27, జనవరి 2026, మంగళవారం

సమస్య - 5364

 28-1-2026 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కారమె సుఖజీవనహితకారణ మగులే”
(లేదా...)
“కారమె కారణం బగు సుఖప్రదజీవనశైలి కెప్పుడున్”
(సోమ నాగభూషణం గారికి ధన్యవాదాలతో...)

20 కామెంట్‌లు:

  1. కందం
    తీరగు నడవడిఁ బతిసతి
    మీరక కర్తవ్యపరత మెలకువ కలుగన్
    భారముల పరస్పర సహ
    కారమె సుఖజీవనహితకారణ మగులే

    ఉత్పలమాల
    తీరగు వర్తనల్ గలిగి దివ్యమనోహరు నర్చనంబునన్
    మీరక బాధ్యతల్ సతము మెచ్చగ నల్వురు సాగుచుండుచున్
    దారయు భర్తయున్ విడక భారములన్నియు మోయనెంచు శ్రీ
    కారమె కారణం బగు సుఖప్రదజీవనశైలి కెప్పుడున్

    రిప్లయితొలగించండి
  2. ఆరయగ దెలియు గాపుర
    నీరధిని తరియుటకొరకు నిరవధికముగన్
    నారీమణుల పయిన యధి
    కారమె సుఖజీవనహితకారణ మగులే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      అరయగ/తెలియు రెండూ ఒకటే కదా? 'కాపురపు నీరధి' అనడం సాధువు. "పయిన నధికారమె" అని ఉండాలి.

      తొలగించండి
  3. కారము లేని పచ్చడికి కాంక్షితమెక్కడ లోకమందు సం
    స్కారము లేని వానికిట సాధ్యముకానిది లక్ష్య సిద్ధి స్వీ
    కారము లేకయున్నయెడ కాపురముండుట సంభవించునా?
    కారమె కారణం బగు సుఖప్రదజీవనశైలి కెప్పుడున్

    [కారము = ఒఱ్ఱ; సంస్కారము = సంకల్పము;
    స్వీకారము = అంగీకారము; కారము = నిశ్చయము]

    కారము రుచికరమే సం
    స్కారముతో లక్ష్య సిద్ధి సాధ్యంబౌ స్వీ
    కారమె పునాది మనువుకు
    కారమె సుఖజీవనహితకారణ మగులే

    రిప్లయితొలగించండి

  4. వారలు వీరలటంచును
    వేఱడమును విడుచుచు కడు పేరిమి తో నా
    వారలె యందరనెడి మమ
    కారమె సుఖజీవనహితకారణ మగులే.


    సారమదెంత యుండినను స్వార్థము వీడుచు నించుకైన నా
    సీరము జూపకుండ సహజీవుల శ్రేయము గోరుచున్ సదా
    ధారుణి ధర్మమార్గమున తాచరియించెడి శ్రేష్ఠమైన సం
    స్కారమె కారణం బగు సుఖప్రదజీవనశైలి కెప్పుడున్.

    రిప్లయితొలగించండి

  5. పూరిగుడిసెలో నున్నను
    భారములను మ్రోయుచున్న, భాగ్యవశమునన్
    కూరిమిగలవారల మమ
    కారమె సుఖజీవనహితకారణ మగులే

    భావం : పూరిగుడిసెలో నివసిస్తున్నా, లేదా జీవిత గమనంలో కష్టాలనే భారములను మోస్తున్నా సరే, అదృష్టవశాత్తూ ప్రేమ గల వారు మనపై చూపే మమకారమే సుఖంగా జీవించడానికి కారణం అవుతుంది. కష్టాల్లో ఉన్నప్పుడు పక్కన ఉండి ప్రేమను పంచే మనుషులు ఉంటే, ఆ కష్టం కూడా సుఖంగానే తోస్తుంది.

    రిప్లయితొలగించండి
  6. కోరికలదుపున నుంచియు
    నోరిమితో జీవనమ్ము నొగిఁ సలుపుచు నీ
    భారము దేవునకిడు సం
    స్కారమె సుఖజీవనహితకారణ మగులే

    భారము దైవమందునుచి ప్రాగహరమ్మగు రీతి జీవికన్
    తీరుగ తీర్చిదిద్దుకొని తృప్తి వహించిననాడు రూఢిగన్
    కోరికలన్ జయించి వెలుగుల్ ప్రసరించుట తథ్యమట్టి సం
    స్కారమె కారణం బగు సుఖప్రదజీవనశైలి కెప్పుడున్

    రిప్లయితొలగించండి
  7. కం॥ ధీరతఁ బెంచు మనుజులకు
    తారణమై చనెడి తోడు ధాత్రినిఁ గనఁగన్
    సారము నొందు బ్రదుకు సం
    స్కారమె సుఖజీవన హితకారణ మగులే

    ఉ॥ తారణమౌను గష్టముల దాపున నుండక రక్ష నొందఁగన్
    ధీరతఁ బెంపు చేయుఁ గడు తేకువ తోడ సదా చరించఁగన్
    గోరిన శక్తిఁ గాంచుటకుఁ గూర్చుచు స్తోమత సంతరించు సం
    స్కారమె కారణంబగు సుఖప్రద జీవనశైలి కెప్పుడున్

    తారణము దాటించు సాధనము

    రిప్లయితొలగించండి
  8. కం:ఊరక రుచి కై తినగా,
    కారము రక్తంపు పోటు కడు హెచ్చగు నీ
    యారోగ్యము చెడు, తక్కువ
    కారమె సుఖజీవనహితకారణ మగులే”

    రిప్లయితొలగించండి
  9. ఉ:కోరగ నేల రూపముల? కూర్చగ వానిని ధ్యాన మందు ని
    స్సారపు పాట్లవేల? కడు శాంతి నొసంగెడు నక్షరమ్మె ఓం
    కారము, బ్రహ్మతత్త్వ మది కన్నుల మూసి స్మరించుచున్న నోం
    కారమె కారణం బగు సుఖప్రదజీవనశైలి కెప్పుడున్”
    (ఓ మి త్యేకాక్షరం బ్రహ్మ అని ఉపనిషద్వాక్యం.ఓంకార స్మరణ అన్ని రూపాల ధ్యానం కంటే ఉత్తమం.)

    రిప్లయితొలగించండి
  10. కోరిక లన్నియు దీర్చు చు
    ధీరత తో సాయ పడుచు దివ్యాత్ము లు నై
    నేరుపు నను జూపెడు మమ
    కార మె సుఖ వ న హితకారమగు లే

    రిప్లయితొలగించండి
  11. మూరినచోఁ బ్రభువుల యప
    కారము సుఖ జీవన లయ కారణ మగులే
    వారని పాలక జన సహ
    కారమె సుఖ జీవన హిత కారణ మగులే


    నీరము నిండుగాఁ దనరు నిండు ఘటమ్ము తొనంక దయ్య గం
    భీరము వార్థి మధ్యమము భీషణ రావ విహీన మౌను సం
    సారము నందు భాసిలెడు శాంతము నిత్యము వీడఁగా నహం
    కారమె కారణం బగు సుఖప్రద జీవన శైలి కెప్పుడున్

    రిప్లయితొలగించండి

  12. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    తీరగు వర్తన తోడను
    భారముగా తలచకుండ భార్యాభర్తల్
    పేరిమి పంచుకొనుచు సహ
    కారమె సుఖజీవన హితకారణ మగులే.

    రిప్లయితొలగించండి
  13. ధారుణి మెచ్చగన్ నడచి ధర్మము తప్పక శాంతిమార్గమున్
    గోరుచు నెల్లవారలకు గూర్మిని బంచుచు నాత్మశుద్ధితో
    మూరుచు నిచ్చలున్ మదిని ముచ్చట నింపెడి సజ్జనత్వ సం
    స్కారమె కారణంబగు సుఖప్రద జీవనశైలి కెప్పుడున్.

    రిప్లయితొలగించండి
  14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి