6, జనవరి 2024, శనివారం

సమస్య - 4638

7-1-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పొట్టలం గొట్టువానికిఁ బుణ్యమబ్బు”
(లేదా...)
“పొట్టలు గొట్టువానికి నమోఘముగా లభియించుఁ బుణ్యముల్”
(వజ్జల రంగాచార్య గారికి ధన్యవాదాలతో...)

19 కామెంట్‌లు:

  1. నిశ్చయముగ పాపము గల్గు నీతిపరుల
    పొట్టలం గొట్టువానికిఁ ; బుణ్యమబ్బు
    నర్హతను జూచి తగురీతి నాదుకొనగ,
    పాప పుణ్యములగు జేయు పనులవలన

    రిప్లయితొలగించండి

  2. పేద లాకలియని చేరువేళ కబళ
    మన్నమిడిన వారికి దక్కు పున్నియమది
    జాలి వీడి శ్రామికులగు గాలి గ్రుడ్డు
    పొట్టలం గొట్టువానికిఁ బుణ్యమబ్బు?


    కొట్టిన నారికేళములు కోవెల కేగుచు బుణ్యమబ్బు గా
    నెట్టుల జేరు బాగెమది యెంతటి వారల కైననీ భువిన్
    వెట్టియటంచు పేదలిల భృత్యులటంచు కృపా విహీనుడై
    పొట్టలు గొట్టువానిని నమోఘముగా లభియించుఁ బుణ్యముల్?

    రిప్లయితొలగించండి
  3. పాప మబ్బును బనిగొని ప్రజలయొక్క
    పొట్టలంగొట్టువానికి ,పుణ్యమబ్బు
    జనుల శ్రమనుగుర్తించియుసమ్ముదమున
    జీతమును నిచ్చివారల చింతమాన్ప

    రిప్లయితొలగించండి
  4. కానలకునేగి జంతు షికారు సేయ
    మూగ జీవుల జంపగ సాగె జనము
    అడవి జీవుల రక్షించి యట్టి వారి
    పొట్టలం గొట్టువానికిఁ బుణ్యమబ్బు

    రిప్లయితొలగించండి
  5. తేటగీతి
    యోగ్యమైనట్టి పాలనమొప్పునటుల
    పన్నుమోయఁ గలుగువారి బాదనెంచి,
    పథకములవైచి నింపగ బడుగు వారి
    పొట్టలం, గొట్టువానికిఁ బుణ్యమబ్బు!

    ఉత్పలమాల
    దిట్టయనంగ పాలకుడు దేశమునేలగఁ గీర్తినందెడున్
    గుట్టుగ మోయువారలకు గూర్చుచు మెత్తని పన్నుదెబ్బలన్,
    బుట్టినదాదిగన్ వెతల మున్గెడు పేదలనెంచి నింపఁగన్
    పొట్టలు, గొట్టువానిని నమోఘముగా లభియించుఁ బుణ్యముల్

    రిప్లయితొలగించండి
  6. పాప నుండును తోడుగా పడగ విప్పి
    పొట్టలన్గొట్టువానికి, బుణ్యమబ్బు
    స్వార్థమెఱుగని నరునకుశాంతునకును
    దైవనిర్ణయమిదియౌనుతెలియరండి

    రిప్లయితొలగించండి
  7. చెట్టనుబట్టిరేదొరలుజేతలునైరిగభారతంబులో
    గట్టిగనిల్చినట్టిఘనుగాంధియనంబడుతాతజచ్చెనే

    కట్టలుగట్టిసంపదనుకంసులునైరినవారితంబుగా
    పొట్టలుగొట్టువానికి నమోఘముగాలభియించు పుణ్యముల్

    రిప్లయితొలగించండి
  8. ఉ.

    కొట్టిన కొట్టు కొట్టక నిగూఢము దోపిడి దారిఁ గాచెడిన్
    ముట్టిన సంపదల్ తినుచు మోక్షమెరుంగని వానిఁ జేకొనెన్
    బెట్టుగ నారదుండు కథఁ బేర్కొన, వాల్మికి గ్రంథకర్తయే
    *పొట్టలు గొట్టువానికి నమోఘముగా లభియించుఁ బుణ్యముల్.*

    రిప్లయితొలగించండి

  9. గట్టిగ చెప్పెదన్ కసటు కల్గును నీతిగ నుండ జూడకన్
    పొట్టలు గొట్టువానికి ; నమోఘముగా లభియించుఁ బుణ్యముల్
    ముట్టిన కార్యమున్ విడక పూర్తిగ జేసెడి వాని మప్పకన్
    బెట్టును జూపుచున్నతని బెద్దగ నెంచుచు బైసి
    నిచ్చినన్

    రిప్లయితొలగించండి
  10. నరకము ల భించు నందురు కరము పరుల
    పొట్ట లం గొట్టు వానికి : పుణ్య మబ్బు
    నాపదను నున్న వానిని యాదు కొనుచు
    సాయము నొనర్చు వానికి జగతిని గద

    రిప్లయితొలగించండి
  11. గుట్టలుగా నఘమ్ములను గోరి యొనర్చుచు నల్పజీవులన్
    తట్టములందుముంచి పెడదారులు ద్రొక్కెడు నుక్కివుండు తా
    నెట్టుల సద్గతుల్ బడయు? నెవ్విధి పేదల నొవ్వజేయుచున్
    పొట్టలు గొట్టువానికి నమోఘముగా లభియించుఁ బుణ్యముల్?

    రిప్లయితొలగించండి
  12. కోరి దీనుల బ్రతుకులు కొల్లగొట్టి
    సౌఖ్యముల్ పొంద జూచెడు స్వార్ధపరుడు
    కల్కములనొనరింపగ కడకు నెట్లు
    పొట్టలం గొట్టువానికిఁ బుణ్యమబ్బు

    రిప్లయితొలగించండి
  13. తే॥ చట్టమును చుట్టముగ మార్చి చాప క్రింది
    నీరు వోలె ధనము దోఁచి నీతి మాలి
    యెదుగఁ బేదల హితమున కెదురు తిరిగి
    పొట్టలం గొట్టు వానికిఁ బుణ్యమబ్బు

    ఉ॥ చట్టము చుట్టమై చనఁగఁ జక్కగ దోఁచ నపార సంపదల్
    గుట్టుగ వాని దోఁచుచును గోరుచు సౌఖ్యముఁ బేదవాండ్రకున్
    బట్టుగఁ బంచ సాగఁగను బ్రాణము సైతము లెక్కసేయకన్
    బొట్టలు గొట్టువానికి నమోఘముగా లభియించుఁ బుణ్యముల్

    Modern day Robin Hood అండి

    రిప్లయితొలగించండి
  14. ఉ:పొట్టను పెంచుకొంటి , నిక పోయెను స్వాస్థ్యము,సొమ్ము కొంత పో
    గొట్టితి వైద్యమున్ బడయ ,కొందరు చెప్పగ నాసనాల జే
    పట్టితి,నేర్పు వాని దయ వారము లోపల పొట్ట తగ్గె,నా
    పొట్టలు కొట్టు వానికి నమోఘము గా లభియించు బుణ్యముల్

    రిప్లయితొలగించండి
  15. తే.గీ:"నాకు కడు ప్రీతి మొక్క జొన్నలన కాని
    యిచట దొరకవే!" యనుచు జింతించ నెవడొ
    మొదలిడెను కొట్టుకు నా కమ్ము  మొక్క జొన్న
    పొట్టలన్ గొట్టు వానికి బుణ్య మబ్బు

    రిప్లయితొలగించండి
  16. Revised
    తే.గీ:"నాకు కడు ప్రీతి మొక్క జొన్నలన కాని
    యిచట దొరకవే!" యనుచు జింతించ నెవడొ
    మొదలిడెను కొట్టు నా కమ్ము  మొక్క జొన్న
    పొట్టలన్ గొట్టు వానికి బుణ్య మబ్బు

    రిప్లయితొలగించండి
  17. పాప మంట దొకింతయుఁ బన్నుగ నెద
    ధైర్య మూని మిక్కుటముగ దయను గాచి
    వనిని మృగ రాశి మృగ రాజు బారి నుండి
    పొట్టలం గొట్టు వానికిఁ బుణ్య మబ్బు


    పుట్టఁగ మర్త్య జన్మమున మోక్షము నందఁగ బీదవారినిం
    దొట్టి క్షుధార్త సంతతికి దొడ్డ మనమ్మున సంతతమ్మునున్
    గుట్టుగఁ బెట్టి యన్నమును గోరిన వారికిఁ బ్రీతి నింపఁగాఁ
    బొట్టలు గొట్టు వానికి నమోఘముగా లభియించుఁ బుణ్యముల్

    [కొట్టు = అంగడి]

    రిప్లయితొలగించండి
  18. భరణి! భరియించ లేనట్టి పాప మబ్బు
    పొట్టలం గొట్టువానికి,బుణ్య మబ్బు
    బరుల బాగును గోరెడు ప్రముఖ మతికి
    పాప పుణ్యాల మిళితమే ప్రాణి బ్రతుకు

    రిప్లయితొలగించండి
  19. పరులుసంపాదననుకోరి పలువిధాల
    కొట్టి తిట్టుచు హింసించి కూర్మ వీడి
    దోచి యానంద మొందెడు దుష్ట జనుల
    *"పొట్టలం గొట్టువానికిఁ బుణ్యమబ్బు”*

    బల్లూరి ఉమాదేవి

    పట్టుచునాయుధమ్ములనుబాటలయందుచరించువారలన్
    కట్టడిసేయుచున్ననిక కాలము మూడుచు కల్గు శిక్షయున్
    పొట్టలు గొట్టువానికి నమోఘముగాలభియించుపుణ్యముల్
    కొట్టుచునారికేళమునుకూరిమితోహరి గొల్చు వారికిన్

    రిప్లయితొలగించండి