండి
  5. రామ లక్ష్మణ సుగ్రీవ సామరస్య
    మమర సుగ్రీవ సచివులే తమను జేర
    వానరాగ్రగణ్యుల సంఖ్య వలనుమీఱ
    నాయనకు నేవురైరి రామాయణమున

    శృంగారాకృతి కల్గియున్న విభుడౌ శ్రీరామ భద్రుండతో
    లాంగూలమ్ములఁ గల్గియున్న తతికిన్ రాజైన సుగ్రీవుడే
    సాంగత్యమ్మును గోరె వాని సచివుల్ సంగాతి బృందాన జే
    రంగా యాయన కేవురైరి గదరా రామాయణం బందునన్

    రిప్లయితొలగించండి
  6. తే॥ అన్న యాజ్ఞ ననిశమటు లమలు పరచు
    తమ్ములు విభీషణుఁడు సదా తత్పరుండు
    నాంజనేయుఁడు రాముని యనుచరులన
    నాయనకు నేవురైరి రామాయణమున

    శా॥ బంగారంబునుఁ బోలు తమ్ములనఁగన్ భావించఁగన్ మూవురే
    అంగీకారము తోడ నెప్పుడును సాహాయమ్ముగా నిద్దరా
    సంగాతుల్ మరి రామచంద్రునకు విశ్వాసంబుఁ గాంచఁగ శ్రీ
    రంగా యాయన కేవురైరి గదరా రామాయణంబందునన్

    (శ్రీరామునకు తమ్ములు ముగ్గురు ఆయన మాట జవదాటరు. హనుమ విభీషణుడు స్నేహితులు)
    సంగాతి స్నేహితుడు

    రిప్లయితొలగించండి
  7. సమస్య : ఆయనకు నేవురైరి రామాయణమున

    తే. పాదసేవచే సౌమిత్రి పవనసుతుడు,
    అర్కి స్నేహమున, జటాయువసువులనిడి,
    పాదుకలుమోసి భరతుండు, పరమ భృత్యు
    లాయనకు నేవురైరి రామాయణమున

    భావం : శ్రీరామచంద్రుని పాదసేవ చేస్తూ లక్ష్మణుడు, హనుమంతుడు, స్నేహభావంతో సుగ్రీవుడు, రాముని కోసం ప్రాణాలర్పించి జటాయువు, మరియు ఆయన పాదుకలను శిరసున ధరించి భరతుడు రామాయణంలో ఆ స్వామికి ఐదుగురు గొప్ప సేవకులుగా ప్రసిద్ధి చెందారు.

    రిప్లయితొలగించండి
  8. దండకారణ్య మందుఁ గదన మొనర్ప
    ముని వరేణ్యల రక్షింప నినకులుండు
    మించి యొకపరి యెదిరించు మేటి యసురు
    లాయనకు నేవు రైరి రామాయణమున


    ఆయన కని యంటివి యెవ్వ రా నర వరుఁ
    డేవు రంటివి గద వార లెవ్వ రయ్య
    యెట్లు విశదమౌ నయ్య నీ విట్లనంగ
    నాయనకు నేవు రైరి రామాయణమున


    కంగా రేలయ చెప్పెదన్ నిలుమ నిక్కం బే విధంబయ్యెనో
    యంగీకారముతో నజాత్మజుఁడు పూజార్హుండు శాంతాఖ్యఁ బ్రీ
    తిం గాంతా మణిఁ గూఁతుఁ గాఁ గొనిన రీతిన్ బిడ్డ లింపారఁగా
    రంగా యాయన కేవు రైరి గదరా రామాయణం బందునన్

    రిప్లయితొలగించండి
  9. ఎంత యో చించి నాగాని సుంత యైన
    తెలియ ద య్యెను పూరణ సలుపు కొఱకు
    నాయన కు నేవురైరి రామాయణము న
    ననుట వై చిత్రి గా దోచె వినుట kaina

    రిప్లయితొలగించండి
  10. తేటగీతి
    తల్లి, పినతల్లులిద్దరు దాశరథికి
    సీతకు జనని, గురుపత్ని చెల్లుదురనఁ
    గనఁగ మాతృసమానులుగఁ దగు వార
    లాయనకు నేవురైరి రామాయణమున

    శార్దూలవిక్రీడితము
    సింగారించెడు తల్లియున్ సమముగన్ సేవించు పిన్నమ్మలున్
    బంగారమ్మగు విద్యనేర్పు గురుపత్న్యాదుల్ సతీ మాత లీ
    భంగిన్ రామునకొప్పగన్ జననులై !వర్తింపగన్ శాస్త్రసా
    రంగా యాయన కేవురైరి గదరా! రామాయణం బందునన్

    రిప్లయితొలగించండి

  11. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    భరత,లక్ష్మణ,శత్రుఘ్ను లరయ తమ్ము
    లుగను,జానకి తనకు సతిగను నిలువ
    భక్తితో చేరిన హనుమ బంటు కతన
    నాయనకు నేవురైరి రామాయణమున.

    రిప్లయితొలగించండి