10, అక్టోబర్ 2022, సోమవారం

సమస్య - 4219

11-10-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దేవుఁడు లేఁడనుచు నమ్మి నిత్యముఁ గొలుతున్”
(లేదా...)
“దేవుఁడు లేఁడు లేఁడని మదిన్ నెఱనమ్ముచుఁ గొల్తు నిచ్చలున్”

26 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. కందం
      కావఁగ బిల్వఁగఁ గరి దీ
      నావనుడై గాచె హరి నిరాయుధ గమనుం
      డా వరదు సాటి దగెడున్
      దేవుఁడు లేఁడనుచు నమ్మి నిత్యముఁ గొలుతున్

      ఉత్పలమాల
      కావ గజేంద్రునిన్ శరణు గైకొని వేగ నిరాయుధుండు దీ
      నావనుఁడంచనన్ గదిలి నమ్మిన రీతిగ బ్రోచినాడనన్
      సేవలొనర్చి మాధవుని చిన్మయ రూపుని వాని మించెడున్
      దేవుఁడు లేఁడు లేఁడని మదిన్ నెఱనమ్ముచుఁ గొల్తు నిచ్చలున్

      తొలగించండి

  2. పావని నిత్యము కొలిచెడు
    పావన చరితుండు రామ భద్రుడొకడె నా
    దైవమని వాని కన్న
    న్దేవుడు లేడనుచు నమ్మి నిత్యము కొలుతున్.

    రిప్లయితొలగించండి
  3. కందం
    భావింప గురువె బ్రహ్మయు
    శ్రీవిష్ణువు నీశ్వరుండు చిన్మయుఁడతఁడే
    కావున సద్గురు కంటెన్
    దేవుఁడు లేఁడనుచు నమ్మి నిత్యముఁగొలుతున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      భావనఁజేతుసద్గురువెబ్రహ్మయు,విష్ణు,మహేశుఁడంచు,సం
      భావనఁజేతు నాయెదుట వర్తిలు దైవమె యంచు మూర్ఖతా
      భావము బాపి జ్ఞానమును పంచు మహాత్ముని కంటెనిమ్మహిన్
      దేవుఁడు లేఁడు లేఁడని మదిన్ నెఱనమ్ముచు గొల్తు నిచ్చలున్.

      తొలగించండి
  4. ఉ.

    జీవుడు కార్యసాధనకు జెల్లుగ సేవల నందజేయుటన్
    *దేవుఁడు లేఁడు లేఁడని మదిన్ నెఱనమ్ముచుఁ గొల్తు నిచ్చలున్*
    గావగ గోరు, నాస్తికుడు కాలుని జేరుట రూఢమే తుదన్
    త్రోవరి భక్తుడే సురల స్తోత్రముచే పురుషార్థ లభ్యమౌ.

    రిప్లయితొలగించండి
  5. పావనమౌ శివ రూపము
    భావము నందునను నిల్ప వాంఛలు దీర్చున్
    గావగ వానికి సాటిగ
    దేవుడు లేడ నుచు నమ్మి నిత్యము గొలుతున్

    రిప్లయితొలగించండి


  6. కావగరమ్ము వేగ జలకంటక మొక్కటి పట్టెనంచు దం
    తావళమార్తిగన్ బిలువ తక్షణమే యట కేగుదెంచి రా
    జీవముఁ బ్రోచినట్టి పురుజిత్తు ముకుందుని మించి నట్టి యే
    దేవుఁడు లేఁడు లేఁడని మదిన్ నెఱనమ్ముచుఁ గొల్తు నిచ్చలున్.

    రిప్లయితొలగించండి
  7. నీవు చరాచరప్రచయ నేతవు శంకర! భక్తపాల! రా
    జీవదళాక్ష! ఫాలశశిశేఖర! సంతత సజ్జనావలిం
    బ్రోవవె యెల్లవేళలను, ముక్కనుదేవర! నీకు సాటి... యే
    దేవుఁడు లేఁడు లేఁడని మదిన్ నెఱనమ్ముచుఁ గొల్తు నిచ్చలున్.

    రిప్లయితొలగించండి
  8. ఠీవిగ మా సంసారపు
    నావను కష్టపడకుండ నడుపుట జూడన్
    కావగ భర్తను మించిన
    దేవుఁడు లేఁడనుచు నమ్మి తేటగ గొలుతున్

    రిప్లయితొలగించండి
  9. జీవాత్మకుపరమాత్మవు
    నీవేగదమమ్ముగాచి నిర్వృతినిడగన్
    కైవల్యంబిడకుండం
    దేవుఁడు లేఁడనుచు నమ్మి నిత్యముఁ గొలుతున్

    రిప్లయితొలగించండి
  10. జీవన యాత్రను గడపగఁ
    బావనుఁ డా రామభద్రుఁ బరిరక్షణలోఁ
    గావఁగ రాముని మించిన
    దేవుఁడు లేఁడనుచు నమ్మి నిత్యముఁ గొలుతున్

    రిప్లయితొలగించండి
  11. జీవన యాత్రనుం గడుప శ్రీకరుఁ డొక్కఁడె తప్ప వేరుగా
    దేవుఁడు లేఁడు లేఁడని మదిన్ నెఱనమ్ముచుఁ గొల్తు నిచ్చలున్
    బావనుఁ డాతడే భువిని బార్వతి నాథుగఁ దిష్థ వేసె నా
    గ్రావము మీద కాలునిగ ,గోపతి,ధూర్జటి నామకంబు తో

    రిప్లయితొలగించండి
  12. జీవన నౌకను నడిపెడు
    దేవుడు పరమేశుడంచు తిరముగ మదిలో
    భావించి హరుని కంటె
    న్దేవుడు లేఁడనుచు నమ్మి నిత్యముఁ గొలుతున్

    రిప్లయితొలగించండి
  13. భావనయందు సమున్నతి
    జీవనమందున నణకువ జీవులపట్లన్
    సేవాభావము కన్న
    న్దేవుఁడు లేఁడనుచు నమ్మి నిత్యముఁ గొలుతున్

    రిప్లయితొలగించండి
  14. జీవులపట్ల నెమ్మియును జీవనమందున సత్య నిష్ఠయున్
    భావనలో సమున్నతియు పాయక పేదల సేవ సల్పుటల్
    దేవుని యర్చనంబునకు దీటగు, నింతకుమించి వేరుగా
    దేవుఁడు లేఁడు లేఁడని మదిన్ నెఱనమ్ముచుఁ గొల్తు నిచ్చలున్

    రిప్లయితొలగించండి
  15. ఈ విశ్వమ్మున మఱి యే
    తావునను వెదకిన నంద తాఁ గనిపించున్
    భావింపఁగ దూరమునన్
    దేవుఁడు లేఁడనుచు నమ్మి నిత్యముఁ గొలుతున్

    పావన మానసమ్మునను వంచన నేరక సుంత యేనియున్
    జీవన యాత్ర నివ్వసుధఁ జెన్నుగఁ జేయుచు ధర్మ బద్ధుఁడై
    వావిరి గొల్వ డెందమున భక్తినిఁ గావని నిర్దయుండునౌ
    దేవుఁడు లేఁడు లేఁడని మదిన్ నెఱ నమ్ముచుఁ గొల్తు నిచ్చలున్

    రిప్లయితొలగించండి
  16. మరొక పూరణ

    కావుమటంచువేడగనె కావగవచ్చెను శంఖచక్రముల్
    నేవియుదాల్చకుండగను నేనిక గావగనెంచుచున్మదిన్
    జీవుల బ్రోవగాదలచు శ్రీహరి కన్నను పుణ్యశీలుడౌ
    *"దేవుఁడు లేఁడు లేఁడని మదిన్ నెఱనమ్ముచుఁ గొల్తు నిచ్చలున్”*

    రిప్లయితొలగించండి
  17. దేవుని నమ్మి నామదిని తేపకు తేపకు
    ప్రస్తుతించినన్
    నావెతలన్ హరించుమని నాపయి జాలిని
    చూపుమంచు నే
    బావురుమంచునేడ్చినను బ్రామిడి మానసు
    డేలబ్రోవడో
    దేవుడు లేడు లేడని మదిన్ నెరనమ్ముచు
    గొల్తు నిచ్చలున్

    రిప్లయితొలగించండి
  18. జీవునిగానన్ని యమర
    శ్రీవాణి కృపను జదివితి,చేరితి కొలువున్
    పావన మూర్తిని మించిన
    “దేవుఁడు లేఁడనుచు నమ్మి నిత్యముఁ గొలుతున్”

    రిప్లయితొలగించండి
  19. జీవనమందు బొందితిని శ్రీకర సౌఖ్యములన్ని మీదయన్
    కావగ దీనునిన్‌ కరుణ కర్తగ శంకర దేవరా ! ననున్
    నావగ దాటవేసితివి నాప్రభు నమ్ముదు మిమ్ముమించి యే
    “దేవుఁడు లేఁడు లేఁడని మదిన్ నెఱనమ్ముచుఁ గొల్తు నిచ్చలున్

    రిప్లయితొలగించండి