17, అక్టోబర్ 2026, శనివారం

సమస్య - 5623

18-10-2026 (ఆదివారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“క్షీరాబ్ధిసుత మనువాడె శివుని ముదముతో”

(లేదా...)

“క్షీరాంభోధితనూజ శంకరునిఁ దాఁ జేపట్టెఁ బ్రాణేశుగన్”

(న.చ. సాహిత్ శతావధానంలో కౌండిన్య తిలక్ గారి సమస్య)

11 కామెంట్‌లు:

  1. నారాయణుని కళత్రము
    క్షీరాబ్ధిసుత ; మనువాడె శివుని ముదముతో
    మేరువు దౌహిత్రి గిరిజ ,
    దేవుల దేవేరుల కథ తెలియగ మేలౌ

    రిప్లయితొలగించండి
  2. కందం
    గౌరీదేవి వినతితోఁ
    దీరియుఁ గుడిచి గరళము, దివ్య భవమునన్
    సారించి చూప హరినిన్
    క్షీరాబ్ధిసుత మనువాడె! శివుని ముదముతో

    శార్దూలవిక్రీడితము
    గౌరీదేవి విషమ్ము గ్రోలమనగన్ గల్లోలమున్ బాపఁగన్
    ధారాళంబుగ గ్రోలి నీలగళుడై, ద్రచ్చన్ సుధన్ బొందగన్
    బారావార భవానఁ జూప 'హరినిన్' భాగ్యంబుగానొప్పుచున్
    క్షీరాంభోధితనూజ శంకరునిఁ, 'దాఁ జేపట్టెఁ బ్రాణేశుగన్!'

    రిప్లయితొలగించండి

  3. ఘోరమగు తపము వీడుచు
    తారక సంహారిని గన త్ర్యక్షుండౌనన్
    గౌరియు తపమును విడి హే
    క్షీరాబ్ధిసుత,! మనువాడె శివుని ముదముతో.



    ఆ రేద్రిమ్మరి తారకా సురుని సంహారమ్ము నే జేసెడిన్
    ధీరుండైన సుతున్ గనన్ నగజ యా దేవేశి యే పేర్మితో
    భారంబంచు దలంచకుండ సురలే ప్రార్థింప హే
    క్షీరాంభోధితనూజ,! శంకరునిఁ దాఁ జేపట్టెఁ బ్రాణేశుగన్.

    రిప్లయితొలగించండి
  4. కోరి హరిని మనువాడెను
    “క్షీరాబ్ధిసుత, మనువాడె శివుని ముదముతో”
    గౌరియె, సారసగర్భుని
    సౌరుగ మనువాడె వాణి సంతసమొదవన్

    రిప్లయితొలగించండి
  5. శౌరిన్ కోరి వరించి ప్రాణవిభుగా సాధించె నందంబుగా
    క్షీరాంభోధితనూజ, శంకరునిఁ దాఁ జేపట్టెఁ బ్రాణేశుగన్
    గౌరీదేవి తపంబొనర్చి, నలువన్ కాల్ద్రొక్కె నిల్లాలుగా
    ధారాళమ్మగు ప్రీతి నెక్కొనఁగ విద్యాదేవి శ్రీవాణియే

    రిప్లయితొలగించండి
  6. కం:నారాయణు భాగ్యముగా
    క్షీరాబ్ధిసుత మనువాడె, శివుని ముదముతో
    ఘోరమగు విషము మ్రింగగ
    దార యె యురికించె నివియె దైవమహిమలౌ.

    రిప్లయితొలగించండి
  7. నీరేరుహోదరుడ నా
    క్షీరాబ్ధిసుత మనువాడె; శివుని ముదముతో
    గౌరి మనువాడె కడకున్
    ఘోరతపమున వరము సమకూడినదనుచున్

    పారావారముఁ జిల్కు వేళ కలిగెన్ బద్మాలయోద్భానమే
    ధీరోధాత్తుడు విష్ణువే తన మదిన్ దీపింపఁ జేపట్టెనా
    క్షీరాంభోధితనూజ; శంకరునిఁ దాఁ జేపట్టెఁ బ్రాణేశుగన్
    ఘోరంబౌ తపమాచరించి సతి సంకోచంబులే తొల్గగా

    [పద్మాలయ + ఉద్భానము = పద్మాలయోద్భానము (లక్ష్మి జననం)]

    రిప్లయితొలగించండి
  8. క్రమాలంకార పూరణ

    శా॥ పారావారముఁ జేర్చు కేశవుని నుద్వాహమ్మునన్ గైకొనెన్
    ధారాళమ్ముగఁ బ్రోచు నీతఁడనుచున్ దైత్యాళి భావించిరే!
    ఆరాధించుచుఁ గృష్ణు రుక్మిణియె యాహ్వానించి మోదమ్ముతో
    క్షీరాంబోధి తనూజ, శంకరునిఁ, దాఁ జేపట్టె బ్రాణేశుగన్

    రిప్లయితొలగించండి
  9. శా:క్షీరాంబోధి మథించు వేళ హరినే చేబట్టి శ్రీమూర్తియౌ
    క్షీరాంభోధితనూజ,శంకరునిఁ దాఁ జేపట్టెఁ బ్రాణేశుగన్”
    స్త్రీరత్నమ్మగు గౌరి సర్పధరునిన్ సేవించి యీ యిర్వురున్
    వేరౌ రీతుల జ్ఞాన సంపదల సాధ్వీ మాతలే మ్రొక్కగన్.



    రిప్లయితొలగించండి
  10. ఆరయ శివుఁ డన్నను శుభ
    కారి యని నెఱుంగ వచ్చుఁ గమనీయముగా
    నారాయణుండు శివుఁడే
    క్షీరాబ్ధి సుత మనువాడె శివుని ముదముతో


    సారానంత ధనప్రదాయిని సదా సౌభాగ్య సంయుక్త యా
    క్షీరాంభోధి తనూజ చక్రిఁ దమిఁ దాఁ జేపట్టఁ బ్రాణేశుగా
    సారాచార సువేత్త్రి శీత నగ రాట్సంజాత, లేకున్న నా
    క్షీరాంభోధి తనూజ, శంకరునిఁ దాఁ జేపట్టెఁ బ్రాణేశుగన్

    [పార్వతీ కల్యాణము నాఁటికి లక్ష్మీ దేవి యింకను క్షీర సముద్రము నుండి పుట్ట లేదు.]

    రిప్లయితొలగించండి
  11. ఆరయ నారాయణు నే
    క్షీరా బ్ది సుత మనువా డె :: శివుని ముదము తో కోరి తపంబు న పతి గా
    వారిజ నేత్ర యె వరించె వలచియు సుకవీ!

    రిప్లయితొలగించండి