23, అక్టోబర్ 2025, గురువారం

సమస్య - 5283

24-10-2025 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శరశయ్యన్ బవ్వళింప శాంతించు వగల్”
(లేదా...)
“శరతల్పంబునఁ బవ్వళింపుము సఖీ చల్లార్చెదన్ దాపమున్”
(వద్దిపర్తి పద్మాకర్ గారి శతావధానంలో అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి సమస్య)

19 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. విరబూచెన్ సురపొన్నవారిజములే విస్తారమై నిండుగా
      పరిపుష్టంబగు మోదమందుకొనగా వాల్గంటి రావేలనే
      పరమార్ధమ్మును సంగ్రహింప వడిగాఁ బ్రాణేశు నింజేరి కే
      శరతల్పంబునఁ బవ్వళింపుము సఖీ చల్లార్చెదన్ దాపమున్

      తొలగించండి
    2. మరియిక జాగేల సఖియ
      పరిష్వజించుము రయమునఁ బ్రాణేశునితోఁ
      బరవశ మొప్పునటుల కే
      శరశయ్యన్ బవ్వళింప శాంతించు వగల్

      తొలగించండి
  2. మ.
    ఉరు శృంగార విలాస సంయుత విభూషోద్భ్రాంత సంశోభతో
    సిరి వోలెన్ నటియింప నో విటకుడా చిన్నారితో పల్కెని
    ట్లరయన్ నీవ మనంబు దోచితివి యాహ్లాదింతు కామోల్లస
    చ్ఛర, తల్పంబున బవ్వళింపుము సఖీ చల్లార్చెదం దాపమున్ !

    రిప్లయితొలగించండి
  3. విరివిగ నెండలు గాయగ
    శరీరమంతయు దపించి , జడ్డ నొసంగన్
    శరమున నానగ నుంచిన
    శరశయ్యన్ బవ్వళింపఁ దాపము దొలఁగున్

    రిప్లయితొలగించండి

  4. సరసుడు విడి పోయె ననుచు
    విరహమ్మున మునిగి యేల వేదన సఖియా
    దరి జేరుము పద్మపు కే
    శరశయ్యన్ బవ్వళింప శాంతించు వగల్.


    విరహమ్మందున కాగు చుంటివి కదా ప్రేయాంశు డే లేక హే
    తరుణీ యెందులకా విచారమిట నీ దాసాను దాసుండ నై
    పిరమిన్ వేచితి సుందరాంగి యిటకున్ విచ్చేయుచున్ మల్లికా
    శరతల్పంబునఁ బవ్వళింపుము సఖీ చల్లార్చెదన్ దాపమున్.

    రిప్లయితొలగించండి
  5. విరహంబందున వేగుచుంటివిగదా ప్రేయాన్ పిసాళించు యా
    విరజాజుల్ మరు మల్లియల్ పరచితిన్ ప్రేమంబుతో శయ్యపై
    మురిపాలొల్కుచు వచ్చి నాకడకికన్ మోదంబు నేగూర్చు కే
    శరతల్పంబున బవ్వళింపుము సఖీ చల్లార్చెదన్ దాపమున్

    రిప్లయితొలగించండి
  6. పురవాసమువిడి ధర్మా
    చరణమె ప్రాధాన్యమంచు జాంగలమున దు
    స్తరములనోర్చిన ధరణిజ
    శరశయ్యన్ బవ్వళింపఁ శాంతించు వగల్

    వగ : సంతాపము
    శరశయ్య : రెల్లుగడ్డి తల్పము

    రిప్లయితొలగించండి
  7. కం:ధరియించి శస్త్రములనే
    ధరియించితి కర్మయోగ తత్పరతన్ నే
    మరణింతు నమ్మ గంగా!
    శరశయ్యన్ బవ్వళింప శాంతించు వగల్”
    (ఒక కర్మయోగి గా శస్త్రాలనే ధరించాను.వాటితోనే మరణిస్తాను.అని గంగ తో భీష్ముడు అన్నట్లు.)

    రిప్లయితొలగించండి
  8. కృష్ణుడు సత్యభామకు తెలుపుట

    కం॥ విరహమున వేగ నేలనొ
    తరుణీ నాహృదిని నిలిచి తనరవొ భామా
    సరసముఁ గనుమ యటుల సుమ
    శరశయ్యన్ బవ్వళింప శాంతించు వగల్

    మ॥ విరహాగ్నిన్ గని సత్యభామ యలుగన్ వెన్నుండు భార్యామణిన్
    సరసోక్తుల్ వెదఁజల్లి వేడుచును ప్రస్తావించెఁ బ్రాధాన్యతన్
    దరుణీ నామది నీ యధీనము సదా తాల్మిన్ లతాంతమ్ముదౌ
    శరతల్పంబునఁ బవ్వళింపుము సఖీ చల్లార్చెదన్ దాపమున్

    రిప్లయితొలగించండి
  9. మ:తిరమౌ ప్రేమను బొందినార మిక సందేహమ్ములన్ వీడుమా!
    బరువౌ నీ నవ యౌవనమ్ము నిశలన్ బాధింప,దీ పెండ్లితో
    సరసమ్మౌ నిక కామతాపమును,నుత్సాహాన నీ మల్లికా
    శరతల్పంబునఁ బవ్వళింపుము సఖీ చల్లార్చెదన్ దాపమున్”
    (మన్మథునివి సుమబాణాలు.కనుక మల్లికాశరతల్పం అన్నట్లు. )

    రిప్లయితొలగించండి
  10. తరుణిరొ మదనుని శరములు
    కెరలించెను నా తనువును కృపఁజూడగదే
    పరచితి కేశరతల్పము
    శరశయ్యన్ బవ్వళింప శాంతించు వగల్

    రిప్లయితొలగించండి
  11. కందం
    మరుల వరూధిని మరుఁగఁ బ్ర
    వరుడై గంధర్వుఁ డందఁ బలికెన్, "సఖి! నా
    సరసన్ యరవిందమ్మను
    శరశయ్యన్ బవ్వళింప శాంతించు వగల్"


    మత్తేభవిక్రీడితము
    మరుబాణాల వరూధినీ మరుగుటన్ మాయావిగంధర్వుఁడే
    తరుణంబంచును రూపునన్ బ్రవరుఁడై దాసాను దాసుండుగన్,
    మురిపాలన్ గురిపించి యిట్లు పలికెన్ ముద్దార, నీ మల్లికా
    శరతల్పంబునఁ బవ్వళింపుము సఖీ చల్లార్చెదన్ దాపమున్!

    రిప్లయితొలగించండి
  12. తరుణీ యిక్షుశరాసనుండు కడు విస్తారమ్ముగా నిర్దయన్
    శరసంధానమొనర్చుచున్ మనసుకున్ శ్రాంతమ్ము పోకార్చెడిన్
    త్వరితమ్మౌగతినేగుదెంచి మదికిన్ స్వాంతమ్ము జేకూర కే
    శరతల్పంబునఁ బవ్వళింపుము సఖీ చల్లార్చెదన్ దాపమున్

    రిప్లయితొలగించండి
  13. సమస్య:
    “శరతల్పంబునఁ బవ్వళింపుము సఖీ చల్లార్చెదన్ దాపమున్”

    మత్తేభము:

    కరముల్ మోడ్చియు వేడెదన్ గనుమరో కాసింత సత్రాజితీ !
    శరముల్ వీడక వేసెనే మదనుడే శాసించకే నెచ్చెలీ !
    చరణంబుల్ కడు కందెనో శిలగు శీర్షంబేగ నాదీ సుమీ !
    “`శరతల్పంబునఁ బవ్వళింపుము సఖీ చల్లార్చెదన్ దాపమున్”

    రిప్లయితొలగించండి
  14. హరి పవ్వళించు ముదమున
    నరనారీ మణుల కిల ఘనమ్ముగ శ్రేయ
    స్కర మగు నొకింత తడ వా
    శరశయ్యన్ బవ్వళింప శాంతించు వగల్

    [శర తల్పము = జల తల్పము]


    తరుణీ రత్నమ గ్రీష్మ నాశమున నిద్రా దేవినిం గొల్వుమా
    పర మానందద శీతలానిలము వీవం జక్క సౌఖ్యంపు లా
    హిరి గ్రమ్మంగ నెడందలో వగపు నీకేలా మహా కోమ లా
    శర తల్పంబునఁ బవ్వళింపుము సఖీ చల్లార్చెదన్దాపమున్

    [ఆశర తల్పము = నైరృతి మూల నున్న తల్పము]

    రిప్లయితొలగించండి
  15. మరలుగ జప తప ములతో
    నిరతము ధ్యానమున నుండు నిష్ఠ పరుండై
    వరమును బొందక నయ్యె డ
    శర శయ్య న్ బవ్వ ళి o ప శాంతించు వగల్

    రిప్లయితొలగించండి
  16. సమస్య:
    “శరతల్పంబునఁ బవ్వళింపుము సఖీ చల్లార్చెదన్ దాపమున్”

    మత్తేభము:

    కరమున్ బట్టగ నీయవే చెలియ స్వీకారంపు నంగీకృతిన్
    విరహంబున్ గనజాలవేల సఖి ! నీవీనాడు క్రీగంటితోన్
    నెఱజాణల్ నను గూడగా నిలుతురే నీమీద మోహంబునే
    పరదేశంబున నీపతుల్ మరచినా, ప్రాణంబులిత్తున్ ప్రియా !
    “`శరతల్పంబునఁ బవ్వళింపుము సఖీ చల్లార్చెదన్ దాపమున్”

    (సైరంధ్రిని జూచి కీచక ప్రేలాపన)

    రిప్లయితొలగించండి