30, జనవరి 2026, శుక్రవారం

సమస్య - 5367

31-1-2026 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మూడునకున్ నాల్గు గలుప ముప్పది యగురా”
(లేదా...)
“మూడును నాల్గునుం గలుప ముప్పదియౌఁ గద లెక్కఁ జూచినన్”

21 కామెంట్‌లు:

  1. గణితావధాని పృచ్ఛకుడైన శిష్యునితో..

    కందం
    చూడుమిదె గుణింతము మరి
    కూడిక నేర్పుటకనంగఁ గూర్చిన పాదం
    బోడక రెండింతల ప
    ద్మూడునకున్ నాల్గు గలుగ ముప్పది యగురా!

    ఉత్పలమాల
    చూడు గుణింతమున్ మరియు సొంపగు కూడికలన్ సమస్యలో
    జోడుగఁ గూర్చినారనఁగ చోద్యములేదిక పూరణంబు నే
    నోడక జేసెదన్ వినఁగ నొప్పనిపించు., గుణించి రెండు, ప
    ద్మూడును, నాల్గునుం గలుప ముప్పదియౌఁ గద లెక్కఁ జూచినన్

    రిప్లయితొలగించండి
  2. ఏడుకు మూడును గలుపుము
    తోడుగ పదమూడు గలిపి తొందరపడకన్
    జోడింపఁగ సరవిని నొక
    మూడునకున్ నాల్గు గలుప ముప్పది యగురా

    రిప్లయితొలగించండి
  3. మూడే ముప్పది యెటులగు ?
    మూడునకున్ నాల్గుగలుప ముప్పది యగురా !
    బాడుగకు నాలుగేలర !
    వేడుకగా పక్క సున్న పెట్టిన జాలున్

    రిప్లయితొలగించండి

  4. కూడికల నేర్పమంచును
    వేడగ నేనొప్పుకొనుచు వివరించితినే
    యేడు పదహారు మరియు
    మూడునకున్ నాల్గు గలుప ముప్పది యగురా.


    నేడది భానువారమని నీదరి జేరితి శ్రద్ధజూపుచున్
    కూడిక నేర్పమంచు నను గోరగ జెప్పుచు నుంటి రెండుతో
    నేడును హెచ్చవేసి మరియింపుగ తొమ్మిది కల్పి దానికిన్
    మూడును నాల్గునుం గలుప ముప్పదియౌఁ గద లెక్కఁ జూచినన్.

    రిప్లయితొలగించండి
  5. మూడునకేడు కలిపి పదు
    మూడును కూడిన లభించు మొత్తముతోడన్
    గూడిక చేయుట సులభము
    మూడునకున్ నాల్గు గలుప ముప్పది యగురా

    మేడము నేర్చుకొంటివిట మేలొనగూడును లెక్కలందునన్
    నేడిటఁ జేసిచూపితివి నేర్చిన కూడిక నిశ్చయంబుగా
    మూడున కేడుకల్పి పదుమూడును గూడిన వచ్చు సంఖ్యకున్
    మూడును నాల్గునుం గలుప ముప్పదియౌఁ గద లెక్కఁ జూచినన్

    [మేడము = కూడిక]

    రిప్లయితొలగించండి
  6. గణితంలో కూడికలు:
    ఉ త్పలమాల:
    ఏడుకు మూడునుంగలిపి యేమరకన్ మరి వచ్చుదానికిన్
    తోడుగ నేడునున్ గలిపి తొందరపాటును వీడి దానికిన్
    జోడుగ నారునుం గలిపి చోద్యముగా దలపోయకన్ వెసన్
    మూడును నాల్గునుం గలుప ముప్పదియౌఁ గద లెక్కఁ జూచినన్

    రిప్లయితొలగించండి
  7. వాడె కదా పురత్రయము వంచన జేయగ నాల్గువేదముల్
    జూడగ వాజిలై వెలయ జొక్కుచు నీలగళుండు నయ్యెడన్
    వేడగ నొక్కబాణమున వేగమె గూల్చెను ముప్పదింటినిన్
    మూడును నాల్గునుం గలుప ముప్పదియౌగద లెక్కజూచినన్.

    రిప్లయితొలగించండి
  8. వేడుక గా లెక్కించుచు
    మూడుకు నిరువది ని కలిపి ముచ్చట మీ రన్
    కూడగ పిదపను దానికి
    మూడు నకు న్ నా ల్గు కలుప ము ప్పది యగు రా!

    రిప్లయితొలగించండి
  9. కం:మూడు పదులు ముప్పది యగు
    మూడును గల్పంగ నదియె ముప్పది మూడౌ
    నేడును దీసియు ముప్పది
    మూడునకున్ నాల్గు గలుప ముప్పది యగురా”
    (10×3=30. 30+3=33. 33-7=26. 26+4=30)

    రిప్లయితొలగించండి
  10. ఉ:మూడు పదుల్ గనంగ నది ముప్పది, దానిన దీసి వేయు మీ
    యేడును! నిప్పు డెంత? యది యిర్వది మూడగు కాదె బాలకా
    యేడుపు మో మదేల? నిక నిర్వది మూడుకు నీవు చక్కగా
    మూడును నాల్గునుం గలుప ముప్పదియౌఁ గద లెక్కఁ జూచినన్”

    (10×3=30. 30-7=23. 23+3+4=30)



    రిప్లయితొలగించండి
  11. కం॥ వాడుక జూదము నొకటికి
    వాఁడు పది నిడుటనుచు నొక పరి మూడిడఁగన్
    గూడుఁ గనె నాలుగు పడఁగ
    మూడునకున్ నాల్గు గలుప ముప్పది యగురా

    ఉ॥ వేడుక జూదమందొకటి పెట్టినచోఁ బది రెట్లనంగనే
    వీడక మూడు రూకలట ప్రీతిగ నుంచఁగ గవ్వలాటలన్
    జూడఁగ నాలుగంకెలకుఁ జొచ్చిన వెంటనె నెగ్గి పోవఁగన్
    మూడును నాల్గునుం గలుప ముప్పదియౌఁ గద లెక్కఁ జూచినన్

    మరొక పూరణండి
    (జూదములో బాగు పడినవారు లేరు కాని స్టాక్ మార్కెట్ వర్తకంలో ఇది జరిగనదే)

    ఉ॥ వీడక మూడు లక్షలను బెట్టఁగ వర్తక మందునావిధిన్
    జూడఁగ నాల్గు వర్షములు చుక్కల తాకెను వృద్ధిచెందుచున్
    గూడగ మూడు లక్షలటు గొప్పగ ముప్పది లక్షలయ్యెనే
    మూడును నాల్గునుం గలుప ముప్పదియౌఁ గద లెక్కఁ జూచినన్

    రిప్లయితొలగించండి
  12. పాడిగ వ్రాయం దగ నీ
    మూడు పదమ్ములను జరణముల గతి భళిరా
    వేడుక మీఱఁగ నింపుగ
    మూడునకున్, నాల్గు, గలుప ముప్పది యగురా

    [ముప్పది = త్రిపద;
    మూడునకున్
    నాల్గు
    గలుప]


    నేఁడును వాడ వాడలను నెమ్మి చరించి గణింప నింపుగాఁ
    బాడిగ సుప్రసిద్ధములు భారత వాఙ్మయ మందుఁ జక్కఁగా
    మూడు చతుష్టయమ్ముల సమూహము నాఱు త్రయమ్ము లిద్ధరన్
    మూడును నాల్గునుం గలుప ముప్పదియౌఁ గద లెక్కఁ జూచినన్

    [వేదోపాయ దుష్ట చతుష్టయములు; గుణ తాప కాల ఋ ణేషణ మూర్తి త్రయములు]

    రిప్లయితొలగించండి
  13. అర్ధ కందానందం :)

    మాథ్సు సో సింపుల్ యు నో :)

    మూడున కిరువది మూడా
    మూడునకున్ నాల్గు గలుప ముప్పది యగురా






    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    ఏడను ఫలితము లభ్యము
    మూడునకున్ నాల్గు గలుప;ముప్పదియగురా
    ఏడున కిరువది కలుపుచు
    మూడును కూడినను ఫలిత మొకటే కదరా!

    రిప్లయితొలగించండి
  15. ఏడునెనిమిది తోడ హెచ్చవేసి
    రెండుతో సమముగా విడదీసి వరలునట్టి
    అందునున్ ఐదును తగ్గచేసి
    మూడు నాలుగు కలిపిన ముప్పది కదా

    గతంలో ఈ సమస్యను ఎవరో పూరించారు మన బ్లాగులో ఇది నేను పూరించినది కాదు

    రిప్లయితొలగించండి