10, నవంబర్ 2023, శుక్రవారం

సమస్య - 4582

11-11-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వెలుఁగుఁ గోరి యార్పుము దీపములను వేగ”
(లేదా...)
“వెలుఁగును గోరి దీపముల వేగమె యార్పుట యుక్తకార్యమౌ”

14 కామెంట్‌లు:


  1. తూర్పునుదయించి నట్టి యా ద్యుమణి తాను
    పడమటన యస్తమింపగ వసుధ లోన
    నిరులు ముసిరిన తరి మిణుగురు పురుగుల
    వెలుఁగుఁ గోరి యార్పుము దీపములను వేగ.

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    వలచి వచ్చెను వధువు శోభనముకనఁగ
    పాలు సగపాలు పంచియు వరుఁడు తపన
    సరసఁ జేర సైగలననె, "సైచననఁగ
    వెలుఁగుఁ, గోరి యార్పుము దీపములను వేగ"

    చంపకమాల
    కలువల కన్నులన్ వధువు కామిని తా తొలిరేయి చేరఁగన్
    వలపునఁ బంచి పాలు సగపాలు దపించుచు బుగ్గ ముద్దిడన్
    సలసల కాగెడున్ వరుని సందిట నిట్లనె, "సైచనొప్ప నీ
    వెలుఁగును, గోరి దీపముల వేగమె యార్పుట యుక్తకార్యమౌ"

    రిప్లయితొలగించండి

  3. ఖలుడట యస్తమింపగనె కాంతిని గోరుచు కృత్రిమంబెయౌ
    వెలుగుల గోరిదీపముల పెట్టితి వీవు కనంగ నిప్పుడే
    తొలిదెస నుద్భవించెరవి, తొయ్యలి లెమ్మిక భానుడిచ్చెడిన్
    వెలుఁగును గోరి దీపముల వేగమె యార్పుట యుక్తకార్యమౌ.

    రిప్లయితొలగించండి
  4. తొలగె జీకటి వేకువ తొంగి చూచె
    నరుణ కిరణాలు పయిపైకి యరుగుదెంచె
    దినకరుండిచ్చు శాశ్వత దివ్య మైన
    వెలుగు గోరి యార్పుమ దీపములనువేగ

    రిప్లయితొలగించండి
  5. కనుల మిరుమిట్లు గొలుపెడు కాంతి తోడ
    దీపములు వెలుగ, సుధల దివ్య కాంతి
    గాంచ లేమోయి మనమింక, కలువల దొర
    వెలుఁగుఁ గోరి యార్పుము దీపములను వేగ”

    రిప్లయితొలగించండి
  6. తలుపుల చెంత నిల్చెనని ద్వారము చెంతకు జేరి భర్త యా
    లలనను కౌగిలించుకుని లాలన తోడ వచించె నిట్టులన్
    గలువల బోలు నీ కనులు కాంతులు చిందుచు నుండెగాదె యా
    వెలుఁగును గోరి దీపముల వేగమె యార్పుట యుక్తకార్యమౌ

    రిప్లయితొలగించండి
  7. వాడుక విధము మానక వరుస రీతి
    దివ్వెలను బెట్టి వెలిగించితివిగ నేడు
    వెలుఁగుఁ గోరి యార్పుము దీపములను వేగ
    నేను గొనలేనటుల మీరె నూనె ఖర్చు

    రిప్లయితొలగించండి
  8. కాంతి నోసెగె డు భానుడు గాను పించె
    చీకటులు దొలగె ను గద చెలియ నీవు
    వెలుగు గోరి యా ర్పు ము దీప ములను వేగ
    దీరె వాటి యవ సరము దెలిసి కొనుము

    రిప్లయితొలగించండి
  9. కొమరు సూర్యుడు తూరుపు కొండనెక్కె
    తెల్లవారెను కాంతులు విల్లి విరిసె
    కిటికి పరదాలు తొలగించు కిరణమాల
    వెలుఁగుఁ గోరి యార్పుము దీపములను వేగ

    రిప్లయితొలగించండి
  10. నిండు చంద్రుడు పొడతెంచె నింగిలోన
    చంద్రకాంతిలో విందుకు సాటిలేదు
    పుచ్చపువ్వును తలపించు పున్నమి నెల
    వెలుఁగుఁ గోరి యార్పుము దీపములను వేగ

    కలువలఱేని పోసనము కమ్మని విందుకు యుక్తమైనదై
    విలువను పెంచునామెతకు వెన్నెలఁ గోరుచు వేచియుంటివా
    పులకలు రేపుచున్నదగు పున్నమి కాంతుల దీప్తమైన రే
    వెలుఁగును గోరి దీపముల వేగమె యార్పుట యుక్తకార్యమౌ

    రిప్లయితొలగించండి
  11. దొరికె నేకాంతమీ రేయి తరుణి మనకు
    స్వప్న లోకాల విహరించి పరవశమున
    చందురుని వెండి వెన్నెలఁ విందు* సేయ
    వెలుఁగుఁ గోరి యార్పుము దీపములను వేగ
    (*Moonlight dinner)

    రిప్లయితొలగించండి
  12. కలిగెను నీకునాకు కనకాంగి వివిక్తము నేటిరేయి యా
    కలువలఱేని వెన్నెలలు కన్నులపండుగగా చెలంగె నా
    వెలుగుల దూఁకొనన్ చెలియ వెన్నెల విందొనరింప, చందిరున్
    వెలుఁగును గోరి దీపముల వేగమె యార్పుట యుక్తకార్యమౌ

    రిప్లయితొలగించండి
  13. తే॥ తళతళనికాంతి నినుఁడు తరలివచ్చు
    తరుణమందు దీపములేలఁ దలుపఁ గాను
    మిలమిల మెరయు దీపమ్ములు వెలవెల యగు
    వెలుఁగుఁ గోరియార్పుము దీపములను వేగ

    చం॥ వెలుఁగులఁ జిమ్ము దీపములు విజ్ఞత వాడఁగ రాత్రి వేళలన్
    దెలతెల వారు చుండఁగను దీపపు కాంతులఁ గోరనేలహో
    పులుముచు కాంతి పుంజములు పుట్టును భానుఁడు తూర్పు దిక్కునన్
    వెలుఁగును గోరి దీపముల వేగమె యార్పుట యుక్తకార్యమౌ

    రిప్లయితొలగించండి
  14. అర్కుడుదయించె నప్పుడె యాకసాన
    నలుదెసలయందు వ్యాపించె నవ్య కాంతి
    కార్యదీక్ష బూనసరైన కాలమిదియె
    వెలుగుగోరియార్పుముదీపములనువేగ

    రిప్లయితొలగించండి