13, అక్టోబర్ 2023, శుక్రవారం

సమస్య - 4557

14-10-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నిప్పు ప్రజ్వరిల్లు నీటిచేత”
(లేదా...)
“నిప్పులు ప్రజ్వరిల్లుఁ గద నీటినిఁ గుండెఁడు గ్రుమ్మరించినన్”

14 కామెంట్‌లు:

  1. భర్త శాంతము గని భార్య ద్రౌపది మండె,
    మగడు మౌని యైన మగువ యేడ్చు,
    తగని శాంతమెపుడు తప్పు ఫలితమిచ్చు-
    నిప్పు ప్రజ్వరిల్లు నీటిచేత!

    రిప్లయితొలగించండి
  2. జలము యంత్ర మందు గలిగించు విద్యుత్తు,
    మెఱుపు బుట్టునుగద మేఘమందు,
    సాగరమున బుట్టు జలముచే బడబాగ్ని,
    నిప్పు ప్రజ్వరిల్లు నీటిచేత!

    రిప్లయితొలగించండి
  3. ఆజ్య మింత పోయ నత్యధి కమ్ముగా
    నిప్పు ప్రజ్వ రిల్లు :: నీటి చేత
    మంట లార్ప వచ్చు మహి లోన యత్నించి
    ముక్తి పొంద గలరు ముప్పు వలన

    రిప్లయితొలగించండి
  4. రిప్లయిలు


    1. ఆటవెలది
      'సతి'ని జూచి తండ్రి పతిని నిందింపగ
      కాలె నగ్ని మిగులఁ గలఁగి, సతికి
      గనుల జారెననఁగఁ గాలుని ముక్కంట
      నిప్పు ప్రజ్వరిల్లు నీటిచేత!

      ఉత్పలమాల
      ఒప్పదు పిల్వకున్న సతి! యోగ్యత నాదని పుట్టినింటికిన్
      దప్పది పోకు పోకనిన దాటుచు 'నీశునిఁ' దండ్రినిందలన్
      చప్పున దూకి గుండమున జన్మముగింపఁగఁ 'ద్ర్యక్షమందునన్
      నిప్పులు ప్రజ్వరిల్లుఁ గద' నీటినిఁ గుండెఁడు గ్రుమ్మరించినన్

      తొలగించండి
  5. శాంతి గోరు పార్థ సారధి తోడున్న
    సమరమందు గెలుపు సాధ్య పడునె
    వెఱ్ఱి తనము కాదె విజయుని తలపది
    నిప్పు ప్రజ్వరిల్లు నీటిచేత?


    (శ్రీ రామునితో విభీషణుడు....)

    చెప్పితి మంచి మాటలవి సీతను వీడుమటంచు లేనిచో
    ముప్పది దానవాళికని, మూఢుడు రావణు డాలకింపడే
    బొప్పడు కాన వానికది బూతుగ తోచెను కాంచి నంతనే
    నిప్పులు ప్రజ్వరిల్లుఁ గద నీటినిఁ గుండెఁడు గ్రుమ్మరించినన్.

    రిప్లయితొలగించండి
  6. దివసకరుని పైన ద్రిమ్మరించిన నీరు
    మంటలార్పకుండు మక్కళించు
    సృష్టిలోన దాగె సృజనాత్మకముచూడ
    నిప్పు ప్రజ్వరిల్లు నీటిచేత

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుప్పెడుగుండెలో నెగయు కోపము నిప్పును బోలుచుండ నె
      ల్లప్పుడు దానిపైనదుపు రాదట సూక్తులనెన్ని చెప్పినన్
      జప్పున చూడనొప్పు మరి జ్వాలిధరమ్ము సజీవమైనచో
      నిప్పులు ప్రజ్వరిల్లుఁ గద నీటినిఁ గుండెఁడు గ్రుమ్మరించినన్

      తొలగించండి
  7. నేడు పద్యరచన నేర్చి వాడు బలికె
    నిప్పు ప్రజ్వరిల్లు నీటిచేత
    ననుచు, యతి కుదురుగ నమరించ, నమ్మిన
    పాక మెటులసాగు బందువులకు

    రిప్లయితొలగించండి
  8. ఆ॥ మంటనార్పు గుణము వెంటఁగొను జలము
    నిప్పు నార్పు ననుట నిజము గాని
    యెగయు ననుట కల్ల యెవరనిరి యిటుల
    “నిప్పు ప్రజ్వరిల్లు నీటిచేత”

    ఉ॥ తప్పని చెప్పనేల పెడదారిని వీడక నున్న భర్తయున్
    గప్పున భార్య యేడ్వఁగను గాసిలి చాలును మంట పుట్టఁగన్
    జప్పున బుద్ధిఁ గాంచుచును జక్కని రీతిగ ప్రజ్వరిల్లఁగన్
    నిప్పులు ప్రజ్వరిల్లుఁ గద నీటిని గుండెఁడు గ్రుమ్మరించినన్

    రిప్లయితొలగించండి
  9. కలికి కంటినీరు కలిగించు నిక్కట్లు
    తొలఁగు నింట సిరులు కలుగు వెతలు
    శాంతమూర్తి యలుగ సర్వ నాశనమౌను
    నిప్పు ప్రజ్వరిల్లు నీటిచేత

    రిప్లయితొలగించండి
  10. ఎప్పుడు మంచివారలకు నెక్కుడు దబ్బరపాటొనర్తురో
    తప్పుడు వ్యాజ్యముల్ నెరపి తద్దయు తొక్కటపాటు జేతురో
    ముప్పొనగూడు నప్పుడు సముద్రమునన్ బడబాగ్ని యట్టులన్
    నిప్పులు ప్రజ్వరిల్లుఁ గద నీటినిఁ గుండెఁడు గ్రుమ్మరించినన్

    రిప్లయితొలగించండి
  11. అవనికంపమంద నల్లకల్లోలమై
    భయముచేతజనులువడలిపోగ
    నగ్ని జ్వాల లెగయ నబ్ధి యందత్తరి
    నిప్పు ప్రజ్వరిల్లె నీటి చేత

    రిప్లయితొలగించండి