18, సెప్టెంబర్ 2026, శుక్రవారం

సమస్య - 5594

19-9-2026 (శనివారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“సున్న మార్కులు ర్యాంకేమొ చూడ ఫస్టు”

(లేదా...)

“మార్కులు సున్న వచ్చినను మాధవి నిల్చెను ఫస్టు ర్యాంకులో”

(ఐతగోని వెంకటేశ్వర్లు గారి శతావధానంలో చి॥ వింజమూరి సంకీర్త్ సమస్య)

6 కామెంట్‌లు:

  1. లెక్కల పరీక్ష మార్కల లెక్క గట్ట
    నన్న కెన్నియని గురువు నడిగినంత ,
    జాబితా యడుగున నుండి జదివి చెప్పె ,
    సున్న మార్కులు ర్యాంకేమొ చూడ ఫస్టు

    రిప్లయితొలగించండి
  2. మొదటి ర్యాంకున నిల్చెడు మురళి లాస్టు!
    దిక్కు తోచని పంతులు తెరచి చూడ
    మాయ కృత్రిమ మేధది! మాధవికన
    సున్న మార్కులు ర్యాంకేమొ చూడ ఫస్టు!


    ఉత్పలమాల
    అర్కుడు పశ్చిమాద్రి నుదయంబున పుట్టిన పుట్టుగాక! సా
    వర్కరు నిల్వడే చివర! ప్రశ్నలనన్ని పరీక్షవ్రాసెనన్
    దర్కమునెంచి పంతులట తప్పది కృత్రిమమేధదంచనన్
    మార్కులు సున్న వచ్చినను మాధవి నిల్చెను ఫస్టు ర్యాంకులో!

    రిప్లయితొలగించండి

  3. కపిలు సచిను ద్రావిడు వలె కల్ప మందు
    కీర్తి గాంచెద ననుచును క్రీడ లందు
    శ్రద్ధ చూపించి చదువు నశ్రద్ధ చేయ
    సున్న మార్కులు, ర్యాంకేమొ చూడ ఫస్టు
    లాట లందున నదిగద యద్భుతంబు.


    కర్కసు రాలు తల్లి సహకారము తో ప్రతి నిత్యమందు తా
    నర్కుని కంటె ముందు చరణాయుధమయ్యది కూసినంతనే
    పార్కున కేగి యాటలట పంతము బూనుచు నేర్చి మేటియై
    మార్కులు సున్న వచ్చినను మాధవి నిల్చెను ఫస్టు ర్యాంకులో.

    రిప్లయితొలగించండి
  4. ప్రకటన లిడినిరుద్యోగ వరమిదియని
    నిర్వహించినారు పరీక్ష నీఛులకట
    కడకు ఫలితంబు లీరీతి గానవచ్చె
    సున్న మార్కులు ర్యాంకేమొ చూడ ఫస్టు

    తార్కిక మైన పద్ధతికి తామిక దూరమటంచు నెంచుచున్
    బేర్కొని నారు ర్యాంకులను వేగముగా మరి నీతి బాహ్యులై
    మర్కట తుల్యులా ఘనులు మార్కులు ర్యాంకులు వెల్లడించగా
    మార్కులు సున్న వచ్చినను మాధవి నిల్చెను ఫస్టు ర్యాంకులో

    రిప్లయితొలగించండి
  5. ఉ॥ తర్కమిదేలనో తెలివి తక్కువ రీతిని వాదమేలనో
    మార్కుల ర్యాంకు వేరు కద మన్నన నొందుచు నాటలందునన్
    బేర్కొన నగ్రగామి యను పేరు గడించఁగ వాటియందునన్
    మార్కులు సున్న వచ్చినను మాధవి నిల్చెను ఫస్టు ర్యాంకులో

    (మార్కులలో కాదండి ఆటలలో ఫస్టు ర్యాంకండి)

    ఉ॥ పేర్కొన ధ్యాస చిన్నపుడు పిల్లల కట్లు పరీక్షలందునన్
    మార్కుల పైన నుండుఁ గద మార్పులు పిమ్మట నెన్నియో సుమా!
    కర్కశ లోకమందునటు కాలము సాగఁగ జీవితమ్నునన్
    మార్కులు సున్న వచ్చినను మాధవి నిల్చెను ఫస్టు ర్యాంకులో

    చి॥ సంకీర్త్ శర్మ 14-15 సం॥ అబ్బాయికదా, అప్పుడు మార్కులు ర్యాంకుల ధ్వాస జీవితములో ఫస్టు గా నిలిచేదానికి మార్కులకు సంబంధం లేదండి. ఆ యదార్థమే తెలుపుతున్నాను.

    జీవితమ్నునన్ 3-4 రెండు పాదాలకు అన్వయం.

    రిప్లయితొలగించండి
  6. సున్న యన్న సుద్దు తెలియు మిన్నగాను
    జూడ నను మాట నాకెన్న సుపరిచయమె
    తక్కినవి నే నెఱుంగను దమ్మువాఁడ
    సున్న మార్కులు ర్యాంకేమొ చూడ ఫస్టు


    తుర్క లెఱుంగ నోపుదురొ దొడ్డ దొరల్ పరికింప నేర్తురో
    యెర్కకు రాక యుండె నిది యింతయు నక్కట యేమి భాషయో
    కొర్కఁ బడంగ రా దకట కూరిన దేదియొ యెందు నిల్చెనో
    మార్కులు సున్న వచ్చినను మాధవి నిల్చెను ఫస్టు ర్యాంకులో


    అర్క నిభమ్ము మండుచును నార్చుచు రొప్పుచు సంభ్రమమ్మునం
    దర్కము కూడ దంచు నని తద్దయు భీతి నొసంగి యొజ్జకుం
    జుర్కుగఁ జెప్పె నేమొ మఱి చుట్టము వచ్చి వచింప నట్టులే
    యెర్కయె సున్న సంఖ్య గడియించిన మాధవి శ్రేణి యొక్కటే

    [పర భాషా పదములను బరిష్కరించి చేసిన పూరణము]

    రిప్లయితొలగించండి