20, సెప్టెంబర్ 2026, ఆదివారం

సమస్య - 5596

21-9-2026 (సోమవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“తండ్రియుఁ గూఁతురు గలసిరి తల్లినిఁ జంపన్”

(లేదా...)

“తండ్రియుఁ గూఁతురుం గలసి తల్లినిఁ జంపిరి సంతసమ్మునన్”

(ఐతగోని వెంకటేశ్వర్లు గారి శతావధానంలో గెంటేల జగదీశ్చంద్రకుమార్ గారి సమస్య)

11 కామెంట్‌లు:

  1. కందం
    గుండ్రంపు హోమగుండము
    దీండ్రించిన నగ్ని నరణిఁ దీక్ష్ణపు జ్వాలల్
    చండ్రముగ బూదిఁ జేసెను
    తం‍డ్రియుఁ గూఁతురు గలసిరి తల్లినిఁ జంపన్!

    అగ్ని =తండ్రి
    అరిగి = తల్లి
    జ్వాల= కూతురు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      గుండ్రపు హోమగుండమునఁ గోరి మునీంద్రులు నాచరింపఁగన్
      దీండ్రపు టగ్ని యా యరణిఁ దీక్ష్ణపు జ్వాలలు నుద్భవించియున్
      జండ్రమనంగ బూదిగను శర్వుడు సూడగ మార్చె! నత్తరిన్
      దండ్రియుఁ గూఁతురుం గలసి తల్లినిఁ జంపిరి సంతసమ్మునన్

      తొలగించండి
  2. ఎండ్రిని, పిల్లలను గనిరి
    తండ్రియుఁ గూఁతురు , గలసిరి తల్లినిఁ జంపన్ ,
    కాండ్రించి యుమ్మిరెల్లరు
    ఎండ్రులె తమ ఖాదనమని యెరుగుట జేతన్

    రిప్లయితొలగించండి

  3. గుండ్రముగ లేవని తిరిగి
    గుండ్రపు చకినముల జేయ కూతురు కోరన్
    తండ్రియును వంత పాడుచు
    తండ్రియుఁ గూఁతురు గలసిరి తల్లినిఁ జంపన్.


    లాండ్రికి వేయ దుస్తులు నిరర్థకమౌ ననుచున్ గృహమ్ము నే
    లాండ్రిగ జేసి తల్లినట ప్రైష్యగ మార్చి కుమార్తె, తండ్రియే
    తీండ్రపు టెండలో కుడుపు తెమ్మనుచున్ పొరిపొచ్చుచున్ సదా
    తండ్రియుఁ గూఁతురుం గలసి తల్లినిఁ జంపిరి సంతసమ్మునన్.

    రిప్లయితొలగించండి
  4. వేండ్రము జనయిత్రి యనగ
    తండ్రి బలాహకము మురిసె తాఁగని చపలన్
    బిండ్రంబౌ పూరణమున
    తండ్రియుఁ గూఁతురు గలసిరి తల్లినిఁ జంపన్

    వేండ్రము తల్లియై భువికి వెచ్చదనంబు నొసంగు చుండగా
    తండ్రి వరాహమే మురిసె తానట గాంచి తనూజ చంచలన్
    బిండ్రమనంగ పూరణము భీకర మైభువి పైకి జేరగా
    తండ్రియుఁ గూఁతురుం గలసి తల్లినిఁ జంపిరి సంతసమ్మునన్

    [ వేండ్రము = తాపము; బలాహకము = వరాహము = మేఘము;
    చపల=చంచల=మెరుపు; పిండ్రము = అమితము; పూరణము = వాన ]

    మబ్బులు మెరుపులు కలిసి అమితమైన వానకురియగా
    తాపము చల్లారిందని భావన.

    రిప్లయితొలగించండి
  5. తండ్రియుఁ గూతురిద్దరొక తావున తల్లి మరొక్కతావునన్
    గుండ్రని తిన్నెపై కలిసి కూర్చుని యాడిన పందెమందునన్
    తీండ్రపుటెత్తు వేసి వినుతింపఁగ చూచెడు వారలచ్చటన్
    తండ్రియుఁ గూఁతురుం గలసి తల్లినిఁ జంపిరి సంతసమ్మునన్

    రిప్లయితొలగించండి
  6. కం:పుండ్రము నిలువుగ దాల్చెడు
    తండ్రి, తనయ యెంచ పరమతపు మనువు మహా
    తీండ్రత దల్లి మృతిన్ గొనె
    తండ్రియుఁ గూఁతురు గలసిరి తల్లినిఁ జంపన్”
    (ఊర్థ్వపుండ్రాలు పెట్టుకొనే ఆ కుటుంబం లో మతాంతర వివాహానికి కూతురు, తండ్రి ఇద్దరు సిద్ధ పడ్డారు.తీవ్రస్వభావం గల తల్లి ఆ బాధతో మరణించింది. అలా ఆ తండ్రీ, కూతురు తల్లి చావుకి కారణం మయ్యారు. )

    రిప్లయితొలగించండి
  7. ఉ॥ మెండుగు తిట్ల నందుకొని మిక్కిలి బాధలు వెట్టుచుండినన్
    దండ్రియుఁ గూఁతురట్లు కడు తాల్మినిఁ జూచిన రక్తపోటు నా
    చండికి మృత్యు ద్వారమయి చప్పున కూల్చఁగఁ బల్కిరెందరో
    తండ్రియుఁ గూతురుం గలిసి తల్లినిఁ జంపిరి సంతసమ్మునన్

    చండి కోపము గల స్త్రీ
    (ఇది లోక సహజమండి. రాయి లాగు ఉండె, అంత హటాత్తుగా పోతుందా రోజు తిట్లు తినలేక తండ్రీ కూతురు (లేక కొడుకుంటే కొడుకు) ఏమో చేసే ఉంటారు అని తప్పక అంటారు)

    రిప్లయితొలగించండి
  8. ఉ:పుండ్రములన్ ధరించు నొక పూత కులమ్మున బుట్టి యేలనో
    తండ్రియె బిడ్డకున్ పరమతంపు వివాహము జేసె నొప్పుచున్,
    తండ్రియె దాని నొప్పె నని తల్లి మృతిన్ గొనె లోకు లిట్లనన్
    "తండ్రియుఁ గూఁతురుం గలసి తల్లినిఁ జంపిరి సంతసమ్మునన్”

    రిప్లయితొలగించండి
  9. కొం డ్రాసనములు వింతను
    గం డ్రని పాప మనుకొన్నఁ గాంచక యే మీ
    రుం డ్రని యాగక పామును,
    దండ్రియుఁ గూఁతురు గలసిరి తల్లినిఁ, జంపన్


    వేండ్రము నాగ్రహం బొసఁగు వీడుఁడు చాలిఁక నంచుఁ బల్కి కో
    డండ్రు కుమారు లెల్లరు నెడందల నింపఁగ శాంత మింపుగాఁ
    దీండ్ర తరోద్ధి తాగ్రహము తీర మనమ్ముల మత్సరమ్మునుం,
    దండ్రియుఁ గూఁతురుం గలసి తల్లినిఁ, జంపిరి సంతసమ్మునన్

    రిప్లయితొలగించండి
  10. తండ్రి సృజించినాడనుచు తల్లికి తానిడె తాటి పండ్లదౌ
    తాండ్రను దానిలో విషము దాగిన సంగతి తానెరుంగకే
    కండ్రిక తిన్న తత్క్షణము కాలము చేసెను బేలతానటన్
    దండ్రియుఁ గూఁతురుం గలసి తల్లినిఁ జంపిరి సంతసమ్మునన్

    రిప్లయితొలగించండి