5, మే 2016, గురువారం

ఖండకావ్యము - 18

నవగ్రహ స్తోత్రము

రచన : పోచిరాజు కామేశ్వర రావు

శ్రీకర దినకర సోముల
నాకుజ బుధ గురువు శుక్రు డాదిగ శనియున్
రాకేందు రిపులు రాహువు
నా కేతువులన్ స్మరింతు నమితప్రీతిన్ (1)

ఘన తిమి రారిన్ కశ్యప
తనయున్ దురితౌఘహర్తఁ దలతుం భక్తిన్
దినకరు జపాసుమ సమున్
జననోద్దీపిత ప్రచండ సమ్యక్కిరణున్ (2)

విమలాంబుజ హిమ వర్ణున్
హిమ గిరిజాధీశ మౌళి హృత్ప్రియ వాసుం
గమలానుజున్ శశాంకున్
నమస్కరింతును నిశాధి నాధున్ సోమున్ (3)

అశనిద్యుతి సమ భాసితు
ని శక్తిహస్త విభవు ధరణీ సంజాతున్
విశ దాంగారక నామున్
భృశ మంగళకరు నుతింతు పేరిమి తోడన్ (4)

గమ్యా ప్రమేయ రూపున్
రమ్య ప్రియంగు నవ కుట్మల సమశ్యామున్
సమ్యక్సత్వ గుణ నిధిన్
సౌమ్యగ్రహ బుధు నుతింతు సమ్మోదముగన్ (5)

అమర ముని వరాచార్యున్
విమలాత్ముం గాంచన నిభ విలసిత దేహున్
సముచిత రీతి బృహస్పతి
నమస్కరింతు నిల భక్తి ననవర తమ్మున్ (6)

సకలాసుర వర గురువుఁ గ
నక సన్నిభ నవ్య కుంద నాళాభాంగుం
బ్రకటిత శాస్త్రాచార్యుని
నకలంకు నుతింతు శుక్రు నగ్ని ముఖు నిలన్ (7)

యామున సమాన దేహ
శ్యామున్ ధర్మాగ్రజు రవి సంజాతున్ ఛా
యామార్తాండ సుపుత్రున్
వేమారు నుతింతు శనిని విలసిత గాత్రున్ (8)

అతి వీరు నర్ధ కాయుని
సతి సింహిక ముద్దుపట్టిఁ జంద్రా దిత్యా
మిత దళితాసక్త మతిన్
సతతము రాహువు నుతింతు సద్భక్తి నిలన్ (9)

కుసుమామల దళ సన్నిభు
నసదృశ రౌద్రాత్ము ఘోరు నతులిత రౌద్రున్
లసితగ్రహ తారా విభు
వసుధం గేతువు నుతింతు బరమప్రీతిన్ (10)

సమస్య - 2024 (అక్కను ప్రేమించి పెండ్లి...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.. 
అక్కను ప్రేమించి పెండ్లియాడె ముదమునన్.

పద్యరచన - 1215

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

4, మే 2016, బుధవారం

ఖండకావ్యము - 17

స్వర్ణ భూమి
రచన : శిష్ట్లా వి.ఎల్.ఎన్. శర్మ

హంగులునింపి రాజిలు మహాజనయిత్రి! సమస్త ధర్మ పా
రంగతితో గమింప జనులన్ దనియించెడి విశ్వభావనల్
సంగమమై వసింపగను శాశ్వత కీర్తి సమున్నతిన్ సదా
బంగరు దేశమై బరగు భారతభూమి కివే నమస్కృతుల్!

భాస్వంతంబయి యుద్యమించి కలలన్ బండించి ప్రేమామృతం
బాస్వాదంచెడి జిత్తముల్వొలయు నాహ్లాదంపు హేలాగతుల్
నీ స్వాంతంబున నిల్పుచున్నిరతము న్నెయ్యంబుతో, శాంతితో
నీ స్వాతంత్ర్య మహాద్యుతిన్ వెలుగ నిమ్మీ ధాత్రిపై నెప్పుడున్!

పాటవమందినట్టి పలు భాషల కోమల రాగమాలికల్,
బాటలయందు జీవనము భాసిలజేసెడి సంస్కృతుల్, మదిన్
మేటి సుధీవిధేయత సమీరణ జేసెడి సౌమ్య శక్తి, ము
ప్పేటల దివ్యభావనల, బేనియొసంగుమ! మానవాళికై!

ఇంత విశాల భావఝరు లిచ్చట నిల్పిన దివ్య ధాత్రి, యా
సాంతము ధర్మ సూత్ర పథసారము, సర్వ మతాల సంగమం
బంతర శక్తిగా బరగ, నాదరభావ విశిష్ట యోచనల్
స్వాంతము నందు గూడినవి, భారత దేశ విభాత రాగమై!

నిద్దుర రాని రేయినిట నీదు ధరిత్రి వికాసయోజనల్
పెద్దగజేయ బూనుమిక వేరువిధంబులనేల యోచనల్
హద్దులు దాటుచున్ పెనగు హైన్యమునిండిన స్వార్ధచింతనల్
వద్దిక ప్రొద్దుబుచ్చకుమ వర్ధిలజేయుము భారతావనిన్!

సమస్య - 2023 (ధాన్యముఁ గని రైతు...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.. 
ధాన్యముఁ గని రైతు తల్లడిల్లె.

పద్యరచన - 1214

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.
(సోదరీమణులైన కవయిత్రులు మన్నించాలి!)

3, మే 2016, మంగళవారం

ఖండకావ్యము - 16

ఋతుచక్రము
రచన : లక్ష్మీదేవి

వసంతఋతువు -
ఉ. 
వేచె విభుండు వచ్చునని వేయి నిరాశలఁ గాలఁ దన్నుచున్
పూచిన సన్నజాజులను పొందిక కొప్పునఁ జుట్టి, గంధముల్
వీచెడు గాలులందు నిడి, ప్రేమగ స్వాగతగీతి కోయిలన్
దాచిన గొంతుతో పలికెఁ, దా వనకన్య వసంతురాకకై.
గ్రీష్మఋతువు -
చం. 
భగభగ మండు టెండలకు బావులు, కాలువలెండిపోవగా,
దగఁ గొని, నీడకోరి, రహదారులఁ సాగెడు గడ్డురోజులన్
సెగలను తాళలేక యిల జీవులు వాడి తపింప, గ్రీష్మమున్
పగను శపించుచుండిరిక పంతముతో నసహాయ మానవుల్.
వర్షఋతువు -
చ. 
చిటపట సద్దు చేయుచును చేరును జల్లులు నింగి వీడుచున్,
పటపట రేకు పైఁ సడుల, పచ్చని చెట్టులు తానమాడ, తా
మటునిటు సాగు కాలువల యందున నల్లరి పిల్లమూకలన్
కటువుగ పెద్దలెల్ల యిడు గర్జన పోలెడు మేఘమాలికల్
దిటవుగ నిండునాకసము, దిక్కదె వర్షపు వేళ జీవికిన్.
శరదృతువు -
ఉ. 
చల్లని వెన్నెలెల్ల యెడ సైయను జంటల కాంక్షమాడ్కినిన్,
చల్లని పిండులో యనగ, జాజుల మల్లెల పాన్పులో యనన్,
తెల్లని పాల సంద్రమన దిక్కులముంచెను, తేటగా నదుల్
పల్లెల పట్టణమ్ములను పారెను పంటల దాహమార్చుచున్.
హేమంతఋతువు -
చం. 
చలిపులి మెత్త కత్తులనుఁ జంపుచునుండగ వృద్ధకోటి, లో
పలకునుఁ జేర వెచ్చనగు పానుపుకోరుచుఁ ,బంటదుప్పటుల్
పలుచగ భూమిఁ గప్పె, నెల ప్రాయము కాచెను నెల్ల జంటలన్,
తెలి విరులెల్ల తీర్చె నిక తీరగు చుక్కల నింగిగా నిలన్.
శిశిరఋతువు -
ఉ. 
పత్రములెల్ల రాల్చి నవపల్లవ కోమల శోభఁ గోరుచున్
చిత్రము చేయునా శిశిరజృంభణ హేల! సదా చలించు, నే
మాత్రము దారి తప్పదు సుమా, ఋతుచక్రము! పెక్కు భంగులన్
గాత్రము మార్చునీ పృథివి కన్నుల పండుగగాగఁ జేయుచున్.

సమస్య - 2022 (దీపాలంకృత గృహమున...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.. 
దీపాలంకృత గృహమునఁ దిమిరము నిండెన్.

పద్యరచన - 1213 (ఉప్పు)

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

2, మే 2016, సోమవారం

ఖండకావ్యము - 15

తెలుఁగు వెలుఁగు.
రచన : మిస్సన్న (దువ్వూరి వేంకట సరసింహ సుబ్బారావు)

పాప నవ్వువోలె పాల మీగడ వోలె
మంచి గంధ మట్లు మల్లె లట్లు
వీణ పాట రీతి విన సొంపుగా నుండు
తీయ తేనె లొలుకు తెలుఁగు పలుకు.

వేమనార్యుఁడన్న విలువైన మాటలు
సుమతి శతక కర్త సూక్తి సుధలు
భవిత తీర్చి దిద్దు బంగరు బాటలై
తెలుఁగు జాతి రీతి తెలియఁ జెప్పు.

తేటగీతి సీస మాటవెలందియు
నందమైన కంద చందములును
కృష్ణ రాయ విభుడు కీర్తించె హర్షించి
దేశ భాషలందు తెలుఁగు లెస్స.

అమ్ములేసి నిలిపె నల్లూరి దొరలను
సింగమట్లు దూకె టంగుటూరి
అమరజీవి యాయె నా పొట్టి రాములు
తెలుఁగు కీర్తి దిశలఁ దేజరిల్ల.

భోజనమ్ము నందు బొబ్బట్లు పులిహార
పనసపొట్టు కూర పచ్చిపులుసు
ఆవకాయ ఘాటు లాపైన గోంగూర
తినిన జిహ్వ లేచు తెలుఁగు రుచుల.

అట్లతద్ది భోగి యాపైన సంక్రాంతి
కనుమ బొమ్మనోము ఘన యుగాది
చవితి దశమి దివిలి శివరాత్రి బతుకమ్మ
తెలుఁగు పండుగలకు తీరు మిన్న,

అతిథి నాదరించు నయ్యల పూజించు
నమ్మ నాన్నలన్న నమిత భక్తి
అన్నదమ్ములందు నైకమత్యమ్మును
తెలుఁగు నేల నంత వెలుఁగుచుండు.

ఆంధ్రమందునైన అమెరికాలో నైన
వెలుఁగులీను చుండు తెలుఁగు పలుకు
మనిషి దూరమైన మమతలు మాయునా
మైత్రి మహిమ మిన్న ధాత్రి లోన.